ప్రొఫెసర్ డానియల్ నెజర్స్
యానాం : తెలుగు సాహిత్యంలో విశిష్టస్థానం పొందిన సత్యం శంకరమంచి ‘అమరావతి కథలు’లో ఎనిమిదింటిని ఫ్రెంచిలోకి అనువదిస్తున్నట్టు ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రొఫెసర్ డానియల్ నెజర్స్ తెలిపారు. తెలుగు భాషపై మక్కువను పెంచుకొని 30 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్న నెజర్స్ బుధవారం యానాం వచ్చారు. ప్రముఖకవి, కథకుడు దాట్ల దేవదానంరాజు ఇంట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగులో అధ్యయనం, పరిశోధన నిమిత్తం గతంలో 1984 నుంచి 89 వరకు పెద్దాపురంలో నివసించినట్టు తెలిపారు.
ఆ సమయంలో సామాజిక, సాంస్కృతిక అంశాలను గమనించానని, పురాతన జానపద కళారూపమైన బుర్రకథలపై పరిశోధన చేసి ఫ్రాన్స్‌లో ఎంఫిల్ పొందానని చెప్పారు. అమరావతి కథలతో పాటు దేవదానంరాజు ‘యానాం కథలు’ సంపుటిలోని ‘దేశద్రోహి, అవును నిజం, పతాకసందేశం, మరో రెండు కథలను కూడా తెలుగులోకి తర్జుమా చేస్తున్నట్టు చెప్పారు. తెలుగులో అధ్యయనం, పరిశోధన చేయవలసి ఉందని, తెలుగు సంస్కృతీ సంప్రదాయాల గురించి మరింత తెలుసుకోవాల్సి ఉందన్నారు.
తెలుగుకు సంబంధించి మరెంతో చేయాలన్న తపన ఉందన్నారు. ఆధునిక సాహిత్యంపై పరిశోధన చేసే ఉద్దేశం ఉన్నట్టు తెలిపారు. ఇప్పటివరకు జానపద సాహిత్యం, వీరబర్బరీకుడు, అనుమాధవ విజయం, వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితం, అల్లూరి సీతారామరాజు, కాలజ్ఞానం, జానపద బుర్రకథలు, హరికథలపై అధ్యయనం చేసిన నెజర్స్, వేమన పద్యాలు, గురజాడ అప్పారావు, రాయప్రోలు సుబ్బారావు దేశభక్తి గీతాలు, ‘చింతామణి’ నాటకం వంటివి తెలుగు నుంచి ఫ్రెంచిలోకి అనువదించారు. ఆయన రూపొందించిన తెలుగు-ఫ్రెంచి నిఘంటువును తెలుగు అకాడమీ 2003-2004లో ప్రచురించింది. కాగా నెజర్‌స యానాంలోని ఫ్రెంచి వారి సమాధులను సందర్శించారు.