
ఠంచనుగా రోజూ మధ్యాహ్నం రెండింటికి ‘కావ్ కావ్ కావ్‘ అంటూ, సన్నగా నాజూకుగా ఉన్న ఓ కాకమ్మ వచ్చి మా బాల్కనీలో ఉన్న చెక్కబల్ల మీద లేండింగ్ చేసేది. అలార్మ్ మ్రోగినట్టుగా అలా ఎలా వచ్చేస్తుందబ్బా? మిలట్రీలో కానీ ప్రశిక్షణ తీసుకుందా?
మా మామగారికి ఆ వేళప్పుడు భోజనం వడ్డించే సమయమని దానికి తెలుసో ఏమో? అయినా దానికెలా తెలుస్తుంది? తెలుస్తుందేమో? బహుశా ఆకలేస్తోందేమో? ఇట్స్ ఏ రియల్ మిస్ట్రీ!
మా చిన్నప్పుడు కాకమ్మ కథలు ఎన్నో వినేవాళ్ళం. అవి తెలివైన లేజీ బర్డ్స్ అని మా మనసుల్లో ముద్ర పడిపోయింది.
నిశ్చింతగా వెళ్ళి కోయిల గూట్లో వాటి గుడ్లు పెట్టడమే అందుకు నిదర్శనం. అసలు వాటి పెంపకం మీద వాటికి అనుమానమేమో? టైమ్స్ మారాయిగా, వాటికీ కొద్దిగా ఓర్పు అలవడుండొచ్చు...అనుకుంటూ తలుపు నెమ్మదిగా తెరిచి–
‘నిశబ్ధంగా, ప్రశాంతంగా ఉన్న ఇంట్లో నీ గోల ఏవిటి? ఆపమ్మా, దణ్ణం పెడతా’ అని ఓ సారి దానివైపు ఓ చూపుచూసాను.
‘అమ్మో! ఇదేదో మామూలు కాకి లా లేదు. అదీ నావైపే సీరియస్ గా చూస్తూ, కావ్ కావ్’ అంది. కోపంగా.
‘ఫీలింగ్ హంగ్రీ కాకమ్మా? అయినా ఢిల్లీలో బోలెడన్ని పార్కులూ, పళ్ళచెట్లూ ఉన్నాయి కదా! అక్కడి కెళ్ళకుండా రాంగ్ రూట్లో వచ్చావు. మీకు అడ్రస్ కోసం మాకు మల్లే జిపిఆర్‌ఎస్లు అఖ్కర్లేదు కూడాను. మీకు జ్ఞాపకశక్తి మహా ఎక్కువట. మాంసం ముక్కలూ, చేపలూ మీకు చాలా ప్రీతికరమైనవని మా అమ్మమ్మ నా చిన్నప్పుడు కాకమ్మ కథల్లో చెబుతూ ఉండేది, నిజమేనా?’ అని అడగంగానే ‘కావ్ కావ్’ అంది.
‘అయినా, మిస్ ఢిల్లీ కాకీ, ఇప్పుడంతా వెడ్డింగు సీజనూ కదా! తెలియక అడుగుతున్నా కానీ, ఘుమ ఘుమలాడే నాన్వెజ్ ముక్కలను వదులుకుని నేనొండిన ఉత్త పప్పన్నం, చప్పటి కేబేజి కూర తినడానికొచ్చావా!’
అనుకోగానే ఠక్కున మొహం తిప్పుకుంది.
‘నీ కర్మ’ అని మనసులో అనుకుంటూ, ‘జావ్ యహా సే, బహుత్ హోగయా తేరా నాటక్, ఉఢ్, ఉడ్’ అని హిందీలో దాన్ని గదిమాను.
దేశ రాజధాని కాకి కదా! తెలుగులో దానికి తెగులేమో అనుకుని. అబ్బో ఖచ్చితంగా హిందీ కాకే! ఉలిక్కిపడి, అర్థంమైనట్టు ఒక్కసారి అది ఎగరినట్టే ఎగిరి మళ్ళీ అదే చోట వాలి ‘కాయ్ కాయ్ కాయ్’ అంటూ మొదలెట్టంది.అదేంటీ ఇందాక ‘కావ్ కావ్ కావ్’ కదూ అంది. ఇప్పుడు కాయ్ కాయ్ కాయ్’ అంటోంది.
నాకేమైనా పొరపాటుగా వినిపిస్తోందా?
‘దాని కేసి తీక్షణంగా చూస్తూ, చెవులు నిక్కబరుచుకుని విన్దామని నిశ్చయించుకున్నా! ఏదో సుదీర్ఘ ఆలోచనలో పడ్డట్టుంది.
లేక ఏదో నన్ను ఆటాడిస్తోంది. నోటికి తాళం వేసినట్టు కూర్చుంది. ఏంటీ ఉలుకూ పలుకూ లేదు. పలుకదే? నాతో పెట్టుకుంటోంది. అది గొంతు తెరుస్తే ఒట్టు.
‘క్యా హువా కవ్వా జీ?
చుప్ క్యూం హో?’ అన్న వెంటనే, ఏదో తెలివొచ్చినట్టు మళ్ళీ రాగాలాపన మొదలెట్టింది. రైటే.
‘కాయ్ కాయ్ కాయ్ కాయ్’ అనే అంటోంది. ఈసారి కన్ఫరమ్డ్!
ఏం కాయ్ కాయాలో, ఏం కావ్ కావాలో దీనికి?
అని దానికేసే చూస్తూ నిలబడిన నన్ను.
‘ఎవరితో మాట్లాడుతున్నావూ?’ మా మమగారు వణుకుతున్న గొంతుతో
సణిగినట్లు అడిగారు.
‘ఆ...కాకితో కబుర్లు చెప్పుకుంటున్నా లెండి. మీకు భోజనం వడ్డించి పెట్టాను’ అనేలోపు ‘ఎందుకూ, మీ అత్తగారు మిసెస్ శేషావతారంతో కబుర్లూ ? వచ్చి టి.విలో న్యూస్ చూసుకోవచ్చు కదా? అసలే మీ ఆయన పెద్ద ఆఫీసరు, ఇలా వచ్చి కాస్త టివి వాల్యూమ్ పెంచు.’
నెమ్మదిగా ఆ కట్టుడు పళ్ళతో ఫుడ్డింగు మొదలెడుతూ, ఓ అరగంట సేపు ఎక్స్పర్ట్ కామెంట్సు ఆయన ఇవ్వడం, నేను వినడం కొన్నేళ్లగా అలవాటై పోయింది.
‘ఇదిగో అమ్మా’ అంటూ, ‘పప్పులో ఉప్పు ఒకరవ్వ ఎక్కువైంది, ఆ కాబేజీ కూర ఆవ పెట్టి చేస్తే మా అబ్బాయి వాళ్ళమ్మని తలుచుకుని భోజనం చేస్తాడు కదా! ఏవిటో ఈ మధ్యన నువ్వు మనసు పెట్టి వంట చేయటంలేదు.
పళ్ళు లేవుకదా, పాపం మామగారికి మామిడికాయ తురిమి,పచ్చడి చేసి పెడదామని లేదురా నీకు, పెరుగొక్కటే భేషుగ్గా ఉంది. కొన్న పెరుగు కామోసు! ఇంట్లో తోడెడితే నాలుగు రాళ్ళు మిగుల్చుకోవచ్చు కదా! అయినా ఎన్నాళ్ళుంటానో ఏమో! వయసైపోయినా జిహ్వచాపల్యం ఉందిగా. నేనూ వెళ్ళిపోతే ఇక నీ వంట ఏడాది కోసారి నా తద్దినానికే తినాల్సొస్తుంది. ముక్తి దొరికితే సరేసరి. ఆ పై లోకాల్లో పెద్ద క్యూట! శేషమ్మ నా కలలో వచ్చిన చెప్పిందిలే.
సరే, ఏదైతేనేం? కాశీ అన్నపూర్ణలా రోజూ అన్నం పెడుతున్నావు. నీ దయా నా ప్రాప్తీ అనుకో!’
ఓ అరగంట తూనీగ చెవిలో దుర్రు దుర్రన్నట్టుగానే ఉంటుంది! ఇది రోజూ ఉన్న కార్యక్రమమే.
కంచంలో చేతులు కడుక్కుని మంచం మీదకి ఉపక్రమించేందుకు సన్నద్ధమౌతున్నాయన్ని, ఆయన మాటలకర్థం ఏమిటో అడగాలి.
ఈయనకి సాత్వికమైన ఆహారం పెడ్తుంటేనే వంక పెట్టకుండా భోజనం అయిందని పించుకోరు, ఇక కారాలూ మిరియాలు వేస్తే గూబ గుయ్యిమని అరవడం మొదలెడతారు. పెద్దాయన హెల్తే మఖ్యం మాకు. ఆయనతో పాటూ మేమూ నెమ్మదిగా కమ్మటి శాఖాహార రుచులకు అలవాటు పడ్డాం. ఆయన డైలాగులు పట్టించుకోకుండా ఏదో రేడియో ప్రోగ్రాం వస్తోందని అనుకుంటూవుంటాను! ఆ వయసులో మేము ఎలా ఉంటామో ఏమోనన్న ఆలోచన కూడా వస్తూ వుంటుంది. అయినా, ఈయనది మరీ విడ్డూరం! ఆ కాకి మా అత్తగారెలా అవుతుంది? ఈ ముసలాయన మాటలొక్కోసారి అర్థం కావు సుమీ! అదీకాక మా ఆయన ఆఫీసరత్వానికీ, నేను టి.విలో న్యూస్ చూడడానికి లింక్ ఏవిటో? అసలు ఈయన గోల ఏవిటో? మనసులో కాస్త చికాకు పడ్డాను.
‘ఏంటండీ మామయ్య గారూ? ఆ కాకిని పట్టుకుని మా అత్తగారంటారు? ఆవిడేమో తెల్లగా, ముద్దుగా, మల్లెపూవల్లే ఉండేవారు. ఎంతో చక్కగా ఇల్లు మేయింటేను చేసే వారు, పిల్లల్నిద్దరినీ కంటికి రెప్పలా కాపాడుకుని, సంస్కారవంతులుగా ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ధారు.
ఆవిడ ఏదో తత్వాలూ కీర్తనలు, జిక్కీ బాలసరస్వతి గారి పాటలు ఎంతో కమనీయంగా పాడుకుంటూ హాపీగా ఉండేవారు. కాకికీ ఆవిడకీ లింక్ ఏమిటీ? నాకు మీ మాటలేమీ బోధపడట్లేదండి. గ్రహపాటున హార్ట్‌ఎటాక్ వచ్చి, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా, ఆవిడ కోరుకున్నట్టుగా డిగ్నిఫైడ్ గానే వెళ్ళి పోయారు...మీరలా అనడం ఏమీ భావ్యం కాదు.
ఆ మహా ఇల్లాలిని ఈ కాకితో పోల్చడం ఏమీ బాగోలేదు. మరింకోటేదో కూడా అన్నారు. ఆ....గుర్తొచ్చింది. టివిలో నేను న్యూస్ చూడడానికి మీ అబ్బాయి ఆఫీసరత్వానికీ ఏమిటి మామయ్యగారూ కనెక్షను?
ఏదోవొకటి మాట్లడకపోతే మీకు తోచదా?’ అని డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ– ఈయన గారి సోడియమ్ లెవెల్స్ పడిపోయి ఏదో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని గొణుక్కున్నా.
‘మజ్జిగలో లవణం రంగరించి ఇస్తే గానీ ఈయన తెలివిగా మాట్లాడరు’ అనుకున్నా! ఏదో నా మదిలోభావాలను ఎక్సరే కళ్ళతో చదివినట్టు.
‘ఇదిగో తల్లీ, నిన్ననేగా నా బ్లడ్ రిపోర్ట్‌లో ఎలక్ట్రలైట్ లెవెల్స్ బాగున్నాయని వచ్చింది. నా సోడియమ్, పొటాషియం లవణాలు బాగానే ఉన్నాయి కానీ.. ఆ ...ఏమీ లేదు.
మీ అత్తగారి సంగీతానికేం, ఆవిడ పాటలు వీనుల విందుగా ఉండేవి. కానీ అమ్ములూ, ఆవిడ నన్ను ప్రశాంతంగా అడపాదడపా అయినా ఓ సిగరెట్టు కాల్చుకోనిచ్చేది కాదు, వారానికో విస్కీ పెగ్గెనా హెపీగా తాగనిచ్చేదికాదు. మీ ఢిల్లీ కాకి లా కాయ్ కాయ్ కాయ్ కాయ్ అంటుండేది.
