
వెంటాడే పాత్రలు...
మహిళా దినోత్సవం ప్రత్యేకం
స్త్రీల గురించి స్త్రీలు రాసుకోవడానికి వీలు లేని రోజుల్లో కూడా స్త్రీలు తమ శక్తిమంతమైన సమక్షంతో కవుల కలాల్లో, రచయితల గళాల్లో దూరి తమకు రూపాలను ఇచ్చుకున్నారు. తాము లోకానికి వెల్లడి చేయాల్సిన సంగతులను వెల్లడి చేశారు. సౌందర్యం, ప్రేమ, త్యాగం, ధైర్యం, తెగువ, నిరసన... ఒక స్త్రీకి వేయి రూపాలు. ప్రతి సాహిత్యకారుడూ ఆ విరాట్ రూపానికి తనదైన వ్యాఖ్య చేస్తూనే ఉన్నాడు. చేస్తూనే ఉంటాడు. భారతీయ సాహిత్యంలో తెలుగు సారస్వతంలో కొన్ని పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇప్పటికీ ప్రభావం చూపుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటిని గుర్తు చేసుకోవడం... తద్వారా వాటిని లోతుగా తెలుసుకునే పనికి పురిగొల్పడం కోసమే ఈ పెద్దల అభిప్రాయాలు.
వరూధిని: వరూధిని మనోహారిణియగు ముద్దరాలు. అమాయకురాలు. దైవభక్తి సంపన్న. స్నిగ్ధమోహావేశ పరవశ. యౌవన విలాసములు పొంగి పొరలు చుండెను. పెద్దన ప్రవరాఖ్యునిచే చెలియలికట్ట వేయించినాడు. పాపం. వరూధిని ప్రవరాఖ్యుణ్ణి ప్రేమించినటులనే ఒక గంధర్వుడు వరూధినిని ప్రేమించి యుండెను. సమయము చిక్కినది. వదలలేదు. ప్రవరాఖ్య రూపము ధరించి నాలుగు అంగలలో వచ్చి పడినాడు. అసలు ప్రవరాఖ్యునితో వరూధిని హృదయము నిండిపోవుచున్న సమయమున నకలు ప్రవరాఖ్యుడు హాజరు. వరూధిని అతడే ఇతడనుకుంది. ఇంకేమి కొరత. ప్రకృతి తత్త్వశాస్త్ర మర్మముల ఘోషించుటకు తగిన అదను. పెద్దన దీనిని జారవిడుచునా? గంధర్వుడు మన్వంతరపు ఢంకాను బజాయించినాడు (అతడి వల్ల వరూధిని మనువుకు జన్మనిచ్చినది). విశ్వామిత్రుడు భరతఖండపు బాకా ఊదలేదా (శకుంతలా దుష్యంతుల సంతానమే భరతుడు). ఈ పరమ రహస్యములను సునిశితముగ లోకమునకు చాటినవారు కాళిదాసు, పెద్దన. ఔరా.. తాళలేని అప్సరసల సంతతివారు భరత ఖండమును, మన్వంతరములను స్థాపించగలిగిరి. పరమాశ్చర్యము గదా?
- పుట్టపర్తి నారాయణచార్యులు
మధురవాణి: నేను చదివినంత మట్టుకు విశ్వసాహిత్యంలో మధురవాణితో సరిపోల్చదగిన పాత్ర మరొకటి లేదు. అనగా ఆ తెగలో ఆమె అద్వితీయంగా నిలుస్తుందని. ఆ తెగ అనగా ‘సామాన్య’ అనే నాయికా విశేషం అని నా ఉద్దేశం. ‘మృచ్ఛకటిక’లో వసంతసేన మానవవేశ్య అయినా మధురవాణి ప్రౌఢత్వం ముందు ఆమె వట్టి గోల. షేక్‌స్పియర్ క్లియోపాత్రగాని, సోఫోక్లిస్ నాయికలుగాని వేశ్యలు కాదు. ముద్దుపళని తన రాధికకు తంజాపూర్ నాగరికతనాటి వేశ్యల లక్షణాలను ప్రసాదించింది. చింతామణి కంటే దేవదేవి నాలుగాకులు ఎక్కువ చదువుకుంది. అంతే. వీరంతా శృంగారంలో కొన్ని సున్నితమైన ఒడుపులు చూపిస్తారు. కాని జీవితాన్ని వడబోసి చూపించరు. వసంతసేనను ‘వెసెల్ ఆఫ్ లవ్’ (ప్రేమపాత్రిక) అనీ, మధురవాణిని ‘వెసెల్ ఆఫ్ లైఫ్’ (జీవపాత్రిక) అనీ నేనంటాను. ఉజ్జయినీ నగరాన్నీ చారుదత్తుని ప్రేమనీ వదులుకోవలసి వస్తే వసంతసేన ఏమయిపోతుందో తలచుకోవడానికే భయమవుతుంది. మధురవాణి మాత్రం యే స్థలాన్నైనా యే స్థితినైనా లొంగదీసుకోగలదు. ఎంత గొప్ప పాత్రని సృష్టించాడు గురజాడ!
- శ్రీశ్రీ
చింతామణి: కాళ్లకూరి నారాయణరావుగారు ఈ నాటకాన్ని రాసిందే వేశ్యాలోలత్వం నుంచి మేలుకొలుపు కోసం. అందుకు తగ్గట్టుగా పదే పదే ఆ అంశం మీద వ్యాఖ్యానాలు చేయిస్తూ వచ్చారు కనుక చింతామణి రచన సక్కుబాయి నాటకంలాగానో, విప్రనారాయణ నాటకంలాగానో భక్తి ప్రధాన నాటకంగా భాసించకుండా సాంఘిక నాటకంగా స్వభావం మార్చుకుంది. చింతామణి వృత్తి చేత వేశ్యగా జీవిస్తున్నా ప్రవృత్తి రీత్యా దుర్మార్గురాలు కాదు. పైగా వేశ్యాలోలత్వంతో తన సంపదనంతా దోచి పెట్టిన భవానీశంకరుడన్నా, దోచి పెట్టడానికి సిద్ధంగా ఉన్న సుబ్బిశెట్టి అన్నా ఆమెకు వెగటు. తన వృత్తి మీద కూడా వెగటు. ఈ సందర్భంలోనే ఆమె మంచి అధ్యయనపరుడు, భక్తుడు అయిన బిల్వమంగళుడు గురించి విన్నది. అతడికి దగ్గర కావాలనుకుంది. కాని అతడు ఆమె మోహంలో పడి ఇంటినీ భార్యనీ ఆఖరుకు చావుబతుకుల మధ్య ఉన్న తండ్రినీ పట్టించుకోని స్థితికి వచ్చాడు. ఒక రాత్రి తండ్రి చనిపోతే శవజాగారాన్ని భార్యకు వదిలిపెట్టి భోరున వర్షం కురుస్తుండగా పిడుగుపాటుకు చింతామణి ఎక్కడ భయపడుతుందోనని ఉధృతంగా పారే ఏరులో కొట్టుకెళ్లే శవాన్ని ఆధారంగా చేసుకొని ఈది ఆమె వద్దకు చేరుతాడు బిల్వమంగళుడు. వేశ్యా లోలత్వానికి ఆ సంఘటన పరాకాష్ట. చింతామణి ఆశించింది వేరు. చూసింది వేరు. వెంటనే ఆమె మలినమైన నిజదేహ స్వరూపాన్ని అతనికి చూపించి ఈ బతుకు అశాశ్వతత్వాన్ని అతనికి బోధించింది. తనే పరమగురువుగా మారింది. బిల్వమంగళుడిని యోగిని చేసింది. మనిషి ఏకాగ్రత, సమ్మోహస్థితి కామం వైపు గాక దైవం వైపు (సత్కర్మల వైపు) మళ్లిస్తే అంతకు మించిన ముక్తిమార్గం లేదు అనే సందేశం ఇస్తుంది. దౌర్బల్యాలకు స్త్రీ, పురుషులు సమానం. కాని వాటి నుంచి మేల్కొనదలిస్తే స్త్రీయే ముందుగా మేల్కొనగలదనీ పురుషునికి మార్గం చూపగలదనీ ఒక ఉదాహరణగా నిలిచే శక్తిమంతమైన పాత్ర చింతామణి.
- ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
సావిత్రి: గుడిపాటి వెంకట చలం రాసిన ‘సావిత్రి’ నాటకంలో సావిత్రిది ఏ తెరలూ కప్పి ఉంచని సత్యప్రేమ. దాంపత్యప్రేమ ఎంత నిష్కల్మషమైందో సంకోచ రహితమైందో చెప్పడానికి పూర్వీకులు తమ సారస్వతంలో సావిత్రి పాత్రను భద్రం చేసుకుంటే కాలక్రమంలో ఆ పాత్రలోని సత్యప్రేమ, దాంపత్య ప్రేమ వెనుక్కి పోయి పాతివ్రత్యం, పతిభక్తి ముందుకు వచ్చాయి. వీటిని భగ్నం చేసి నిష్కల్మషమైన దాంపత్యప్రేమను పునఃప్రతిష్ఠించడానికి చలం ఈ నాటకం రాశాడా అనిపిస్తుంది. సావిత్రి ప్రేమ అంత స్వచ్ఛమైనది కనుకనే ఈ నాటకంలో యుముడు ‘పవివ్రతా పరమధర్మము సహగమనము’ అని అంటే ‘అవును. సహ-గమనమే చేస్తాను. పదండి. ప్రేమ లోబడదు. జయిస్తుంది’ అంటుంది సావిత్రి. యముడు సావిత్రి ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సావిత్రి దేనికీ భయపడదు. సత్యవంతుని ప్రేమ అపవిత్రమైనదనే మాయను సృష్టించి అతడిని మరో స్త్రీతో చూపిస్తాడు. కాని సావిత్రి చలించలేదు. ఎందుకు చలించాలి? తన సత్యవంతుడెటువంటి వాడని? ‘ఏ మార్పూ రాని మార్పు రావడం అసంభవమైన’ అటువంటివాడు. చివరికి యముడు రాక్షసమైన ఇంకో పరీక్ష చేస్తాడు. భర్తను రక్షిస్తే పునర్జీవిని కానిస్తే ప్రత్యుపకారంగా సావిత్రి తన సౌందర్యాన్ని యముని భోగానికొకమారు స్వాధీనం చేయాలట. సావిత్రి ధైర్యాన్ని పగలకొట్టగలిగితే పగలకొట్టగలిగేది ఈ పరీక్షా ఘట్టమే. సావిత్రి హృదయం చెదరలేదు. కాని చాలా ఆవేదన పొందింది. బాధపడ్డది. అంతే. కాని కర్తవ్యం నుంచి రాలిపోలేదు. ముందు భర్త బతకడమేగా తనకి కావలిసింది. సత్యవంతుడు బతికిన తరువాతగా తాను ప్రత్యుపకారం చెయ్యడం. తరువాత లోకాలన్నింటికీ మృత్యుపీడ వదిలిపోయేట్టు యముణ్ణి నాశనం చెయ్యలేనా అనుకుంది. అందుకు ప్రయత్నించింది. అప్పుడు- యముడు- సావిత్రిలోని ప్రేమ గొప్పతనాన్ని తన మీద ఆమె విజయాన్ని అంగీకరించింది. దాంపత్యంలోని ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి. పైపై మెరుపుల కొరకు కాదు. సమాజం కొరకూ కాదు. మన కోసం మన లోపలి నుంచి ఉద్భవించాలి. అలాంటి స్త్రీత్వమూ సావిత్రీత్వమూ కావాలి అనిపించడమే ఈ నాటకానికి ఫలశ్రుతి.
- పింగళి నాగేంద్రరావు
కిన్నెరసాని: తెలుగుదేశం చేసుకున్న పుణ్యం కవి విశ్వనాథ ఒకనాడు భద్రాచలాన్ని, అక్కడి అటవీ ప్రాంతాన్ని సందర్శించడం. ఆ అడవిదారిలో వెన్నెల బయలు దాటి, రాళ్లవాగు దాటి ముందుకు వెళితే ఎదురుగా ఒక రమణీయదృశ్యం. స్థిరంగా నిలిచి ఉన్న కొండ... ఆ కొండను చుట్టుకు వలయాలుగా ప్రవహించే అందాలవాగు. అంతకు మించి మరీ అందంగా వినిపించిన దాని పేరు- ‘కిన్నెరసాని’. ఆ పేరు వినగానే విశ్వనాథకు భావావేశం రగిలి, గళంలో తారట్లాడి, భావరాగతాళయుక్తంగా జాలువారి- ఆ వచ్చింది కిన్నెరసాని పాట అయ్యింది. ఇక్కడ జరిగిన చమత్కారం ఏమిటంటే ఆ తేనెపాటల కిన్నెరవాగు అచ్చమైన తెలుగింటి పడుచుగా కవికి సాక్షాత్కరించటం, నదిగా ఆమె చుట్టుకొని తిరుగుతున్న ఆ కొండశిల విధి వైచిత్రి వల్ల శిలాకృతి పొందిన ఆమె పతి కావడం. ఆ ఇద్దరినీ చుట్టుకోని కవి ఊహలో ఒక సమ్మోహకమైన జీవత్కథ ఏర్పడిపోవడం. కిన్నెర కథాసౌరభం ఎటువంటిదంటే.... తెలుగింట పుట్టి పెరిగిన పిల్ల కిన్నెర. ఎన్నో కోరికలతో పెళ్లీ పేరంటమూ జరిగి అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. పెనిమిటి ప్రేమమూర్తే. అత్తతోనే వచ్చింది చిక్కు. ఎప్పుడూ కోడలిపైన ఏదో ఒక నింద వేయటమే పనిగా పెట్టుకున్నది. ఒకనాడు కిన్నెరను అనరాని మాటలే అన్నది ఆ అత్త. అటు అత్త ఆరడి, ఇటు భర్త మౌనం- ఆపుకోలేని దుఃఖంతో వేగిపోయింది కిన్నెర. కోపావేశంతో ముందు వెనుకలు ఆలోచించకుండా ఇల్లు వదలి అడవుల వెంట పరుగు తీసింది. అది చూచి భయంతో ఆందోళనతో ఆమె వెంటే పరుగు తీశాడు ఆమె భర్త. ఎలాగో ఆమెను అందుకుని కౌగిలిలో హత్తుకొని తనను వీడి వెళ్లవద్దని వేడుకొన్నాడు. అప్పుడొక కరుణాద్భుతమైన చిత్రం జరిగింది. భర్త కౌగిలి నుంచి జారిపోతున్నది కిన్నెర- కరిగి కరిగి నీరై, యేరై పారుతున్నది కిన్నెర. అణువణువూ శోకమై కిన్నెరవాగులా మారి జలజలా పారుతున్నది కిన్నెర. భర్త ఆమె కోసం దుఃఖించి దుఃఖించి స్థాణువైనాడు. భర్త- శోకం కరడు కట్టిన శిలాకృతి. భార్య- శోకం నిలువునా నీరయిన రసాకృతి. ఇది కల్పనా? ఇది కల్పన అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది. కాని- ఇది స్త్రీ పురుష సంబంధాలలోని సంఘర్షణలకు అద్దం పట్టే నిష్ఠూరమైన జీవనసత్యం!
- సి.వేదవతి