ఎగువ మధ్యతరగతి రియాల్టీ
పుస్తక సమీక్ష
ముఖపత్రాన్ని తాకి చూడగానే కొనాలనిపించిన పుస్తకం, కుప్పిలి పద్మ ‘ద లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్’! నునుపైన భాగం యిన్నోసెన్స్ దశకూ, ఇసుక రజను కలిసిన రంగులద్దినట్టున్న భాగం యిన్నోసెన్స్ కోల్పోయిన దశకూ సూచికగా అనిపించింది. జనవరి 2011 నించి జూలై 2015 వరకూ వివిధ పత్రికలలో అచ్చయిన 11 కథల సంపుటి ఇది.
గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రత్యేకించి ఎగువ మధ్యతరగతి జీవితాలలో చోటుచేసుకుంటోన్న మార్పులకు సంబంధించిన కథలివి. ఈ మార్పులు కింది, మధ్యతరగతి జీవితాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎంతో కొంత ప్రభావాన్ని వేస్తుండటంలో ఆయా జీవితాల్లోకి అమిత వేగంగా చొచ్చుకువచ్చిన ప్రసార మాధ్యమాల పాత్ర కూడా తక్కువేమీ కాదు. మొత్తంగా సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులపై నిశితమైన గమనింపు ఉన్నపుడే ఒకదానికొకటి భిన్నమైన ఇన్నిరకాల ఇతివృత్తాలను తీసుకుని కథలుగా మలచటం సాధ్యమవుతుంది. అందుకు పద్మ అభినందనీయులు.
స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు పునాది పరస్పర నమ్మకం అనే భావనకు బదులుగా తమ తమ కెరియర్‌ను సౌకర్యవంతంగా మలచుకోడానికి ఏమైనా వదులుకోగలగడం, ఎన్ని సర్దుబాట్లనైనా చేసుకోగలగటాన్ని చిత్రిస్తోంది ఈ పుస్తకానికి శీర్షికగా వున్న మొదటి కథ, ‘ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్’!
జరుగుబాటు బాగావుండే కుటుంబాలలో కూతురికి వుండే స్థానం, అదే పరిస్థితుల్లో పెరిగి దాదాపు అదే వయసులో వుండి, ఆ కుటుంబంలోనికి కోడలిగా అడుగుపెట్టిన అమ్మాయికి లేకపోవడాన్ని ప్రశ్నించే కథ, ‘ఫ్రంట్ సీట్’. అద్దె గర్భాలు (సరోగసీ) ఒక వ్యాపారంగా మారిపోయిన పరిస్థితుల్ని చూపించిన కథ, ‘మదర్‌హుడ్ రియాల్టీ చెక్!’
సమానత్వ విలువలూ, సామాజిక ఆందోళనలూ కూడా యువతరం ఎగతాళికి, చిన్నచూపుకూ గురవుతున్న పరిస్థితులను చూపించిన కథ ‘సహస్ర’! పెళ్ళి గురించి ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్న అమ్మాయి తన కింది వర్గాలకు చెందిన స్త్రీల (జిమ్ ట్రెయినర్, వంటావిడ) అనుభవాలనూ ఆలోచనలనూ తన ఆలోచనలతో పోల్చుకుని చూసుకునే కథ, ‘మాన్వి’!
ఎదుటివారి ప్రేమని సాధించడానికి తన భావాలని ఎంతో సున్నితంగా, ఆర్ద్రంగా పూల బొకేల భాషలో వ్యక్తీకరించినా, అవసరం తీరాక ఎంతో బండగా అదే భాషలో తన తిరస్కారాన్నీ ప్రకటించాలనే ప్రయత్నం చేసిన ఒక కస్టమర్‌కీ; మనసులో మిగుల్చుకున్న కాస్త చెమ్మనూ ఆ బొకేలతోపాటు అందించే సందేశం రూపంలో వ్యక్తం చేసే ఒక బొకేల దుకాణం యజమానురాలికీ మధ్య జరిగిన సంఘటనల సమాహారమే పూల ముఖంగా అందించిన కథ, ‘బ్రేకప్ బొకే’! చిక్కని ఆత్మీయతానుబంధాల మధ్య అల్లుకున్న జీవితాన్ని వదలలేక వదిలి, ఎప్పటికైనా తిరిగిరావాలనే ఆశను మూటగట్టుకుని అమెరికా వెళ్ళి, అక్కడ అలవాటుపడలేక చివరకు భర్త ఆలోచనల మేరకే ఇంటికి తిరిగివచ్చిన ఒక స్త్రీ సున్నితమైన మానసిక సంఘర్షణాచిత్రమే ‘పున్నమిలా వచ్చిపొమ్మని..!’.
సమాజపు ఆమోదాన్ని పొందలేని అనుబంధాల పట్ల సమాజం ఎంత క్రూరంగా హింసాత్మకంగా ఉండగలదో చెప్పిన కథ, ‘మౌన’!
ఈ కథలన్నీ సమాజంలోని అత్యల్ప వర్గాల జీవితాల గురించే చెప్పినవైనా తప్పనిసరిగా ఈ మార్పులని గుర్తించవలసిన అవసరాన్ని వివరించేవే. అయితే, కథల్లోని పరిసరాల్ని, వాతావరణాన్ని పరిచయం చేయడానికి పద్మ వాడే భాష చాలాచోట్ల కృతకంగా అనిపిస్తోంది. పాత్రలకు ఇచ్చిన పేర్లు కూడా ఫ్యాన్సీగా ఉన్నాయి. పుస్తకం అందంగా కనిపించటానికి తీసుకున్న శ్రద్ధలో, కొంచమైనా ప్రూఫ్ రీడింగ్‌పై పెట్టినట్లైతే బాగుండేది. కొన్నిచోట్ల వాక్యాలు మిస్సయ్యాయి. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలియలేదు రెండుమూడుచోట్ల.
- అమృత