వై. ముకుంద రామారావు
తెలుగు వర్తమాన వచన కవులలో నాకు మిక్కిలి ఇష్టమైన ముగ్గురు నలుగురు కవులలో యల్లపు ముకుంద రామారావు ఒకరు. మా గురువర్యులు ఆచార్య పింగళి లక్ష్మికాంతం సాహిత్య విమర్శ పాఠం చెపుతూ ‘కవిత్వము – వేదాంతము ఒకే కొమ్మకు పూచిన రెండు పువ్వులు’ అన్నారు. ఈ రెండు పువ్వుల సౌరభాలను మేళవించి, సారమతితో మంచి కవిత్వం చెప్పిన వారిలో ముకుంద రామారావు మొట్టమొదటి వారు. వృత్తిరీత్యా కంప్యూ టర్ ఇంజనీరు అయిన ముకుంద రామారావు ప్రవృత్తి రీత్యా మూర్తీభవించిన కవి.
రామారావు 1995 నుండి 2017 వరకు 22 ఏళ్ల కాలంలో స్వీయ కవితా సంపుటాలను మాత్రమే ప్రచురించారు. రామారావు ఏ కవిత అయినా సరే సంక్షిప్తంగా, అనుభూతి సాంద్రంగా, ఆత్మీయతానుబంధంతో కూడి ఉంటుంది. ప్రకృతిలోనూ, మానవ జీవితంలోనూ దాగి ఉన్న సృష్టి రహస్యాన్ని వెదుకుతూ ఉంటుంది. తమ పెద్దమ్మాయికి పెండ్లి చేసి అత్తగారింటికి పంపిన తర్వాత ఆమె కోసం బెంగపెట్టుకొని ‘వలసపోయిన మందహాసం’ అనే మొట్టమొదటి కవిత వ్రాశారు రామా రావు. ఆ కవితకు ఎంతో పేరు వచ్చింది. 1995లో ఇదే శీర్షికతో మొదటి కవితా సంపుటిని వెలువరించారు. అక్కడి నుండి ఆయన కవితా దిగ్విజయ యాత్ర కొనసాగింది.
‘మరో మజిలీకి ముందు’ కవితా సంపుటికి ప్రముఖ కవి ఇస్మాయిల్ ‘కవిత్వ మజిలీ కథలు’ అనే పేరుతో చాలా గొప్ప పీఠిక వ్రాశారు. అందులో ‘ముకుంద రామారావు కవితల్లో సున్ని తమైన హృదయం అనుభవ ప్రకంపనలకు స్పందించే తీరు కనిపిస్తుంది. ఇక్కడ మనతో మాట్లాడేది హృదయం, హేతువు కాదు...’ అని రాశారు.
‘ఎవరున్నా లేకున్నా’ కవితా సంపుటికి ప్రముఖ కవి, అను వాదకుడు అయిన దీవి సుబ్బారావు తాను రాసిన పీఠికలో ‘ముకుంద రామారావు గారి వ్యక్తిత్వం నుండి కవిత్వాన్ని విడదీసి చూడలేము... ఇలాంటి కవిత్వాన్ని చెప్పడానికి మనిషి తాత్త్వికుడై ఉండాలి. చుట్టూరా ఉన్న మనుషుల్ని ప్రేమించ గలిగిన వాడై ఉండాలి. ముకుంద రామారావు గారు ఆ కోవకు చెందినవారు’ అని రాశారు.
‘నిశ్శబ్దం నీడల్లో’ కవితా సంపుటిలో శరీరంలోని ప్రాణాన్ని ఒక దీపంతో పోల్చుతూ ‘దేహ దీపం’ అనే ఆ చిన్న కవిత వ్రాశారు–‘దళసరి చర్మం / ఎముకల గూడు / రహస్య స్థావరంలో / దేహ దీపం! / ఎంతోకొంత వెలిగి / ఆరిపోతుందో / ఎగిరి పోతుందో / ఎవరికెరుక? / ఆపలేక / అందుకోలేక / జీవితాంతం ఆరాటం!!‘ స్వీయ అనువాద రచనలు రామారావు సాహిత్య కృషిలో ముఖ్యమైనవి. దీనిలో మొత్తం 14 గ్రంథాలున్నాయి.
వీటిలో మొదటి అయిదు పుస్తకాలు ఈ ప్రపంచ సృష్టికి మూల భూతములయిన పంచభూతాల పేర్లతో వెలువడ్డాయి. ‘ఆకాశం – గాలి – నేల – కాంతి – నీరు‘ అనే వరుసలో తమ అనువాద గ్రంథాలను వెలువరించారు. ‘అదే నీరు’ పీఠికలో తనలో దాగివున్న పంచభూతాలను తెలియజేస్తూ, ఒక చక్కటి కవిత వ్రాశారు.
‘అవును/సూర్యుడు వస్తుంటాడు పోతుంటాడు –/ఆకాశం అదే!/ అలలు వస్తుంటాయి పోతుంటాయి –/సముద్రం అదే!/సముద్రం నువ్వయితే –/నీటిలో మునిగి ఈదాలనుకునే చేపని నేను!’ అని సాగే ఇంత గొప్ప కవితను ఈ మధ్యకాలంలో నేను చదవలేదు. దీనిని చదివిన నేను ‘ఈ కవితలో కలసిపోతిని, కరిగిపోతిని, కాన రాకే కదిలి పోతిని!’
– ప్రొ‘‘ తంగిరాల వెంకట సుబ్బారావు, సాహితీవేత్త
(అజో–విభొ కందాళం వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం నేడు విశాఖలో ముకుంద రామారావు అందుకుంటున్న సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment