భ్రమాన్విత చేతన | Analysis Based On You Should Have Left Novel | Sakshi
Sakshi News home page

భ్రమాన్విత చేతన

Published Mon, Mar 2 2020 12:53 AM | Last Updated on Mon, Mar 2 2020 12:53 AM

Analysis Based On You Should Have Left Novel - Sakshi

‘వాస్తవాన్ని వివరించడానికి, ఎన్నిమాటలూ సరిపోవు,’ అంటాడు డానియల్‌ ఖిల్మాన్‌ రాసిన ‘యు షుడ్‌ హావ్‌ లెఫ్ట్‌’ నవలలోని కథకుడు. కానీ, రచయిత సమర్థుడైతే ఒక ప్రత్యేకమైన కథకుడ్ని ఉపయోగించుకుని ఆ సంక్లిష్ట వాస్తవాన్ని మన ఊహకి అందేలా చేయగలడు. నవల శిల్పం, ఆ శిల్ప ప్రభావం సంపూర్ణంగా ఆ ప్రత్యేక కథకుడి మీదా, అతని కథనం మీదా ఆధారపడి వుంటుంది. 
సినిమా రచయిత అయిన కథకుడు, విజయవంతమైన తన సినిమాకి సీక్వెల్‌ రాయడానికి– భార్య (ఒకప్పుడు సినీ నటి, ఇప్పుడు నలభై ఏళ్లు), నాలుగేళ్ల కూతురుతో కలిసి కొండమీద ఒక భవంతిని అద్దెకి తీసుకుంటాడు. రైటర్స్‌ బ్లాక్‌తో అవస్థ పడుతున్న అతనికి, నటిగా అవకాశాలు రాని అసహనంతో ఉన్న భార్య విసిరే సూటిపోటి మాటలు తోడవుతుంటాయి.

స్క్రీన్‌ప్లే రాసే పుస్తకంలోనే జరుగుతున్న విషయాలని కూడా అతను రాస్తుండటంతో కథ మనలని చేరుతుంటుంది. మొత్తం ఆరురోజుల కథ, ఆరే ఆరు అధ్యాయాలు. రెండో అధ్యాయంలో ‘ఒక వింత విషయం జరిగింది,’ అనే వాక్యంతో అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంట్లో ఉన్న ఒక ఫొటోలోని మనిషే పీడకలలో కనిపించింది కానీ, తీరా చూస్తే ఇప్పుడక్కడ ఆ ఫొటోనే లేదు! ఇంట్లో ఇంతకుముందు చూసిన కారిడారే ఇంకా పొడుగ్గా ఉన్నట్టుంది. ఇంతకుముందు లేని పడక గదులు ఇప్పుడు మరికొన్ని కనిపిస్తున్నాయి. కొండకింది ఊరికి సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడో కొత్త వ్యక్తి, అక్కడెందుకు ఉంటున్నారసలు అని స్థానిక యాసలో అడిగింది అతనికి సగమే అర్థం అవుతుంది. మిగతా సగం మనకి అర్థం అవుతుంది! 

నాలుగో రోజుకి మరో ఎదురుదెబ్బ– భార్యకి మరెవరితోనో సంబంధం ఉందని తెలియడం, నిలదీస్తే ‘కూతుర్ని జాగ్రత్తగా చూసుకో,’ అని ఆమె కారేసుకుని వెళ్లిపోవడం. ఒక లంబకోణం గీసి, ఆ కోణాన్ని ఖండిస్తూ అడ్డంగా మరో సరళరేఖని గీసి, ఏర్పడ్డ రెండు కోణాల మొత్తం చూస్తే అది తొంభైకి కొంచెం తక్కువగా ఉంటోంది. లెక్కలన్నీ తప్పుతున్నాయి.ఇదంతా బొత్తిగా ‘భూత’ కల్పనేమో అని మనం అనుకునే లోపలే ఒక విషయం గమనిస్తాం. ఇప్పటివరకూ జరిగిన కథలోని చివరి రెండు అధ్యాయాలలోనూ కథకుడు రాస్తున్న దాంట్లో తేడా కనిపిస్తుంది. విరిగిపోతున్న వాక్యాలూ, చెరిగిపోతున్న విరామ చిహ్నాలూ మనకి కొత్త అనుమానాలు సృష్టిస్తాయి. దెబ్బతిన్న కథకుడి మానసిక సమతుల్యత అర్థమై– జరిగిన కథని పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం, జరగబోతున్న కథని, చెప్పబోతున్న కథకుడిని జాగ్రత్తగా అంచనా వేయాల్సిన అవసరం ఏకకాలంలో కలుగుతాయి. ప్రత్యేకత కలిగిన ఇలాంటి అన్‌రిలయబుల్‌ నేరేటర్‌ విషయంలో కథకుడు నమ్మదగినవాడు కాదని ప్రారంభంలోనే తెలియడం వేరు. మధ్యలో తెలియడం అసలైన హారర్‌!

ముప్పై ఏళ్ల వయసులోనే ‘మెజరింగ్‌ ది వరల్డ్‌’ నవలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ జర్మన్‌ రచయిత మూడేళ్ల క్రితం విడుదలయిన నవల ‘టిల్‌’తో జర్మన్‌ సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ‘యు షుడ్‌ హావ్‌ లెఫ్ట్‌’ కథనం ఆకట్టుకోవడానికి మూల రచయిత కృషి ఎంత ఉండివుండవచ్చో, అనువాదకుడు రాస్‌ బెంజమిన్‌ కృషి దాదాపుగా అంతే ఉందనిపిస్తుంది. 2017లో పాంథియాన్‌ ప్రచురించిన ఈ ఇంగ్లిష్‌ అనువాదం చదివాక బెంజమిన్‌ ఇతర అనువాదాలని వెతికిపట్టుకుని చదవాలనిపిస్తుంది.
దిశ మారుతున్న కథని మనం గమనిస్తూ కూడా దాన్ని మామూలు హారర్‌ కథగా భ్రమించకుండా, రచయిత కథని నడుపుతున్న తీరుని గమనించేట్టు చేయడం డానియల్‌ ఖిల్మాన్‌ ఈ నవలలో సాధించిన విశేషం.
  -యు ఎ.వి.రమణమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement