
రెండు ప్లాట్‌ఫారమ్‌లు కలవవు.రెండు పట్టాలు కలవవు.రెండు గమ్యాలు ఒకటి కావు.సమాంతర జీవితాలను సమంగా వేధించే అనుభూతి ఇది.కలవని వారిని ప్రేమించే అనురాగం ఇది.ఈ ప్రేమ ఒక జీవితకాలం లేటు.
నగరపు ఒంటరి జీవితం.. అదీ కోల్‌కత్తా లోన్లీనెస్.. స్క్రీన్ మీద ‘‘యువర్స్ ట్రూలీ’’గా కనిపించింది. ‘ఆనీ జైదీ’ రాసిన ‘‘ది వన్ దట్ వజ్ అనౌన్స్‌డ్’’ అనే షార్ట్ స్టోరీ ఆ సినిమాకు ఆధారం. జీ ఫైవ్ స్ట్రీమ్ అవుతోంది.
కథ..
మీథీ కుమార్(సోనీ రాజ్దాన్).. ప్రభుత్వ ఉద్యోగిని. రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్న అవివాహిత. ఆమెకు ఓ చెల్లెలు ..లాలి (ఆహనా కుమారా) బెంగళూరులో ఉద్యోగం చేస్తూంటుంది. కోల్‌కత్తాలో తాత,తండ్రి వారసత్వంగా వచ్చిన.. ఇచ్చిన ఇంటిలో ఓ పోర్షన్ అద్దెకు ఇచ్చి.. మీథీ కుమార్ ఒంటరిగా ఉంటూంటుంది. తల్లీతండ్రి చనిపోవడం, వయసులో తన కన్నా చాలా చిన్నదవడంతో చెల్లెలికి అక్కలాగా కాకుండా ఓ తల్లిలా వ్యవహరిస్తుంది మీథీ. మితభాషి. ఒటరితనం వల్లో.. స్వభావమే అంతో తెలియదు కాని.. కలివిడిగా ఉండదు. ఆఫీస్‌లో ఆమెకు ఒకే ఒక మహిళా సహోద్యోగి. మిగిలిన వాళ్లంతా మగవాళ్లే. పురుషాహంకారులే. దాంతో ఆ ఫీమేల్ కొలీగ్‌తో తప్ప ఇంకెవరితోనూ మాట కలపదు ఆమె. ఆ సహోద్యోగి ప్రెగ్నెంట్. డెలివరీకి లీవ్ మీద వెళ్లబోతూ మీథీ గురించి ఆందోళన పడుతుంది.
తనులేక ఆఫీస్‌లో కూడా ఒంటరి అయిపోతుందేమోనని. కానిమీథీకి ఒంటరితనంతోనే చెలిమి ఎక్కువ. బద్దకంగానే రోజు మొదలవుతుంది ఆమెకు. అద్దెకు ఇచ్చిన పోర్షన్‌లో పక్షి ప్రేమికుడైన విజయ్ (పంకజ్ త్రిపాఠి) కుటుంబం ఉంటుంది. అతను మీథీతో స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తూంటాడు. పెంపుడు చిలుకను పలకరించే మిషతో మీథీ కంట్లో పడడానికి, ఆమెతో మాటలు కదపడానికీ ప్రయత్నిస్తుంటాడు. మీథీ సేద తీరేది ఒకే ఒక్క చోట.. ప్రయాణంలో.. కొన్నేళ్లుగా! కోల్‌కత్తా ఈ కొస నుంచి ఆఫీస్ ఉన్న ఆ కొస వరకు ఆమెది సుదీర్ఘ ప్రయాణమే. తోపుడు బండితో మొదలై.. రిక్షాలో సాగి.. లోకల్ ట్రైన్‌తో గమ్యం చేరుకుంటుంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచీ ఆ దారి సుపరిచితమే. అయినా ప్రతి రోజూ కొత్తగా చూస్తూంటుంది.
సరికొత్త పరిచయం..
అలా ఒకసారి ఆ రైల్వేస్టేషన్.. ఆమెకు ఓ సరికొత్త కొంతును పరిచయం చేస్తుంది. రైల్వే మేల్ అనౌన్సర్ గొంతు (వినయ్ పాఠక్) అది. ఆ స్వరంతో స్నేహం చేస్తుంది. దగ్గరితనం పెంచుకుంటుంది. ఎంతలా అంటే... ఆ అనౌన్సర్ తనతోనే మాట్లాడుతున్నాడనే భ్రమను వాస్తవమని నమ్మేంతగా. ఆ స్టేషన్‌లో జనం రద్దీలో.. దారి దొరక్క ఇబ్బంది పడ్తూంటే.. తోటి ప్రయాణికులు తమ లగేజ్ చూడమనే పని అప్పగిస్తుంటే... వదిలించుకొని త్వరగా గమ్యాన్ని చేరుకో అంటూ ఆ అనౌన్సర్ గైడ్ చేసి.. తనకు తోవ చూపిస్తున్నట్టు.. కాస్త శ్రద్ధగా తయారైన రోజు.. ఆ అనౌన్సర్ తనకు కాంప్లిమెంట్ ఇస్తున్నట్టు.. మొత్తంగా ఆ స్వరం తనకోసం వేచి చూస్తున్నట్టు.. తనను ప్రేమిస్తున్నట్టూ ఊహించుకుంటుంది.
ఆ గొంతుతో ప్రేమలో పడ్డప్పటి నుంచి ఆమెలో కొత్త ఉత్సాహం కనపడుతుంది. రోజూవారి ఆ సోలాంగ్ జర్నీ.. ఇంట్రస్టింగ్‌గా మారుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. రైల్లో తోటి ప్రయాణికులను కుతూహ లంగా చూడ్డం ప్రారంభిస్తుంది. తన చుట్టూ సానుకూల వాతావరణం ఉన్నట్టు తోస్తుంది. ఎదురైన చావు ఊరేగింపు... అప్పుడే పెళ్లి చేసుకుని ట్రైన్ ఎక్కిన కొత్త జంట.. ఆ కొత్త పెళ్లికొడుకు పట్ల కొత్త పెళ్లికూతురు అనాసక్తంగా ఉండడం.. అంతలోకే ఆ ట్రైన్‌లోకి వచ్చిన ఓ యువకుడిని చూసి కొత్త పెళ్లికూతురు మొహం విప్పారడం.. అతను ఆమెను తీసుకొని వెళ్లిపోవడం.. కొత్త పెళ్లికొడుకు ఖంగు తినడం.. వంటి తనకు ఎదురైన సంఘటనలను ఆ రైల్వే అనౌన్సర్‌కు ఉత్తరాలుగా రాస్తుంది.
మొత్తానికి తనలోని భావోద్వేగాల ఉనికిని కనిపెడుతుంది. వాటన్నిటినీ లేఖల్లో ఆ అనౌన్సర్‌తో పంచుకుంటుంది. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. రిటైర్‌మెంట్ దగ్గర పడ్తుంది. రిటైర్ అయితే.. ప్రయాణం ఆగిపోతుంది. ఆ అనౌన్సర్ గొంతూ దూరమవుతుంది.. అన్న ఆలోచన రాగానే నెమ్మదిగా ఆమెలో దిగులు మొదలవుతుంది. ఇన్ని ఉత్తరాలు రాస్తున్నా.. ఒక్కదానికీ జవాబివ్వడేంటీ అన్న బాధ మనసును మెలిపెడుతూంటుంది.
చూడాలి.. కలవాలి.. అడగాలి
అసలు తన జాబులు అందుతున్నాయా? లేదా? చదువుతున్నాడా?చించేస్తున్నాడా? అనే సందేహం.. సంఘర్షణ, అంతర్మథనం ఆమెను నిద్రపోనివ్వవు. ఏది ఏమైనా అతనిని చూడాలి.. కలిసి మాట్లాడాలి.. తన ఉత్తరాల గురించి అడగాలి అని ఒకరోజు ఆ స్టేషన్‌లోని అనౌన్స్‌మెంట్ గదికి వెళ్తుంది. అక్కడ ఎవరూ ఉండరు. మళ్లీ తెల్లవారి.. అతను తనను కలవలేకపోయినందుకు నొచ్చుకున్నట్టు.. ‘‘ఇన్నేళ్లు ఎప్పుడూ నన్ను చూడాలనిపించలేదా? లేక లేక నేను లీవ్ పెట్టిన రోజే నన్ను కలవాలనిపించిందా’’ అని నిష్టూరమాడినట్టు.. సారీ చెప్పినట్టూ భ్రమ పడ్తుంది. అతనిని క్షమించేస్తుంది. కాని మనసులో మాత్రం ఇదేదో తేల్చుకోవాలనే నిశ్చయించుకుంటుంది.
దీపావళి..
చెల్లెలు లాలి తీరు.. అక్క మీథీ మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. గలగల మాట్లాడుతూ.. సరదాగా.. ఉంటుంది లాలీ. దీపావళి పండక్కి అక్కతో గడపడానికి ఊరొస్తుంది. అప్పుడు మీథీలోని అక్క బయటపడ్తుంది. చెల్లితో సరదాగా ఉంటుంది. మొదటిసారిగా అమ్మలా కాకుండా.. అక్కలాగా.. ఓ స్నేహితురాలిగా లాలీతో గడుపుతుంది. చెల్లెలి బాయ్‌ఫ్రెండ్ గురించి డిస్కస్ చేస్తుంది. అనౌన్సర్‌తో తన ప్రేమ వ్యవహారం చెప్తుంది. ఏదో ఒకటి తేల్చుకోమ్మని చెల్లెలూ సలహా ఇస్తుంది మీథీకి. కుదరకపోతే.. ఆ ఇల్లు అమ్మేసి.. తనతోపాటే బెంగళూరు వచ్చేయమని ఒత్తిడి తెస్తుంది.
చెల్లెలు వెళ్లిపోయాక.. ఆ విషయాలన్నిటితో ఆ అనౌన్సర్‌కు ఉత్తరం రాస్తుంది. ఆ ఇంటికి, తనకు ఉన్న అనుబంధాన్ని, సెంటిమెంట్‌ను వివరిస్తుంది. ఇంటిని అమ్మలేని.. ఆ ఊరి వదిలి వెళ్లిపోలేని నిస్సహాయతను తెలుపుతుంది. అతని నుంచి జవాబు రాకపోతే చెల్లెలు ఇచ్చిన సలహానే పాటించాల్సి వస్తుందేమోననే భయాన్నీ వ్యక్తపరుస్తుంది. అయినా ఉత్తరం రాదు. చెల్లెలు వెళ్లిపోయాక ఒంటరితనం భరంగా అనిపించి.. ఓ కుక్కపిల్లను తెచ్చుకుంటుంది. తనతోపాటే దాన్ని ఆఫీస్‌కి తీసుకెళ్తుంది.
ఆ రోజు..
స్టేషన్‌లో అనౌన్సర్ సంభాషణ వినిపించదు. అన్యమనస్కంగా ఉంటుంది మీథికి. కుక్కపిల్లను దువ్వుతూ ప్లాట్‌ఫారమ్ మీద కూర్చుంటుంది. అవతల ప్లాట్‌ఫారమ్ బెంచ్ మీద ఓ వ్యక్తి కనిపిస్తాడు. బ్యాగ్‌లోంచి ఏవో తీస్తూ. శ్రద్ధగా పరికిస్తుంది. ఎన్వలప్‌లు. ఉలిక్కిపడ్తుంది. అడ్రస్ కింద ఉన్న రంగురంగు పూల డిజైన్లను చూసి. తను వేసినవే.. ఒక్కసారిగా ఆనందం ఆమెలో. అంటే.. తన ఉత్తరాలందుతున్నాయి. చదువుకుంటున్నాడు. మనసు ఉప్పొంగుతుంది. వెళ్లి అతణ్ణి కలవాలని ఉద్యుక్తమవుతుండగానే.. ఇద్దరికీ మధ్య ఉన్న ట్రాక్ మీదకు ట్రైన్ వస్తుంది.. పోతుంది. అవతలి ప్లాట్‌ఫారమ్ మీద అతనుండడు.
ఆ ట్రైన్‌లో వెళ్లిపోయాడని అనుకుంటుంది. తెల్లవారి కలవొచ్చు.. కలుస్తాడనే భరోసాతో మీథీ కుమారీ ఇంటికి బయలుదేరుతుంది. ప్లాట్‌ఫారమ్ మీద ఉత్తరాలు చదువుకుంటున్న వ్యక్తి పాత్రలో మహేష్ భట్ కనిపిస్తాడు. ఇదీ.. యువర్స్ ట్రూలీ కథ. దర్శకుడు సన్‌జోయ్ నాగ్. లంచ్‌బాక్స్, అపర్ణా సేన్ ‘36 చౌరంఘీ లేన్’ సినిమాలను పోలినట్టు కనిపించినా.. వాటికి భిన్నమైందే. మీథీ కుమార్ పాత్రలో సోనీ రాజ్దాన్ ఒదిగిపోయిందని చెప్పొచ్చు.
– సరస్వతి రమ
Comments
Please login to add a commentAdd a comment