ఓ మైక్రోమేనేజమెంట్ చేసేది. ఇది చెయ్య కండీ,
అది చెయ్యకండీ అని ఓ ఆడ హిట్లర్‌లా నామీద ఆర్డర్లూ!
ఈ కాకి కనీసం మధ్యాహ్నం, ఓ సమయం చూసుకు వచ్చి
కాయ్‌కాయ్ కాయ్ అని అరిచిపొతుంది.
మీ అత్తగారు, ‘కాయ్ కాయ్’తో పాటూ ఖయ్ ఖయ్ ఖయ్ ఖయ్ లాడేది. అందుకనే అలా అన్నాను’ అని సమర్థించుకున్నారు, శూన్యం లోకి చూస్తూ. అయినా ‘నిన్ను మిస్స్ అవుతున్నా మై డియర్ శేషమ్మా, మనిద్దరి మధ్యలో అన్యోన్యమైన, ఆత్మీయమైన, అనూహ్యమైన ఖెమిస్ట్రీ ఉండేది’ అంటూ పంచె కొస పైకెట్టుకుని కంట తడి తుడుచుకున్నారు.
‘ఈయన ఆరోగ్యం కోసం ఎంత మదన పడిందో, ఈయన మర్చిపోయారా? ఆవిడకి తన డెభ్భై ఐదో బర్త్‌డే చేసుకోవాలని ఎంతో కోరికగానూ ఉండేది. ఈయనని కంటికి రెప్పలా ఆమె బ్రతికున్నంత కాలం కాపాడుకున్నందుకు, ఆయన మంచికోసం చెప్పిన మాటలు కాకి అరుపులా? అయ్యో ఈయన తీరే వేరనుకుని నేనే పొరపాటు పడ్డా!
మామయ్య గారు ఆవిణ్ణి ఎంత మిస్ అవుతున్నారో! అయ్యో పాపం..అరవై మూడేళ్ళ వైవాహికబంధం మరి.
‘ఈ వయసులో ఓ పట్టాన నిద్ర రాదు, ఏదో భోజనం అవ్వగానే ఓ కునుకు తీద్దామంటే నీ యక్ష ప్రశ్నలతో నా నిద్ర కాస్తా పోగొడుతున్నావు తల్లీ’ రివర్స్ గేరులో నాకే క్లాసు పీకడం మొదలెట్టారు.
‘కానీ కోడలు పిల్లా నువ్వు నా అమ్మవురా! ఏదో మాట్లాడుతుంటా. మనసు కష్టపెట్టుకోమాకు. ఆ టీవిలో న్యూస్ రోజూ చూసి నిన్ను నువ్వు అప్డేట్ చేసుకో, బాబు ఇంటికి రాత్రి ఆలస్యంగా వచ్చినప్పుడు నేను అన్నం తినలేదని, రెండు సిగరెట్లు కాల్చానని, పనిమనిషిని అరిచానని, నేనొండిన వంటకి మీ నాన్న వంద వంకలు పెట్టకుండా భోంచేయరని వాడి తల తినక! నువ్వు చూసే టివి సీరియల్సా, రిపీట్ టెలికాస్ట్ ఇవ్వక! ఏ పార్టీకి ఎంత మద్దతొస్తుందో, వరల్డ్ న్యూస్ గురించో ముచ్చటించు, ఆంధ్రా, తెలంగాణా రాజకీయాలు చర్చించు లేకపోతే మాంచి పాట ఒకటి నా శేషమ్మలా పాడుతూ, అలసి పోయి వచ్చిన నా కొడుక్కి ప్రేమతో కాస్త పక్కనుండి అన్నం పెట్టు. ఏ టివి సీరియల్సో చూస్తుకూర్చోక!’ అనంటూ ఆవులించి గురక పెడుతూ, నిద్రలోకి హాయిగా అక్కడున్న సోఫాలో జారుకున్నారు.
అమ్మో పెద్దాయన, జనరల్ హెల్తూ ఇవాళ బాగానే ఉన్నదనుకుని, అయ్యో, నా తండ్రి లాంటి ఆయన, నాతో మాట్లాడకపోతే పాపం ఆయన ఎవరితో మాట్లాడతారు?
న్యూస్ పేపరు పట్టుకుని నా గదికి వెళ్ళాను నవ్వుకుంటూ, నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికీ, ఓ కునుకు తీయడానికీ.
సత్యశ్రీ నండూరి
Comments
Please login to add a commentAdd a comment