
అన్నిటికన్నా ఆలూ ముఖ్యం!
ఆత్మబంధువు
‘ఆంటీ... ఆంటీ’ అంటూ ఇంట్లోకి వచ్చాడు చరణ్.
‘‘హాయ్ హీరో... ఏంటి సంగతి... పొద్దుటే ఆంటీ గుర్తొచ్చింది’’ అంటూ నవ్వుతూ పలకరించింది రేఖ.
‘‘మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చానాంటీ!’’
‘‘థ్యాంక్సా... ఎందుకూ?’’
‘‘మీరు చెప్పిన టైమ్ గ్రిడ్ బాగా పనిచేస్తుందాంటీ. ఇప్పుడు నా టైమ్ నేను బాగా మేనేజ్ చేసుకోగలుగుతున్నా.’’
‘‘గుడ్... ‘ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చదివావా?’’
‘‘చదివానాంటీ. వండర్‌ఫుల్ బుక్.’’
‘‘గుడ్... ఇంకా!’’
‘‘టైమ్ మేనేజ్ చేస్తున్నా కానీ...’’ అంటూ నసిగాడు చరణ్.
‘‘హా... కానీ? ఏంటో చెప్పు చిన్నూ!’’ అంది రేఖ.
‘‘టైమ్ మేనేజ్ చేస్తున్నా కానీ... ఎక్కడో ఏదో తేడా కొడుతోందాంటీ. అదేంటో అర్థం కావడంలేదు.’’
‘‘తేడా కొట్టడమంటే?’’
‘‘అంటే... అన్నీ టైమ్ ప్రకారమే చేస్తున్నా. కానీ ప్రయారిటీస్‌లో ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుంది.’’
‘‘ఔనా... సరే రా... వంట చేస్తూ మాట్లాడుకుందాం..’’ అంటూ వంట గదిలోకి వెళ్లింది. చరణ్ కూడా వెళ్లాడు.
‘‘నీకు వంట చేయడం వచ్చా?’’ అడిగింది రేఖ.
‘‘రాదాంటీ.’’
‘‘తినడం?’’ నవ్వుతూ అంది.
‘‘బాగా వచ్చాంటీ’’ నవ్వుతూనే చెప్పాడు చరణ్.
‘‘తినడం వచ్చినప్పుడు... ఆ తినేది ఎలా వండాలో కూడా నేర్చుకోవాలోయ్.’’
‘‘తప్పకుండా నేర్చుకుంటా. ఇప్పటికి ఆ అవసరం రాలేదుగా.’’
‘‘అవసరం వచ్చినప్పుడు నేర్చుకోవడం కాదు. ఏదైనా ముందు నేర్చుకుంటే అవసరానికి ఉపయోగ పడుతుంది. సరే... ఆ జార్ ఇటు అందుకో.’’
గాజు జార్ తెచ్చిచ్చాడు చరణ్. దాని నిండుగా బంగాళా దుంపలు వేసి... ‘‘ఇప్పుడిది నిండినట్టేనా చరణ్?’’ అని అడిగింది.
తల ఊపాడు చరణ్. రేఖ వెంటనే దాన్లో శనగలు పోసింది. బంగాళదుంపల మధ్యనున్న ఖాళీల్లోంచి కొన్ని శనగలు లోపలికి చేరాయి. ‘‘ఇప్పుడు నిండిందా?’’
‘‘హా.. నిండింది ఆంటీ!’’
‘‘అంటే దీన్లో మరేమీ పట్టవుగా?’’
‘‘పట్టవు... ఫుల్‌గా నింపేశారుగా.’’
తలూపి దాన్లో చక్కెర పోసింది రేఖ. బంగాళాదుంపలు, సెనగల మధ్యగుండా కొంత చక్కెర లోపలికి చేరింది. ‘‘ఏమీ పట్టవన్నావుగా చిన్నూ... మరి చక్కెర పట్టిందిగా?’’ అంది రేఖ.
‘‘అంటే’’... నసిగాడు చరణ్.
‘‘సర్లే.. ఇప్పటికైనా నిండినట్లేనా?’’
‘‘హా... ఇప్పుడైతే పూర్తిగా నిండినట్లే. జార్ అంచులవరకూ చక్కెర వచ్చిందిగా. ఇంకేం పట్టవు’’ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.
అలాగా అంటూ జార్‌లో నీళ్లు పోసింది రేఖ. ఎందుకలా చేస్తుందో తెలియక ఆశ్చర్యంగా చూస్తున్నాడు చరణ్. అదే మాట అడిగాడు.
‘‘ఈ జార్ మన జీవితం లాంటిది. ఇందులో వేసిన దుంపలు అత్యంత ముఖ్యమైన అంశాల్లాంటివి. జీవితంలో అన్నీ కోల్పోయినా మనతోపాటే మిగిలి ఉండేవి. అంటే... విద్య, ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు, ప్యాషన్ వగైరా. శనగలు అవసరమైన విషయాలు. ఉద్యోగం, ఇల్లు, కారులాంటివి. మిగతా వన్నీ చక్కెరలాంటివి. అంత ప్రాముఖ్యత లేని సినిమాలు, షికార్లు, గాసిప్‌లు, ఫేస్‌బుక్ లాంటివి. నువ్వు జీవితాన్ని తియ్యగా కనిపించే చక్కెరతో నింపేస్తే... దానిలో సెనగలకూ, బంగాళా దుంపలకూ చోటుండదు. అలాక్కాకుండా ముందు బంగాళాదుంపలతో నింపేస్తే... మిగతా అన్నింటికీ చోటు ఉంటుంది.’’
అర్థమైందన్నట్లుగా తలాడించాడు చరణ్. ‘‘ఏం అర్థమైంది?’’ అంది రేఖ.
‘‘జీవితంలో ముఖ్యమైన వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనీ, వాటికే ఎక్కువ టైమ్ కేటాయించాలనీ.’’
‘‘గుడ్... గుడ్.’’
‘‘మరి మీరు చివర్లో పోసిన నీళ్లు ఏంటి ఆంటీ?’’
‘‘జీవితంలో అన్నీ సాధించా మనుకున్నా... అన్నీ నిండాయనుకున్నా... ఇంకా ఎంతో కొంత చోటు మిగిలే ఉంటుందని.’’
‘‘మీరు సూపర్ ఆంటీ! థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్.’’ అంటూ సంతృప్తిగా ఇంటికి వెళ్లిపోయాడు చరణ్.
- డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్