మూడు నెలలు ద్వీపాంతరవాస జైలుశిక్ష | Ranganatha Ramachandra Rao Translated Telugu Short Story In Sakshi Funday | Sakshi
Sakshi News home page

ప్రార్ధన

Published Sun, Apr 12 2020 9:15 AM | Last Updated on Sun, Apr 12 2020 10:27 AM

Ranganatha Ramachandra Rao Translated Telugu Short Story In Sakshi Funday

మ్యాడిసన్‌ సర్కిల్లో ఒక బెంచీ మీద కూర్చున్న సోపి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. చలి కాలం దగ్గరపడుతోంది. అయితే ఈ ఎముకలు కొరికే చలి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి. మూడునెలలు ద్వీపాంతరవాస జైల్లో ఉండే అవకాశం దొరకాలని అతను ఎదురుచూస్తున్నాడు. ఎన్నో ఏళ్ళుగా చలికాలంలో ఆ ద్వీపమే అతనికి ఆశ్రయమిచ్చింది. చలికాలం వచ్చిందంటే న్యూయార్క్‌లోని ధనవంతులు పామ్‌ బీచ్‌కో, రివేరాకో టికెట్‌ కొనుక్కుంటారు. అదే విధంగా సోపి చలికాలం రాగానే ఆ ద్వీపానికి వెళ్ళడానికి తనదైన ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఆ సమయం వచ్చింది.

గతరాత్రి ఆ పురాతన సర్కిల్లోని ఫౌంటెన్‌ పక్కన తన మామూలు బెంచీ మీద అతను పడుకున్నాడు. కింద రెండు వార్తపత్రికలు పరుచుకున్నాడు. పైన రెండు పత్రికలు కప్పుకున్నాడు. అయినా చలికి తట్టుకోలేకపోయాడు. ఆ కారణంగా ఇప్పుడు సోపి మనస్సంతా ఆ ద్వీపమే బృహదాకారంలో ఆక్రమించుకుంది.

నగరంలో ఆశ్రయం పొందేవారి కోసం మతధర్మాల పేరిట చేసే ఏర్పాట్ల పట్ల  అతనికి వ్యతిరేకత ఉంది. సోపి అభిప్రాయం ప్రకారం ఈ లోకోపకార కార్యాలకన్నా చట్టమే అధిక కరుణామయి. ఆ ఊళ్ళో ఉన్న కార్పొరేషన్‌ వాళ్ళు, ధర్మసంస్థల వాళ్ళు నిర్మించిన ధర్మసత్రాలు ఉన్నాయి. అక్కడికి అతను వెళితే చాలు. ఉండటానికి చోటు దొరుకుతుంది. తినటానికి భోజనం దొరుకుతుంది. అక్కడ అతను జీవితాన్ని సాఫీగా గడపవచ్చు. అయితే ఇలా దానం కోసం చేయి చాపటానికి సోపి మనస్సు అంగీకరించేది కాదు. నిజానికి దాతలు సమకూర్చే సౌలభ్యాలకు అతను రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. అయినా దాన్ని స్వీకరించే సమయంలో మనస్సులో ఏర్పడే దైన్యం? ఆ విషయాన్ని అతను ఊహించలేకపోయేవాడు. ఊహించి భరించలేకపోయాడు. దానికన్నా చట్టానికి అతిథి కావటమే ఉత్తమమని సోపి అనుకున్నాడు. అక్కడ అన్నీ వ్యవహారాలు నియమాలకు అనుగుణంగా నడుస్తున్నప్పటికీ, గత జీవితంలో అకారణంగా ఎవరూ తలదూర్చరు.

ద్వీపానికి వెళ్ళాలని సోపి నిర్ణయం తీసుకుంటుండగానే దాన్ని సాధించటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో అత్యంత సంతోషాన్ని కలిగించే మార్గం ఖరీదైన హోటలుకు వెళ్ళి పొట్టపగుల తినటం, తరువాత చేతులు పైకెత్తి డబ్బులు లేవని ఒప్పుకోవటం.
 వెంటనే వాళ్ళు ఎలాంటి గొడవ చేయకుండా పోలీసులకు అప్పగిస్తారు. 
తన పని అనుకూలం చేయడానికి సిద్ధంగా ఉండే న్యాయాధికారి తను ఆశించిన పనిని పూర్తి చేస్తారు.
సోపి తన బెంచీ మీది నుంచి పైకి లేచి సర్కిల్‌ దాటి ముందుకు సాగాడు. బ్రాడ్‌ వే, అయిదవ రోడ్డు కలిసే  స్థలంలో కిక్కిరిసిన  వాహనాల సందడి. అతను బ్రాడ్‌ వే వైపు తిరిగి ధగధగమని మెరుస్తున్న ఓ హోటల్‌ ముందు నుంచున్నాడు.

సోపి చక్కటి వేస్ట్‌ కోట్‌ వేసుకున్నాడు. దాని కింది బొత్తం నుంచి పైవరకూ ఉన్న దుస్తుల పట్ల ఆత్మవిశ్వాసం ఉంది. గడ్డం నున్నగా గీసుకున్నాడు. ఎవరికీ అనుమానం కలగకుండా హోటల్లోకి ప్రవేశించి ఒక టేబుల్‌ పట్టుకుంటే చాలు. అతను గెలిచినట్టే. టేబుల్‌ పై భాగంలో కనిపించే అతన్ని చూస్తే వెయిటరుకు అనుమానం కలగటానికి అవకాశమే లేదు. బాగా కాల్చిన మల్లార్డ్‌ బాతును, ఒక బాటిల్‌ చబ్లీసును ఆర్డర్‌ చేయాలి. అటు తరువాత కేంబర్టుకు చెప్పి ఒక సిగార్‌ ఆర్డర్‌ చేయాలి. సిగార్‌ ఒక డాలర్‌ ఖరీదు చేయవచ్చు. మొత్తం బిల్లు దుబారా కాకపోవటం వల్ల హోటల్‌ వాళ్ళు ప్రతీకార మనోభావాన్ని ప్రదర్శించరు. ఎలాగూ బాతు మాంసం తిని కడుపు నిండిపోతుంది. సంతోషంతో చలికాలపు ఆశ్రయం కోసం ప్రయాణం సాగించవచ్చు.
అయితే సోపి హోటల్‌ గుమ్మంలో కాలుపెడుతుండగా సూపర్వైజర్‌ కళ్ళు అతడి వదులు ట్రౌజర్, అధ్వాన్న స్థితిలో ఉన్న బూట్లమీద పడ్టాయి. వెంటనే బలిష్ఠమైన చేతులు అతడిని సద్దులేకుండా అవలీలగా వీధిలోకి విసిరేశాయి. ఇలా మల్లార్డ్‌ బాతు మాంసం తినే అవకాశం తప్పిపోయింది.

సోపి బ్రాడ్‌ వే వదిలి ముందుకు పోయాడు. అతనికి ద్వీపానికి వెళ్ళే మార్గం అంత సులభంగా కనిపించలేదు. దాన్ని ప్రవేశించడానికి మరో ఉపాయం వెతకాలని అనుకున్నాడు. ఆరవ రోడ్డు మలుపులో ఒక దుకాణం కనిపించింది. విద్యుద్దీపాల అలంకరణతో ధగధగ మెరిసిపోతోంది. కిటికీ అద్దాల వెనుక నానా రకా సామాన్లు చక్కగా, అత్యంత ఆకర్షణీయంగా అమర్చి పెట్టారు.
 సోపి బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. వెంటనే ఒక రాయి తీసుకుని ఆ కిటికీ వైపు విసిరాడు. మరుక్షణం భళ్ళుమంటూ కిటికీ అద్దం పగిలింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల జనం వచ్చి గుమిగూడారు. జనంతో పాటు ఒక పోలీస్‌ కూడా వచ్చాడు. సోపి తన జేబులో చేయి పెట్టుకుని చిన్నగా నవ్వుతూ మౌనంగా నుంచున్నాడు.

‘‘రాయి విసిరినవాడు ఎటువైపు వెళ్ళాడు?’’ అని పోలీస్‌ అడిగాడు.
‘‘ఎందుకు, నేనే అలా చేసివుండొచ్చని మీకు అనిపింలేదా?’’ అన్నాడు సోపి.
అతని స్వరంలో వ్యంగ్యం లేదు. కేవలం అదృష్టదేవతను ఆహ్వానించే స్నేహపూర్వకమైన ధ్వని ఉంది. 
ఆ సంఘటన గురించి  ఏదైనా క్లూ ఇవ్వగలిగే వ్యక్తి సోపి అని అంగీకరించడానికి కూడా పోలీస్‌ సిద్ధంగా లేడు. కిటికీని బ్రద్దలు కొట్టినవాడు పోలీసులతో హాస్యంగా మాట్లాడటానికి  ప్రయత్నించడు. వేగంగా అక్కడి నుంచి పారిపోతాడు. అదే సమయంలో కొద్ది దూరంలో వెళుతున్న బస్సు ఎక్కబోతున్న ఓ వ్యక్తి పోలీస్‌ కంటపడ్డాడు. అతనే కిటికీ అద్దం పగులగొట్టినవాడు కావచ్చని వెంటనే లాఠీని ముందు చాపి పోలీస్‌ అటువైపు పరుగెత్తాడు. రెండవసారి తన ప్రయత్నంలో విఫలమైన సోపి హృదయం జుగుప్సతో నిండిపోయింది. 
అక్కడ ఉండలేక అడుగు ముందుకు వేశాడు.

రోడ్డుకు అటుపక్కన ఒక సాధారణ హోటల్‌ కంటపడింది. ఆకలిగొన్న సాధారణ వ్యక్తులకు అక్కడ తక్కువ ఖరీదులో ఆహారం దొరికేది. అక్కడి పింగాణి పాత్రలు, బల్ల మీద పరిచిన తెల్లటి క్లాత్‌ సోపిని పిలిచినట్టు ఆనిపించింది. 
సోపి లోపలికి దూరాడు. అతని చిరిగిన బూట్లు, లూజు ట్రౌజర్‌ ఎవరి దృష్టికి రాలేదు. ఒక బల్ల దగ్గర కూర్చున్న సోపి బీఫ్‌ స్టీక్స్, ఫ్లాప్‌ జాక్స్, డోనట్‌ తిని పై తాగాడు. వెయిటర్‌ బిల్లు ఇచ్చాడు. తన దగ్గర చిల్లిగవ్వ లేదని చేతులు పైకెత్తాడు.
‘‘తొందరగా పోలీసును పిలువు. నాలాంటి సభ్యుడైన నాగరికుడిని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదు’’ అన్నాడు సోపి.
‘‘నీలాంటివాడికి పోలీసు ఎందుకు?’’ అంటూ ఇద్దరు వెయిటర్లు అతడ్ని ఎడాపెడా వాయించి, ఒళ్ళు హూనం చేసి వీధిలోకి తోశారు.
 

నేల మీద పడిన సోపి, వదులైన కీళ్ళను సరిచేసుకుంటూ మెల్లగా లేచి, బట్టలకు అంటుకున్న దుమ్మును దులుపుకున్నాడు. తాను కోరుకుంటున్నట్టు అరెస్ట్‌ కావటం కేవలం పగటికల అనిపించింది. ద్వీపానికి వెళ్ళే ప్లాన్‌ చాలా దూరంలో ఉన్నట్టు అనిపించింది. రెండు అంగళ్ళ తరువాత ఒక మెడికల్‌ షాపు ముందు నిబడ్డ పోలీస్‌ ఎందుకో అతడిని చూసి నవ్వి ముందుకు పోయాడు.
సోపి కుంటుతూ కొద్దిదూరం నడిచాడు. అరెస్ట్‌ కావడానికి మళ్ళీ ధైర్యం రాసాగింది. ఈసారి తనంతట తానే ఒక అవకాశం ఒదిగి వచ్చింది. ఒక గొప్పింటి స్త్రీలా కనిపిస్తున్న అందగత్తె ఒక షాపులో ప్రదర్శన కోసం పెట్టిన వస్తువులను చూస్తూ నుంచుని ఉంది. ఆ ప్రదేశానికి కొద్ది దూరంలో ఒక పోలీస్‌ గోడకు ఒరిగి నుంచుని ఉన్నాడు. ఆమెతో రోడ్‌  సైడ్‌ రోమియోలా ప్రవర్తించాలని ఆలోచించాడు సోపి. సభ్యతగా కనిపిస్తున్న ఆ యువతిని, నిజాయితీపరుడిలా కనిపిస్తున్న ఆ పోలీసును చూసినపుడు, తొందరగానే తాను సంకెళ్ళలో చిక్కుకుంటాడని భావించిన సోపి, అప్పుడే తనకు చలికాలపు ఆశ్రయం దొరికిపోయినట్టు సంతోషపడ్డాడు.

సోపి తన టై సరిచేసుకొని, మడతలుపడ్డ తన కోటుచేతులను లాక్కుంటూ, హ్యాటును కాస్త ఓరగా చేసుకుని ఆ యువతివైపు నెమ్మదిగా అడుగు వేశాడు. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, చిన్నగా దగ్గి, చిరునవ్వు నవ్వాడు. తరువాత ఆమె వైపు చూస్తూ రోడ్‌ సైడ్‌  రోమియోలా అల్లరిగా  సైగలు చేశాడు. తరువాత ఓరకంట పోలీసు వైపు చూశాడు. పోలీస్‌ తననే చురచుర చూస్తున్నాడని నిర్ధారించుకున్నాడు. ఆమె రెండు అడుగులు ముందుకు వేసి, మళ్ళీ ప్రదర్శనకు పెట్టిన వస్తువులను కిటికీలోంచి తదేకచిత్తంతో చూడసాగింది. సోపి ఆమె దగ్గరికి పోయి ధైర్యంగా  పక్కన నుంచుని, తన హ్యాటును పైకెత్తి–
‘‘హలో బేబీ, నాతోపాటు డ్యాన్స్‌ చేయడానికి వస్తావా?’’ అన్నాడు.

పోలీసు ఇంకా చూస్తూనే ఉన్నాడు. తన సైగకు నొచ్చుకున్న యువతి వచ్చి వేలుచూపించి ఒక్క మాట చెబితే చాలు. సోపి స్వర్గానికి సమానమైన ఆ ద్వీపానికి దారి పట్టేవాడు. అప్పటికే  అతనికి పోలీస్‌ స్టేషన్‌ వెచ్చటి వాతావరణాన్ని అనుభవిస్తున్నట్టు అనిపించింది. ఆ యువతి అతని వైపు తిరిగి చేయిచాపి కోటు చేతిని పట్టుకుంది. తరువాత సంతోషంగా–
‘‘ఓహ్‌! కచ్చితంగా. నేను అప్పుడే పలకరిద్దామనుకున్నాను. అయితే ఆ పోలీసు మనల్నే చూస్తున్నాడు’’ అంది.
ఆమె మామిడి చెట్టుకు అల్లుకున్న తీగలా అతన్ని కరుచుకుంది. సోపి పిచ్చివాడిలా ఆమెతోపాటు అడుగు వేస్తూ పోలీసును దాటి ముందుకు నడిచాడు. బహుశా జైల్లో వెచ్చగా కాకుండా స్వేచ్ఛగా బయటి ప్రపంచంలో ఉండటమే తన నుదుటి రాతలో ఉందని అనుకున్నాడు.

ముందరి మలుపులో తన వెంట వచ్చిన ఆ యువతి చేతిని విదిల్చుకుని సోపి అక్కడి నుంచి పరుగుతీశాడు. కొద్దిసేపటి తరువాత  అతను విలాసవంతమైన ఒక కాలనీలో నిలబడ్డాడు. అక్కడ ఫర్కోట్‌ ధరించిన ఆడవాళ్ళు, నిలువు కోటు ధరించి పురుషులు చలికాలపు చల్లటి గాలిలో ఉల్లాసంగా తిరుగుతున్నారు. ఏదో భయంకరమైన మాంత్రిక శక్తి   వల్ల  అరెస్ట్‌ కావడం లేదని సోపికి హఠాత్తుగా దిగులువేసింది. ఈ ఆలోచనతో అతను భయపడ్డాడు. అదే సమయంలో సినిమాహాలు దగ్గర తిరుగుతున్న ఓ పోలీస్‌ కనిపించగానే మునుగుతున్నవాడికి గడ్డిపరక దొరికినట్టయ్యింది. వెంటనే అసభ్యంగా ప్రవర్తించి అతని దృష్టిని  ఆకర్షించాలని అనుకున్నాడు. రోడ్డుపక్కనున్న కాలుదారిలో సోపి తాగినవాడిలా తూలుతూ మొరటు కంఠంతో అసందర్భంగా బిగ్గరగా అరవసాగాడు. అతను గంతువేస్తూ, ఎగిరి దూకుతూ ఊళ పెట్టాడు. పిచ్చిపిచ్చిగా ఏడ్చాడు. చుట్టుపక్కంతా గొడవ చేశాడు.

పోలీస్‌ తన లాఠీని తిప్పుతూ సోపి వైపు చూడకుండా అటు తిరిగి దగ్గర్లో ఉన్న ఒక పౌరుడితో అన్నాడు– ‘‘ఎవడో పనికిమాలిన వెధవ. వొట్టి వాగుడుకాయ. అయితే  ఏమీ ఇబ్బంది పెట్టడు. ఇలాంటివాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోకూడదని మాకు పైనుంచి ఆర్డర్‌ వచ్చింది’’.
ఖిన్నుడైన సోపి తన కోతిచేష్టలను ఆపాడు.
 ఏ పోలీసు తనను అరెస్ట్‌ చేయడం లేదుకదా? ద్వీపానికి వెళ్ళటం సాధ్యం కాని లక్ష్యంలా అతనికి కనిపించింది. కొరికే చలిలో రక్షణ పొందడానికి అతను తన పల్చని కోటు బొత్తాలను పెట్టుకున్నాడు. 
అక్కడొక సిగార్‌ అంగడి కనిపించింది. మంచి దుస్తులు ధరించిన ఒక వ్యక్తి వెలుగుతున్న దీపంతో సిగార్‌ వెలిగించుకుంటున్నాడు. తన సిల్క్‌ గొడుగును అంగడి తలుపు పక్కన ఆనించి పెట్టాడు.
సోపి పోయి గొడుగును తీసుకుని నిమ్మళంగా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. సిగార్‌ వెలిగించుకుంటున్న మనిషి హడావుడిగా సోపి వెనుకే వచ్చి– 
‘‘ఏయ్, అది నా గొడుగు’’ అని గడుసుగా అన్నాడు.

‘‘ఓహో, అవునా?’’ అంటూ సోపి కోపంతో బుసకొట్టాడు. 
దొంగతనంతో పాటు అవహేళనను చేరుస్తూ ‘‘అలాగైతే ఎందుకు పోలీసును పిలవడం? నేను దాన్ని తీసుకున్నాను. నీ గొడుగు కదా? పోలీసును ఎందుకు పిలవటం లేదు? అదిగో అక్కడ మూలలో ఒక పోలీస్‌ నిలబడ్డాడు చూడు’’
గొడుగు యజమాని తన నడక వేగాన్ని తగ్గించాడు. అదృష్టం ఎక్కడ ముఖం చాటేస్తుందోననే ఆలోచనతో సోపి కూడా అలాగే చేశాడు. పోలీసు ఇద్దరివైపు కుతూహంగా చూశాడు. 
‘‘ఓహ్‌! అదీ...మీకు తెలుసుకదా, ఇలాంటి తప్పులు ఎలా జరుగుతాయో...అది మీ గొడుగైవుంటే దయచేసి నన్ను క్షమించండి.  ఈరోజు ఉదయం నేను ఆ గొడుగును  ఒక హోటల్లో కనిపిస్తే తీసుకొచ్చాను. అది మీదని మీరు గుర్తుపడితే...బహుశా మీరు...’’ అన్నాడు ఆ మనిషి.
‘‘అవును, ఇది నాదే’’ అన్నాడు సోపి దుష్టతనంతో.

ఆ మనిషి  వెనక్కు జరిగాడు. పోలీస్‌ ఓ పొడువైన అందగత్తెకు సహాయపడటానికి రోడ్డుదాటి అటువైపు వెళ్ళాడు. సోపి రోడ్డు మీద తూర్పుకు అభిముఖంగా నడవసాగాడు. తన ప్రయత్నాలు విఫలమైనందుకు అతనికి బాధగా ఉంది. రోడ్డు  పక్కనున్న ఒక గుంతలో గొడుగును కోపంతో విసిరాడు. శిరస్త్రాణం ధరించి చేతిలో కర్ర పట్టుకుని నడిచే జనం పట్ల  కోపంతో గొణుక్కున్నాడు. వారి చేతికి తాను చిక్కుకోవాలని ప్రయత్నిస్తే, తాను ఏ తప్పు చేయని గొప్ప వ్యక్తి అన్నట్టు వాళ్ళు గౌరవంతో చూస్తున్నట్టు అనిపించింది.
చివరికి సోపి తూర్పువైపున ఉన్న రోడ్డు మీదికి వచ్చాడు. ధగధగమని వెలిగే దీపాలుకానీ, కోలాహలం కానీ లేదు. అక్కడినుంచి మ్యాడిసన్‌ సర్కిల్‌ వైపు నడవసాగాడు. తోటలోని బెంచే తన ఇల్లయినప్పటికీ, ఇంటికి వెనుతిరిగి వెళ్ళాలనే భావన అతనిలో జాగృతమైంది.

అయితే మరీ ప్రశాంతంగా ఉన్న ఒక మలుపులో సోపి గబుక్కున నిలబడ్డాడు. అక్కడొక పురాతన చర్చి ఉంది. అక్కడ ఒక వ్యక్తి నైపుణ్యంతో  ప్రార్థన గీతాన్ని తన వాయిద్యంలో వాయిస్తున్నాడు. ఆ మధురమైన సంగీతం తోసుకుని వచ్చి సోపి చెవుల్లో దూరి అతన్ని అక్కడే పట్టి నిలిపివేసింది. చర్చి చుట్టూ వేసిన కంచె దగ్గర అతను నుంచున్నాడు.
పైన చంద్రుడు ప్రకాశంగా, ప్రశాంతంగా వెలుగులు చిందిస్తున్నాడు. జనసంచారం తగ్గింది. వాహనాల సంచారం అంతగా లేదు. గువ్వపిట్టలు  నిద్రకళ్ళతో కువకువలాడుతున్నాయి. కొద్దిసేపు ఆ దృశ్యం పల్లెటూరి చర్చీ ప్రాంగణంలా అనిపించింది. ఆ వ్యక్తి  వాయిస్తున్న ప్రార్థనాగీతం సోపి మనస్సును ఆవరించింది. ఆ గీతం అతడిని ఇనుప కంచెను ఆనుకుని నిలుచునేలా చేసింది. 
తల్లి, గులాబీ, ఆకాంక్షలు, స్నేహితులు, ప్రామాణికమైన భావనలు...మొదలైనవన్నీ అతని జీవితాన్ని నింపుకున్నటువంటి కాలంలో అతనికి  ఆ ప్రార్థనా గీతం బాగా తెలుసు. 

సోపి స్వీకార మనోధర్మం, పురాతన చర్చీ కలిగించిన ప్రభావం కలగలిసి ఉన్నట్టుండి అతని ఆత్మలో ఒక అద్భుతమైన పరివర్తన కలిగింది. తాను ఎలాంటి అధఃపాతాళంలో పడిపోయాడుకదా అని అతను దిగులు చెందాడు. తనను తాను పరిశీలించుకున్నాడు. అధఃపతనంలో గడిపిన  ఆ రోజులు, యోగ్యం కానటువంటి ఆకాంక్షలూ, విఫలమైన కోరికలు, వ్యర్థమైన సామర్థ్యాలు, హీనమైన అభిప్రాయాలు ఇవే అతని అస్తిత్వంలో నిండివుండేవి.

ఈ కొత్త మార్పుకు అతని హృదయం చప్పున సంతోషంతో ప్రతిస్పందించింది. ఆ క్షణంలో ఒక ప్రబలమైన వేగం, తన నిరాశాపూరితమైన అదృష్టంతో  పోరాడటానికి అతన్ని ముందుకు తోసింది. ఆ ఊబి నుంచి అతను లేచి పైకి రావాల్సిందే. మరొకసారి అతను మనిషి కావాలి. అతడిని వశపరుచుకున్న సైతాన్ను గెలవాలి. ఇంకా కాలం మించిపోలేదు. ఇంకా అతను వయస్సులో చిన్నవాడు. అతనిలోని పాత ఆశలు, కోరికలను పునర్జీవింపజేయాలి. ఆ పవిత్రమైన, మధురమైన వాదనపు నాదం అతనిలో ఒక క్రాంతినే తెచ్చింది. రేపు రభసగా వ్యాపారం సాగే ముందరి పట్టణానికి వెళ్ళి ఏదైనా ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. గొర్రె, మేక జుత్తును దిగుమతి చేసుకునే ఒక వ్యాపారి గతంలో ఒకసారి అతడికి వ్యాన్‌ డ్రైవర్‌ పని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. రేపు ఆ వ్యాపారిని కలుసుకుని ఉద్యోగం అడగాలి.

ప్రపంచంలో తాను ఒక గొప్ప వ్యక్తి కావాలి. తాను ఒక... సోపి భుజం మీద బరువైన చేయొకటి పడింది. అతను చప్పున వెనుతిరిగి చూశాడు. 
పోలీసు వెడల్పు ముఖం అతని కంటపడింది.
‘‘ఇక్కడ ఏం చేస్తున్నావు?’’ అడిగాడు పోలీస్‌.
‘‘ఏమీ లేదు’’ అన్నాడు సోపి.
‘‘అయితే నా వెంట రా’’ అన్నాడు పోలీస్‌.
మరుసటి రోజు ఉదయంచీ–
కోర్టులో జడ్జి, ‘‘నీకు మూడు నెలలు ద్వీపాంతరవాస జైలుశిక్ష  విధిస్తున్నాను’’ అన్నాడు.

-ఆంగ్ల మూలం: ఓ.హెన్రీ 
అనువాదం: రంగనాథ రామచంద్రరావు    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement