kuppili padma
-
కవిత్వంలా తరలిపోయిన ఆఫీసర్
అనేక అక్షరాలని, రంగులని, రాగాల మధ్య నుంచి నడిచే దారిని జాగ్రత్తగా వెతుక్కుంటూ ఆ యింటి గదుల్లోంచి ఆ టెర్రస్ వెన్నెల మీదకి వస్తే అక్కడ రజనీ పాటలో... చలం గారి సుధో... హిందుస్తానీ సంగీతమో మనల్ని చుట్టుకుంటుంది. వెన్నెలంత నిశ్శ బ్దంగా ఆ రాగాలని నింపుకొంటూ సదాశివరావుగారు. ఆ రోజు ఆ గెట్ టుగెదర్కి వారు ఆహ్వా నించిన కళారంగానికి సంబంధించిన వారెందరో ఆ గానాన్ని శ్వాసిస్తూ... ··· చాలా యేళ్ళ క్రిందట వారు ఫోన్ చేసి ‘నువ్వు వచ్చేయ్, ఫొటోలు తియ్యాలి’ అన్నారు. నా కథాసంపుటి ‘ద లాస్ ఆఫ్ యిన్నొసెన్స్’ ఆవిష్కరణకి వచ్చి నా చేతిలో వో వెడల్పాటి కవర్ పెట్టారు. విప్పి చూస్తే... Pleasant Surprise. దాదాపు 15 యేళ్ళ క్రితం తీస్తానని తీసిన నా ఫొటోలు. భలే దాచారే అనుకున్నా. యెప్పుడు యెక్కడ యెవరికి యే కానుకని యివ్వాలో తెలిసినవారు. ··· యీ విశిష్టమైన చదువరి ‘ఆత్మా ఫేక్టర్’ కథతో తెలుగు సాహిత్య రంగంలోకి రచయితగా అడుగిడి ప్రపంచ కవిత్వం నుండి తాను చేసిన అనువాదాలని యిటీవలే ‘కావ్యకళ’ పేరుతో పుస్తకంగా వెలువరించారు. ‘క్రాస్ రోడ్స్’ కథాసంపుటి, పాలపుంత, ఆత్మా ఫేక్టర్, కావ్యకళ, సైన్స్ ఫిక్షన్ రచయితల పరిచయాలు పుస్తకాలుగా వెలుపడ్డాయి. బ్రిటిష్ కాలానికి సంబంధించిన కొన్ని కథలని వారు యెంతో మమేకతతో రాశారు. యిటీవల నాలుగైదేళ్ళుగా సైన్స్ ఫిక్షన్ మీద ‘పాలపిట్ట’ పత్రికలో రాస్తూ వచ్చిన వ్యాసాలు తెలుగు సాహిత్యంలో అపు రూపమైనవి. ‘సైన్స్ ఫిక్షన్ రచయితలు’ పేరిట నాలుగు సంపుటాలుగా వెలువడ్డ ఆ వ్యాసాల్లో ఆయన చేసిన కృషి అద్భుతం. తెలుగులో మరెవ్వరూ వారి దరిదాపుల్లోకి రాలేరనిపించేట్టు వుండే ఆ వ్యాసాలు తెలుగులో చిర స్థాయిగా నిలిచిపోయే రచన. యెంతో చదువుకొన్నందుకు తెలుగువారికి వారు అందించిన మేలిమి కానుక ఆ వ్యాసాలు. ··· స్నేహశీలి సదాశివరావు గారికి స్నేహితులని కలవ లేదని బెంగ పడటం కంటే, యెలాగైనా వారిని కలవాలి అంతే కానీ టైమ్ లేదనుకో కూడదనుకొంటానని చెప్పారో సందర్భంలో. స్నేహితులని కలుసుకోవటం, సమయాలని రంగులమయం చేసుకోవటాన్ని వారు ప్రేమిస్తారు. వారికి బాపు అంటే బోలెడంత యిష్టం. చిత్రకారులు గోపి గారికి బాపు అవార్డ్ వచ్చిందని సంతోషపడుతూ, యేడవ తేదీ సాయంత్రం తమ యింటికి రమ్మని ఆహ్వానించారు. గోపీ గారు యిల్లు వెతుకుతూ ‘నాలుగేళ్ళ క్రితం వచ్చాను. యిల్లు తెలియటం లేదు’ అని కాల్ చేస్తే, ‘నే వస్తున్నా’ అని గోపిగారిని కలిసి మాట్లాడుతూ వారి యింటి వైపు నడుస్తున్నారు. సడన్‌గా సదాశివరావు గారు ‘‘యేమిటోలా వుంది’’ అని రోడ్డు పక్కనే ఆగి నిలబడలేక అలా పేవ్మెంట్ మీద కూర్చున్నారు. గోపిగారు వారి పక్కనే కూర్చుని సదాశివరావు గారి తలని వొడిలో పెట్టుకున్నారు. రోడ్డు మీద అటూయిటూ వెళ్తున్న వాహనాలు... మను షులు... కొద్ది దూరాన వున్న క్రాస్రోడ్స్కి చేరువగా... సైన్స్ ఫిక్షన్ రాగాల లోకాలకి... తనెంతో ప్రేమించే రంగులు విర జిమ్మే చిత్రకారుని చేతుల్లోనే ఆయన యీ లోకాన్ని విడిచి తరలిపోయారు. ··· ఆ మర్నాడు ధరమ్ కరమ్ రోడ్డులో వారి యింటి ప్రాంగణంలో కుటుంబసభ్యులు, కళాకారులు... వారు పని చేసిన డిపార్ట్మెంట్కి సంబంధించినవారు... యెందరో చెమ్మగిల్లిన మనసులతో. IPS 1967 Batchకి చెందిన సదాశివరావు... కె.వెంకటసుబ్బారావు, చంద్రకాంత పుష్పవేణమ్మ గార్లకు కృష్ణా జిల్లా అత్కురులో 15–7–1943న జన్మించారు. ఎమ్మెస్సీ జియాలజీని వెంకటేశ్వర యూనివర్సిటీలో చదు వుకొన్నారు. 1966లో ప్రమీల గారితో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు... యామిని, హరిత, రంజిత్, వినయ. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి. కె. సదాశివరావు గారికి వినమ్ర నమస్సులు. వ్యాసకర్త కుప్పిలి పద్మ, కవయిత్రి, రచయిత్రి. మొబైల్ : 98663 16174 kuppilipadma@gmail.com -
నీలవేణి
- పుస్తక సమీక్ష స్త్రీల సాహిత్యం, దళిత సాహిత్యం ఆధిపత్యపు సార్వత్రిక జ్ఞానాన్ని చెదరగొడతాయి. కొత్త సార్వత్రిక జ్ఞానాన్ని యిస్తాయి. అటువంటి జ్ఞానాన్ని సునీల్‌కుమార్ 15 కథల సంపుటి ‘నీలవేణి’ అందిస్తోంది. ఇందులో ఎక్కువ కథలు దళిత జీవిత నేపథ్యంలో రాసినవి. వ్యంగ్యం, హాస్యం, ఆగ్రహం, ఆర్తి యీ కథలని నెలబెడతాయి. ‘దభేల్ మని యెగిరిపడ్డాడు రంగ’ అని మొదలయ్యే ‘దెయ్యం’ కథ, దేవుళ్లూ దెయ్యాలూ యెవరి ప్రయోజనం కోసం ముందుకు వస్తాయో నెత్తిమీద దభేల్మని మొట్టి మరీ చెపుతుంది. నవ్వుతూ వుండగానే, యెప్పుడో యెక్కడో జరిగిపోయిన, అందరూ మర్చిపోయిన విషయం తెరమీదకు వస్తుంది. అధర్మం పట్ల అదుపులో పెట్టుకున్న రచయిత ఆగ్రహం కళ్లెం బిగించిన గుర్రాల్లాగా మాటల్ని కవాతు చేయిస్తుంది. ‘థూ’ అనిపిస్తుంది. చుండూరు దళితుల మారణకాండ దుఃఖాన్ని కలిగించిన సంఘటన. అన్యాయం జరిగినప్పుడు న్యాయమనేది వొకటుందని మనసును వోదార్చుకోవటానికి ప్రయత్నిస్తాం. న్యాయం అన్యాయంగా సాక్షాత్కరించినప్పుడు జోసెప్ప ధిక్కారం, క్రోధం మనలోపలివే అనిపించి నిరసనాగ్రహంతో గొంతు కలుపుతాం. చీకటి అని దిగులు పడుతుంటే ‘సముద్రం మీద నక్కిన చీకటి నది మీదగా, కాలవ మీదగా దారి చేసుకుని ఆమెని కమ్మేసింది’ అని ‘చీకటి’ని జీవితానికే ప్రతీకగా చూపిస్తుంది. ‘ఆర్థిక తెలివి వాకిట్లోకి రాగానే ప్రేమ కిటికీలోంచి దూకేస్తుంది’ అంటూ చంటి మన మందుకి వస్తాడు. చంటిలాంటి వ్యక్తులు యీ సమాజంలో ఎందరున్నారో అనిపిస్తుంది. దళిత జీవితపు పార్శ్వాలలో జరుగుతున్న కల్లోల పరిణామాల్నీ, అగ్రవర్ణ ఆధిపత్యం వివిధ రూపాల్లో యెలా కొనసాగుతుందో ఆయా మార్పులనీ ‘దేవదాసు 2015’, ‘పరిశుద్ధ వివాహము- మూడవ ప్రకటన’ కథల్లో రచయిత వొడిసి పట్టుకున్నారు. దేవదాసు, జరుగుతున్న విషయాలని తాగుడు యిచ్చే అప్పటిశక్తితో ‘మతంలోకి వచ్చినా మా పేర్లల్లో హిందూ వాసన పోదు. మీ పేరు చివర కులం పోదు. మా జనం పరిస్థితి ఏటల్లకాలం మీ ఎనకమాల తిరగటమేనా?’ అని దులపరిస్తాడు. ‘తండ్రి అనేవాడు పూర్తిగా ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం... ఉండి లేకపోతే నరకం’ అని ‘నీలవేణి’ సూక్ష్మమైన శరీర రాజకీయాలని చక్కగా చూపిస్తుంది. ‘నా జీవితం ఓ పరీక్షా నాళిక అయిపోయింది’ అని చెప్పిన నీలవేణి ‘మన జీవితం మీద మనకి కంట్రోల్ లేకపోతే ఇలా ప్రతి కుక్కా మన జీవితంతో ప్రయోగం చేస్తుంది’ అని అంటూ వుంటే కథా వస్తువుకీ, కథా సమయానికీ జీవం పోయటానికి కావలసిన సామగ్రిని వోపికగా అమర్చుకోవటం యీ కథకునికే చెల్లింది అనిపిస్తుంది. ఇటువంటి అనుభవాలను వెలుగులోకి తీసుకురావటం వలన యీరోజు సార్వత్రిక జ్ఞానం అనుకుంటున్న ఆధిపత్య జ్ఞానం చెదిరిపోతుంది. అలా చెదరగొట్టటం సమాజానికి చాలా అవసరం. - కుప్పిలి పద్మ నీలవేణి (కథల సంపుటి); కథకుడు: పి.వి.సునీల్ కుమార్; పేజీలు: 188; వెల: 125; ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్-68; ఫోన్: 040-24224453 -
ఎగువ మధ్యతరగతి రియాల్టీ
పుస్తక సమీక్ష ముఖపత్రాన్ని తాకి చూడగానే కొనాలనిపించిన పుస్తకం, కుప్పిలి పద్మ ‘ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్’! నునుపైన భాగం యిన్నోసెన్స్ దశకూ, ఇసుక రజను కలిసిన రంగులద్దినట్టున్న భాగం యిన్నోసెన్స్ కోల్పోయిన దశకూ సూచికగా అనిపించింది. జనవరి 2011 నించి జూలై 2015 వరకూ వివిధ పత్రికలలో అచ్చయిన 11 కథల సంపుటి ఇది. గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఎగువ మధ్యతరగతి జీవితాలలో చోటుచేసుకుంటోన్న మార్పులకు సంబంధించిన కథలివి. ఈ మార్పులు కింది, మధ్యతరగతి జీవితాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత ప్రభావాన్ని వేస్తుండటంలో ఆయా జీవితాల్లోకి అమిత వేగంగా చొచ్చుకువచ్చిన ప్రసార మాధ్యమాల పాత్ర కూడా తక్కువేమీ కాదు. మొత్తంగా సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులపై నిశితమైన గమనింపు ఉన్నపుడే ఒకదానికొకటి భిన్నమైన ఇన్నిరకాల ఇతివృత్తాలను తీసుకుని కథలుగా మలచటం సాధ్యమవుతుంది. అందుకు పద్మ అభినందనీయులు. స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు పునాది పరస్పర నమ్మకం అనే భావనకు బదులుగా తమ తమ కెరియర్ను సౌకర్యవంతంగా మలచుకోడానికి ఏమైనా వదులుకోగలగడం, ఎన్ని సర్దుబాట్లనైనా చేసుకోగలగటాన్ని చిత్రిస్తోంది ఈ పుస్తకానికి శీర్షికగా వున్న మొదటి కథ, ‘ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్’! జరుగుబాటు బాగావుండే కుటుంబాలలో కూతురికి వుండే స్థానం, అదే పరిస్థితుల్లో పెరిగి దాదాపు అదే వయసులో వుండి, ఆ కుటుంబంలోనికి కోడలిగా అడుగుపెట్టిన అమ్మాయికి లేకపోవడాన్ని ప్రశ్నించే కథ, ‘ఫ్రంట్ సీట్’. అద్దె గర్భాలు (సరోగసీ) ఒక వ్యాపారంగా మారిపోయిన పరిస్థితుల్ని చూపించిన కథ, ‘మదర్‌హుడ్ రియాల్టీ చెక్!’ సమానత్వ విలువలూ, సామాజిక ఆందోళనలూ కూడా యువతరం ఎగతాళికి, చిన్నచూపుకూ గురవుతున్న పరిస్థితులను చూపించిన కథ ‘సహస్ర’! పెళ్ళి గురించి ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న అమ్మాయి తన కింది వర్గాలకు చెందిన స్త్రీల (జిమ్ ట్రెయినర్, వంటావిడ) అనుభవాలనూ ఆలోచనలనూ తన ఆలోచనలతో పోల్చుకుని చూసుకునే కథ, ‘మాన్వి’! ఎదుటివారి ప్రేమని సాధించడానికి తన భావాలని ఎంతో సున్నితంగా, ఆర్ద్రంగా పూల బొకేల భాషలో వ్యక్తీకరించినా, అవసరం తీరాక ఎంతో బండగా అదే భాషలో తన తిరస్కారాన్నీ ప్రకటించాలనే ప్రయత్నం చేసిన ఒక కస్టమర్కీ; మనసులో మిగుల్చుకున్న కాస్త చెమ్మనూ ఆ బొకేలతోపాటు అందించే సందేశం రూపంలో వ్యక్తం చేసే ఒక బొకేల దుకాణం యజమానురాలికీ మధ్య జరిగిన సంఘటనల సమాహారమే పూల ముఖంగా అందించిన కథ, ‘బ్రేకప్ బొకే’! చిక్కని ఆత్మీయతానుబంధాల మధ్య అల్లుకున్న జీవితాన్ని వదలలేక వదిలి, ఎప్పటికైనా తిరిగిరావాలనే ఆశను మూటగట్టుకుని అమెరికా వెళ్ళి, అక్కడ అలవాటుపడలేక చివరకు భర్త ఆలోచనల మేరకే ఇంటికి తిరిగివచ్చిన ఒక స్త్రీ సున్నితమైన మానసిక సంఘర్షణాచిత్రమే ‘పున్నమిలా వచ్చిపొమ్మని..!’. సమాజపు ఆమోదాన్ని పొందలేని అనుబంధాల పట్ల సమాజం ఎంత క్రూరంగా హింసాత్మకంగా ఉండగలదో చెప్పిన కథ, ‘మౌన’! ఈ కథలన్నీ సమాజంలోని అత్యల్ప వర్గాల జీవితాల గురించే చెప్పినవైనా తప్పనిసరిగా ఈ మార్పులని గుర్తించవలసిన అవసరాన్ని వివరించేవే. అయితే, కథల్లోని పరిసరాల్ని, వాతావరణాన్ని పరిచయం చేయడానికి పద్మ వాడే భాష చాలాచోట్ల కృతకంగా అనిపిస్తోంది. పాత్రలకు ఇచ్చిన పేర్లు కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి. పుస్తకం అందంగా కనిపించటానికి తీసుకున్న శ్రద్ధలో, కొంచమైనా ప్రూఫ్ రీడింగ్‌పై పెట్టినట్లైతే బాగుండేది. కొన్నిచోట్ల వాక్యాలు మిస్సయ్యాయి. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియలేదు రెండుమూడుచోట్ల. - అమృత