ఆయన కవిత్వం... భారతీయాత్మ స్వరూపం | World Poetry Day special | Sakshi
Sakshi News home page

ఆయన కవిత్వం... భారతీయాత్మ స్వరూపం

Published Mon, Mar 21 2022 12:37 AM | Last Updated on Mon, Mar 21 2022 1:21 AM

World Poetry Day special - Sakshi

రాయప్రోలు సుబ్బారావు

‘‘మామిడి కొమ్మ మీద కల మంత్ర పరాయణుడైన కోకిల స్వామికి మ్రొక్కి యీ యభినవ స్వరకల్పన కుద్యమిం చితిన్‌’’ అంటూ గత శతాబ్దంలో తెలుగులో ఆధునిక కవిత్వానికి ప్రారంభ కుడైన వాడు రాయప్రోలు సుబ్బారావు. రాయప్రోలు తన సమస్త వాఙ్మయం ద్వారా భారతీయ సంస్కృతి స్వరూప స్వభావాలను సమకాలీన జనానికి పునః సాక్షాత్కరింప జేసి వాటి విలువల పరిరక్షణకు సంకల్పించినారు. మేనమామ అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద చేసిన విద్యాభ్యాసం ప్రాచీన వాఙ్మయంలోని మౌలిక విషయాల అవగాహనకు తోడ్పడినది. వేదాధ్యయన అధ్యాప నలకు పుట్టిల్లు అయిన ‘వెదుళ్ళపల్లి’లోని ఆయన జీవనం వేదోపనిషత్తుల యందు ప్రగాఢమైన విశ్వాసాన్ని కలిగించినది.

ఆధునిక కవులకు ‘మ్యానిఫెస్టో’గా రచించిన ‘రమ్యా లోకం’ లక్షణ గ్రంథంలో– ‘‘క్రొత్త నీరు తొల్కరి యేళ్ళ క్రుమ్మి పాఱ/ప్రాతనీరు కలంగుట బ్రమ్ముకాదు’’అని అంటారు. కాలానుగుణమైన మార్పును ఆహ్వానించవలసిందే అంటారు. ఆధునికతా పరివేషంలో నూతన అభివ్యక్తి కోసం మార్పును ఆహ్వానించిన రాయప్రోలు సంప్రదాయ సంస్కృతులను మాత్రం వదలి పెట్టలేదు. తన కవిత్వం ద్వారా రాయప్రోలు ప్రతిపాదించిన సంస్కృతీపరమైన అంశాలను మనం ఇట్లా గమనించవచ్చును – ‘‘ఏ దేశమేగిన ఎందు కాలిడినా / ఏ పీఠ మెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని / నిలుపరా నీ జాతి నిండు గౌరవమును’’అంటూ మాతృ దేశా రాధనం వ్యక్తి సంస్కృతికి నిదర్శనమని చాటినారు. 

అట్లే ‘‘తమ్ముడా! చెల్లెలా!’’ అంటూ సోదర సోదరీ భావంతో దేశీయమైన, జాతీయమైన సాంస్కృతిక వార సత్వాన్ని  ప్రబోధించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాను తెలుగువాడిగా పుట్టడమే ఒక అదృష్టంగా భావించా డాయన. ‘‘ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు / పూజ సల్పి తినో యిందు పుట్టినాడ! కలదయేని పునర్జన్మ కలుగా గాక / మధు మధు రంబయిన తెన్గు మాతృభాష.’’ 

ప్రతి మనిషీ భాషా తపస్సు చేయడం ద్వారా మాతృ భావనకు పునాది వేయమంటా రాయన. భాషలు వేరైనా మతాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా భారతీయుల సాంస్కృతిక విధానం ఒక్క టేనన్నది రాయప్రోలు ఉద్దేశ్యం. అందుకే మాతృ భాషలో ఇతర భాషా పదాలు వచ్చి చేరడమన్నది ఆ భాష  గొప్పదనానికి నిదర్శన మంటాడు. భారతీయ సమాజంలో కుటుంబ సంబంధాలను, మానవీయ సంబంధాలను అంటి పెట్టుకొని ఉన్న సంస్కృతి ఆధు నిక కాలంలో ప్రేమ రాహిత్యం వల్ల సంక్షోభంలో పడిపోయిందన్న ఆవేదనను రాయప్రోలు తన ‘రూపనవనీతం’లో ఇలా వ్యక్తం చేసినారు –

‘‘మానవ గాత్రమునకు మాన్పరాని గాయములు తగిలి నవి చైతన్యమంతా అనిష్టముష్టి ఘాతాలతో కాయలు కాసినవి. ప్రేమ ప్రవహింపక గడ్డలు కట్టింది... నైతిక చక్రము సవ్యాప సవ్య మార్గములు తెలియకుండా త్రిప్పినందువల్ల, ఒడుదొడు కులతో మిట్టపల్లాలతో కుంటుతుంది. గమ్యం కానరాకుండా చాటయింది.’’ 

‘‘పరమ ధర్మార్థమైన దాంపత్య భక్తి’’ అనే పద్యంలో ప్రేమ అన్నది ఒక అఖండమైన పదార్థంగా అది భక్తి, రక్తి, సక్తి అని  మూడు విధాలుగా అభివ్యక్త మవుతున్నదని ప్రకటించినాడు. ఈ మూడింటినీ భారతీయ సంస్కృతిలోని ప్రధానమైన అంశాలుగా వ్యాఖ్యానించవలసి ఉన్నది. ప్రపంచ దేశాలలో భారతీయ సంస్కృతికి అత్యున్నత గౌరవం లభించడానికి కారణం మన కుటుంబ వ్యవస్థ. మానవ సంస్కృతి వికాసానికి మూలమైన స్త్రీ – పురుష సంబంధాలను రాయప్రోలు తన కావ్యాలలోనూ, లక్షణ గ్రంథాలలోనూ ‘నరనారీ సంబంధం’ పేరుతో విశ్లేషించినారు. మానవులందరూ స్త్రీ పురుష భేదం చేత మౌలికంగా రెండే రెండు వర్గాలు. ఈ రెండు వర్గాల పరస్పర సంబంధం మీదనే మానవ జీవితం, మానవ సమాజం అభివృద్ధి మార్గంలో విస్తరిస్తాయని అంటారు.

ఇట్లే రాయప్రోలు సాహిత్యపరంగా రసభావనను గురించి చెప్పిన నిర్వచనము గానీ, సమాజపరంగా ఆయన ప్రతిపాదించిన  నూతన సిద్ధాంతము శాంతం, శివం, సుందరం అన్నది కానీ భారతీయ సంస్కృతిలోని ప్రధాన లక్ష్యాన్ని ఆవరించుకొని చెప్పినవే. భారతీయ సంస్కృతీ సారమైన శాంతం, శివం, సుందరం అన్నవి మూడు వన్నెల జెండా వంటివనీ, ప్రతి ఒక్కరూ వాటిననుసరించి శిరసావహించి భారతీయ సంస్కృతికి గౌరవ వందనం చేయ వలసిందేనని ప్రబోధించినాడు. 
వ్యాసకర్త మాజీ సంచాలకులు 
తెలుగు అకాడమి ‘ 93901 13169 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement