తెలంగాణలో రాస్తున్నది శిష్ట వ్యవహారికమే...
సంభాషణ
తెలుగు సాహిత్యపు వృత్తలేఖిని డా.కడియాల రామమోహన్‌రాయ్. కవిత్వం-కథ-నవల-వ్యాసం-నాటకం... ప్రక్రియ ఏదైనా రచన కేంద్రికపై దృష్టినిలిపి వ్యాఖ్య చేయడం ఆయన విమర్శనా స్వభావం. శ్రీశ్రీ, దాశరథి, శేషేంద్ర, కాళోజీ, కొ.కు వంటివారితోనే కాదు ఆర్.కె.నారాయణన్ వంటి అన్యభాషా రచయితలతో కూడా స్నేహం కలిగి, వర్తమాన రచయితల పట్ల వాత్సల్యత ప్రదర్శించే అరుదైన సాహితీశీలి. గుంటూరు జిల్లా సిరిపురంలో 1944లో జన్మించిన డా. కడియాల ఏ.సి.కళాశాలలో ఏ.సి.కళాశాల, జేకేసి కళాశాలల్లో ఆచార్యునిగా పనిచేశారు. ‘తెలుగు సాహిత్యంలో కృషీవల జీవితం’కు అత్యుత్తమ పరిశోధకునిగా తూమాటి దోణప్ప గోల్డ్‌మెడల్ పొందారు. ఉత్తరాంధ్ర నవలా వికాసం, శేషేంద్ర కవిత్వం, సాహిత్య సంపద తదితర రచనలను విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా గౌరవించాయి. కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించిన భారతీయ సాహిత్యపు ఎన్‌సైక్లోపీడియాలోని ఐదు వాల్యూంలలో 28 వ్యాసాలు కడియాలవే. వందేళ్ల తెలుగు నవలలపై పరిశోధనను అప్పాజోశ్యుల ఫౌండేషన్ ప్రచురించింది. 50 ఏళ్లుగా ఇండియాలో గొప్పనాటకాలు ఏమి వచ్చాయి? తెలుగు నాటకరంగం ఎలా ఉంది? అనే అంశాన్ని యూజీసి ప్రాజెక్ట్ తరఫున విశ్లేషిస్తోన్న డా. కడియాలతో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ సారాంశం:
కొత్తగా ఏం చెప్పారు?
వాదాలు అనేకాలు. జాతీయవాదం, అంతర్జాతీయవాదం, స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం ఇలా... వాదం ఏదైనా ఆయా వాదాలు ప్రాంతాలవారికి తమ జీవితాల్లోని అవిస్మరణీయతను పాఠకులకు తెలిపాయి. కాని తెలుగు ప్రజల్లో కొన్నేళ్లుగా బలంగా విన్పించి విజయవంతం అయిన ప్రత్యేక తెలంగాణవాదం సాహితీపరంగా విఫలమైంది. తెలంగాణ జీవితాన్ని, సంస్కృతిని, ఆర్తిని ఇతర ప్రాంతాలవారికి తెలియజేయడంలో విఫలమైంది. తెలంగాణ నుంచి వచ్చిన భారీ పుస్తకాలు కొత్తగా వెలుగులోకి తెచ్చినదేమిటి? సాహిత్యాన్ని పరిపుష్ఠం చేసిన దాఖలా ఏది? తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన రచనలు ఇతర ప్రాంతాలవారిని తిట్టడం లేదా ద్వేషించడమే పనిగా వచ్చాయి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అభ్యుదయ సాహితీకారులు అనబడే వారు కూడా ఈ తిట్ల దండకంలో చేరడం. తెలంగాణ ముఖ్యమంత్రి యజ్ఞయాగాలు, వాస్తు శాస్త్రం గురించి అధికారికంగా మాట్లాడుతున్నారు. హరగోపాల్, ఘంటాచక్రపాణి, గద్దర్, విమల, వరవరరావు ఎవ్వరూ, ఒక్కళ్లునూ ఈ ధోరణులపై నోరెత్తి మాట్లాడ్డం లేదు. ఎవ్వరూ ప్రొటెస్ట్ చేయరే. ఇదొక చిత్రమైన మహామౌనం. ఇదంతా వారికి తృప్తిగా ఉందని భావించాలి కాబోలు!
ఏ మాండలికం రాస్తున్నాం?
తెలంగాణ మాండలీకాన్ని రచనల్లో, పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలనే ఉత్సుకత ఇటీవల బాగా వ్యక్తమవుతోంది. మంచిదే! అయితే తెలంగాణ మాండలీకాన్ని రాస్తోన్న తెలంగాణ రచయితలెందరు? తెలంగాణవాళ్లంతా రాస్తోంది కృష్ణాజిల్లా భాషే. ఎన్.వేణుగోపాల్ తదితరులందరూ శిష్టవ్యావహారీకులే. వీరెవరికీ పి.యశోదారెడ్డిగారిలా మాండలీకం రాదు. అప్పటి వరకూ రాస్తోన్న వాక్యాల్లో నాలుగు పదాలు చేర్చినంత మాత్రాన మాండలీకం అవుతుందా? ఆపాదించుకునే మాండలీకం వేరు జీవితంలోంచి వచ్చిన మాండలీకం వేరు. ఇదంతా హడావుడిగా అయ్యేది కాదు. సమిష్టి కషితోనే సాధ్యం. రాష్ట్రం వచ్చింది కాబట్టి అంతా హడావుడిగా మార్చేయాలనే వైఖరి సబబు కాదు. దాశరధి, నారాయణరెడ్డి, కాళోజీలను ఆంధ్రప్రాంతం తలదాల్చలేదా? ‘ఆంధ్ర’ అంటే బూతేనా? ఇదేం సబబు! ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ను తెలంగాణ సాంఘిక చరిత్ర అంటారా? ఉద్వేగాల స్థానంలో సంయమనం ప్రవేశించాల్సిన సమయం ఇది!
గొలుసు నవలలు ఒక ప్రత్యామ్నాయం
మాండలీకం ప్రస్తావనను కేవలం తెలంగాణ దృష్టితో చెప్పడం లేదు. అన్ని ప్రాంతాల సాహితీ వేత్తలూ ఈ క్రమంలో కృషి చేయాల్సి ఉంటుంది. తెలుగు సాహిత్యంలో సరైన ఆధునిక నవల లేదు. ఈ ఆవశ్యకతను మాండలిక కోణం నుంచి కూడా తెలుగు సాహితీవేత్తలు గుర్తించాలి. భిన్న ప్రాంతాలనుంచి ప్రముఖ రచయితలను ఎంపిక చేసి వారి వారి ప్రాంతాలలో నిర్ణీత కాలవ్యవధిలోని జీవితాన్ని ఆయా ప్రాంతాల మాండలీకంలో రాసేందుకు సంకల్పించాలి. మూడు ప్రాంతాల మాండలికాన్నీ పాఠకులు గొలుసుకట్టు ఇతివృత్తంతో అవగాహన చేసుకునేందుకు ఉపకరిస్తుంది.
చప్పగా ఉంది!
మొత్తంగా తెలుగు సాహిత్యం పలుచబడింది. బలహీనమైంది. మీ ప్రాంతం నుంచి మీరు ఇటీవల విన్న సంతృప్తికరమైన కవిత గురించి చెప్పండి అంటే సరైన సమాధానం రావడం లేదు. ఒకటి బాగా రాస్తే పది చప్పగా వస్తున్నాయి అంటున్నారు. ఆంధ్రప్రాంతానికి చెందిన శివారెడ్డి వంటి కవులు తమ రచనల ప్రతిధ్వనులనే విన్పిస్తున్నారు. మానవ సంబంధాలలో ఆర్ధ్రతనే రాస్తున్నారు. శిల్పంమీద దృష్టి పెడుతున్నారు. జీవితాన్ని పట్టుకునే శ్రమకు సాహసించడం లేదు. వేంపల్లి గంగాధర్, షరీఫ్‌లు ‘ఆమోద యోగ్యత’కోసం తపనపడుతున్నారు. గతంలో కథలు విరివిగా వైవిధ్యంతో వచ్చేవి. ఇటీవలి కాలంలో వార్షిక సంకలనానికి ఎంచుదామంటే కథలు పదీ పరకా మాత్రమే వస్తున్నాయని వింటున్నాను. ఈ వాతావరణంలో పెద్దింటి అశోక్ కుమార్ భిన్నంగా కన్పిస్తున్నారు. ఆయన రచనల్లో స్పార్క్ ఉంది. ‘మాయిముంత’ ఎంత గొప్ప కథ! జీవితంలోకి వెళ్లి వచ్చేవారే అలా రాయగలరు!
- పున్నా కృష్ణమూర్తి