తెలుగు సాహిత్యంలో బిరుదులు
పూర్వకాలంలో మహారాజులు కవులను, పండితులను గజారోహణాలతో, గండపెండేరాలతో, సింహతలాటాలతో, కనకాభిషేకాలతో, పుష్పాభిషేకాలతో, కిరీటదారణలతో, పల్లకీ ఊరేగింపులతో వివిధ రీతులలో సత్కరించేవారు. వీటితోపాటు వారికి బిరుదులను ప్రదానం చేసేవారు. బహుజనపల్లి సీతారామాచార్యుల శబ్దరత్నాకరం బిరుదు పదానికి సామర్థ్య చిహ్నము అని అర్థం చెబుతున్నది.
బిరుదులు ఎవరు ఇస్తారు?: పైన పేర్కొన్నట్టు మహారాజులు బిరుదులు ప్రదానం చేసేవారు. రాచరికం అంతరించాక సంస్థానాధీశులు, జమీందారులు తమను ఆశ్రయించినవారికి బిరుదులతో సత్కరించేవారు. జమీందారీ వ్యవస్థ నాశనమయ్యాక బ్రిటీష్ ప్రభుత్వం వారు తమ పరిపాలనా సౌలభ్యం కోసం కొంతమందికి రావుసాహెబ్, రావు బహద్దూర్, దీవాన్ బహద్దూర్ వంటి బిరుదులను ఇచ్చేవారు. ఇలాంటి బిరుదులు పొందినవారిలో కొంతమంది సాహిత్యరంగానికి చెందిన వారు వున్నా ఈ బిరుదులు సారస్వత రంగానికి చెందిన బిరుదులుగా పరిగణించలేము. తరువాతి కాలంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కొన్ని సాహిత్య సంస్థలు, కొందరు వ్యక్తులు బిరుదులను ఇస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మిక మఠాలు, పీఠాలకు చెందిన అధిపతులు, జగద్గురువులు కూడా తమ భక్తులైన కవులకు, రచయితలకు బిరుద ప్రదానం చేస్తున్నారు.
బిరుదప్రదానం అనేది పేరు పెట్టడం లాంటిది. నిక్‌నేమ్ (పరిహాసనామం) తగిలించటం వంటిదన్నమాట. నిక్‌నేమ్ వ్యంగ్యంగా, హేళనగా ఉండటమో, న్యూనత లేదా హైన్యతను సూచించడమో జరిగితే బిరుదులు గౌరవ సూచకంగా ఉంటాయి. ఒకటీ అరా బిరుదులు వెక్కిరింపుగా కూడా లేకపోలేదు. రేచీకటి ఉన్న కవికి ఆంధ్రమిల్టన్, బ్రహ్మచారి అయిన రచయితకి సాహితీభీష్మ బిరుదును ప్రదానం చేయడం వెనుక వున్న వ్యంగ్యాన్ని గమనించవచ్చు.
బిరుద ప్రదానంలో మనవారు ప్రదర్శించిన వైవిధ్యాన్ని, నైపుణ్యాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. వాటిలో కొన్ని రకాల బిరుదులను ఇక్కడ పరిశీలిద్దాం.
1. పూర్వకవులతో/పురాణ పురుషులతో పోల్చి వారి పేర్లముందు ‘అభినవ’ అనో, ’నవీన’ అనో, ’నూతన’, ’నవ్య’, ’అపర’ అనో ఏదో ఒక విశేషణాన్ని తగిలించడం. అభినవ కాళిదాసు, అభినవ తిక్కన, అపర పింగళిసూరన, అభినవ వేమన, అభినవ మొల్ల, నూతన తిక్కన సోమయాజి మొదలైనవి.
2. సంస్కృత, ఆంగ్ల, విదేశీ కవులతో పోల్చి వారి పేర్లకు ముందు ‘ఆంధ్ర’ లేదా ‘తెలుగు’ అని తగిలించడం. ఆంధ్ర ఎడిసన్, ఆంధ్ర కల్హణ, ఆంధ్ర బిల్హణ, ఆంధ్ర జయదేవ, ఆంధ్ర బాస్వెల్, ఆంధ్ర బెర్నార్డ్ షా, ఆంధ్ర మొపాసా, ఆంధ్ర వ్యాస, ఆంధ్ర షెల్లీ, తెలుగు బాస్వెల్ వగైరా.
3. పక్షులను విశేషణాలుగా ఉంచడం. కవికోకిల, అవధానరాజహంస, కవిరాజహంస, కుండినకవిహంస, కవికాకి, కవిగండభేరుండ మొ.
