నిర్భీతికి ముందుమాట మలాల. నిన్నటికి విషయసూచిక.. మోనిక. నిజాలలో తుది పలుకు మాంటీ. లిటరరీ వారియర్స్ ఈ ముగ్గురూ. మలాల ‘ఫియర్‌లెస్’ క్లబ్.. మోనిక ‘బ్లూమ్స్‌బరీ’ పోరాటం.. మాంటీ ‘ప్రెసిడెంట్ హంట్’... పదునైన ఖడ్గపు అంచులిప్పుడు!
హై లెవల్లో జరిగే పనులకు చప్పుడు ఉండదు. ఆగస్టు 22 శనివారం ‘ఢిల్లీ రాయిట్స్ 2020 : ది అన్‌టోల్డ్ స్టోరీ’ పుస్తకం ఆవిష్కరణ జరగడానికి ముందు రోజు.. ‘ఆ పుస్తకం మీద మన పేరు ఉండటానికి లేదు’ అని ఢిల్లీలోని బ్లూమ్స్‌బరీ ప్రచురణ సంస్థకు తన ప్రధాన కార్యాలయం ఉన్న లండన్ నుంచి అత్యవసర ఆదేశాలు వచ్చాయి! అప్పటికే బ్లూమ్స్‌బరీ పేరుతో ఆ పుస్తకానివి వంద కాపీలు ప్రింట్ అయి.. ప్రముఖ మీడియా హౌస్‌లకు, దేశవిదేశాల్లోని ప్రసిద్ధ రచయితలు, గ్రంథకర్తలకు, సోషల్ మీడియాలోని శక్తిమంతమైన ప్రచారకర్తలకు చేరిపోయాయి. పుస్తక రచయిత్రితో కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చే సెప్టెంబరులో బ్లూమ్స్‌బరీ ఆ పుస్తకాన్ని మార్కెట్‌లోకి తేవలసి ఉంది. అకస్మాత్తుగా మొత్తానికే ప్రచురణను ఆపేసింది! విడుదల కాకుండానే వివాదం అయిన ఈ ‘ఢిల్లీ రాయిట్స్ 2020 : ది అన్‌టోల్డ్ స్టోరీ’ పుస్తక ప్రధాన రచయిత్రి మోనికా అరోరా. ప్రచురణను ఎందుకు ఆపేశారన్న దానికి బ్లూమ్స్‌బరీ ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఢిల్లీలోని ఆ ప్రచురణ సంస్థ న్యాయపరమైన వివాదంలోకి వెళ్లే అవకాశం ఉంది.
మోనికా రచయిత్రి మాత్రమే కాదు. పేరున్న సుప్రీంకోర్టు లాయర్, సామాజిక కార్యకర్త కూడా. మోనిక ఈ ఆగస్టు 28న తన 47 లోకి ప్రవేశిస్తున్నారు. ఈ వయసుకే ఆమె మహిళా న్యాయవాదుల సంఘానికి నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిర్భయ ఘటనను సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టును, హైకోర్టును కోరిన తొలి న్యాయవాది మోనికానే. ఢిల్లీ యూనివర్సిటీలో ‘లా’ పీజీ చేశారామె. 1993–94 మధ్య ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా ఉన్నారు. ‘ఢిల్లీ రాయిట్స్..’ పుస్తకావిష్కరణకు బీజేపీ నాయకులను ఆహ్వానించడమే బ్లూమ్స్‌బరీ తీసుకున్న ఉపసంహరణ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడీ పుస్తకాన్ని ‘గరుడ ప్రకాశన్’ ముద్రించబోతోంది.
అధినేతలు కన్ను మూసినప్పుడు వెనువెంటనే చప్పుడవదు. కరోనా ప్రారంభ సమయంలో ఉత్తర కొరియా సుప్రీమ్ లీడర్ కిమ్ జోన్ ఉన్ కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. మే నెలలో ఒకసారి అలా కనిపించి ఇలా మాయం అయ్యారు. ఇక నాలుగు రోజుల క్రితమైతే.. కొన్ని ప్రధానమైన పాలనాధికారాలను కిమ్ తన సోదరికి బదిలీ చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే కిమ్‌కి ఏదో అయి ఉంటుందన్నదే అందులోని ఊహాజనితమైన ప్రధాన వార్త. ఆయన బతికి లేరని, మే నెలలో ఒక కర్మాగారానికి రిబ్బన్ కట్ చేస్తూ కనిపించింది కిమ్ డూప్ అని అప్పట్లోనే ప్రచారం అయింది. ఇప్పుడిక ఆయన కోమాలో ఉన్నారని మరో వదంతి! కొరియా కొట్టిన పిండి అయిన రాయ్ క్యాలీ అనే బీబీసి జర్నలిస్టయితే ‘కిమ్ లేరనే నా నమ్మకం’ అంటున్నారు! ఏది నిజం? ఏది అబద్ధం? ఈ సందిగ్ధావస్థలో అందరి ఆలోచనలు రూత్ యాన్ మాంటీ వైపు మళ్లాయి. పరిశోధనాత్మక గ్రంథాల రచయిత్రి ఆమె. దేశాలన్నీ తిరుగుతుంటారు.
దేశాధినేతల రహస్యాలను పుస్తక రూపంలోకి తెస్తుంటారు. ఆరిజోనాలోని స్కాట్‌డేల్‌లో ఉంటారు. ‘డోనాల్ట్ ట్రంప్ ఇన్ 100 ఫ్యాక్ట్స్’ అని 2018లో ఒక పుస్తకం రాశారు. గత ఏడాది జనవరిలో ‘నార్త్ కొరియా ఇన్ 100 ఫ్యాక్ట్’ అని మరో పుస్తకం తెచ్చారు. ఈ రెండు పుస్తకాలూ ప్రకంపనలు సృష్టించాయి. జర్నలిస్టు రాయ్ క్యాలీ లానే రచయిత్రి రూత్ కూడా కొరియాలో చీమ చిటుక్కుమన్నా పట్టేస్తారు. ‘చివరిసారిగా నేను కిమ్‌ని లేవలేని స్థితిలో చూశాను’ అని ఆమె ఇటీవలే ఎక్కడో రాసిన మాట ఇప్పుడు మళ్లీ పైకి తేలింది. ఇద్దరు మనుషుల సహాయంతో కిమ్ నడుస్తున్నారట.. ఆమె చూసేటప్పటికి! మరి ఇప్పటికి?! చెబితే ఉత్తర కొరియా శత్రుదేశం దక్షిణ కొరియా చెప్పాలి. లేదంటే.. మళ్లీ రూత్ యాన్ మాంటీనే పరిశోధించి చెప్పాలి.
మలాలా ఏం సాధించినా చప్పుడే అవలేదు! అన్నీ నిశ్శబ్దంగానే జరిగిపోయాయి. తాలిబన్‌లపై పోరాటం, నోబెల్ శాంతి బహుమతి, రెండు నెలల క్రితమే పూర్తి చేసిన ఆక్స్‌ఫర్డ్ డిగ్రీ.. ఈ మధ్యలో ఆమె రాసిన ‘ఐ యామ్ మలాలా’, ‘మలాలాస్ మ్యాజిక్ పెన్సిల్’, ‘మై స్టోరీ ఆఫ్ స్టాండింగ్ అప్ ఫర్ గర్ల్స్ రైట్స్’, ‘వియ్ ఆర్ డిస్‌ప్లేస్‌డ్’.. ఇవన్నీ కూడా! ఇప్పుడిక తక్కిన రచయిత్రుల పుస్తకాలను నెలకొకటిగా ఆమె పరిచయం చేయబోతోంది. వాటిపై చర్చించబోతోంది. ఆ రచయిత్రులతో వెబ్ ఇష్టాగోష్టులు కూడా ఉంటాయి. ఇందుకోసం అక్టోబర్‌లో ‘ఫియర్‌లెస్’ అనే డిజిటల్ బుక్ క్లబ్‌ను ప్రారంభిస్తోంది. క్లబ్ కోసం టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో ఉన్న ‘లిటరటీ’ అనే స్టార్టప్‌తో కలిసి చర్చనీయ పుస్తకాలను ఎంపిక చేస్తుంది మలాలా.
ప్రపంచ ప్రసిద్ధులైన ఆంగ్ల రచయిత్రుల గ్రంథ సారాంశాలను మన మాలతీ చందూర్‌లా మలాలా తనదైన కథన శైలిలో వివరిస్తుంది. ఆసక్తి, పఠనశక్తి కలిగిస్తుంది. వాటిల్లో ఎక్కువగా ఆటోబయోగ్రఫీలు, రియల్ లైఫ్ స్టోరీలు ఉంటాయి. కొన్నిసార్లు మగవాళ్లు రాసినవి కూడా. మలాలాకు వ్యక్తిగతంగా ఆమె ఆల్‌టైమ్ ఫేవరేట్, ఎప్పుడూ తన పక్కనే ఉండే పుస్తకం.. పాలో కొయిలో రాసిన ‘ది ఆల్‌కెమిస్ట్’. ఒక గొర్రెల కాపరి ఆశయ లక్ష్యసాధన ప్రయాణం అది. లోపలి భయాలను, బయటి భయాలను దాటుకుని వచ్చిన వారి జీవితాలను చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంటుంది. అందుకే నా డిజిటల్ బుక్ క్లబ్‌కి ‘ఫియర్‌లెస్’ అని పేరు పెట్టాను అంటోంది మలాలా యూసఫ్జాయ్.
Comments
Please login to add a commentAdd a comment