neelaveni
-
నిజంగా ఈ నీలవేణిది చాలా పెద్ద మనసే
ఆమె ఒక నిరుపేద పారుశుధ్య కార్మికురాలు.. భర్త, కుమారుడు మృతిచెందారు.. జీతం, భర్త పింఛనే బతుకుదెరువు.. అందులోనే కొంత నిరుపేదలకు పంచుతోంది.. అదీ సరిపోక చెత్తలో ఉండే సామగ్రిని అమ్మి సాయం చేస్తోంది... అనాథలను, నిరుపేదలను చదివించడమే తన లక్ష్యం అంటోంది.. నిజంగా ఈ తలపూరి నీలవేణిది పెద్ద మనసే.. సమస్యలు చుట్టుముట్టినా... విజయవాడ 57వ డివిజన్ సుబ్బరాజునగర్కి చెందిన నీలవేణి (44) కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్య విభాగంలో కార్మికురాలిగా విధులు నిర్వహిస్తోంది. ఆమె భర్త సాయిబాబు 2008లో గుండెపొటుతో మృతిచెందాడు. 2014లో కుమారుడు అనిల్‌కుమార్ ఫెర్రిలో స్నానం కోసమని కృష్ణా నదిలో దిగి మరణించాడు. అయినా ఆమె కృంగిపోలేదు. తనకు వచ్చే తక్కువ జీతంలోనే పేదలకు సాయం చేస్తూనే కుమార్తె నాగలక్ష్మీదుర్గకు పెళ్లి చేసింది. అనాథలకు, నిరుపేదలకు సాయం చేయడానికి తన జీతం డబ్బులతో పాటు భర్త మరణానంతరం వస్తోన్న పింఛన్ డబ్బులనూ ఉపయోగించేది. ఆ డబ్బులు సరిపోవడం లేదని భావించి తాను సేకరించిన చెత్తలో ప్లాస్టిక్, గాజు సీసాలు, పుస్తకాలు, ఇనుము వంటి సామాన్లు వేరుగా విక్రయించి ఆ డబ్బులు కూడా పేదలకు ఉపయోగించేది. ట్రస్ట్ ఏర్పాటు... నీలవేణి చేస్తోన్న సాయాన్ని చూసిన కొందరు ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. తామూ సాయం చేస్తామని మరికొందరు ముందుకు వస్తున్నారు. వీరందరితో కలిసి నీలవేణి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్థానికంగా ఉంటున్న 8 మంది యువకులతో కలిసి 2020 జూలైలో ‘దివానపు తిరుపతి చారిటబుల్ ట్రస్ట్’ను ఏర్పాటు చేసి దానిద్వారా నిరుపేద విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, స్టేషనరీ సామాన్లు అందించడం, అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉన్నవారికి, రోడ్లపైన అనాథలకు భోజనాలు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో నిరుపేద కార్మిక కుటుంబాలను గుర్తించి వారికి బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్క్‌లు, మెడికల్ కిట్లు పంచిపెట్టింది. సమాజంలో ఒక మనిషి ఉన్నత స్థితికి చేరుకోవాలంటే దానికి చదువు ఒక్కటే మార్గమని.. అనాథ పిల్లలు, నిరుపేద చిన్నారులను చదివించాలన్నదే తన లక్ష్యమని నీలవేణి వెల్లడించారు. – అజిత్‌సింగ్ నగర్ (విజయవాడ సెంట్రల్) -
పెళ్లి చేసుకోమని అడిగితే రైలు కిందకి తోసేశాడు
-
ప్రేమించాడు..పెళ్లి చేసుకోమని అడిగితే..
-
పెళ్లి చేసుకోమని అడిగితే..
రైలు కిందకి తోసేసిన ప్రియుడు.. కాళ్లు పొగొట్టుకున్న బాధితురాలు విజయనగరం ఫోర్ట్: పెళ్లి చేసుకోమని అడిగిన ప్రియురాలిని రైలు కిందకి తోసేశాడో ప్రేమికుడు. ఫలితంగా ఆమె రెండు కాళ్లను పోగొట్టుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి రైల్వేస్టేషన్లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకోగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. తెర్లాం మండలం వెలగవలస గ్రామానికి చెందిన రాగోలు నీలవేణి(23) రంగపువలస గ్రామానికి చెందిన ధమరసింగి రామకృష్ణ(30) ఓ మ్యూజికల్ బ్యాండ్ పార్టీలో గాయకులుగా చేరారు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆరేళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుంది. తనని పెళ్లి చేసుకోమని నీలవేణి ఇటీవల రామకృష్ణను కోరగా, అతడు రూ.10 లక్షలు కట్నం కావాలని డిమాండ్ చేశాడు. దీనిపై కొంతకాలంగా వీరి మధ్య వివాదం నడుస్తోంది. సోమవారం ఉదయం రామకృష్ణ చీపురుపల్లి రైల్వేస్టేషన్లో ఉన్నాడని తెలుసుకున్న ఆమె అక్కడకు చేరుకుని పెళ్లి చేసుకోమని పట్టుబట్టింది. ఇందుకు అతడు తిరస్కరించడంతో చచ్చిపోతానని బెదిరించింది. వీరిరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో రామకృష్ణ ఆమెను రైలు వస్తున్న తరుణంలో పట్టాలపైకి తోసేశాడు. ఆమెకు తీవ్ర గాయాలవడంతో రైల్వే పోలీసులు ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె రెండు కాళ్లను తొలగించారు. నిందితుడు రామకృష్ణ పరారీలో ఉన్నాడు. -
నీలవేణి
- పుస్తక సమీక్ష స్త్రీల సాహిత్యం, దళిత సాహిత్యం ఆధిపత్యపు సార్వత్రిక జ్ఞానాన్ని చెదరగొడతాయి. కొత్త సార్వత్రిక జ్ఞానాన్ని యిస్తాయి. అటువంటి జ్ఞానాన్ని సునీల్‌కుమార్ 15 కథల సంపుటి ‘నీలవేణి’ అందిస్తోంది. ఇందులో ఎక్కువ కథలు దళిత జీవిత నేపథ్యంలో రాసినవి. వ్యంగ్యం, హాస్యం, ఆగ్రహం, ఆర్తి యీ కథలని నెలబెడతాయి. ‘దభేల్ మని యెగిరిపడ్డాడు రంగ’ అని మొదలయ్యే ‘దెయ్యం’ కథ, దేవుళ్లూ దెయ్యాలూ యెవరి ప్రయోజనం కోసం ముందుకు వస్తాయో నెత్తిమీద దభేల్మని మొట్టి మరీ చెపుతుంది. నవ్వుతూ వుండగానే, యెప్పుడో యెక్కడో జరిగిపోయిన, అందరూ మర్చిపోయిన విషయం తెరమీదకు వస్తుంది. అధర్మం పట్ల అదుపులో పెట్టుకున్న రచయిత ఆగ్రహం కళ్లెం బిగించిన గుర్రాల్లాగా మాటల్ని కవాతు చేయిస్తుంది. ‘థూ’ అనిపిస్తుంది. చుండూరు దళితుల మారణకాండ దుఃఖాన్ని కలిగించిన సంఘటన. అన్యాయం జరిగినప్పుడు న్యాయమనేది వొకటుందని మనసును వోదార్చుకోవటానికి ప్రయత్నిస్తాం. న్యాయం అన్యాయంగా సాక్షాత్కరించినప్పుడు జోసెప్ప ధిక్కారం, క్రోధం మనలోపలివే అనిపించి నిరసనాగ్రహంతో గొంతు కలుపుతాం. చీకటి అని దిగులు పడుతుంటే ‘సముద్రం మీద నక్కిన చీకటి నది మీదగా, కాలవ మీదగా దారి చేసుకుని ఆమెని కమ్మేసింది’ అని ‘చీకటి’ని జీవితానికే ప్రతీకగా చూపిస్తుంది. ‘ఆర్థిక తెలివి వాకిట్లోకి రాగానే ప్రేమ కిటికీలోంచి దూకేస్తుంది’ అంటూ చంటి మన మందుకి వస్తాడు. చంటిలాంటి వ్యక్తులు యీ సమాజంలో ఎందరున్నారో అనిపిస్తుంది. దళిత జీవితపు పార్శ్వాలలో జరుగుతున్న కల్లోల పరిణామాల్నీ, అగ్రవర్ణ ఆధిపత్యం వివిధ రూపాల్లో యెలా కొనసాగుతుందో ఆయా మార్పులనీ ‘దేవదాసు 2015’, ‘పరిశుద్ధ వివాహము- మూడవ ప్రకటన’ కథల్లో రచయిత వొడిసి పట్టుకున్నారు. దేవదాసు, జరుగుతున్న విషయాలని తాగుడు యిచ్చే అప్పటిశక్తితో ‘మతంలోకి వచ్చినా మా పేర్లల్లో హిందూ వాసన పోదు. మీ పేరు చివర కులం పోదు. మా జనం పరిస్థితి ఏటల్లకాలం మీ ఎనకమాల తిరగటమేనా?’ అని దులపరిస్తాడు. ‘తండ్రి అనేవాడు పూర్తిగా ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం... ఉండి లేకపోతే నరకం’ అని ‘నీలవేణి’ సూక్ష్మమైన శరీర రాజకీయాలని చక్కగా చూపిస్తుంది. ‘నా జీవితం ఓ పరీక్షా నాళిక అయిపోయింది’ అని చెప్పిన నీలవేణి ‘మన జీవితం మీద మనకి కంట్రోల్ లేకపోతే ఇలా ప్రతి కుక్కా మన జీవితంతో ప్రయోగం చేస్తుంది’ అని అంటూ వుంటే కథా వస్తువుకీ, కథా సమయానికీ జీవం పోయటానికి కావలసిన సామగ్రిని వోపికగా అమర్చుకోవటం యీ కథకునికే చెల్లింది అనిపిస్తుంది. ఇటువంటి అనుభవాలను వెలుగులోకి తీసుకురావటం వలన యీరోజు సార్వత్రిక జ్ఞానం అనుకుంటున్న ఆధిపత్య జ్ఞానం చెదిరిపోతుంది. అలా చెదరగొట్టటం సమాజానికి చాలా అవసరం. - కుప్పిలి పద్మ నీలవేణి (కథల సంపుటి); కథకుడు: పి.వి.సునీల్ కుమార్; పేజీలు: 188; వెల: 125; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్-68; ఫోన్: 040-24224453 -
తల్లి చెంతకు వివాహిత
శ్రీకాకుళం: సారవకోట మండలంలోని అలుదు గ్రామానికి చెందిన వివాహిత తోటాడ నీలవేణి (21)ని సోమవారం పాతపట్నం సీఐ శ్రీనివాసరావు ఆమె తల్లి తవిటమ్మకు అప్పగించారు. ఏడాది క్రితం తన కుమార్తె కనిపించడం లేదని తవిటమ్మ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించగా సోమవారం నీలవేణి గుర్తించి ఆమె తల్లికి అప్పగించినట్టు సీఐ తెలిపారు. అయితే కేసు నమోదు చేసినప్పటికి ఆమె అవివాహితని, ప్రస్తుతం వివాహం అయి, ఒక బిడ్డకు తల్లికూడానని ఆయన తెలిపారు. సీఐతో పాటు ట్రైనీ ఎస్ఐ మధుసూదనరావు, ఏఎస్ఐ ఎంఆర్కే రెడ్డి, హెచ్‌సీ శ్రీనివాసరావు ఉన్నారు.