4. జంతువుల పేర్లు కలిగిన బిరుదులు.
సింహము: అవధాని పంచానన, ఆంధ్ర వైయ్యాకరణకేసరి, ఆశుకవి కేసరి, కళాసింహ, కవిసింహ, కవికంఠీరవ, కింకవీంద్ర ఘటాపంచానన
ఏనుగు: కవికరి, కవిదిగ్గజ, విద్వత్కవికుంజర
మిగిలిన జంతువులు: కవివృషభ, కవికిశోర
5. దేవతల పేర్లు కలిగిన బిరుదులు:
బ్రహ్మ: కథాబ్రహ్మ, కవిబ్రహ్మ, చరిత్రచతురానన, జానపద కవిబ్రహ్మ, సహస్రావధానబ్రహ్మ, సాహిత్యబ్రహ్మ, హాస్యబ్రహ్మ, కథావిరించి మొదలగునవి.
ఈశ్వరుడు: అలంకార నటరాజ, కవిరాజశేఖర, పరిశోధన పరమేశ్వర, పీఠికాప్రబంధ పరమేశ్వర, కవితా మహేశ్వర, ప్రబంధ పరమేశ్వర మొదలైనవి.
సరస్వతి: అభినవ భారతి, అవధాన శారద, అవధాన సరస్వతి, కవితాభారతి, జ్ఞానభారతి, పుంభావ సరస్వతి, ప్రసన్న భారతి, బాలసరస్వతి, సాహిత్యసరస్వతి ఇత్యాదులు.
బృహస్పతి: అక్షరవాచస్పతి, విద్యావాచస్పతి, శతావధాన గీష్పతి,ఆంధ్రభాషా వాచస్పతి
సూర్యచంద్రులు: అవధాన కళానిధి, అవధాన శశాంక, అవధాని సుధాంశు, ఉభయభాషా భాస్కర, కథాసుధానిధి, కథాకళానిధి, కవిచంద్ర, కవితాసుధాకర, కవిసుధాకర, కావ్యకళానిధి, విద్యాభాస్కర, సాహితీశశాంక, సాహిత్య సుధాకర. కేవలం దేవతలే కాకుండా రాక్షసులు (ధారణాబ్రహ్మ రాక్షసుడు, కవిరాక్షసుడు), గంధర్వులు (సాహిత్య గాంధర్వ) కూడా మన సాహితీ ప్రపంచాన్ని ఏలుతున్నారు.
6. చారిత్రక, పురాణపురుషుల పేర్లు కలిగిన బిరుదులు: అభినవాంధ్ర వాల్మీకి, అభినవ కృష్ణరాయ, ఆంధ్ర భోజ, అభినవ భోజ, అభినవ వ్యాస, అభినవ సహదేవ, అభినవ సూత, ఆంధ్రవ్యాస, కవికిరీటి, ప్రసన్న వాల్మీకి, సాహితీ వశిష్ఠ ఇత్యాదులు.
7. సముద్రము, నదులతో పోల్చిన బిరుదులు: కవితానంద మనోదధి, సాహిత్య రత్నాకర, కవితాగంగోత్రి, కవితాతరంగిణి, విద్యాదానవ్రతమహోదధి, విద్యాసాగర
8. వయసును సూచించే బిరుదులు: బాలకవి, యువకవి, తరుణకవి, ప్రౌఢకవి మొ.
9. ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే బిరుదులు: కోనసీమ కవికోకిల, అమెరికా అవధాన భారతి, రాయలసీమ కవికోకిల, వెల్లంకి వేమన, నల్లగొండ కాళోజీ మొ.
10. బంధుమిత్రులను సూచించే బిరుదులు: అభినవాంధ్ర కవితాపితామహుడు, అభ్యుదయ కవితాపితామహుడు, అవధాని పితామహ, ఆంధ్రకవితా పితామహుడు, ఆంధ్రచరిత్ర నాటక పితామహ, ఆంధ్ర నాటకపితామహ, ఆంధ్ర పద్య కవితా పితామహ, భావకవితాపితామహుడు, వచనకవితా పితామహుడు, శారదాతనయ, శారదాపుత్ర, సరస్వతీపుత్ర, సరస్వతీసత్పుత్ర, సాహితీబంధు, కవిమిత్ర, సాహితీమిత్ర మొ.
11. ఇంకా మనకవులలో రాజులు, చక్రవర్తులు, సమ్రాట్టులు, సార్వభౌములు, పాదుషాలు, వల్లభులు, త్రాతలు, పోషకులు, ఉద్ధారకులు ఉన్నట్లు వారివారి బిరుదుల వలన తెలుస్తున్నది. మణులు, రత్నాలు, కంఠాభరణాలు, భూషణాలు, అలంకారాలను కూడా మనవాళ్లు బిరుదులలో అందంగా పొదిగినారు. ధురీణులు, ప్రపూర్ణులు, చతురులు, తల్లజులు, ప్రవీణులు, మూర్ధన్యులు, తత్పరులు, పండితులు మొదలైన నిష్ణాతులు కూడా మన కవిపండిత సమూహంలో ఉన్నట్లు వారి వారి బిరుదుల వలన తెలుస్తున్నది.
ఈ బిరుదులను అధ్యయనం చేస్తే ఆయా వ్యక్తుల పాండిత్యంపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ఉదాహరణకు అభినవ వేమన అనే బిరుదాంకితుడు వేమన వలె ఆటవెలది పద్యాలలో విశేషమైన ప్రతిభ కనపరచి వుండవచ్చునన్న అంచనాకు రావచ్చును. అలాగే గద్యతిక్కన, భావకవి, శృంగారకవి, హాస్యబ్రహ్మ మొదలైన బిరుదుల ద్వారా ఆయా కవుల రచనల స్వభావాన్ని గుర్తించవచ్చు. బిరుదులలోని విశేషణాన్ని ఆయా కవులలో మనం అపేక్షిస్తాం. ఉదాహరణకు మధురకవి లేదా కవికోకిల అనే బిరుదున్న కవుల రచనల్లో మాధుర్యాన్ని, కవుల గొంతులో కోకిల స్వభావమైన మధురమైన కంఠస్వరాన్ని ఆశిస్తాం. అయితే అన్నిసందర్భాలలో అలా ఆశించడంలో ఔచిత్యముండకపోవచ్చును. ఉదాహరణకు రాజహంస అపార్టుమెంటు వెల్ఫేర్ కమిటీవారు వారి గృహసముదాయంలో నివసిస్తున్న ఒక కవిగారికి కవిరాజహంస అనే బిరుదుని ఇచ్చారనుకోండి. ఆ కవిగారిలో రాయంచ లక్షణాలను వెదుకుకోవడం, ఆ కవిగారికి నిజంగా ఆ లక్షణాలు ఉన్నాసరే, అహేతుకమవుతుంది.
కొన్ని బిరుదులను ప్రత్యేకంగా ఎవరూ ప్రసాదించకపోయినా ప్రజల నోళ్ళల్లో నాని అవే బిరుదులుగా స్థిరపడిపోతాయి. ప్రజాకవి, మహాకవి, సహజకవి అందుకు ఉదాహరణలు. కొన్ని ఆయా కవుల పేర్లలో భాగమైపోయి అవే నిజమైన పేర్లుగా స్థిరపడిపోతాయి. ఉదాహరణకు ఎలకూచి బాలసరస్వతి, చిన్నయసూరి, విశ్వనాథకవిరాజు మున్నగునవి.
చివరగా ఒకమాట. ఈ బిరుదులలో కొన్నిమాత్రమే అన్వర్థాలు. అటువంటి బిరుదులు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాయి. తెచ్చిపెట్టుకున్న బిరుదులు, అడిగిపుచ్చుకున్న బిరుదులు, వ్యాపారధోరణిలో సంపాదించుకున్న బిరుదులకు విలువ ఉండదు. అలాంటివి పటాటోప ప్రదర్శనకు మాత్రమే ఉపయోగపడతాయి. కేవలము బిరుదాంచితులు మాత్రమే గొప్పవారు అని ఎవరైనా భావిస్తే అది పొరపాటు. ఏ బిరుదులూ లేని ప్రతిభాసంపన్నులైన కవిపండితులెంతమందో ఉన్నారు. చాలామందికి ఈ బిరుదులపట్ల అనాసక్తత లేదా విముఖత ఉంది. అలాంటివారు తమకు బిరుదులు ఉన్నా వాటిని ఎక్కడా పేర్కొనరు. ఏది ఏమైనా ఈ బిరుదులనేవి ఒక గుర్తింపు అని మాత్రం అంగీకరించాలి.
- కోడీహళ్లి మురళీమోహన్, 9701371256
(వ్యాసకర్త ఇటీవల ‘ఆంధ్రసాహిత్యములో బిరుద నామములు’ పుస్తకం తెచ్చారు.)