వేశ్యా వృత్తిని కరోనానే రద్దు చేసింది | Short Story On Prostitution In Funday | Sakshi
Sakshi News home page

ఇది మరకలు చెరుపుకునే సమయం

Published Sun, Feb 28 2021 11:58 AM | Last Updated on Sun, Feb 28 2021 12:32 PM

Short Story On Prostitution In Funday - Sakshi

అతనేం ఫోన్‌ నంబర్‌ ఇచ్చి వెళ్లలేదు.. ఇవ్వమని తనూ అడగలేదు.. నిన్న ఆ కాసేపు సంభాషణ తప్ప తమ ఇద్దరి మధ్యా ఏ స్నేహమూ లేదు. కనీస పరిచయమూ లేదు. మరచివెళ్ళాడో, వదిలి వెళ్ళాడో, సెల్‌ఫోన్‌ తీస్తుండగా జేబు నుండి జారి పడింది ఈ విజిటింగ్‌ కార్డ్‌... కలరు, డిజైను బావున్నాయ్‌. అతని అభిరుచి ఎంత కళాత్మకమో తెలియజేస్తున్నాయ్‌.. కార్డ్‌ మీద ఒకే ఒక్క ఫోన్‌ నంబరూ ఫ్యాన్సీగా ఉంది... కానీ ఇంతకూ విజిటింగ్‌ కార్డు, ఈ ఫోన్‌ నంబరు అతనివే అయ్యుంటాయా? ఈ ప్రశ్న ఉదయం నుండి సాయంత్రం వరకు చాలాసార్లు అనుకుంది రేష్మా... ఇదివరకైతే ఇక్కడికి రోజుకు నలుగురైదుగురైనా వచ్చిపోతుండేవాళ్లు. కొన్ని నెలలుగా ఒక్క మగ పురుగూ రావటం లేదు. కనుక ఈ కార్డ్‌ అతనిదే అని తనకు తాను నిర్ధారించుకొని స్థిమిత పడింది..

రాత్రి ఏడవుతుండగా ఆ నంబర్‌కు కాల్‌ చేసి, ఒక రింగ్‌ కాగానే ఎందుకో భయమనిపించి కట్‌ చేసింది.. అంతకు ముందే చాలాసార్లు ఆ నంబర్‌ ఒకో అంకెను తన సెల్‌లో ప్రెస్‌ చేస్తూ కాల్‌ చేసే ధైర్యం రాక వదిలేసింది. ‘రింగ్‌ అయ్యిందా? హమ్మో ఎవరైనా కాల్‌ చేసి కోప్పడతారా? ఒకవేళ అతనే అయితే మళ్ళీ అంత మధురంగా మాట్లాడతాడా? తేనె తన పెదాల్లో ఉంటుందా? అతని పదాల్లోనా? మాట్లాడినంత సేపూ తియ్యగా ఉంటుంది’ అనుకుంది. ఒకవేళ అతనే కోపగించుకోబోతుంటే తన గొంతులో మాడ్యులేషన్‌ పసిగట్టి ముందు తనే... ‘ఎన్నో వివరాలు తీసుకున్నావు, ఏమో రాసుకెళ్ళావు పత్రికలో ఇంకా రాలేదేం?’ అని గట్టిగా అడగాలన్నట్టు రిహార్సల్స్‌ వేస్తోంది..

ఇన్నిసార్లు చేసినా ఒక్కసారీ కాల్‌ బ్యాక్‌ చేయడేం? తను బిజీ పర్సనే. ఆరోజు తను ఇక్కడున్న ఆ కాసేపట్లో ఆ విషయాన్ని గమనించింది. ఒకరింగ్‌తో రెండు రింగ్స్‌తో కట్‌ చేస్తూ ఈ అయిదు రోజుల్లో కనీసం ఓ పదిసార్లు చేసుంటుంది తను. ఇన్ని మిస్డ్‌ కాల్స్‌ ఎవరివో అనే స్పృహ ఉండదా ఇతనికి అనుకుంది. బహుశా అన్‌నోన్‌ నంబర్స్‌ పట్టించుకోడేమో అని సమాధానం చెప్పుకుంది.. ‘నీకేంటి.. నువు చేసిన తప్పేంటి.. ముల్లునొదిలి అరిటాకుకు శిక్షేంటి..’ గానగంధర్వుడు ఎస్పీ బాలు గొంతును అనుకరిస్తూ కాన్ఫరెన్స్‌ హాల్లో ఆర్కెస్ట్రాలో వినవస్తోందో పాట. సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సంగీతాభిమానులు పిలుపునివ్వటంతో ఆరోజు సభలో తామూ స్వర ఆకాంక్ష వ్యక్తం చేయాలని నిర్ణయించింది ఆ పత్రిక యాజమాన్యం. ఇందులో భాగంగా బాలు పాడిన అన్నేసి భాషల్లోని కొన్నేసి పాటలను పాడుతున్నారు గాయనీగాయకులు..

‘సమస్యను వెలుగులోకి తేవటంతోనే జర్నలిస్ట్‌ బాధ్యత తీరిపోదు...’ పాటల అనంతరం చైర్మన్‌ గొంతు మైక్‌లో ధ్వనించే సరికి అక్కడున్న అందరూ పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. ఎడిటర్‌తో పాటు ఆ సభలో సెంట్రల్‌ డెస్క్‌ జర్నలిస్టులు, సబ్‌ ఎడిటర్‌లు, సిటీ డెస్క్, బ్యూరో, ఇంకొందరు సిబ్బంది కలసి ఓ యాభైమంది లోపుంటారు.. చెన్నై టీనగర్‌ కార్యాలయం బయట ఎప్పటి నుంచి కురుస్తోందో వర్షం అప్పుడే వినిపిస్తోంది. ఒక ఉదాత్తమైన వ్యక్తిని తన ఉన్నత ప్రసంగానికి ఆహ్వానిస్తూ కరతాళ ధ్వనులా అన్నట్టుంది చినుకుల సింఫనీ.. ‘సమస్య తీరే పరిష్కారాన్నీ చూపాలి. అందుకు ఎవరిని కదిలించాలో ఆ కదలిక తేవాలి. జర్నలిస్ట్‌గా మీరు ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగారో ఆత్మ విమర్శ చేసుకోండి. సమస్యను రాయటం అంటే సమస్యను భుజానికెత్తుకోవటం అని గుర్తించండి. మన వల్ల ఒక్కరి సమస్యా పరిష్కారం కాలేదంటే ఇక పెన్ను మూసుకోవటం ఉత్తమం’ అంటూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేస్తున్నాడు చైర్మన్‌ రామస్వామి. తమిళంలో అత్యాదరణ గల పత్రిక చైర్మన్‌ అతను. తన పత్రికలో అత్యుత్తమ కథనాలను ఏటా సెలెక్ట్‌ కమిటీ ద్వారా ఎంపిక చేసి జర్నలిస్టులను తన పుట్టినరోజు సందర్భంగా అవార్డుతో సత్కరించటం ఆనవాయితీ. 

చైర్మన్‌ అవార్డును ఆయన చేతుల మీదుగా తీసుకోవటం ప్రెస్టీజియస్‌గా భావిస్తారు ఆ పత్రిక జర్నలిస్టులు, విప్లవ్‌ అదే అనుభూతికి గురవుతున్నాడు... అవార్డు అందుకుంటుంటే సహ జర్నలిస్టులు, ఉద్యోగుల చప్పట్లు మార్మోగుతున్నాయ్‌ కాని, అతనికి మాత్రం చైర్మన్‌గారి ప్రసంగం చెవుల్లో ధ్వనిస్తోంది.
డిన్నర్‌ టైంలో కలసిన తోటి జర్నలిస్ట్‌ వేలు పిళ్ళై ‘ఇదుగో బాస్‌ నీ సిమ్‌’ అని అందిస్తూ.. ‘ఏవో మిస్డ్‌కాల్స్‌ ఉన్నాయ్‌. చెక్‌ చేస్కో’ అన్నాడు.. ఒక జర్నలిస్ట్‌ సెలవుపై ఊరెళుతుంటే అతని ఆఫీస్‌ సిమ్‌కార్డ్‌ను ఇన్‌చార్జ్‌కు అప్పగించి వెళ్లటం ఆ పత్రిక రూల్‌. లాక్‌డౌన్‌ వల్ల, ఆఫీస్‌ పని ఒత్తిడి వల్ల, కరోనా భయం కారణాన గత మార్చి నుంచి సొంతూరికి వెళ్ళటం కుదరలేదు విప్లవ్‌కు... కోయంబత్తూరు దగ్గర చిన్న పల్లెటూరు అతనిది. తల్లిదండ్రులు ‘పెళ్లి సంబంధం చూశాం రమ్మ’ని డేట్‌ ఫిక్స్‌ చేయటంతో వారం క్రితం వెళ్ళి రాత్రే వచ్చాడు.. ఊరెళుతున్నప్పుడు తన సిమ్‌ను అప్పగించాడతను. అవార్డు తీసుకుంటూనే తను తిరిగి డ్యూటీలో జాయినవ్వటంతో అతని సిమ్‌ను అతనికప్పగించాడు ఇన్‌చార్జ్‌ వేలు పిళ్ళై.

ఇంటికెళ్లి తను పొందిన అవార్డును మళ్లీ మళ్లీ చూసుకొని మురుస్తూ సెల్‌ఫోన్‌లో సిమ్‌ వేసుకున్నాక, కాల్‌ రిజిస్టర్‌ చెక్‌ చేస్తుంటే ఒక నంబర్‌ నుంచి ఎక్కువ మిస్డ్‌కాల్స్‌ ఉండటం గమనించాడు. అదేదో అన్‌ నోన్‌ నంబర్‌.. కానీ ఎవరో? ఎందుకు చేశారో? అనుకొని వెంటనే ఆ నంబర్‌కు ఫోన్‌ చేశాడు.
అప్పటికే టైం పది దాటింది. అయినా ఆ విషయం పట్టించుకోలేదు విప్లవ్‌.. అవతలి సెల్‌ఫోన్‌లో వినపడుతోన్న కాలర్‌ ట్యూన్‌ అతన్ని ఆశ్చర్యపరిచింది. ఆ పాట ఎక్కడో విన్నట్టనిపించింది. ఎక్కడ విన్నాడో ఠక్కున గుర్తొచ్చింది. ఆ పాట రుడాలి సినిమాలో భుపేన్‌ హజారికా పాడింది. కానీ తాను ఈ మధ్య విన్నది మాత్రం రెద్‌ లైట్‌ ఏరియాలోని ఆమె గదికి వెళ్ళినపుడు.. ఆరోజు తను వెయిట్‌ చేస్తున్న గదిలోకి జాజిపూల పరిమళమై ఆమె లోగొంతుతో పాడుకుంటూ వస్తున్నప్పుడు.. ఇంటర్వ్యూ మధ్యలో ఆమె సెల్‌ఫోన్‌ రింగ్‌టోనై మోగినపుడు... తనకేదో ఫోనొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆమె అటు తిరిగి అదే పాట హమ్‌ చేస్తున్నప్పుడు..

ఇంటర్వ్యూ చేసొచ్చి మరిచేపోయాను.. ఆ ఇంటర్వ్యూ తాలూకు కథనం వల్లే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న చైర్మన్‌ అవార్డ్‌ దక్కింది తనకు. తన ఆర్టికల్‌ చూసుకుందో? లేదో? పబ్లిష్‌ అయ్యాక చెబుదామనుకొని ఏదో పనుల్లో మరచిపోయాను. ఇపుడు ‘ఈ అవార్డు మీ వల్లనే’ అని థాంక్స్‌ చెప్పాలి.. లోకల్‌ అయితే ఏ స్వీట్‌ ప్యాకెట్టో పట్టుకొని వెళ్లి కృతజ్ఞత చెబుదును. తనుండేది ముంబైలో, నేనేమో చెన్నైలో ఎలా కుదురుతుంది? అనుకున్నాడు...
ఫోన్‌లో పాట అయిపోయి అప్పటికి రెండోసారి.. ‘ఎందుకో ఫోన్‌ తీయటం లేదు’ అనుకుంటూ మరోసారి రీ డయల్‌ చేశాడు. ‘అవునూ ఇంతకు ఈ నంబర్‌ తనదేనా.. లేకపోతే ఈ టైంలో చేసినందుకు ఎవరితోనైనా తిట్లు తినాల్సి వస్తుందా .. అయినా నా నంబర్‌ ఆమెకు ఇవ్వలేదు కదా ఎలా తెలుస్తుంది? తను నాకెందుకు చేస్తుంది?’ అనుకుంటూ కాల్‌ కట్‌ చేశాడు పాట పూర్తిగా వినకుండానే..

పది నిమిషాల తరువాత ఫోన్‌ వస్తున్నట్టు రింగ్‌టోన్‌ మోగింది.. చూస్తే తను ఇప్పటివరకూ డయల్‌ చేసిన నంబర్‌ అది.. కాల్‌ చేస్తోంది తనే అనుకుంటూ, ఒకవేళ ఆమె కాదేమో అనే భయంతో లిఫ్ట్‌ చేయగానే.. ‘హాయ్‌...హల్లో’ అంటూ కోకిలగొంతు.. ఆ గొంతు ఆమెదే.. కానీ ఎందుకో ఆ గొంతులో అలసట ధ్వనిస్తోంది..  
‘హలో’ అని అతననగానే ‘హే.. ఏమైపోయారు? హబ్బ ఎన్ని సార్లు కాల్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు. అంత బిజీనా?’ కొంచెం ఆయాసపడుతూ ఆమె అంటుండగా... ‘ఆ.. బిజీ ఎవరో తెలుస్తోందిగా, ఇప్పుడు నేనూ మూడుసార్లు చేశాను’ అని అతనన్నాడు.. ‘ఓహ్‌..సారీ క..క..కస్టమర్‌ ఉన్నాడు మీద.. అప్పటికీ ఫోన్‌ రింగవుతుంటే చూశా. మీ నంబర్‌.. బ‌ట్‌ అతనేమో మంచి మూడ్‌లో ఉన్నాడు. అప్పుడే క్లైమాక్స్‌ కొచ్చేస్తున్నాడు. అతని మూడ్‌ డిస్టర్బ్‌ చేయటం నాకిష్టముండదు. ఒక రిలాక్సేషన్‌ కోసం హ్యాపీనెస్‌ కోసం, ఇంట్లో దొరకనిదేదో పొందటంకోసం మా దగ్గరికొస్తారు.. వాళ్ళను శాటిస్‌ఫై చేయటమే నాకిష్టం. నేను కోపరేట్‌ చేస్తుంటే మురిసిపోతారు. ప్రేమగా మాట్లాడుతారు. లవ్యూ చెపుతారు. ఆ పదం వినగానే మరింత అర్పించేస్తుంటాన్నేను’ అంటూ తను చెపుతుంటే ఎందుకో చలం మైదానం నవలలో రాజేశ్వరి గుర్తొస్తోందతనికి. రాజేశ్వరి వేశ్య కాకపోవచ్చు. కానీ ప్రేమ పిపాసి.. ప్రేమిస్తున్నానగానే కరగిపోతుంది.. ఇదుగో ఈమె కూడా అని అనుకున్నాడు...

‘ఏంటి బిజినెస్‌ మళ్ళీ స్టార్టయ్యిందా?’ అన్నాడు.. ‘అదేం లేదు. మీరెళ్ళిన రోజు నుండి ఇదుగో ఈరోజే ఒక్క బేరమొచ్చింది.. ఆకలి కథ అలాగే కంటిన్యూ అవుతోంది... కరోనా భయంపోతేనే మా వేశ్యాజీవితాలకు కళ’ అని ఆమె చెపుతోంది.. వేశ్యావాటికకు ఏర్పడిన గడ్డుకాలం గురించి... అలా రాత్రి పన్నెండు దాటేవరకు ముంబై నుండి చెన్నై దాకా వాళ్ళ మాటలు ప్రవహిస్తూనే ఉన్నాయ్‌.. చివరగా ‘సరే నేనొచ్చేస్తున్నా ముంబై. ఒక వారం రోజులైనా ఉండేందుకు’ అనే మాటతో తన కాల్‌ కట్‌ చేశాడు... మరుసటి రోజు మొదటి ఫ్లైట్‌కు ముంబైలో వాలిపోయాడతను. తన ఆలోచన విని, తన పత్రిక చైర్మన్‌ సంతోషించటమే కాక అన్ని ఖర్చులూ తనే భరిస్తానని ప్రోత్సహించటం విప్లవ్‌కు మరింత శక్తినిచ్చింది.. వెళ్లీ వెళ్ళటంతోనే ఆమెను కలసి తన ఆలోచన చెప్పాడు విప్లవ్‌. అది విని ఆమె సంతోషిస్తూ చప్పట్లు చరిచింది. సాధ్యాసాధ్యాలపై ఆమె సంశయ పడుతుందో, పూర్తిగా వ్యతిరేకిస్తుందో అనుకున్నాడు విప్లవ్‌. కానీ ఆమె అందుకు భిన్నంగా స్పందించేసరికి ఆశ్చర్యపోయాడు. తన పని సులువు అవుతుందనుకున్నాడు..

ఆమె సహకారంతో వేశ్యా వాడలోని కమ్యూనిటీ హాల్‌లో సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ముప్పయ్‌ ఏళ్ళ వయసున్న ఒకామె మాట్లాడుతూ.. ‘ఖర్మకొద్దీ ఈ బురదలో కూరుకున్నాం. ఇప్పటికైనా కలువల్లా వికసించాలనుకుంటున్నాం’ అంటూ తన మద్దతు తెల్పగా, ఇంకో ఆమె మైక్‌ అందుకొని ‘పుట్టిన ప్రతి బాలిక మహిళే అవుతుంది.. ఏ స్త్రీ కూడా వేశ్య ముద్ర కోరుకోదు. దురదృష్టం మమ్మల్ని అలా వెంటాడింది.. నిజంగా ఇది మరకలు చెరుపుకునే సమయం’ అంటూ మాట్లాడుతుంటే చప్పట్లు మార్మోగాయి... ‘వేశ్యా వృత్తి సాగటం లేదని, ఉపాధి కరువయ్యిందని ఇన్ని నెలలూ కరోనాను తిట్టుకున్నాం. కానీ ఆ కరోనా ఈ కొత్త ఆలోచనకు కారణమయ్యింది. బురద బతుకు నుంచి బయటపడేందుకు మనకిదే మంచి అవకాశం’ అంటూ మరో యువతి తన అభిప్రాయం స్పష్టం చేసింది..

‘గత కొన్ని నెలలుగా ఎన్ని పస్తులున్నామో, ఎన్ని కన్నీళ్లు మింగుతున్నామో, అప్పు పుట్టక, ఆదరణ లేక, అనారోగ్యాలకూ చేతిలో చిల్లిగవ్వలేక.. పౌర సమాజం మనపట్ల జాలి చూపలేదు. ఏ ఒక్కరూ ఏ సాయం చేయలేదు. ఈ బతుకు మనకొద్దు్ద మనం జనజీవన స్రవంతిలో కలుద్దాం’ అంటూ మరో మహిళ తన ఆవేదన తెలిపింది. ‘కరువు కోరల్లో చిక్కిన వేశ్యల దయనీయ స్థితిపై మొన్న పేపర్లో వచ్చాక మన బతుకులెంత దుర్భరంగా ఉన్నాయో లోకానికి తెలిసింది. అయినా జాలి చూపులు తప్ప మనకే సాయమూ దక్కలేదు.. ఎవరి సాయం కోసమో ఎదురు చూడటం అనవసరం. మనం ప్రత్యామ్నాయం వైపు మళ్లటమే ఉత్తమం.. కరోనా శత్రువు కాదు. మనవరకు స్నేహితుడే...’ అంటూ ఇంకో యువతి మార్పును స్వాగతించింది. ‘ఎవరో అమ్మివేయడం వల్ల మనం ఇక్కడికొచ్చాం. ఎవరో మనల్ని కొనుగోలు చేయటాన ఈ బానిసత్వానికి గురయ్యాం.. కరోనా మన బానిసత్వాన్ని విడిపించే బాహుబలి.

మార్చి నెల నుంచి వేశ్యా వృత్తిని కరోనానే రద్దు చేసింది. ఇది ఇన్నేళ్లూ ఎవరికీ సాధ్యపడనిది..’ అంటూ మరో మహిళ స్పష్టం చేశాక చివరగా రేష్మా మాట్లాడుతూ, ‘ఈ విప్లవ్‌ నా ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుండీ ఎదురవుతున్న కష్టాలను వివరిస్తూ నేను పోస్ట్‌ చేసిన పోయెం చదివి స్పందించి, వాళ్ల పత్రిక పర్మిషన్‌ తీసుకొని ఇక్కడికొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశాడు. మన వీధుల్లో తిరిగాడు, ఇక్కడి పరిస్థితులు అంచనా వేశాడు. నా ద్వారా మన కష్టాలు పూర్తిగా తెలుసుకొని తన శైలిలో ఆర్టికల్‌ రాశాడు. కరోనా తొలగటం కాదు, మన జీవితాల్లో మార్పు రావాలని, వేశ్య అనే పదంలేని మహిళా లోకం ఏర్పడాలని కోరుతూ ఆర్టికల్‌ రాశాడు. అంతటితో తన పని పూరై్తందనుకోకుండా, ఇలా మనకు ఉపాధి అవకాశాలను కల్పించే చర్యలకు పూనుకున్నాడు. వేశ్యా జీవితాల నుంచి వైదొలిగేందుకు మన ఉమ్మడి అభిప్రాయాలు తీసుకోవటం కోసమే ఈ మీటింగ్‌’ అంటూ ముగించింది రేష్మా.

తను రాబోయే ముందే తన ఆలోచన స్థానిక జర్నలిస్టులకు తెలియజేశాడు విప్లవ్‌. మరుసటి రోజు వాళ్ళను కలుసుకొని, వాళ్ళ సహకారంతో కార్యాచరణ ప్రారంభించాడు. లోకల్‌ ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థలను, మున్సిపల్‌ కార్పొరేషన్‌ను, స్త్రీ శిశు సంక్షేమ శాఖను, విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ విభాగం, బ్యాంకు అధికారులను కలసి వేశ్యావృత్తి మహిళలకు ఉపాధి అవకాశాలను బ్యాంకు రుణ సదుపాయాలపై చర్చించాడు. అలా ఆపరేషన్‌ వేశ్యా వాటిక మొదలయ్యింది. స్థానిక మహిళలకు ఫ్లవర్‌ బొకేలు, మాస్కులు, శానిటైజర్ల తయారీలో శిక్షణ ఇప్పించటం, బ్యాంకు రుణాల ద్వారా కిరాణా దుకాణాలు, మిల్క్‌ బూత్‌ లు, ఇతర యూనిట్ల ఏర్పాటు ద్వారా వారి ఉత్పత్తులను మహిళాభివృద్ధిశాఖ ద్వారా కొనుగోలు చేయించటం.. ప్రభుత్వం ద్వారా సొంత మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించటం, కుట్లు, అల్లికలు, వంటలు, కళల్లో శిక్షణతోపాటు యూట్యూబ్‌ సాయంతో సొంత చానెల్‌ ఏర్పాటు చేయించటం ఒకొకటిగా యుద్ధ ప్రాతిపదికన జరిగాయ్‌. ఇంకా కొనసాగుతున్నాయ్‌. ఇప్పుడక్కడ ఇన్నేళ్ళ చీకట్లు తొలగి వెలుగు సంతరించుకుంటోంది.
- కె శ్రీనివాస్‌ సూఫీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement