తెలుగు కవిత్వం ఫ్యూడల్ సంప్రదాయ శృంఖలాలు తెంచుకొని, వస్తువులో, వైచిత్రిలో, ఛందస్సులో, అనుభూతి వ్యక్తీకరణలో కొంగొత్త మార్పులను స్వాగతించింది. ఇరవయ్యవ శతాబ్ది ప్రథమార్థం ఇందుకు నాంది పలికింది. కవితాసరళిలో విప్లవాత్మకమైన సంస్కరణలు పెల్లుబికాయి. 1939లో పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) మీటిన ఫిడేలు రాగాల డజన్ పెనుతరంగ ధ్వనినే సృష్టించింది. ఏ రకమైన కట్టుబాట్లు, నియమాలు, నిబంధనలు ఖాతరు చేయకుండా కొత్త పంథాకు హారతి పట్టాడు పఠాభి. జన వ్యవహారానికి దూరంగా ఉన్న కృత్రిమ గ్రాంథికాన్నిS ఎగతాళి చేసేటట్టు భాషలో, భావనలో సరికొత్త ప్రయోగాలు చేశాడు. పండితులకే పరిమితమైన ఛందస్సుపై తిరుగుబాటు బావుటా ఎగరేశాడు.
‘నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రల్తో
పద్యాల నడుముల్ విరగదంతాను
చిన్నయసూరి బాల వ్యాకరణాన్ని
చాల దండిస్తాను
అనుసరిస్తాను నవీన పంథా, కాని
భావ కవిని మాత్రము కాను, నే
నహంభావ కవిని’ అంటాడు పఠాభి.
‘ప్రాచ్య దిశ సూర్య చక్రం రక్తవర్ణంలో
కన్బట్టింది, ప్రభాత రేజరు
నిసి నల్లని చీకట్ల గడ్డంబును షేవ్
జేయన్ పడిన కత్తిగాటట్టుల’ అన్న కవితలో చీకట్లను గడ్డంతో పోలుస్తాడు. దాన్ని ప్రభాత రేజరుతో గీసుకుంటుంటే పడిన కత్తిగాటులా ఉన్నాడు సూర్యుడని వర్ణించిన తీరులో అత్యంత నవ్యత కనిపిస్తుంది.
ఇలా ఈ పుస్తకంలోని ఖండికలన్నీ చమత్కారంతో నిండి ఉంటాయి. పాశ్చాత్య కవితా ధోరణులు, సర్రియిలిజం ప్రభావం పఠాభిపై విపరీతంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. పుస్తకానికి పెట్టిన పేరులో కూడా నవ్యత్వం ఉంది. ‘ఫిడేలు రాగాల డజన్’లో 12 ఖండికలున్నాయి. అంచేతనే ఈ పేరు! అభ్యుదయ కవిత్వ చైతన్యం విస్తరించిన తరువాత, ముందు యుగం దూతలైన పఠాభి తరహా కవులు భావ కవిత్వాన్ని దాదాపు పాతిపెట్టినంత పని చేశారు. పఠాభి ప్రభావంలోనే చాలామంది నవ యువ కవులు ఈ తరహా కవితా విన్యాసంలో రచనలు చేయడం కొసమెరుపు.
వాండ్రంగి కొండలరావు
Published Mon, Apr 23 2018 1:08 AM | Last Updated on Mon, Apr 23 2018 1:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment