
‘‘దేవుడా! ఈ నెంబరు వాడిదే కావాలి’’ మనసులో అనుకుంటూ మొబైల్లో నెంబర్ని డయల్ చేశాడు విశ్వజిత్. ‘‘చెప్పండి. ఎవరు మీరు?’’ అవతలి గొంతు.
‘‘నేను...కాదు...మీది రామాపురమేనా?’’ అడిగాడు నెమ్మదిగా.
‘‘అవును’’
‘‘అవునా? మీ పేరు సుందరం కదా!’’
‘‘అవును. నేను ఇక్కడే టీచర్‌గా పనిచేస్తున్నాను. ఇంతకూ మీరు ఎవరు?’’ కాస్త విసుగ్గా అవతల గొంతు. ‘‘నేను.. నేను...విశ్వజిత్. కాదు... కాదు...వెంకట్రామున్ని’’ అన్నాడు తడబడుతూ విశ్వజిత్.
‘‘వెంకట్రామా?’’
‘‘వెంకట్రామున్ని. నీ చిన్ననాటి నేస్తాన్ని’’
‘‘వెంకట్రామ్....అంటే వీరయ్య కొడుకువా? ఒరేయ్ ఎంత కాలం అయింది రా! నమ్మలేకపోతున్నాను. అయ్యో సారీ’’
‘‘సారీ ఎందుకు రా! ఇరవై అయిదేళ్ళు ఏళ్లు ఎలా గడిచాయో తెలియడం లేదు. నా అదృష్టం కొద్దీ ఎలాగోలా నీ నంబరు దొరికింది’’
‘‘అవున్రా! అయినా ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు?’’
‘‘అవన్నీ వివరంగా తరువాత చెబుతాను. ముందు నీతో మాట్లాడుతూ ఉంటే మన ఊరు నాతో మాట్లాడుతున్నట్టు ఉంది రా! ఆ పొలాలు, వాగులు, వంకలు, చెట్లు, చేమలు, చెరువులు అన్ని అన్ని కళ్ల ముందు కదలాడుతున్నట్లుంది. అవున్రా మన ఊరి చెరువు, గట్టు మీద చింత చెట్టు ఎలా ఉన్నాయి రా? చూడాలని ఉంది...’’
‘‘వెంకట్! ఇంకెక్కడి చెరువు రా? ఎప్పుడో మాయమైంది’’
‘‘ఎలా?’’
‘‘అందరూ ఆక్రమించుకున్నారు. ఇళ్లు కట్టుకున్నారు.’’
‘‘మరి చింతచెట్టు?’’ అడుగుతుంటే గొంతు జీరవోయింది.
‘‘అదొక్కటే మిగిలింది. దానికి దగ్గరలోనే కదా మా ఇల్లు. కానీ నీకో ముఖ్య విషయం చెప్పాలి రా! త్వరలో ఆ చింతచెట్టు కూడా మాయం కాబోతోంది! రేపు మన గ్రామ పంచాయతీ వాళ్లు ఆ చెట్టును, అది ఉన్న స్థలాన్ని వేలం వేయబోతున్నారు. అక్కడ బార్ కట్టించబోతున్నారు’’
‘‘ఆ చెట్టు నాకెంతో ఇష్టం కదరా! మన చిన్నతనం అంతా అక్కడే గడిచింది! అది నాకు జీవితాన్ని ఇచ్చింది!....’’ ఇక మాటలు పెగల్లేదు.
‘‘వెంకట్! అంతే కాదు రా, అది మీ నాన్న శీలానికి ఏర్పడిన మచ్చను చెరిపేసింది!’’
‘‘ఒరేయ్ సుందరం, నేను మన ఊరికి వస్తాను రా! ఎలాగైనా దాన్ని చూడాలి! ఇప్పుడే బయలుదేరుతాను. రేపటి ఉదయానికంతా ఎలాగోలా చేరుకుంటాను’’ అంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వజిత్. సమయం చూశాడు, మధ్యాహ్నం మూడుగంటలవుతోంది. అంతే మరో ఆలోచన లేకుండా వెంటనే బయలుదేరాడు.
∙∙
ఇరవైఅయిదేళ్ళ తర్వాత తను పుట్టి, పెరిగిన ఊరిని చూడబోతున్నాడు. ప్రస్తుతం తను ముంబైలో ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్. దేశంలోని పెద్ద నగరాల్లో తన కంపెనీలు ఉన్నాయి. కోటీశ్వరుడైన విశ్వజిత్ పేరు చిన్ననాటి పేరు వెంకట్రాముడు. ఎనిమిదేళ్ల తర్వాత విశ్వజిత్. తన జీవితాన్ని రెండు భాగాలుగా ఆ వయస్సు విభజించింది. రామవరం ప్రకృతి ఇచ్చిన కానుక పచ్చటి పొలాలు. రెండు వందల దాకా ఇళ్ళు. ఊరికి ఆనుకుని చిన్న చెరువు. గట్టున చింత చెట్టు. ఎన్నో ఏళ్ల నాటిది. తన అమ్మా,నాన్నలు వీరయ్య, లక్ష్మమ్మలు. తను ఒక్కడే సంతానం. చెరువు కింద రెండెకరాల పొలం. దాన్లోనే అమ్మా,నాన్నలు ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు.
మరీ తన చిన్నతనంలోని విషయాలు గుర్తుకు లేవు కానీ ఒకటో తరగతి చేరే సమయం నుంచి అన్నీ గుర్తున్నాయి. నాన్న స్వతహాగా ఎవరి జోలికి పోరు. ఏ చెడు అలవాటు లేదు. ఊళ్లో అతనికి మంచి రైతుగా పేరుంది. వానకారు పంటలుగా చెరువు కింద వరి పండిస్తూ, ఎండ కారుగా నీళ్లు తక్కువ ఉంటాయి కాబట్టి కూరగాయలు పండించే వాడు. అలా సంవత్సరమంతా పొలం పని ఉండేది. తన బాల్యమంతా ఎంత ఆనందంగా గడిచిపోయిందో!
తనకున్న మిత్రుల్లో అందరికంటే సుందరం మంచి మిత్రుడు. తమ పొలానికి ప్రక్కనే ఉన్న ఆ ఊరి పెద్ద గంగాధరంగారికి మాగాణి ఉంది. ఎంతో తనకు సరిగా తెలియదు కానీ వందెకరాలు అని అంటుంటారు. ఆయన కన్ను తమ పొలం పై పడింది. ‘‘మీకున్న ఆ రెండు ఎకరాలు నాకు ఇచ్చేస్తే మరో చోట నాలుగు ఎకరాలు ఇస్తాను’’ అని చెప్పాడు. కానీ అది మెట్టభూమి. పైగా రాళ్ల నేల. పంటలు పండటం కష్టం. దాంతో నాన్న అంగీకరించలేదు. అదే శాపమయింది. పగపట్టాడు. ఎలాగైనా తమ పొలం లాక్కోవాలని ఎదురుచూశాడు.
ఆరోజు తాను బడిలో ఉన్నాడు. అమ్మ జ్వరంగా వుందని ఇంటిపట్టునే ఉన్నది. నాన్న ఒక్కడే పొలానికి వెళ్ళాడు. మధ్యాహ్నం మూడవుతోంది. తను బళ్ళో ఉంటే ఎవరో వచ్చి చెప్పారు– ‘‘ఒరేయ్ వెంకట్రామ్ మీ నాన్నను పొలం దగ్గర చంపేశార్రా!’’ అని. పరుగుతీశాడు.
రక్తపుమడుగులో నాన్న. తల పగిలి ఉంది. నోట మాట రాక భయంతో వణుకుతూ నిలబడి పోయాడు. నాన్న ప్రక్కనే అమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. చుట్టూ అంతా ఏదో గుసగుసలాడు కుంటున్నారు.
‘‘తగిన శాస్తి జరిగింది!’’ అన్నారెవరో. తను అటు చూశాడు. ‘‘అవును మరి ఒళ్లు బాగా కొవ్వెక్కి ఆడపిల్లను పాడుచేయ బోయాడు. ఛీ...ఛీ...పోయే కాలం కాకపోతే మంచికి విలువ లేదు’’ ఇంకెవరోఅన్నారు.
‘‘మంచివాడు అనుకున్నాం! ఇలా మేకవన్నె పులి అనుకోలేదు. సమయానికి గంగాధరంగారు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఓ ఆడపిల్ల జీవితం అన్యాయమైపోయేది కదా!’’ అన్నారు మరొకరెవరో. ఇలా తలా ఒక మాట అంటూ ఉంటే తాను అటు ఇటు చుట్టూ చూశాడు. ఓ పక్కగా తమ పొలం పక్కన పొలం గల రంగయ్య కూతురు భాగ్య ఏడుస్తూ కూర్చొని వుంది. తను ‘‘అక్కా అక్కా’’ అని పిలిచేవాడు. ఏం జరిగిందో చూచాయగా తెలుస్తోంది. నాన్న అక్కను ఏదో చేయబోయాడట. గంగాధరం వచ్చి అడ్డుకున్నారట. ఆ కొట్లాటలో నాన్న మరణించారట. ఇదంతా నిజమేనా? నాన్న అలాంటి వాడా? తన మదినిండా ప్రశ్నలు.....
‘‘సిగ్గులేని జన్మ. నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచేసే రకం. పదండి ఇంకా ఇక్కడే వుండి ఏం చేసేది? ఈ శవాన్ని పాతేద్దాం. ఇంకా ఏం మొహం పెట్టుకుని ఏడుస్తున్నావే? ఇలాంటి మొగుడు ఉంటేనేం? లేకుంటేనేం?’’ ఇలా ఎన్నో మాటలు చుట్టూ ఉన్న జనం లోంచి తూటాల్లా వస్తుంటే అంతటి ఆవేదనలోను ఆశ్చర్యం, అసహ్యం...ఏ రోజూ ఎవరిని ఏమీ అని ఎరుగని, ఏ మాట పడని నాన్నను ఇలా అన్ని మాటలు అంటున్నారు ఎందుకు?
‘‘చూడమ్మా లక్ష్మమ్మా! రంగయ్య పని ఉందని ఊళ్లోకి వెళ్లాడు. పొలం దగ్గర నీ మొగుడు వీరయ్య ఉన్నాడు. ప్రక్క పొలంలోనే భాగ్య కలుపు తీస్తోంది. ఏం బుద్ధి పుట్టిందో ఏమోగానీ కూతురులాంటి భాగ్యను చెరచబోయాడు. అదే సమయంలో నేను పొలానికి వస్తూ ఇది చూశాను. పరిగెత్తి వెళ్లి తోసేసాను. ఇద్దరి మధ్య తోపులాట మొదలైంది. ఆ తోపులాటలో అనుకోకుండా వీరయ్య తల బండరాయికి తాకి పడిపోయాడు. కళ్ళ ముందు ఆడపిల్ల మానం కాపాడటానికి పోతే ఇలా జరిగింది’’ చేతులు కట్టుకుని అన్నాడు గంగాధరం.
‘‘మీరేంటయ్యా! అలా తప్పు చేసిన వాళ్ళలా తలవంచుకొని మాట్లాడుతున్నారు. ఇలాంటి మానవ మృగాన్ని భగవంతుడే శిక్షించాడు. వీడిలాంటి వాడికి పెళ్ళాం అని చెప్పుకోవడం కంటే చావడం మేలు కదా’’ ఇంకెవరో ఎత్తిపొడిచారు.
ఏమనుకుందో ఏమో అమ్మ లేచింది. బిగ్గరగా ఏడుస్తూ ఊళ్లోకి పరుగుదీసింది. ఎవ్వరికి ఏమీ అర్థం కాలేదు.
‘’అమ్మా! అమ్మా!’’ అంటూ తను పరువు తీశాడు కానీ అప్పటికే అమ్మ దూరంగా అందనంత వేగంతో వెళుతోంది. అందుకోవాలని తను వేగంగానే పరిగెత్తాడు. కానీ తన కళ్ళ ముందే అమ్మ కట్ట మీద నుండి నిండుగా ఉన్న చెరువులోకి దూకింది. దాన్ని చూడగానే తను కళ్ళు తిరిగి కుప్పకూలిపోయాడు. కళ్ళు తెరిచి చూసేసరికి స్మశానంలో ఉన్నాడు. రెండు గోతుల్లో ఒకదాంట్లో అమ్మ, మరోదాంట్లో నాన్నని పడేసి ఉన్నారు. లేచి కూర్చున్నాడు. తన చేత మట్టి వేయించారు. అందరూ వెళ్లిపోయారు. తన సంగతి ఎవరికి పట్టలేదు. చీకటి పడే వేళ ఇంటికి వెళ్లాడు. ఇంకా భయమేసింది. ఇంటి ముందున్న రెండు ఎద్దులు లేవు. ఆవు కూడా లేదు. ఇల్లంతా చిందరవందరగా, సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
గంగాధరం ఇంట్లో పనిచేసే పాలేరు తమ ఇంట్లో ఉన్నాడు.
‘‘ఒరేయ్! పోరాపో...వస్తే నీవుకూడా నీ అమ్మానాన్నల వద్దకు వెళతావు’’ తాగి వున్నాడు కాబోలు గర్జించాడు. తను భయంతో పరుగులు తీశాడు. చింతచెట్టు దగ్గరకు చేరాడు. పొర్లి పొర్లి యేడ్చాడు. రాత్రంతా అక్కడే పడుకున్నాడు. మర్నాడు ఉదయం లేచాక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆకలి భరించలేకపోయాడు. చెరువు నీళ్ళు తాగి బడికి వెళ్లాడు. ఎవరూ మాట్లాడలేదు ఒక్క సుందరం తప్ప. గట్టిగా హత్తుకొని ఏడ్చాడు. వాడు రహస్యంగా ఇంట్లో నుండి తెచ్చియిచ్చిన రొట్టెను తిన్నాడు. మళ్లీ సాయంత్రం చెట్టు క్రిందకే చేరాడు. ఆరోజు గడిచింది. మర్నాడు సుందరం బడికి రాలేదు. నిన్న రొట్టెలు ఇచ్చాడని ఇంట్లో వాన్ని తన్నారట. తనకి ఏం చేయాలో తెలియడం లేదు. అలాగే ఆకలితోనే మళ్ళీ చెట్టు కిందికి చేరాడు. అలా మరో రెండు రోజులు గడిచాయి. ఆ చెరువు నీరే ఆహారంగా, ఆ చెట్టు నీడే ఆవాసంగా గడిచింది. ఆ రోజు రాత్రి తను పడుకుని ఉన్నాడు. దబ్బుమని శబ్దం వినిపించింది. భయంతో లేచాడు.
రోడ్డు మీదుగా వెళ్తున్న కారు ఒకటి వచ్చి చెట్టును ఢీకొంది. కారు హెడ్ లైట్లు వెలుగుతున్నాయి. పరుగున వెళ్ళి చూశాడు. లోపల ఎవరో పెద్దమనిషి ఆయాసపడుతూ ఉన్నాడు. ‘‘నీళ్లు నీళ్లు’’ అని సైగ చేశాడు. తను చెరువు నీళ్లను పరిగెత్తుకొని వెళ్లి తెచ్చి ఇచ్చాడు. ఆయన నీళ్లు తాగి ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాడు. పదినిమిషాల తర్వాత మామూలు మనిషి అయ్యాడు. బలవంతంగా డోర్ తెరుచుకుని బయటకు వచ్చాడు. ఇద్దరు కలిసి కారును వెనక్కి తోశారు. ఆయన జేబులో చేయి పెట్టి కొంత డబ్బు బయటకు తీసి ఇవ్వబోయాడు. తను వద్దన్నాడు.
‘‘మీ అమ్మానాన్నలకి ఇవ్వు’’ అన్నాడాయన.
‘‘వారు లేరు’’ చెప్పాడు.
‘‘అనా«థవా?’’ జాలిగా అడిగాడు.
తను తల వంచుకున్నాడు.
‘‘పద కారెక్కు!’’ అన్నాడాయన స్థిరంగా.
తను మరింకేం ఆలోచించలేదు. కార్లోకెక్కి కూర్చున్నాడు. తనెక్కడికి వెళుతున్నాడో తెలియదు. అలసిపోయిన కారణాన బాగా నిద్ర పట్టింది. ఉదయం లేచి చూస్తే ఇంకా కారులోనే ఉన్నారు. బాగా ఆకలిగా ఉందని చెప్పాడతడు. ఇద్దరూ పెద్ద హోటల్లో టిఫిన్ చేశారు. ఆరోజు రాత్రికి ముంబై చేరుకున్నారు.
అంత పెద్ద నగరాన్ని అప్పుడే చూడటం. ఒక పెద్ద భవంతిని చేరుకున్నారు. ఆ పెద్దాయన తనను పెద్ద స్కూల్లో చేర్పించారు. నెమ్మదిగా తెలిసింది ఆ పెద్దాయనకు చాలా వ్యాపారాలు ఉన్నాయని, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని. కానీ వారసులు లేరు. ఉన్న కుమారుడు యాక్సిడెంట్లో పోయాడట. తనని వారసునిగా ప్రకటించారు. తన పేరును విశ్వజిత్‌గా మార్చాడు. కాలం సాగిపోయింది. తను ఎంబీఏ పూర్తిచేశాడు. అన్ని కంపెనీల బాధ్యతలను తనకు అప్పగించి ఆయన కాలం చేశారు.
కొత్త బాధ్యతలు ....కొత్త జీవితం....
తన ఊరు, ఇల్లు, పొలం గుర్తుకొచ్చేవి. కాని ఆ చిన్ననాటి సంఘటనలు తలుచుకోగానే ఊరు తనను వెలివేసింది అన్న భావన వచ్చేది. అందుకే ఆ చేదు జ్ఞాపకాలన్నింటిని అణచివేశాడు. తనకు నూతన జీవితం ఇచ్చిన ఆ పెద్దయిన పేరు నిలిచేలా వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. అనుకోకుండా ఓ రోజు ఫేస్‌బుక్‌లో చూస్తుంటే సుందరం అని కనిపించి ఉత్సాహంతో వివరాలు చూస్తే రామాపురం అని తెలిసి ఇక ఆగలేక ఫోన్ చేశాడు. తన అమ్మానాన్నలను దూరం చేసిన ఊరిని, తనకు నిలువ నీడ లేకుండా చేసిన ఊరిని ఎప్పటికీ తలచుకోకూడదు అనుకున్నాడు. కానీ ఆ చెట్టు, ఆ చింతచెట్టు తనకు నాలుగు రోజులు ఎవరూ తోడు లేకపోయినా ఆశ్రయం ఇచ్చింది. అందుకే తన జ్ఞాపకాల వరుసలో అది మొదటిగా నిలిచింది. కానీ ఇప్పుడు అది అంతకంటే ఎక్కువ అనిపిస్తుంది. ఆలోచనలతో పాటు ప్రయాణం కూడా సాగుతూ ఉంది.
∙∙
చింతచెట్టు కింద గ్రామపంచాయతీ వాళ్లు రెండు టేబుల్స్ వేసి మీటింగ్ పెట్టారు. గ్రామస్తులు చాలా మంది వచ్చి కూర్చున్నారు. చివరి వరుసలో సుందరం, విశ్వజిత్ ఉన్నారు.
విశ్వజిత్ ఆ చెట్టుని తదేకంగా చూస్తున్నాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతన్ని ఊళ్లో వాళ్ళు పెద్దగా ఎవరు గమనించలేదు. సుందరం బంధువు ఏమో అనుకున్నారు.
పంచాయతీ కార్యదర్శి గొంతు సవరించుకున్నాడు. ‘‘ఇంతకు పూర్వం ప్రకటించిన ప్రకారం మన గ్రామంలో ఉన్న ఈ చింతచెట్టు, అది ఉన్న పదిసెంట్ల స్థలం పంచాయతీకి చెందినది. దీన్ని వేలం వేయడం ద్వారా పంచాయితీకి ఆదాయం సమకూర్చుకోవాలి అనుకున్నాం. ఈ స్థలాన్ని లీజుకు తీసుకోవలసిన వారు ఎవరైనా సరే ఈ బహిరంగ వేలంలో పాల్గొని పాడవచ్చు. ముందుగా ప్రభుత్వం వారి పాట పది లక్షల రూపాయలు’’ అన్నాడు.
‘‘పదకొండు లక్షలు’’ ఎవరో ఒకాయన అన్నాడు. ‘‘పన్నెండు లక్షలు’’ ఇంకొకరి పాట.
‘‘పదిహేనులక్షలు’’... ఇక మరెవ్వరూ పాడలేదు. మౌనం రాజ్యమేలుతోంది. పంచాయతీ కార్యదర్శి ‘‘పదిహేనులక్షలు ఒకటోసారి...పదిహేను లక్షలు రెండవసారి’’అన్నాడు.
‘‘కోటిపాయలు’’ విశ్వజిత్ లేచి అన్నాడు.
‘‘కోటి’’ ఆ మాట వినపడగానే అంతా వెనక్కి తిరిగి చూశారు. ‘‘ఈ స్థలానికా అంత సొమ్ము ఇచ్చేది? మూర్ఖత్వం, అంతటి అమాయకత్వం’’ అన్నట్లు పంచాయతీ కార్యదర్శి ముఖం పెట్టాడు.
‘‘అవును. కోటి రూపాయలు’’ మరోసారి అన్నాడు విశ్వజిత్.
‘‘ఎవరు నువ్వు? ఒకేసారి ఎంత అమౌంట్ పాడుతున్నావు?’’ అడిగాడు వీఆర్‌ఓ.
‘‘అవును నేను స్పష్టంగా చెబుతున్నాను, అక్షరాలా కోటి రూపాయలు. నా పేరు విశ్వజిత్’’
‘‘విశ్వజిత్ పాట కోటి రూపాయలు. ఒకటవ సారి....కోటి రూపాయలు... రెండవసారి...కోటి రూపాయలు... మూడవసారి.’’
ఇంకా ఎవ్వరూ మాట్లాడలేదు.
‘‘ఈ చెట్టుతో సహా ఈ స్థలం లీజు ఇవ్వబడింది. ఒప్పంద పత్రంపై సంతకం చేయండి. డబ్బును వారంలోగా సమకూర్చండి’’ అన్నాడు పంచాయతీ కార్యదర్శి.
‘‘మీకందరికీ ఆశ్చర్యంగా ఉండవచ్చు. నేనెవరిని? దాన్ని ఎందుకు వేలం పాడానని! నా పేరు విశ్వజిత్. ఇలా అంటే మీకు ఎవరికీ తెలియదు. నేను వెంకట్రామున్ని. అయినా మీకు తెలియదనుకుంటున్నా. ఇరవై అయిదేళ్ళ క్రితం చనిపోయిన వీరయ్య, లక్ష్మమ్మల కొడుకును’’ అన్నాడు.
అక్కడ ఉన్న యువకులకు అంతగా అర్థం కాలేదు కాని యాభై అరవై ఏళ్ళ వయసున్న వారికి మాత్రం విశ్వజిత్ మాటలు వినగానే ఉలిక్కిపడినట్లయ్యింది.
‘‘ఓర్నీ! నువ్వు మన వీరయ్య కొడుకువా? ఆరోజు ఘోరమైన అన్యాయం జరిగిపోయింది. అసలు ఎక్కడికి వెళ్లావు? ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు?’’అడిగారు.
‘‘నేను చెబుతాను. ఈ వెంకట్రాముడి తండ్రి వీరయ్య. చాలా మంచివాడు. అతడి పొలం తనకు అమ్మలేదని కక్ష గట్టాడు ఆనాటి ఊరిపెద్ద గంగాధరం. ఒకరోజు ఆ గంగాధరం ఓ ఆడపిల్లను పాడుచేయబోతే వీరయ్య అడ్డుపడి ఆ పిల్లను కాపాడాడు. అయితే ఆ కొట్లాటను తన కక్ష తీర్చుకోడానికి అనువుగా మార్చుకొనే ఆలోచనతో వీరయ్యను చంపేశాడు. వీరయ్యే పాడు చేయబోతే తాను అడ్డుకొన్నానని ఆ కొట్లాటలో అనుకోకుండా బండరాయి తగిలి చనిపోయాడని కట్టుకథ అల్లాడు. ఆ పిల్లను, వాళ్ళ నాన్నను బెదిరించాడు. తన అంగబలంతో అనరాని మాటలనిపించాడు. అవి భరించలేక వీళ్శమ్మ చెరువులో దూకి చనిపోయింది. వీడు అనాథగా మారాడు. గంగాధరం దుర్మార్గానికి భయపడి అంతా ఏమనలేకపోయారు. యాక్సిడెంట్లో గంగాధరం కుటుంబమంతా దూరమయ్యింది. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్ళీ ఇంకోరోజు ఇదే చెట్టు క్రింద పాడుచేయబోయాడు. అప్పుడు వానపడుతోంది. పిడుగువచ్చి వాడి ప్రాణం తీసింది. ఆ పిల్ల అప్పుడే అందరికీ జరిగింది చెప్పింది. ఊరంతా వీళ్ళకు జరిగిన అన్యాయానికి బాధపడింది.’’ వివరంగా చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు ఒక పెద్దాయన.
‘‘ఈ విషయాలు నాకు నిన్ననే తెలిశాయి. ఏ అవమానభారంతో ఊరు విడిచానో అది తొలగించింది ఈ చెట్టు. ఈ స్థలాన్ని, ఈ చెట్టును ఇతడు ఏం చేసుకుంటాడు అని కదా అనుమానం? ఏమీ చేసుకోను. ఈ చెట్టు నాకు ప్రాణం. అందుకే ఇది కలకాలం ఇలాగే కళకళలాడుతూ ఉండాలి. ఈ చెట్టు కిందే నా బాల్యం గడిచింది.
ఈ ఊరి పిల్లల బాల్యమంతా ఈ చెట్టు కిందే గడపాలి. వారికి నేను ఇచ్చే కానుక ఇది. దీన్ని కాపాడుకోవటానికి కోటి కాదు పది కోట్లయినా ఇస్తాను. ఈ చెట్టు నాకు జీవితం ఇచ్చింది. ఈ చెట్టును కొట్టేసి ఇక్కడ వారు పెట్టాలని భావించారట. చాలా బాధేసింది. ఇది ఎందరో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలకు సజీవసాక్ష్యం. దీని బ్రతకనిద్దాం. మన పెద్దలకు గుర్తుగా, ఆచారాలకు సంప్రదాయాలకు సాక్షిగా నిలుపుకుందాం’’ కరతాళధ్వనుల మధ్య అందరికీ నమస్కరించాడు విశ్వజిత్.
- డా.టి.సురేశ్ బాబు
Comments
Please login to add a commentAdd a comment