రాక్షసనీడ | short story | Sakshi
Sakshi News home page

రాక్షసనీడ

Published Sun, Mar 27 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

రాక్షసనీడ

రాక్షసనీడ


 నాలుగు రోజులుగా పెరిగిన గడ్డాన్ని అద్దంలో చూసుకుంటూ ఓసారి చేత్తో సుతారంగా నిమురుకున్నాడు విశ్వం. చుబుకం దగ్గర రెండు వెంట్రుకలు తెల్లగా తళుక్కున మెరిసేసరికి ఉలిక్కిపడ్డట్టు చూసుకున్నాడు. ‘ముప్పయి నాలుగేళ్లు దాటకనే తన గెడ్డం నెరిసిపోతోంది! అంటే... నిరుద్యోగిగానే తన బతుకు పండిపోతోందన్నమాట!’... అలా అనుకోగానే అతని మొహంలో నిరాశ చీకట్లు ఆవరించాయి. చూపుల్లో దిగులు స్పష్టంగా కనబడి తనమీద తనకే ఎక్కడ లేని జాలీ పుట్టుకొచ్చింది.‘‘అన్నయ్యా... నీ షర్టు గుండీ కుట్టమన్నావ్... ఏదీ - ఇవ్వు మరి’’ అంది రాధ.‘‘అదిగో... కుర్చీమీద వేశాను చూడమ్మా- షర్టు జేబులోనే ఉంది గుండీ!’’
 రెండు నిముషాల్లో షర్ట్‌కు గుండీ కుట్టేసింది రాధ.
 
 ‘‘నాన్న వెళ్లమన్నచోటికి తొందరగా వెళ్లిరా అన్నయ్యా. నిద్ర లేస్తూనే వెళ్లలేదేమని అడుగుతాడు. నువ్వింకా వెళ్లలేదని చెబితే బాధపడతాడు’’ అంది రాధ షర్టును విశ్వంకు అందిస్తూ. ‘‘సర్లే... వెళ్లక ఏంజేస్తాను!’’ కాస్త విసుగ్గానే అన్నాడు విశ్వం.‘‘ఎందుకురా అంత విసుగూ! ఆరు నెలలకో, సంవత్సరానికో ఓ పని చెబుతారు మీ నాన్న. అది కూడా చేయలేవా?’’ అంది జానకమ్మ - కిరోసిన్ స్టవ్‌ని శుభ్రపరుస్తూ.
 
 ‘‘ఊ... ఎందుకు చేయనూ. కాస్త మెల్లగా మాట్లాడండి. తల్లీ కూతుళ్లిద్దరివీ ఇంతింత లావు గొంతులు. మీ మాటలకి నాన్న లేచినా లేస్తాడు’’ అన్నాడు విశ్వం - పక్క గదిలో పడుకుని ఉన్న వాళ్ల నాన్న వేపు ఓసారి అనుమానంగా చూస్తూ. గాఢనిద్రలో వున్నాడు ఆయన. చిన్నప్పటినుంచి విశ్వానికి ఒక భయం ఉంది - దాన్ని భయం అనడం కన్నా ఆందోళన అనడం సబబేమో! నిద్రపోతూ ఉన్న తండ్రిని ఎందుకో ఒక్కోసారి జాగ్రత్తగా గమనించేవాడు విశ్వం. వాళ్ల నాన్న నిద్రలోనే శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడేమోనని అనుమానం. అలా అతనికి ఎందుకనిపిస్తుందో తెలీదు.
 
 గాఢనిద్రలో ఉన్న మనిషికి ఒక్కోసారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తేలిగ్గా వుంటాయి. అప్పుడసలు ఊపిరాడుతోందా లేదా - అని ఎవరికైనా అనుమానం వస్తుంది. అదే సందేహం అతనికీనూ. అలా ఆందోళనపడి కాసేపు కంపించిపోతాడు. మరికాసేపు తదేకంగా గమనించి ఊపిరి ఆడుతున్నట్టు ఎద ఎగసిపడుతోంటే తన ఆందోళన పోగొట్టుకుంటాడు. తన తండ్రి పోతే ఇంకేమైనా వుందా... తన సంసారం నడి సముద్రంలో నావలా మునిగినట్టే అనిపించేదతనికి.
 
 ‘‘ఎందుకలా నాన్న వేపు చూస్తున్నావన్నయ్యా?’’ అంది రాధ. ‘‘ఏమీ లేదమ్మా. నాన్న మేలుకొని ఉన్నాడేమోనని’’ అంటూ గొణిగాడు విశ్వం. ‘‘ఒంట్లో బాగోలేదుగా. ట్యాబ్లెట్లు వేసుకుని పడుకున్నాడు. అప్పుడే ఎలా మేలుకుంటాడు?’’ అంది రాధ.
 
 విశ్వం అద్దంలో తన డ్రెస్‌నీ, మొహాన్నీ ఓసారి చూసుకొని వీధిలోకి వెళ్లిపోయాడు. అసహనంగా అడుగులు వేస్తున్నాడు విశ్వం. అతని అసహనానికి కారణం - ఆ రోజు ఉదయం వాళ్ల నాన్న... రాఘవయ్యగారి దగ్గర ఐదు వందలు అప్పు తీసుకురమ్మని చెప్పటమే. ఏ పని చేయడానికైనా మహదానందంగా ఒప్పుకుంటాడు గాని, అప్పు తీసుకురమ్మంటే మాత్రం ఎంత ఇబ్బందిపడి పోతాడో చెప్పలేం.
 
 ఇలా అప్పు అడగడానికి వెళ్లడం అతనికిదేం మొదటిసారి కాదు కానీ, వెళ్లిన ప్రతిసారి - ఆ అప్పిచ్చేవాళ్ల పోజులూ, మాటలూ అతనికిష్టం వుండేవి కావు. అప్పు ఇచ్చేవాళ్లు కావాలనే అలా మాట్లాడతారో లేక తనే ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌తో అలా ఊహించుకుంటాడో విశ్వానికి అర్థం అయ్యేది కాదు.
 
 ‘‘అప్పు చేయకుండా బతకడానికి వీలు కాదా?’’ అన్న ప్రశ్నకు జవాబు - నాన్నే... అవును... అప్పు చేయకుండా ఎలా వుండగలరు! సత్యకాలం మనిషిలా ఆఫీసుల్లో లంచాలు తీసుకోకుండా... ప్రమోషన్ లేకుండా... ఇరవై ఏడేళ్లుగా గుమాస్తాగా బతుకీడుస్తూ అయిదుగురు సంతానంతో ఎవరుంటారు అప్పు చేయకుండా! ఆఖరికి అక్కయ్య పెళ్లి కూడా అప్పుతోనే చేశాడు నాన్న.
 
 - ఇలా ఆలోచిస్తూనే రాఘవయ్య ఇంటి ముందుకొచ్చేశాడు విశ్వం. ‘‘మా నాన్న మిమ్మల్ని డబ్బడిగాడట గదండీ!’’ అంటూ గొణిగాడు విశ్వం గుమ్మం దగ్గరే నిలబడి.‘‘అవును - అడిగాడు... ఈ వేళకే వచ్చేశావా? నేనింకా బ్యాంక్‌కి వెళ్లందే? పరమేశ్వరయ్య పెద్దబ్బాయివి కదా నువ్వు. ఏ ఉద్యోగం చేస్తున్నావు?’’ గుమ్మంకవతలనే నిలబడి అన్నాడు రాఘవయ్య.
 
 ‘‘ఇంకా ఏం లేదండీ?’’
 ‘‘ఈ వయసొచ్చినా నిన్ను కూచోబెట్టి సాకుతున్నాడన్నమాట మీ నాన్న. మావాడు నీకంటే పదేళ్లు చిన్నవాడేమో! అయినా చక్కగా వ్యాపారం చేసి నెలకు రెండు వేలు సంపాదిస్తున్నాడు. మనకూ కొంచెం పట్టుదల ఉండాలయ్యా. తండ్రి సంపాయించి పెడుతాడులే హాయిగా తినేద్దాం అనుకుంటే ఎలా?’’
 
 ఒక్కసారి విశ్వానికి రోషం ముంచుకొచ్చింది. ‘‘డబ్బుంటే ఇవ్వండి. లేకపోతే లేదు. మా స్వంత విషయాల్లో మీ జోక్యం ఏమిటీ... ఉద్యోగం కోసం ఎన్ని తిప్పలు పడుతున్నానో మీకేం తెలుసు? ఊరికే నోటికొచ్చినట్టు వాగితే సరికాదు’’ అని నాలుగు దులిపేయాలనిపించింది. అలా దులిపేశాక అప్పు ఎలా ఇస్తాడు? తన కోపం నాన్నని ఇబ్బందుల్లో పడేస్తుంది. అందుకే కిమ్మనకుండా నిలుచున్నాడు విశ్వం.
 
 ‘‘ఏమిటయ్యా - అలా మాటాడకుండా నిలబడ్డావు. మీ అక్కయ్య పెళ్లికి ఇరవై వేలు అప్పు చేశాడటగా మీ నాన్న. నిన్న సాయంత్రం అన్నీ చెప్పాడులే! దానికి వడ్డీ కట్టేందుకేమో నా దగ్గర అప్పడిగాడు. నీకూ ఉద్యోగముంటే అతనికి కొంచెం భారం తగ్గి వుండేదని అన్నాడు. బీఏ చదివావటగా. ఈ కాలంలో ఎంఏలూ, పీహెచ్‌డీలూ చేసిన వాళ్లకే ఉద్యోగాలు రావటం లేదు. అదీ అదృష్టంలే. సరే కానీ... మరో గంట తర్వాత కనబడు. ఆలోగా బ్యాంక్‌కి వెళ్లి డబ్బు తీసుకుని వస్తాను’’  అంటూనే తలుపులేసుకున్నాడు రాఘవయ్య.
 
 గంగిరెద్దులా తల ఆడించేసి అలా వీధిలోకి మెల్లగా అడుగులేస్తూ బయల్దేరాడు విశ్వం. అడ్డమైన ప్రతివాడూ తనకి ఉద్యోగం లేదని ఏదో రకంగా అవమానిస్తూ మాట్లాడతాడు. ఏ మనిషికైనా నిరుద్యోగాన్ని మించిన శిక్ష ఉండదేమో!
  ‘‘ఒరేయ్ విశ్వం!’’ అన్న పిలుపు వినిపించే సరికి తల వంచుకుని నడుస్తున్నవాడల్లా తలెత్తి చూశాడు. ఎదురుగా శంకర్ నవ్వుతూ వున్నాడు బీఏలో విశ్వానికి క్లాస్‌మేట్ శంకర్. ‘‘ఏరా... ఏమిటంత సీరియస్‌గా ఆలోచిస్తున్నావ్... ఎదురుగా వచ్చే మనుషుల్ని కూడా చూడకుండా’’ అన్నాడు శంకర్.
 
 ‘‘అబ్బే... ఏం ఆలోచించటం లేదురా!’’ అన్నాడు నవ్వుతూ విశ్వం. ‘‘నాకు వీడీవో ఉద్యోగం వచ్చిందోయ్. అంటే విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసరు. మొన్న 86లో జరగలేదూ గ్రూప్ త్రీ ఎగ్జామ్. అది పాసయ్యాను’’... శంకర్ గొంతులో గొప్ప సంతోషంతో పాటు కాస్తంత గర్వం కూడా మిళితమై ఉంది.‘‘కంగ్రాచ్యులేషన్స్’’ అన్నాడు విశ్వం. నవ్వుతూ అనాలని అతని ఉద్దేశం. అయితే తనకు రాని ఆ ఉద్యోగం పెదాల మీదకు నవ్వుని రానివ్వలేదు.
 
 ‘‘థాంక్యూ! నువ్వూ నాతో పాటు రాశావుగా పరీక్ష. ఏమయ్యింది?’’
 ‘‘ఏం కాలేదు. పాసైవుంటే నేనూ నీతో కంగ్రాచ్యులేషన్స్ చెప్పించుకునేవాణ్నిగా.’’
 ‘‘అమ్మో... భలే జోకులేస్తావురోయ్. ఈ శుభ సందర్భంలో కాఫీ తాగుదాం పద.’’
 మిత్రులిద్దరూ దగ్గర్లోని హోటల్లోకి వెళ్లి కూచున్నారు.
 
 ‘‘అసలు నాకీ ఉద్యోగం రాదనుకున్నారా! నీకో విషయం తెలుసా. వచ్చే నెలలో నాకు ముప్పయి నాలుగేళ్లు నిండిపోతాయి. అంటే గవర్నమెంటు ఉద్యోగాలకి వయసు దాటిపోయినట్టేగా. లక్కీగా ఈ ఉద్యోగం వచ్చింది.’’తనకూ ముప్పయి నాలుగేళ్లు మరో రెండు నెలల్లో నిండిపోతున్న విషయం గుర్తుకొచ్చి ఒళ్లంతా ఓసారి కంపించిపోయింది విశ్వంకు.
 
 కాఫీ తాగుతూ తను ప్రిలిమినరీ పరీక్ష ఎలా రాసిందీ... తర్వాతి పరీక్ష ఎలా రాసిందీ చెప్పుకుపోతున్నాడు శంకర్. విశ్వం ఎంతో ఇబ్బందిగా అతని వేపు చూస్తూ ‘‘ఊ’’ కొడుతున్నాడు యాంత్రికంగా. విశ్వానికి అతని మాటలు వినిపించినంత దూరంగా పారిపోవాలని వుంది.
 
 ‘‘ఈసారి పరీక్షలైనా బాగా రాయవోయ్. తల్లిదండ్రుల మీద ఇంకా ఆధారపడుతూ వుండటానికి మొహమాటంగా లేదూ?’’ తమాషాకి అన్నాడు శంకర్ విశ్వంతో తనకున్న చనువుతో.‘‘ఉద్యోగం వచ్చింది కదా అని నానా కూతలు కూయకురా శంకర్!’’ అన్నాడు విశ్వం కాస్త కోపంగానే.
 
 ‘‘అంత కోపం పనికిరాదు బ్రదర్! నేనేం నీకు జ్ఞానబోధ చేయడానికి రాలేదు. మీ నాన్న ఒక్కరేగా అర్నింగ్ మెంబరు. ఇంకా పెళ్లి కావాల్సిన చెల్లెళ్లున్నారు. అనకూడదు కానీ, మీ నాన్న కాస్తా ‘హరీ’మంటే మీ పరిస్థితెంత భయంకరమో ఆలోచించు’’ నింపాదిగా అన్నాడు శంకర్. ‘‘నోరు మూయరా వెధవా!’’ అంటూ గట్టిగా అరిచాడు విశ్వం. హోటల్లో అందరూ ఓసారి విశ్వం వేపు చూశారు. గభాల్న తలదించేసుకున్నాడు విశ్వం. విశ్వం ఎందుకంత గట్టిగా అరిచాడో అర్థం కాలేదు శంకర్‌కి. తన ‘సహజ ధోరణి’ విశ్వాన్ని నొప్పించిందని నమ్మలేకుండా వున్నాడు.
 
 ‘‘సారీరా విశ్వం!!’’ అంటూ కాఫీ బిల్లుని తీసుకుని లేచి నిలుచున్నాడు శంకర్.పొద్దు వాలిపోతోంది.వేప చెట్టుకు ఆనుకున్నవాడల్లా ఓసారి చుట్టూ కలయజూశాడు విశ్వం. చెట్టూ చేమలు తప్ప చుట్టుపక్కల ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. ఓ అరమైలు దూరంలో ఊరు కనిపిస్తోంది.
 
 ఉదయం నుంచి విశ్వంలో చెప్పలేనంత నిస్పృహ కలుగుతోంది. అతని మనసు ఏకాంతాన్ని కోరుకుంటోంది. అందువల్లే మిత్రుల్ని ఎవర్నీ కలవకుండా ఇలా ఊరి బయటకి వచ్చేశాడు. అతనికి అంత నిస్పృహ కలగడానికి కారణం - ఆ రోజు మార్చి ఎనిమిదో తేదీ అవడమే. అంటే ఆ రోజు తన పుట్టినరోజన్నమాట. తనకి ముప్పయి నాలుగేళ్లు నిండిపోతున్నాయి ఆ రోజుతో. తనిక ఏ గవర్నమెంటు ఉద్యోగానికీ దరఖాస్తు చేయడానికి పనికిరాడు.
 ఇన్నేళ్లు తనని పెంచి పెద్దచేసిన నాన్నకి - తన చెల్లెళ్లతో పాటు తనూ భారమైనాడే గాని ఉద్యోగం చేసి నాలుగురాళ్లు సంపాయించి కష్టాల ఊబిలో కూరుకుపోతున్న తండ్రిని ఆదుకోలేకపోయాడు.
 
 ఏదన్నా చిన్న ప్రైవేటు సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నిద్దామా అంటే ప్రభుత్వ సంస్థల కంటే ఘోరంగా ఉన్నాయవి. అక్కడ మరీ పెద్ద పలుకుబడి వుండాలి. తనకు లేందల్లా అదీ, డబ్బే! ఏదయినా వ్యాపారం చేసుకుని బతకడం తనకి చేతకాదు. తను అవిటివాడు కాకున్నా - రిక్షా తొక్కో, కట్టెలు కొట్టో జీవించడానికి వీలుకాకుండా మానసికంగా అవిటితనాన్ని సంతరించిపెట్టింది మధ్యతరగతి మనస్తత్వం.
 
 తనమీద తనకే ఎనలేని జాలివేసి ఒక్కసారి బిగ్గరగా భోరున ఏడ్చేశాడు విశ్వం. తనకిక జీవితం లేదన్నది స్పష్టం! రెండు నిమిషాల తర్వాత సిగరెట్ తాగాలనిపించిందతనికి. సగం కాల్చి మళ్లీ తాగాలని వుంచుకున్న సిగరెట్టుని వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె కోసం వెదికాడు. అంతకు క్రితమే చివరి అగ్గిపుల్లని వెలిగించి ఖాళీ డొక్కును దూరంగా విసిరేసినట్టు గుర్తుకొచ్చి, నిరుత్సాహపడిపోయాడు. ఎద్దుల మెడలోని గంటల శబ్దం వినిపించినట్టయి లేచి చూశాడు విశ్వం. కొద్దిదూరంలో జోడెద్దుల బండి ఊరిలోంచి వస్తోంది. బండి తోలేవాడి దగ్గరయినా సిగరెట్టును వెలిగించుకోవచ్చు కదా అని సగం కాలిన సిగరెట్టుతో బండి వేపు కదిలాడు విశ్వం.

 ‘అగ్గిపెట్టె కావాలి’ అన్నట్టు సంజ్ఞ చేశాడు బండి మనిషికి దూరం నుంచే. బండి మనిషి ఎద్దుల్ని పగ్గాలతో బిగబట్టి బండి నిలిపేశాడు. దగ్గరకెళ్లాక బండి తోలుతున్న మనిషిని చూసి ఉలిక్కిపడ్డాడు విశ్వం. అతను ఎవరో కాదు - ప్రతిరోజూ వాళ్లింటికి పాలు తెచ్చే సుబ్బయ్యే! గోచి పంచె, ముతక రకం చొక్కా వేసుకొని వున్నాడు. అతని వెనకాల ఒక ఆడమనిషి కునికిపాట్లు పడుతోంది. ఆమె అతని భార్య కాబోలు అనుకున్నాడు విశ్వం.సుబ్బయ్య అగ్గిపెట్టె తీసి ఇస్తూనే అన్నాడు.‘‘ఇదేంది సామీ నువ్వీడున్నావు. నీకు తెలిసినట్టు లేదే అసలిసయం... ఆడ మీ నాయనకు..’’ అని చెబుతుండగానే...
 
 ‘‘ఏమయిందీ?’’ అన్నాడు అగ్గిపెట్టెని అందుకుంటూ. ‘‘మధ్యాహ్నం... పెద్దాసుపత్రిలో... మీ నాయనకి గుండెనొప్పి వచ్చిందని చేర్పించినారు. నేను పలకరించేలోపు కన్ను మూసినాడు. నువ్వు కొడుకువి కదా. చచ్చేటప్పుడయినా దగ్గరుండొద్దా. అగ్గిపెట్టె కోసరం నువ్వొచ్చిందే మంచిదయింది. లేకపోతే నీకిప్పుడే ఈ వార్త తెలిసేది కాదు కదా! తొందరగా ఎళ్లు సామీ!’’ అంటూనే అగ్గిపెట్టె కోసం ఎదురు చూడకుండా ఎద్దుల్ని అదిలించాడు. బండి ముందుకు సాగిపోయింది.చేష్టలుడిగి వింటున్నవాడల్లా ఒక్కసారి తల విదిలించుకున్నాడు. చేతిలో సగం కాలిన సిగరెట్టూ, అగ్గిపెట్టె ఎప్పుడు జారిపోయాయో.
 
 పరిగెత్తబోయి బోర్లాపడ్డాడు విశ్వం. మెల్లగా లేచి నడక సాగించాడు.నాన్న... తన నాన్న చనిపోయాడు.. తనని కన్న నాన్న, పెంచిన నాన్న, ప్రేమించిన నాన్న... చనిపోయాడు. ఒక్క అరగంట ఆలస్యంగా ఇంటికి పోతే తను ఏమై పోయాడోనని బెంగపెట్టుకునే నాన్న తనకిక లేడు. జీవన పోరాటంలో... ఎదిగిన కొడుకు కనీస సహాయం చేయలేకపోయినా ఒక్కడే పోరాడి పోరాడి అలసి సొలసిన నాన్న శాశ్వత నిద్రపోయాడు.‘‘నాన్నా!!!’’ అంటూ ఒక్కసారి వెర్రికేక పెట్టాడు విశ్వం. దిక్కులు సమాధానమివ్వడం మాని విశ్వంనే చూస్తూ ఉన్నాయి మౌనంగా.
 
 వడివడిగా ఊరివేపు నడుస్తున్నాడే కానీ అడుగులు సరిగా పడటం లేదు. ఇక నుంచీ అమ్మనూ, ముగ్గురు చెల్లెళ్లనీ తను పోషించాలన్నమాట. ఎలా? తనకి ఉద్యోగం ఎలా వస్తుంది? రెండు క్షణాల్లో మెరుపు లాంటి ఆలోచన వచ్చింది విశ్వానికి. నాన్న గవర్నమెంటు ఉద్యోగి. చనిపోయిన ఉద్యోగి కొడుకుకు తప్పకుండా ఉద్యోగం ఇస్తుంది ప్రభుత్వం.
 
 అవును... తనకిక ఉద్యోగం.
 అతి తొందరలో తనకిక ఉద్యోగం.
 విశ్వం కళ్లలో ఆనంద రేఖ మెరిసి మాయమైంది.

 నాన్నకి రావాల్సిన ప్రావిడెంటు ఫండుతోనూ, గ్రూప్ ఇన్సూరెన్సు వాళ్లు ఇచ్చే డబ్బుతోనూ అక్కయ్య పెళ్లి బాకీ తీర్చేసి, ముగ్గురి చెల్లెళ్ల పెళ్లీ చేసేస్తాడు.
 
 ఏదేమైనా తనకిక ఉద్యోగం!
 అవును. తనకిక ఉద్యోగం!
 ఛీ! ఛీ!! ఛీ!!! తను మనిషా? రాక్షసుడా? తండ్రి చనిపోతే... ఇవేం ఆలోచనలు! తనకీ - రాక్షసుడికీ ఏం తేడా?
 తనమీద తనకే అసహ్యమేస్తోంది!
 అవును... తన ఆలోచనలన్నీ పాడువే!
 తొందరలో తనకిక ఉద్యో...
 ఛీ! ఛీ!!
 తన అక్కయ్య పెళ్లి బాకీ
 తన చెల్లెళ్ల పెళ్లి సమస్యలు -
 తక్కిన జీవిత సమస్యలు -
 అన్నీ పటాపంచలు...
 నాన్న బతికుండేప్పుడు తీరని సమస్యలు... ఆయన చనిపోయాక తీరేందుకు సిద్ధంగా వున్నాయి. ఎంత విచిత్రం!
 తనేనా ఇలా ఆలోచిస్తోంది?
 నిద్రపోతూ ఉన్న నాన్న చనిపోయాడేమోననే ఆలోచన వస్తే భరించలేక ఆందోళన పడిపోయిన తనేనా ఇలా ఆలోచిస్తోంది!
 తనసలు మనిషేనా?
 తనకి ముప్పయి నాలుగేళ్లు దాటితేనేం... తనకీ ఉద్యోగం వచ్చేస్తుంది.
 అసలు రాకేం చేస్తుంది!
 గంతులేద్దామనిపిస్తోంది అతనికి.
 నాన్న శవం జ్ఞాపకం వచ్చి విరమించుకున్నాడు.
 పాడు ఆలోచనల్ని కౌగలించుకుంటూనే విశ్వం అడుగులు ఇప్పుడు వడివడిగా పడుతున్నాయి ఇంటివేపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement