ఇండియన్– అమెరికన్ కమ్యూనిటీ నేపథ్యంతో ఉండే రాకేష్ సత్యాల్ రాసిన రెండవ నవల, ‘నో వన్ కాన్ ప్రొనౌన్స్ మై నేమ్’ ఒమాహా రాష్ట్రంలో చోటు చేసుకుంటుంది.
డిపార్టుమెంట్ స్టోర్లో పురుషుల సెక్షన్‌లో ఉద్యోగం చేసే హరిత్, నలబైల్లో ఉన్న బ్రహ్మచారి. వలస వచ్చిన రెండవ తరపు భారతీయుడు. అక్క స్వాతి, దుర్ఘటనలో చనిపోవడంతో అతని తల్లి మతి చెడుతుంది. కంటిపొర వల్ల చూపు సరిగ్గా ఆనని ఆమెని ఊరడించడానికి, ప్రతి రాత్రీ స్వాతి బట్టలు తొడుక్కుని తానే అక్కయినట్టు నటిస్తుంటాడు. ‘ఈ బట్టలు మార్చుకోవడం అన్న ఆట ఎప్పుడు ప్రారంభం అయిందో అతనికే తెలియదు... ఒకరోజు స్వాతి లిప్‌స్టిక్ తన పెదవుల మీద ఆన్చుకున్నప్పుడు, అది దినచర్య అవుతుందని అతనికి తెలుసు.’ ఆ ఆట అతనికి ఉపశమనం కలిగిస్తుంది.
ఉద్యోగానికి తప్ప ఇంటి బయటకి కదలని హరిత్‌ను అతని స్టోర్లోనే పని చేసే సమలైంగికుడైన టెడ్డీ, శుక్రవారాలు పబ్‌కు తీసుకెళ్ళడం మొదలెడతాడు.
ఒహాయోలోనే ఉండే మధ్యవయస్కురాలైన రంజన కొడుకు ప్రశాంత్ ప్రిన్స్‌టన్ యూనివర్సిటీకి వెళ్ళిపోతాడు. ఆమెకు డాక్టరైన భర్త మోహన్‌కు వివాహేతర సంబంధం ఉందని అనుమానం. ‘తనూ మోహన్ శృంగారంలో పాల్గొన్న ఆఖరిసారి గుర్తే లేదు... అతని శరీరాకృతి అచ్చం భారతీయ పురుషుల వంటిదే. అయిదవ నెల గర్భిణీ లాంటి పొట్ట’ అనుకుంటుంది. రహస్యంగా ప్రేమకథలు రాస్తూ, రచయితల గుంపు చర్చల్లో భాగం పంచుకుంటుంటుంది. ఇతర భారతీయ స్త్రీలతో స్నేహం ఆమెకి నిరాశ కలిగిస్తుంది. ఖాళీగా ఇంట్లో కూర్చోలేక ఒక ఇండియన్ డాక్టర్ ఆఫీసులో, రిసెప్షనిస్టుగా పని చేయడం మొదలెడుతుంది.
తండ్రికి నచ్చదని తెలిసీ ప్రశాంత్ తన సబ్జెక్టు మార్చుకుంటాడు. తల్లిదండ్రులు తనని సెమిస్టర్‌లోç రెండుసార్లు మాత్రమే కలుసుకోవాలన్న షరతు విధిస్తాడు.
రంజన, హరిత్– ఇద్దరూ ఇతరులతో ఏదో విధమైన లోతైన సంబంధం కోసం వెతుకుతుంటారు. కానీ అదెలా సాధ్యమవగలదో ఇద్దరికీ తెలియదు.
కొన్ని క్రమవారీ సంఘటనల వల్ల ఇద్దరూ కలుసుకున్నప్పుడు వారిమధ్య స్నేహం పెంపొందుతుంది. హరిత్‌ను కలుసుకున్న తరువాత తనకీ ఒక ఉనికంటూ ఉందనీ, తనూ మెచ్చుకోతగ్గ స్త్రీయే అనీ రంజన గుర్తిస్తుంది. ఎంతోకాలంగా తనలోనే దాచుకుని, నిర్వచించకుండా వదిలేసిన అనుభూతులని హరిత్ తెలుసుకుని, అది తమిద్దరి స్నేహం వల్లే సంభవించిందనుకుంటాడు. ఇద్దరూ తమ తమ మనఃస్థితులని అర్థం చేసుకుని, తమ భయాలని విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు.
నవల ఆఖరున రంజన ఉత్తమ రచయిత్రిగా, కిక్కిరిసి ఉన్న ఆడిటోరియమ్‌లో ప్రసంగిస్తూ కనబడుతుంది. తన ఆందోళన వదిలించుకున్న హరిత్ స్వేచ్ఛగా, స్వలింగ సంపర్కుడిగా జీవితం కొనసాగిస్తాడు.
ఈ ముగ్గురితోపాటు, రచయిత మరెన్నో చిన్న పాత్రలనీ పరిచయం చేస్తారు. పాత్రలనీ, వొంటరితనాన్నీ రచయిత హాస్యంగా, ఎంతో సానుభూతితో, సుకుమారంగా వర్ణిస్తారు. నవ్వు, ఉత్సాహం పుట్టించే ఈ నవల– లైంగిక గుర్తింపు, అమెరికాలో మొదటి తరపు భారతీయుల గురించినది. అమెరికన్లు భారతీయ పేర్లను సరిగ్గా ఉచ్ఛరించలేకపోవడమే నవల శీర్షికకి ఆధారం.
భయం జీవితాల్లో ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో, జీవితాలని ఎలా అడ్డగించి, నిర్వచించి, మలుపులు తిప్పగలదో అని చెప్పే ఈ నవలని ‘పికడోర్ యుఎస్‌ఎ’ 2017లో పబ్లిష్ చేసింది. ‘కిల్లర్ ఫిల్మ్స్’ నవలని సినిమాగా తీస్తోంది. రచయిత మొదటి నవల ‘బ్లూ బోయ్’ 2009లో అచ్చయింది.
కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment