Book Author
-
సింగపూర్‌లో రామ్ మాధవ్ పుస్తక సభ విజయవంతం
డాక్టర్ రామ్ మాధవ్ రచించిన "ది హిందుత్వ పారడైమ్" (సమగ్ర మానవతావాదం మరియు పాశ్చాత్యేతర ప్రపంచ దృష్టికోణం కోసం అన్వేషణ) పుస్తక పరిచయం విశ్లేషణ కార్యక్రమము సింగపూర్ ఘనంగా జరిగింది. శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో మే 8న జరిగిన ఈ కార్యక్రమంలో పదికి పైగా స్థానిక భారతీయ సంస్థలు అధిపతులతో పాటు సుమారుగా ౩౦౦ మందికి పైగా సింగపూర్ వాసులు పాల్గొన్నారు. పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌడేషన్ పాలక మండలి సభ్యుడు డాక్టర్ రామ్ మాధవ్ మాట్లాడుతూ... నేను వ్రాసిన హిందుత్వం పుస్తకం 21వ శతాబ్దపు వాస్తవికతకు అన్వయించవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుతుంది, ఈ ఆలోచన ప్రపంచ దృక్పథం ఆధారంగా మన రాజకీయ వ్యవస్థలను అభివృద్ధి చేయగలమా లేదా అనేది తెలియచేస్తుంది అని తెలిపారు. అనంతరం సభ్యులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెప్పి సందేహ నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థని స్థాపించాక మొట్టమొదటి స్థానిక సామూహిక కార్యక్రమము విజయవంతం అవ్వడంపట్ల నిర్వాహుకులు కవుటూరు రత్నకుమార్ తదితరులు సంతోషం తెలియచేశారు. ఈ కార్యక్రమము విజయవంతం కావడం కోసం అహర్నిశలు కృషిచేసిన ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రవితేజ్ భాగవతుల, రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సురేష్ చివుకుల, యోగేష్ హిందూజ, సంజయ్, ఊలపల్లి భాస్కర్,రాధిక మంగిపూడి, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు ధన్యవాదాలు తెలియచేసారు. కార్యక్రమ నిర్వహణకు ఆడిటోరియం, భోజన సదుపాయాలను గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షుడు అతుల్ ప్రత్యేకంగా అందజేశారు. చదవండి: ఘంటసాల గొప్ప గాయకుడు, మానవతావాది, సంగీత విద్వాంసులు -
పదును అంచులు
నిర్భీతికి ముందుమాట మలాల. నిన్నటికి విషయసూచిక.. మోనిక. నిజాలలో తుది పలుకు మాంటీ. లిటరరీ వారియర్స్ ఈ ముగ్గురూ. మలాల ‘ఫియర్లెస్’ క్లబ్.. మోనిక ‘బ్లూమ్స్బరీ’ పోరాటం.. మాంటీ ‘ప్రెసిడెంట్ హంట్’... పదునైన ఖడ్గపు అంచులిప్పుడు! హై లెవల్లో జరిగే పనులకు చప్పుడు ఉండదు. ఆగస్టు 22 శనివారం ‘ఢిల్లీ రాయిట్స్ 2020 : ది అన్‌టోల్డ్ స్టోరీ’ పుస్తకం ఆవిష్కరణ జరగడానికి ముందు రోజు.. ‘ఆ పుస్తకం మీద మన పేరు ఉండటానికి లేదు’ అని ఢిల్లీలోని బ్లూమ్స్బరీ ప్రచురణ సంస్థకు తన ప్రధాన కార్యాలయం ఉన్న లండన్ నుంచి అత్యవసర ఆదేశాలు వచ్చాయి! అప్పటికే బ్లూమ్స్బరీ పేరుతో ఆ పుస్తకానివి వంద కాపీలు ప్రింట్ అయి.. ప్రముఖ మీడియా హౌస్‌లకు, దేశవిదేశాల్లోని ప్రసిద్ధ రచయితలు, గ్రంథకర్తలకు, సోషల్ మీడియాలోని శక్తిమంతమైన ప్రచారకర్తలకు చేరిపోయాయి. పుస్తక రచయిత్రితో కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే సెప్టెంబరులో బ్లూమ్స్బరీ ఆ పుస్తకాన్ని మార్కెట్లోకి తేవలసి ఉంది. అకస్మాత్తుగా మొత్తానికే ప్రచురణను ఆపేసింది! విడుదల కాకుండానే వివాదం అయిన ఈ ‘ఢిల్లీ రాయిట్స్ 2020 : ది అన్‌టోల్డ్ స్టోరీ’ పుస్తక ప్రధాన రచయిత్రి మోనికా అరోరా. ప్రచురణను ఎందుకు ఆపేశారన్న దానికి బ్లూమ్స్బరీ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఢిల్లీలోని ఆ ప్రచురణ సంస్థ న్యాయపరమైన వివాదంలోకి వెళ్లే అవకాశం ఉంది. మోనికా రచయిత్రి మాత్రమే కాదు. పేరున్న సుప్రీంకోర్టు లాయర్, సామాజిక కార్యకర్త కూడా. మోనిక ఈ ఆగస్టు 28న తన 47 లోకి ప్రవేశిస్తున్నారు. ఈ వయసుకే ఆమె మహిళా న్యాయవాదుల సంఘానికి నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిర్భయ ఘటనను సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టును, హైకోర్టును కోరిన తొలి న్యాయవాది మోనికానే. ఢిల్లీ యూనివర్సిటీలో ‘లా’ పీజీ చేశారామె. 1993–94 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ‘ఢిల్లీ రాయిట్స్..’ పుస్తకావిష్కరణకు బీజేపీ నాయకులను ఆహ్వానించడమే బ్లూమ్స్బరీ తీసుకున్న ఉపసంహరణ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడీ పుస్తకాన్ని ‘గరుడ ప్రకాశన్’ ముద్రించబోతోంది. అధినేతలు కన్ను మూసినప్పుడు వెనువెంటనే చప్పుడవదు. కరోనా ప్రారంభ సమయంలో ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోన్ ఉన్ కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. మే నెలలో ఒకసారి అలా కనిపించి ఇలా మాయం అయ్యారు. ఇక నాలుగు రోజుల క్రితమైతే.. కొన్ని ప్రధానమైన పాలనాధికారాలను కిమ్ తన సోదరికి బదిలీ చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే కిమ్‌కి ఏదో అయి ఉంటుందన్నదే అందులోని ఊహాజనితమైన ప్రధాన వార్త. ఆయన బతికి లేరని, మే నెలలో ఒక కర్మాగారానికి రిబ్బన్ కట్ చేస్తూ కనిపించింది కిమ్ డూప్ అని అప్పట్లోనే ప్రచారం అయింది. ఇప్పుడిక ఆయన కోమాలో ఉన్నారని మరో వదంతి! కొరియా కొట్టిన పిండి అయిన రాయ్ క్యాలీ అనే బీబీసి జర్నలిస్టయితే ‘కిమ్ లేరనే నా నమ్మకం’ అంటున్నారు! ఏది నిజం? ఏది అబద్ధం? ఈ సందిగ్ధావస్థలో అందరి ఆలోచనలు రూత్ యాన్ మాంటీ వైపు మళ్లాయి. పరిశోధనాత్మక గ్రంథాల రచయిత్రి ఆమె. దేశాలన్నీ తిరుగుతుంటారు. దేశాధినేతల రహస్యాలను పుస్తక రూపంలోకి తెస్తుంటారు. ఆరిజోనాలోని స్కాట్డేల్లో ఉంటారు. ‘డోనాల్ట్ ట్రంప్ ఇన్ 100 ఫ్యాక్ట్స్’ అని 2018లో ఒక పుస్తకం రాశారు. గత ఏడాది జనవరిలో ‘నార్త్ కొరియా ఇన్ 100 ఫ్యాక్ట్’ అని మరో పుస్తకం తెచ్చారు. ఈ రెండు పుస్తకాలూ ప్రకంపనలు సృష్టించాయి. జర్నలిస్టు రాయ్ క్యాలీ లానే రచయిత్రి రూత్ కూడా కొరియాలో చీమ చిటుక్కుమన్నా పట్టేస్తారు. ‘చివరిసారిగా నేను కిమ్‌ని లేవలేని స్థితిలో చూశాను’ అని ఆమె ఇటీవలే ఎక్కడో రాసిన మాట ఇప్పుడు మళ్లీ పైకి తేలింది. ఇద్దరు మనుషుల సహాయంతో కిమ్ నడుస్తున్నారట.. ఆమె చూసేటప్పటికి! మరి ఇప్పటికి?! చెబితే ఉత్తర కొరియా శత్రుదేశం దక్షిణ కొరియా చెప్పాలి. లేదంటే.. మళ్లీ రూత్ యాన్ మాంటీనే పరిశోధించి చెప్పాలి. మలాలా ఏం సాధించినా చప్పుడే అవలేదు! అన్నీ నిశ్శబ్దంగానే జరిగిపోయాయి. తాలిబన్లపై పోరాటం, నోబెల్ శాంతి బహుమతి, రెండు నెలల క్రితమే పూర్తి చేసిన ఆక్స్ఫర్డ్ డిగ్రీ.. ఈ మధ్యలో ఆమె రాసిన ‘ఐ యామ్ మలాలా’, ‘మలాలాస్ మ్యాజిక్ పెన్సిల్’, ‘మై స్టోరీ ఆఫ్ స్టాండింగ్ అప్ ఫర్ గర్ల్స్ రైట్స్’, ‘వియ్ ఆర్ డిస్ప్లేస్డ్’.. ఇవన్నీ కూడా! ఇప్పుడిక తక్కిన రచయిత్రుల పుస్తకాలను నెలకొకటిగా ఆమె పరిచయం చేయబోతోంది. వాటిపై చర్చించబోతోంది. ఆ రచయిత్రులతో వెబ్ ఇష్టాగోష్టులు కూడా ఉంటాయి. ఇందుకోసం అక్టోబర్‌లో ‘ఫియర్లెస్’ అనే డిజిటల్ బుక్ క్లబ్‌ను ప్రారంభిస్తోంది. క్లబ్ కోసం టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఉన్న ‘లిటరటీ’ అనే స్టార్టప్‌తో కలిసి చర్చనీయ పుస్తకాలను ఎంపిక చేస్తుంది మలాలా. ప్రపంచ ప్రసిద్ధులైన ఆంగ్ల రచయిత్రుల గ్రంథ సారాంశాలను మన మాలతీ చందూర్లా మలాలా తనదైన కథన శైలిలో వివరిస్తుంది. ఆసక్తి, పఠనశక్తి కలిగిస్తుంది. వాటిల్లో ఎక్కువగా ఆటోబయోగ్రఫీలు, రియల్ లైఫ్ స్టోరీలు ఉంటాయి. కొన్నిసార్లు మగవాళ్లు రాసినవి కూడా. మలాలాకు వ్యక్తిగతంగా ఆమె ఆల్‌టైమ్ ఫేవరేట్, ఎప్పుడూ తన పక్కనే ఉండే పుస్తకం.. పాలో కొయిలో రాసిన ‘ది ఆల్కెమిస్ట్’. ఒక గొర్రెల కాపరి ఆశయ లక్ష్యసాధన ప్రయాణం అది. లోపలి భయాలను, బయటి భయాలను దాటుకుని వచ్చిన వారి జీవితాలను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. అందుకే నా డిజిటల్ బుక్ క్లబ్‌కి ‘ఫియర్లెస్’ అని పేరు పెట్టాను అంటోంది మలాలా యూసఫ్‌జాయ్. -
చాల్స్ లాంబ్
ఇప్పుడు మనం ‘వ్యాసం’గా భావిస్తున్నది సాధారణంగా రాజకీయ వ్యాసమే. కానీ ఈ అర్థంలోకి స్థిరపడకముందు వ్యాసం ఒక సాహిత్య ప్రక్రియ. 19వ శతాబ్దపు గొప్ప ఎస్సేయిస్టు చాల్స్ లాంబ్ (1775–1834). ఇంగ్లండ్‌లో జన్మించాడు. ఒంటరి పిల్లాడు. పదకొండేళ్లు పెద్దదైన అక్క, రచయిత్రి మేరీ లాంబ్ దగ్గర తొలుత చదువుకున్నాడు. చాలాకాలం ఈస్ట్ ఇండియా హౌజ్‌లో గుమస్తాగా పనిచేశాడు. మేరీతో కలిసి టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్ రాశాడు. 1820లో ఏలియా అనే కలంపేరుతో ఒక లండన్ మేగజైన్‌కు వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. వాటిల్లో జ్ఞాపకాల వెచ్చదనం, మేధో చమత్కారం, అంతరంగ కలబోత, కలగలిసి ఉంటాయి. ‘ఎస్సేస్ ఆఫ్ ఏలియా’ పేరుతో రెండు భాగాలుగా ఈ పుస్తకాలు వచ్చాయి. చాల్స్ కవి కూడా. అలాగే ఆయన ఉత్తరాలు కూడా సంకలనాలుగా వచ్చాయి. లాంబులు వర్ధిల్లాలనే ఆశయంతో ఇంగ్లండ్‌లో నెలకొల్పిన క్లబ్ ఒకటి 140 ఏళ్లుగా కొనసాగుతోంది. -
పోయేది తక్కువ పొందేది ఎక్కువ
అనువాదంలో పోగొట్టుకున్నది ఏకొంతో తప్పకుండా ఉంటుంది. దానితోబాటు పొందేదీ ఉంటుంది. నష్టం గురించి చింతిస్తూ, పొందే లాభం లాభమే కాదన్నట్టు మడికట్టుకు కూర్చుంటే, మనల్ని మనమే ఇతర భాషా సాహిత్యాలనుండి వెలివేసుకున్నట్టు. ఎవరో నాటిన చెట్టుకొమ్మలు, అన్నింటినీ వివరిస్తూ, అన్ని వైపులా విస్తరిస్తాయి. ఆ చెట్టుచుట్టూ లేచిన, దాని పిల్లచెట్లూ అనువాదమే. అయినా మనకు తెలిసిన ప్రపంచంలోనే - బాధలు శబ్దాలు రంగులు రుచులు వాసనలు దృశ్యాలు అనువాదం చేయలేనివి ఎన్నెన్నో. ఆకాశాన్ని అనుభవంలోకి నింపుకుంటున్న మేఘాల్ని పూర్తిగా జీర్ణించుకుని, అనువాదం చేస్తున్న వర్షాన్ని అర్థం చేసుకోగలమా? అంతెందుకు, పదిమంది చూసిన ఒకే దృశ్యాన్ని, ఆ పదిమందీ పది విధాలుగా చెబుతారు. అందులో సారాంశం ఒకటే అయినపుడు వాటిల్లో భిన్నత్వం అంతగా పట్టించుకోం. వివిధ అనువాదాలూ అంతే, మూలం చెడనంతవరకూ. అనువాదమంటే మరో భాషనుండి మన భాషలోకి కేవలం పదాల మార్పు మాత్రమే కాదు. సరైన సమానమైన పదాలు ఎన్నుకోవడం కష్టమైన పని. మాతృకలోని శబ్ద సౌందర్యం, శబ్ద మాధుర్యం, అందులోని అద్భుతమైన సంగీతం అనువాదంలోకి అంతగా ఎలాగూ ఒదగదు. అంచాత ఎన్నుకున్న పదాలు అవి చూడాల్సిన ప్రపంచాన్ని ఎలా చూస్తాయన్నది ముఖ్యం. నిజానికి కళ్లల్లో కళ్లు పెట్టి చూడటం లాంటిది అనువాదం. తెలియని ప్రదేశంలో, తెలిసిన వివరాలతో, సరైన వీధినో ఇంటినో కనుగొనడం లాంటిది. ప్రతీ భాష తనదైన పదజాలంతో దృష్టికోణంతో ప్రపంచాన్ని మరోలా చూస్తుంది. ప్రతీ భాషకు దాని పదాల్లో విభిన్నమైన చూపుంటుంది. ప్రతి భాషకీ దానిదైన ఒక ప్రపంచం, పరిశీలన, పాదుకొన్న విలువలు ఉంటాయి. వాటిల్లో కొన్నింటిని దానిదైన నుడికారం, అభివ్యక్తి ద్వారానే గ్రహించగలం. వాటిని అనువాదం చేయడం ఏ అనువాదకుడికైనా ఒక సవాలు. మరొక భాషలో అది అంతే అందంగా పొదగడం అంతగా సాధ్యపడదు. ఒకవేళ చేయగలిగినా అర్థరహితంగానూ అస్పష్టంగానూ తయారుకావచ్చు. ఎన్ని పరిమితులున్నా వాటిని సాధ్యమైనంతవరకు సజావుగా దాటుకుంటూ రాగలుగుతేనే అనువాదం సాధ్యమయేది. ఏదో ఒక ఆకారాన్ని అదే ఆకారంగా ఎలాగూ మార్చలేం. ఆ అందాన్ని అలాగే ఉంచి, దానిని గుర్తుచేసే మరో అందాన్ని బహుశా తయారుచేయడం అనువాదం. అనువాదంలో పోగొట్టుకున్నది ఏకొంతో తప్పకుండా ఉంటుంది. దానితోబాటు పొందేదీ కొంత ఉంటుంది. ఈ లాభనష్టాల బేరీజుల్లో నష్టం గురించి చింతిస్తూ, పొందే లాభం లాభమే కాదన్నట్టు మడికట్టుకు కూర్చుంటే, మనల్ని మనమే ఇతర భాషా సాహిత్యాలనుండి వెలివేసుకున్నట్టు. అనువాదకుడు కేవలం వంతెనలాంటి వాడు. వంతెన ఎలా ఉన్నా, అటు కూడా వెళ్లి రాగలిగే వెసులుబాటు కల్పించేవాడు మాత్రమే. అటు వెళ్లొచ్చాక అది ఎంత సంతృప్తి మిగిల్చింది అన్న మంచో చెడో ఆ అనువాదకుడికే చెందుతుంది. మూల రచన అనువాదకుడికి ఎంత నచ్చింది అతనిలో ఎంత ఇంకింది, ఎంత ప్రేమతో అది బయటకొచ్చిందన్నది - ఆ అనువాద రచనే తెలియజేస్తుంది. కవిత్వ అనువాదంలో స్థిరార్థమైన సమతుల్యం కంటే, మాతృకలోని ఆ కవిత అనుభవం కోసం ఎక్కువగా మనం ఎదురుచూస్తాం. ఆ కవిత మొదటి శ్రోత, లేదా మొదటి పాఠకుడు పొందిన అనుభూతి అనువాదంలోనూ పొందగలుగుతే ఎంత అదృష్టం! ఎక్కువ భాగం అనువాదాలన్నీ ఆంగ్లంలో ప్రయాణిస్తూ సాంస్కృతిక సరిహద్దుల్ని దాటుకుంటూ, ఆ ప్రయాణంలో పొందే జ్ఞానంతో తిరిగొచ్చి, ఆ కవితను దేశీయ నేలమీదకు తీసుకొచ్చే ప్రయత్నాలే. ఆ కవిత ముందూ వెనకలు అనేక విషయాలమీద ఒకేమారు ఆధారపడి ఉంటాయి. ముందుగా - ఆ కవిత్వ చారిత్రక సంప్రదాయం, దాని ఛందశ్శాస్త్ర సంప్రదాయం, దానికి కట్టుబడి ఉండే ఇతివృత్తాలు, దాని భాషా పరిధి, అది ఏ ఉద్దేశంతో రాసిన కవిత్వమో మొదలైనవి. రెండవది - కవిత్వ సంప్రదాయ విషయంలో ఆ కవికున్న తనదైన ప్రత్యేకత, కవిత - సంప్రదాయాల మధ్య సాగే మాండలిక స్నేహం; చివరగా ఒక భాషనుండి మరోభాషకు చేసే అజ్ఞాత ప్రయాణం. ఆ కవి ఆలోచనలతో, భావనలతో, కవిత్వ ఊహలతో పక్క పక్కనే నడుస్తూ ఆ కవితను భావగర్భితంగా ఒడిసిపట్టుకోవడం అనువాదం. ఒక కవి, అనువాదకుడుగా బహుశా అన్యోన్య వైరుధ్యంలో జీవిస్తుంటాడు. అతని పని అనువాదంలా అనిపించకూడదు. అలా అని స్వతంత్ర ఊహల అభ్యాసంగా కూడా కాదు. అనువాదకునిలో ఒక స్వరం - మూలాన్ని గౌరవించమని హెచ్చరిస్తుంటుంది. మరో స్వరం - దానికి నూతన రూపమివ్వమని ప్రాధేయ పడుతుంది. అనువాదకుని పరిస్థితి సరిగ్గా కాఫ్కా సూక్తిలోని, రెండు గొలుసులతో, ఒకటి భూమితో ఇంకొకటి ఆకాశంతో సంకెళ్లు వేయబడ్డ పౌరుడిలా ఉంటుంది. భూమి వైపు వెళ్తే, ఆకాశం గొలుసు వెళ్లనివ్వదు, ఆకాశం వైపు వెళ్తే భూమి గొలుసు వెనక్కి లాగుతుంది. అయినా కాఫ్కా చెప్పినట్టు అన్ని సాధ్యాసాధ్యాలూ అతనివే, అతను అనుభవించేవే. తప్పిదం మూలంగా మౌలిక నిర్భంధంలోని ఎటూ కదలలేని స్థితిని అతను ఒప్పుకోడు. తనకు సంతృప్తినిచ్చే దారేదో అతనే వెతుక్కుంటాడు. ఇతిహాసాలు మహాకావ్యాలు సైతం అనేక సంవత్సరాలు మౌఖికంగా ఉండి ప్రజల నాలుకలమీద నాని, లిపిలో వాటిని చేర్చేవరకు నిలువగలిగాయి. బహుశా శతాబ్దాల మానవానుభవాల నిధులు భాషలు. భాష ఏ నాగరికతకైనా ఒక సంకేతలిపి. వాటి రహస్యాల్ని సంకేతాల్ని అక్కడి యాస భద్రంగా ఉంచగలుగుతుందేమో! ఈ పుస్తకంలో రెండు వేలకు పైగా కవులున్నారు. వందకుపైగా దేశాలున్నాయి. చేర్చని దేశాల్లో, లేదా వారి కవిత్వ పరిచయం చేయని దేశాల్లో, కవిత్వం లేదని ప్రామాణికంగా చెప్పలేం. ఆంగ్లంలో అవి బయటకు రాకపోవడం ఒక కారణమయితే, ఉన్నా అవి లభ్యం కాకపోవడం మరో కారణం. కవిత్వ పర్వతాన్ని అధిరోహిస్తూ చుట్టూ చూడాలన్న అణుచుకోలేని కోరికతో, ఇష్టంతో ఆ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నంలో, అంతవరకూ తెలియని అద్భుతమైన అనేక కవిత్వ ప్రపంచాల్ని చూడాలని, నేను చూసుకుంటూ పోయిన ప్రపంచాన్ని అందరికీ చూపించి ఆనందపడాలన్న ప్రయత్నమే ఈ పుస్తకం. (వ్యాసకర్త ‘అదే గాలి: ప్రపంచ దేశాల కవిత్వం -నేపథ్యం’ పేరుతో పుస్తకం వెలువరిస్తున్నారు. ప్రచురణ: ఎమెస్కో. రచయిత మెయిల్: mukundaramarao@hotmail.com) ముకుంద రామారావు