పోయేది తక్కువ పొందేది ఎక్కువ | mukunda ramarao write a comments on translation | Sakshi
Sakshi News home page

పోయేది తక్కువ పొందేది ఎక్కువ

Published Sun, Feb 7 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

పోయేది తక్కువ పొందేది ఎక్కువ

పోయేది తక్కువ పొందేది ఎక్కువ

అనువాదంలో పోగొట్టుకున్నది ఏకొంతో తప్పకుండా ఉంటుంది. దానితోబాటు పొందేదీ ఉంటుంది. నష్టం గురించి చింతిస్తూ, పొందే లాభం లాభమే కాదన్నట్టు మడికట్టుకు కూర్చుంటే, మనల్ని మనమే ఇతర భాషా సాహిత్యాలనుండి వెలివేసుకున్నట్టు.
 
ఎవరో నాటిన చెట్టుకొమ్మలు, అన్నింటినీ వివరిస్తూ, అన్ని వైపులా విస్తరిస్తాయి. ఆ చెట్టుచుట్టూ లేచిన, దాని పిల్లచెట్లూ అనువాదమే. అయినా మనకు తెలిసిన ప్రపంచంలోనే -  బాధలు శబ్దాలు రంగులు రుచులు వాసనలు దృశ్యాలు అనువాదం చేయలేనివి ఎన్నెన్నో. ఆకాశాన్ని అనుభవంలోకి నింపుకుంటున్న మేఘాల్ని పూర్తిగా జీర్ణించుకుని, అనువాదం చేస్తున్న వర్షాన్ని అర్థం చేసుకోగలమా? అంతెందుకు, పదిమంది చూసిన ఒకే దృశ్యాన్ని, ఆ పదిమందీ పది విధాలుగా చెబుతారు. అందులో సారాంశం ఒకటే అయినపుడు వాటిల్లో భిన్నత్వం అంతగా పట్టించుకోం. వివిధ అనువాదాలూ అంతే, మూలం చెడనంతవరకూ.
 
అనువాదమంటే మరో భాషనుండి మన భాషలోకి కేవలం పదాల మార్పు మాత్రమే కాదు. సరైన సమానమైన పదాలు ఎన్నుకోవడం కష్టమైన పని. మాతృకలోని శబ్ద సౌందర్యం, శబ్ద మాధుర్యం, అందులోని అద్భుతమైన సంగీతం అనువాదంలోకి అంతగా ఎలాగూ ఒదగదు. అంచాత ఎన్నుకున్న పదాలు అవి చూడాల్సిన ప్రపంచాన్ని ఎలా చూస్తాయన్నది ముఖ్యం.
 
నిజానికి కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం లాంటిది అనువాదం. తెలియని ప్రదేశంలో, తెలిసిన వివరాలతో, సరైన వీధినో ఇంటినో కనుగొనడం లాంటిది. ప్రతీ భాష తనదైన పదజాలంతో దృష్టికోణంతో ప్రపంచాన్ని మరోలా చూస్తుంది. ప్రతీ భాషకు దాని పదాల్లో విభిన్నమైన చూపుంటుంది. ప్రతి భాషకీ దానిదైన ఒక ప్రపంచం, పరిశీలన, పాదుకొన్న విలువలు ఉంటాయి.
 
వాటిల్లో కొన్నింటిని దానిదైన నుడికారం, అభివ్యక్తి ద్వారానే గ్రహించగలం. వాటిని అనువాదం చేయడం ఏ అనువాదకుడికైనా ఒక సవాలు. మరొక భాషలో అది అంతే అందంగా పొదగడం అంతగా సాధ్యపడదు. ఒకవేళ చేయగలిగినా అర్థరహితంగానూ అస్పష్టంగానూ తయారుకావచ్చు. ఎన్ని పరిమితులున్నా వాటిని సాధ్యమైనంతవరకు సజావుగా దాటుకుంటూ రాగలుగుతేనే అనువాదం సాధ్యమయేది. ఏదో ఒక ఆకారాన్ని అదే ఆకారంగా ఎలాగూ మార్చలేం. ఆ అందాన్ని అలాగే ఉంచి, దానిని గుర్తుచేసే మరో అందాన్ని బహుశా తయారుచేయడం అనువాదం.
 
అనువాదంలో పోగొట్టుకున్నది ఏకొంతో తప్పకుండా ఉంటుంది. దానితోబాటు పొందేదీ కొంత ఉంటుంది. ఈ లాభనష్టాల బేరీజుల్లో నష్టం గురించి చింతిస్తూ, పొందే లాభం లాభమే కాదన్నట్టు మడికట్టుకు కూర్చుంటే, మనల్ని మనమే ఇతర భాషా సాహిత్యాలనుండి వెలివేసుకున్నట్టు. అనువాదకుడు కేవలం వంతెనలాంటి వాడు. వంతెన ఎలా ఉన్నా, అటు కూడా వెళ్లి రాగలిగే వెసులుబాటు కల్పించేవాడు మాత్రమే. అటు వెళ్లొచ్చాక అది ఎంత సంతృప్తి మిగిల్చింది అన్న మంచో చెడో ఆ అనువాదకుడికే చెందుతుంది. మూల రచన అనువాదకుడికి ఎంత నచ్చింది అతనిలో ఎంత ఇంకింది, ఎంత ప్రేమతో అది బయటకొచ్చిందన్నది - ఆ అనువాద రచనే తెలియజేస్తుంది.
 
కవిత్వ అనువాదంలో స్థిరార్థమైన సమతుల్యం కంటే, మాతృకలోని ఆ కవిత అనుభవం కోసం ఎక్కువగా మనం ఎదురుచూస్తాం. ఆ కవిత మొదటి శ్రోత, లేదా మొదటి పాఠకుడు పొందిన అనుభూతి అనువాదంలోనూ పొందగలుగుతే ఎంత అదృష్టం! ఎక్కువ భాగం అనువాదాలన్నీ ఆంగ్లంలో ప్రయాణిస్తూ సాంస్కృతిక సరిహద్దుల్ని దాటుకుంటూ, ఆ ప్రయాణంలో పొందే జ్ఞానంతో తిరిగొచ్చి, ఆ కవితను దేశీయ నేలమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలే.

ఆ కవిత ముందూ వెనకలు అనేక విషయాలమీద ఒకేమారు ఆధారపడి ఉంటాయి. ముందుగా - ఆ కవిత్వ చారిత్రక సంప్రదాయం, దాని ఛందశ్శాస్త్ర సంప్రదాయం, దానికి కట్టుబడి ఉండే ఇతివృత్తాలు, దాని భాషా పరిధి, అది ఏ ఉద్దేశంతో రాసిన కవిత్వమో మొదలైనవి. రెండవది - కవిత్వ సంప్రదాయ విషయంలో ఆ కవికున్న తనదైన ప్రత్యేకత, కవిత - సంప్రదాయాల మధ్య సాగే మాండలిక స్నేహం; చివరగా ఒక భాషనుండి మరోభాషకు చేసే అజ్ఞాత ప్రయాణం. ఆ కవి ఆలోచనలతో, భావనలతో, కవిత్వ ఊహలతో పక్క పక్కనే నడుస్తూ ఆ కవితను భావగర్భితంగా ఒడిసిపట్టుకోవడం అనువాదం.
 
ఒక కవి, అనువాదకుడుగా బహుశా అన్యోన్య వైరుధ్యంలో జీవిస్తుంటాడు. అతని పని అనువాదంలా అనిపించకూడదు. అలా అని స్వతంత్ర ఊహల అభ్యాసంగా కూడా కాదు. అనువాదకునిలో ఒక స్వరం - మూలాన్ని గౌరవించమని హెచ్చరిస్తుంటుంది. మరో స్వరం - దానికి నూతన రూపమివ్వమని ప్రాధేయ పడుతుంది. అనువాదకుని పరిస్థితి సరిగ్గా కాఫ్కా సూక్తిలోని, రెండు గొలుసులతో, ఒకటి భూమితో ఇంకొకటి ఆకాశంతో సంకెళ్లు వేయబడ్డ పౌరుడిలా ఉంటుంది. భూమి వైపు వెళ్తే, ఆకాశం గొలుసు వెళ్లనివ్వదు, ఆకాశం వైపు వెళ్తే భూమి గొలుసు వెనక్కి లాగుతుంది. అయినా కాఫ్కా చెప్పినట్టు అన్ని సాధ్యాసాధ్యాలూ అతనివే, అతను  అనుభవించేవే. తప్పిదం మూలంగా మౌలిక నిర్భంధంలోని ఎటూ కదలలేని స్థితిని అతను ఒప్పుకోడు. తనకు సంతృప్తినిచ్చే దారేదో అతనే వెతుక్కుంటాడు.
   
ఇతిహాసాలు మహాకావ్యాలు సైతం అనేక సంవత్సరాలు మౌఖికంగా ఉండి ప్రజల నాలుకలమీద నాని, లిపిలో వాటిని చేర్చేవరకు నిలువగలిగాయి. బహుశా శతాబ్దాల మానవానుభవాల నిధులు భాషలు. భాష ఏ నాగరికతకైనా ఒక సంకేతలిపి. వాటి రహస్యాల్ని సంకేతాల్ని అక్కడి యాస భద్రంగా ఉంచగలుగుతుందేమో!
   
ఈ పుస్తకంలో రెండు వేలకు పైగా కవులున్నారు. వందకుపైగా దేశాలున్నాయి. చేర్చని దేశాల్లో, లేదా వారి కవిత్వ పరిచయం చేయని దేశాల్లో, కవిత్వం లేదని ప్రామాణికంగా చెప్పలేం. ఆంగ్లంలో అవి బయటకు రాకపోవడం ఒక కారణమయితే, ఉన్నా అవి లభ్యం కాకపోవడం మరో కారణం.

కవిత్వ పర్వతాన్ని అధిరోహిస్తూ చుట్టూ చూడాలన్న అణుచుకోలేని కోరికతో, ఇష్టంతో ఆ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నంలో, అంతవరకూ తెలియని అద్భుతమైన అనేక కవిత్వ ప్రపంచాల్ని చూడాలని, నేను చూసుకుంటూ పోయిన ప్రపంచాన్ని అందరికీ చూపించి ఆనందపడాలన్న ప్రయత్నమే ఈ పుస్తకం.
 
 (వ్యాసకర్త ‘అదే గాలి: ప్రపంచ దేశాల కవిత్వం -నేపథ్యం’ పేరుతో పుస్తకం వెలువరిస్తున్నారు. ప్రచురణ: ఎమెస్కో. రచయిత మెయిల్: mukundaramarao@hotmail.com)

 

ముకుంద రామారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement