పద్యానవనం: పాలకులు పలికి బొంకకూడదు...
‘‘ఒక్కొక పద్దియంబునకు నొక్కొక నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించితి, వృధాశ్రమయయ్యె గులీనుడైన రా జిక్కరణిన్ మృషల్వలుకునే? కవితా ఋణమీయకుండునే నిక్కమెరుంగనైతి గజనీ సులతాను మహమ్మదగ్రణీ!’’
సమాజాన్ని లోతుగా పరిశీలించి, స్వీయానుభవంతో..... అందులో మంచి చెడుల్నే కావ్య వస్తువుగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహనీయుడు గుర్రం జాషువా. పారశీక కవి ‘పిరదౌసి’... రాజును నమ్మి, ఎంతో శ్రమించి మోసపోయిన తీరును అత్యద్భుత కావ్యంగా మలిచారు. ప్రతి పద్యం ఆణిముత్యమే! పిరదౌసి కూడా అదే చెబుతున్నాడు. గజనీ సుల్తాను ప్రభువు, తన వంశ చరిత్రను కావ్యంగా రాయమని కోరినపుడు తనకు ఏం మాట ఇచ్చాడు? రేయింబవళ్లు తాను ఎంతో శ్రమకోర్చి కావ్యాన్ని పూర్తి చేశాక రాజు ఎలా మాట తప్పాడు? ఇదే పిరదౌసి కావ్యం. ఒక్కో పద్యానికి ఒక్కో రక్తపు బొట్టు ఖర్చయ్యేలా కష్టించి కావ్య రచన చేశానంటాడు కవి. తన శ్రమంతా వృథా అయింది. రాజు మాట తప్పాడు. ఒక్కో పద్యానికి ఒక్కో బంగారు నాణెమిస్తానని సభాముఖంగా ప్రకటించి, కావ్య రచన పూర్తయ్యాక మాట తప్పి వెండి నాణేలు పంపాడు. రాజులు, అంటే పాలకులే అలా మాట తప్పొచ్చా? పాలకులే మాట తప్పితే ఇక ప్రజల గతి ఏంటి?
జాషువా.... కాదు కాదు పిరదౌసి పేర్కొన్నట్టు ‘‘నిక్కమెరుంగనైతి....’’ అని పిదప బాధపడాల్సి వస్తుంది. నిజమే! ఇప్పుడు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల్లోనూ పాలకులు ఆడినమాట తప్పినపుడు సామాన్య ప్రజలు ఏం చేయగలుగుతున్నారు? ఎన్ని ఎన్నికల ప్రణాళికలు గాలి మాటలై, నీటి మూటలై ప్రజానీకాన్ని వెక్కిరించడం లేదు! ‘అయ్యో ఇంతటి పచ్చి అబద్ధాలకోరు అని ఊహించకపోతిమే! తెలియక ఈయన్ని ఎన్నుకుంటిమి, నిజం గ్రహించమైతిమి, ఇప్పుడేం చేయాలి?’ అని వగచడం తప్ప మళ్లీ అయిదేళ్ల దాకా సగటు పౌరులు చేయగలిగింది కూడా ఏమీ ఉండదు.
తప్పు చేసిన, మాట తప్పిన ప్రజాప్రతినిధుల్ని వెనక్కి పిలిచే వ్యవస్థా లేదిప్పుడు. ఒక్కసారి చెయిజారిన ఓటు, అయిదేళ్లదాకా వెనక్కి రాని, అంటే, తిరిగి వాడలేని అర్జున నాగాస్త్రమే! స్వల్ప కాలిక జ్ఞాపకం, మరుపు అనే మానవ లక్షణాల్నే తమకు శ్రీరామరక్షగా మలచుకొని రాజకీయ పక్షాలు రాజ్యాలేలుతాయి. అవసరానికి మాయ మాటలు చెప్పి, అటుపై నిస్సిగ్గుగా మాట తప్పి తలలెగరేసుకొని మరీ రాజకీయాలు నెరపుతున్నాయి. ఎన్నికల ముందు మానిఫెస్టోల మయసభా మేడలు కట్టి, జనాల్ని ఆశల పల్లకీలెక్కించి, ఆనక అన్నీ మరచి వంచించడం మామూలయిపోయింది. అయిదేళ్లకు తిరిగి ఎన్నికలు రాగానే, పద పదం, వాక్యాలకు వాక్యాలు, పేరాలకు పేరాలు, పేజీలకు పేజీలు.... యధాతథంగానో, కాస్త అటుఇటుగా మార్పులు చేసో మళ్లీ కొత్త మానిఫెస్టోలు జారీచేయడం రివాజయింది.
ఇదంతా మాట తప్పడం కాదా? ఆత్మ వంచన-పర వంచన కాదా? ఆయా నేతలు, రాజకీయ పక్షాల చరిత్రను సరిగా పరిశీలించి, జనం జాగ్రత్తగా కీలెరిగి వాత పెడితే గాని, ఈ మాయా రోగం కుదురుకోదు. సగటు జీవి జీవితం కుదుటపడదు. మాటమీద నిలబడే వారి విశ్వసనీయతే ప్రామాణికంగా ప్రజలు తీర్పిచ్చినపుడే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం. అసలు విలువ తెలిసి ఓటును ఒక అస్త్రంగా వాడితే తప్ప, మనుషుల్ని మనుషులుగా కాకుండా, ఓటర్లుగా మాత్రమే చూసే ఆధునిక అరాచకీయాలకు అంతముండదు. కావ్యం రాయమని ఆనతిచ్చిన రాజు తన కవితా ఋణమీయకుండునే? అని కవి వగచాడు. ‘వచ్చే అయిదేళ్లు నీవు మా పాలకుడివిగా ఉండు’ అని, మహత్తరమైన ‘ఓటు’తో ప్రజాకోర్టులో తీర్పిచ్చిన ఓటరు రుణమీయకుండా ఉండే ఆ రాజు/పాలకుడు ఏమవుతాడు? నామ రూపాల్లేకుండా నాశనమవుతాడు కవి చెప్పినట్టుగా! అప్పటిదాకా ఒక గొప్ప తారగా వెలిగిన రాజు కూడా, మాటపై నిలబడకుండా ప్రజాకంటకుడైతే ఏమవుతాడో కవి చక్కగా చెప్పాడు. ‘.....కవియు చనిపోయె యొక చుక్క గగనమెక్కె, రాజు మరణించె నొక తార రాలిపోయె!’
అదీ తేడా!
- దిలీప్‌రెడ్డి