జూలూరుతో భేటీ అయిన ప్రొఫెసర్ డానియెల్
సాక్షి, హైదరాబాద్: వందల ఏళ్లుగా భాష, సంస్కృతులతో అనుబంధం కలిగి ఉన్న ఫ్రెంచ్–తెలుగు మహా నిఘంటువు అవసరం ఎంతో ఉందని ఫ్రెంచి రచయిత, తెలుగు అధ్యయనవేత్త ప్రొఫెసర్ డానియెల్ నెజాక్స్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్‌తో రవీంద్రభారతిలో గురువారం సమావేశమైన డానియెల్, నిఘంటువు ప్రచురణకు సహకరించవలసిందిగా కోరారు. మూడున్నర దశాబ్దాలకు పైగా తెలుగు భాషతో, ప్రజలతో అనుబంధం ఉన్న తాను పారిస్‌లో తెలుగుపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
అందుకు తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ.. ఫ్రెంచి–తెలుగు మహా నిఘంటువు ప్రచురణకు తెలంగాణ సాహిత్య అకాడమీ సిద్ధంగా ఉందని, ఈ గ్రంథానికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. పారిస్‌లో తెలుగు భాష, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సంతోషదాయకమని, ముఖ్యమంత్రి కేసీఆర్, క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలుగు–ఫ్రెంచి మహా నిఘంటువు కోసం డానియల్ చేస్తున్న కృషిని జూలూరు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment