గ్రేట్ రైటర్
ఆస్ట్రియా రాజధాని వియన్నాలోని యూదు కుటుంబంలో జన్మించాడు స్టెఫాన్ త్సై్వక్ (1881–1942). జ్వైగ్ అని కూడా రాస్తారు. జర్మన్ ఉచ్చారణ మాత్రం త్సై్వక్. యూదు ఆచారాల గురించి విస్తృతంగా రాసినప్పటికీ తనను యూదుగా భావించుకోలేదు. మా అమ్మా నాన్న యాదృచ్ఛికంగా యూదులు అన్నాడు. 1920, 30ల్లో అత్యంత పాఠకాదరణ ఉన్న రచయిత. ‘ద రాయల్ గేమ్’, ‘అమోక్’, ‘లెటర్ ఫ్రమ్ యాన్ అన్‌నోన్ ఉమన్’ నవలికలు బాగా పేరు తెచ్చాయి. ‘జర్నీ ఇంటూ ద పాస్ట్’, ‘బివేర్ ఆఫ్ పిటీ’, ‘ఎ ఫేర్‌వెల్ టు యూరప్’ లాంటి రచనల ఆధారంగా సినిమాలు వచ్చాయి. స్వీయ వర్ణనలో సిద్ధహస్తులు: కాసనోవా, స్టెండాల్, టాల్‌స్టాయ్; ముగ్గురు మాస్టర్లు: బాల్జాక్, డికెన్స్, దోస్తోవ్‌స్కీ లాంటి స్టడీలు రాశాడు.
జీవిత చరిత్రలు వెలువరించాడు. భారతీయ సత్యాన్వేషణ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ త్సై్వక్ రాసిన కథ ‘విరాట్’ను పొనుగోటి కృష్ణారెడ్డి తెలుగులోకి అనువదించారు. హిట్లర్ అధికారంలోకి వచ్చాక 1934లో ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు. తర్వాత కొన్ని నెలలు అమెరికాలో ఉన్నాడు. అటుపై బ్రెజిల్ చేరుకున్నాడు. కానీ ఎక్కడా ఆయనకు శాంతి లభించలేదు. తన లోపలి మనిషికీ బాహ్యంగా ఉంటున్న మనిషికీ మధ్య సమన్వయం కుదరక అరవయ్యో ఏట ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకాల పుస్తకం ‘ద వల్డ్ ఆఫ్ ఎస్టర్‌డే’ చనిపోవడానికి ఒక రోజు ముందు పూర్తయ్యింది. 1881–1942 మధ్యకాలంలో ఒక మనిషి బతకడమంటే ఏమిటో ఈ పుస్తకం పట్టిస్తుందంటారు.
Comments
Please login to add a commentAdd a comment