
ఈరోజుల్లో హిట్లర్ మీసాలున్న వారిని చూడటం బహు అరుదు. కానీ నా చిన్న వయస్సులో హిట్లర్ మీసాలున్నవారినెందరినో చూశాను. అది ఓ స్టయిల్. అయినా హిట్లర్ మీసాలుంచుకున్న వారికి హిట్లర్ గురించి తెలుసా...ఏ మేరకు తెలుసుంటుంది....అరవై లక్షల యూదులను నాజీ సైన్యం నిర్దాక్షిణ్యంగా హతమార్చిన విషయం వారికి తెలుసా!
నాకు తెలిసి ఇద్దరు హిట్లర్ మీసాలున్న వాళ్ళున్నారు.
ఒకరు నా స్కూల్ రోజుల్లో క్రాఫ్ చేసే అతను. అతని పేరు దేశింగ్. మరొకరు రిక్షా తొక్కే పళని. ఈ ఇద్దరికీ హిట్లర్ మీసం అందంగానే ఉండేది.
పళని దగ్గర ఓ కుక్క ఉంది. దానికో ప్రత్యేకత. దానిని పూర్తి శాకాహారిగా పెంచాడు పళని. కారణం పళని మాంసాహారం తినడు. ఎవరో నాటువైద్యుడు చెప్పిన సలహా మేరకు అతను తన కుక్కను పూర్తి శాకాహారిగా పెంచుతూ వచ్చాడు.
ఆ కుక్క పేరు డాక్టర్. కుక్కకు ఎందుకు ఆ పేరు పెట్టాడో తెలీదు. ఆ కుక్క అతనితోపాటు రిక్షా స్టాండులోనే అటూ ఇటూ తిరుగుతుండేది.
తన డాక్టర్ కుక్క ఎట్టి పరిస్థితిలోనూ ఎముక ముక్క కూడా చూడదని అతని ప్రగాఢమైన నమ్మకం.
ఆ కుక్కతో ఒకే ఒక్క చిక్కుంది. అది దాని భయం. కాస్తంత మోటుగా ఎవరైనా కనిపిస్తే చాలు ఆ కుక్క అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరికీ కనిపించని చోట దాక్కుంటుంది.
ఎవరినీ చూసి అది మొరిగినట్లు చరిత్ర లేదు. అది ఒట్టి ఇడ్లీ తప్ప మరేదీ తినదు. దానికి ఇడ్లీ అంటే ఎంతో ఇష్టం. అది దాదాపుగా సాధువులాగే బతుకుతూ వచ్చింది.
ఓసారి రైల్వే గేటు దాటుతుండగా ఎవరో ఓ ద్విచక్రవాహనదారుడు అడ్డంగా వచ్చి పళని రిక్షాను డీ కొన్నాడు. అనుకోని ఆ ప్రమాదంలో రిక్షా బోల్తాపడింది. పళనికి చేయి విరిగింది. ఆస్పత్రిలో చేరాడు.
ఆ రోజుల్లో అతని డాక్టర్ కుక్కను స్టాండులోని ఇతర రిక్షా వాళ్ళు చూసుకోసాగారు.
పది రోజుల తర్వాత పళని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. తన డాక్టర్ కుక్కను చూసి అతను కంగుతిన్నాడు. కారణం, అది ఓ ఎముక ముక్కను నాకుతోంది.
పది రోజుల్లో ఆ కుక్కను ఇతర రిక్షావాళ్ళు మాంసాహారిగా మార్చేశారు కదా అని పళని బాధపడ్డాడు. కోప్పడ్డాడు. తన కుక్క తనకెంతో ద్రోహం చేసిందనుకున్నాడు. ఇలా చేస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. కోపావేశంతో దాన్ని అక్కడి నుండి తరిమేశాడు.
నిజానికి కుక్క మాంసం తినడం సహజమేగా. కానీ అతను దాన్ని జీర్ణించుకోలేకపోయాడు.
నమ్మకద్రోహి అని దాని మీద కారాలూ మిరియాలూ నూరుతూ వచ్చాడు.
ఆ తర్వాత దాన్ని సరిగ్గా చూసుకునే వాళ్ళు లేక అది ఎక్కడపడితే అక్కడ తిరుగుతుండేది. పళని ఉండే రిక్షా స్టాండు దగ్గరకు వచ్చి తోక ఊపుతూ అతని వంక చూసేది. కానీ పళని దానిని పట్టించుకునే వాడు కాదు. అంతేకాదు, ఇంకోసారి ఇటొచ్చావంటే కొట్టి చంపేస్తానని తరిమేవాడు.
కాలం గడిచింది.కొన్ని రోజులకు ఆ కుక్క ఓ లారీ కింద పడి చచ్చిపోయింది. పళనికి విషయం తెలియడంతోనే అతని మనసు ఆగలేదు. కన్నీరుమున్నీరయ్యాడు. డాక్టరయ్యా ఎంత పనైపోయింది అని ఏడుస్తూ దాన్ని ఎత్తుకుని రైలు బ్రిడ్జి పక్కన గొయ్యి తవ్వి పాతిపెట్టాడు. ఆ రోజు డాక్టర్ కుక్క కోసం అతను మీసం తీసేశాడు. ఆ తర్వాత అతను మీసమే పెంచలేదు.
ఇంతకూ అతను ఎందుకు హిట్లర్ మీసం పెట్టుకున్నాడో తెలీలేదు. పైగా తన కుక్క చనిపోయిందని ఆ మీసం తీసెయ్యడం మరీ ఆశ్చర్యం కలిగించింది. అయినా మనుషులు ఇలాగే రకరకాలుగా ఉంటారు. వారి అభిమానం అర్థం చేసుకోవడం కష్టం. ఎవరికి వారు ఏదో రూపంలో తమ అభిమానాన్ని ప్రేమనూ ఇలా చూపుతుంటారు. పైగా అతను కుక్కను శాకాహారిగా పెంచడం కూడా విడ్డూరంగానే అనిపించింది.
– యామిజాల జగదీశ్
హైదరాబాద్
(తమిళంలో మిత్రుడు ఎస్.రామకృష్ణన్ చెప్పిన మాటలే దీనికి ఆధారం. ఆయనకు కృతజ్ఞతలు)
Comments
Please login to add a commentAdd a comment