నీలవేణి
- పుస్తక సమీక్ష
స్త్రీల సాహిత్యం, దళిత సాహిత్యం ఆధిపత్యపు సార్వత్రిక జ్ఞానాన్ని చెదరగొడతాయి. కొత్త సార్వత్రిక జ్ఞానాన్ని యిస్తాయి. అటువంటి జ్ఞానాన్ని సునీల్‌కుమార్ 15 కథల సంపుటి ‘నీలవేణి’ అందిస్తోంది. ఇందులో ఎక్కువ కథలు దళిత జీవిత నేపథ్యంలో రాసినవి. వ్యంగ్యం, హాస్యం, ఆగ్రహం, ఆర్తి యీ కథలని నెలబెడతాయి.
‘దభేల్ మని యెగిరిపడ్డాడు రంగ’ అని మొదలయ్యే ‘దెయ్యం’ కథ, దేవుళ్లూ దెయ్యాలూ యెవరి ప్రయోజనం కోసం ముందుకు వస్తాయో నెత్తిమీద దభేల్‌మని మొట్టి మరీ చెపుతుంది. నవ్వుతూ వుండగానే, యెప్పుడో యెక్కడో జరిగిపోయిన, అందరూ మర్చిపోయిన విషయం తెరమీదకు వస్తుంది. అధర్మం పట్ల అదుపులో పెట్టుకున్న రచయిత ఆగ్రహం కళ్లెం బిగించిన గుర్రాల్లాగా మాటల్ని కవాతు చేయిస్తుంది. ‘థూ’ అనిపిస్తుంది. చుండూరు దళితుల మారణకాండ దుఃఖాన్ని కలిగించిన సంఘటన. అన్యాయం జరిగినప్పుడు న్యాయమనేది వొకటుందని మనసును వోదార్చుకోవటానికి ప్రయత్నిస్తాం. న్యాయం అన్యాయంగా సాక్షాత్కరించినప్పుడు జోసెప్ప ధిక్కారం, క్రోధం మనలోపలివే అనిపించి నిరసనాగ్రహంతో గొంతు కలుపుతాం. చీకటి అని దిగులు పడుతుంటే ‘సముద్రం మీద నక్కిన చీకటి నది మీదగా, కాలవ మీదగా దారి చేసుకుని ఆమెని కమ్మేసింది’ అని ‘చీకటి’ని జీవితానికే ప్రతీకగా చూపిస్తుంది. ‘ఆర్థిక తెలివి వాకిట్లోకి రాగానే ప్రేమ కిటికీలోంచి దూకేస్తుంది’ అంటూ చంటి మన మందుకి వస్తాడు. చంటిలాంటి వ్యక్తులు యీ సమాజంలో ఎందరున్నారో అనిపిస్తుంది.
దళిత జీవితపు పార్శ్వాలలో జరుగుతున్న కల్లోల పరిణామాల్నీ, అగ్రవర్ణ ఆధిపత్యం వివిధ రూపాల్లో యెలా కొనసాగుతుందో ఆయా మార్పులనీ ‘దేవదాసు 2015’, ‘పరిశుద్ధ వివాహము- మూడవ ప్రకటన’ కథల్లో రచయిత వొడిసి పట్టుకున్నారు. దేవదాసు, జరుగుతున్న విషయాలని తాగుడు యిచ్చే అప్పటిశక్తితో ‘మతంలోకి వచ్చినా మా పేర్లల్లో హిందూ వాసన పోదు. మీ పేరు చివర కులం పోదు. మా జనం పరిస్థితి ఏటల్లకాలం మీ ఎనకమాల తిరగటమేనా?’ అని దులపరిస్తాడు.
‘తండ్రి అనేవాడు పూర్తిగా ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం... ఉండి లేకపోతే నరకం’ అని ‘నీలవేణి’ సూక్ష్మమైన శరీర రాజకీయాలని చక్కగా చూపిస్తుంది. ‘నా జీవితం ఓ పరీక్షా నాళిక అయిపోయింది’ అని చెప్పిన నీలవేణి ‘మన జీవితం మీద మనకి కంట్రోల్ లేకపోతే ఇలా ప్రతి కుక్కా మన జీవితంతో ప్రయోగం చేస్తుంది’ అని అంటూ వుంటే కథా వస్తువుకీ, కథా సమయానికీ జీవం పోయటానికి కావలసిన సామగ్రిని వోపికగా అమర్చుకోవటం యీ కథకునికే చెల్లింది అనిపిస్తుంది. ఇటువంటి అనుభవాలను వెలుగులోకి తీసుకురావటం వలన యీరోజు సార్వత్రిక జ్ఞానం అనుకుంటున్న ఆధిపత్య జ్ఞానం చెదిరిపోతుంది. అలా చెదరగొట్టటం సమాజానికి చాలా అవసరం.
- కుప్పిలి పద్మ
నీలవేణి (కథల సంపుటి); కథకుడు: పి.వి.సునీల్ కుమార్; పేజీలు: 188; వెల: 125; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్-68;
ఫోన్: 040-24224453