బ్రిటీష్ వారికి నిజామ్ రాజు ధారాదత్తం చేయగా అటు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగమైన సర్కారు జిల్లాలు, దత్తమండలాల ప్రాంతంలో కానీ, ఇటు నిజామ్ సొంత ఏలుబడిలో మరాఠ్వాడా, హుబ్లీ ప్రాంతాలతో కలసిన హైదరాబాద్ సంస్థానంలో కానీ సాగిన తెలుగు వారి సైలెంట్ సినిమా ప్రయాణం ఇవాళ్టికీ పూర్తిగా వెలుగులోకి రాని సమాచారఖని.
తెలంగాణ ఆత్మగౌరవం, ప్రత్యేక రాష్ట్ర స్ఫూర్తితో సినీ వ్యాసకర్త, పలు సినీ గ్రంథాల రచయిత హెచ్. రమేశ్‌బాబు ఇప్పుడు హైదరాబాద్ ప్రాంత మూకీ యుగ అంశాలను తవ్వి తీశారు. స్టీఫెన్ హ్యూస్ లాంటి విదేశీయుల నుంచి బి.డి. గర్గ లాంటి స్వదేశీయులు, స్థానిక విశ్వవిద్యాలయ పరిశోధకుల దాకా ఇప్పటికే పలువురు చేసిన శోధనలు, రచనల నుంచి కావాల్సినంత తీసుకొంటూ... అరుదైన ఫోటోలతో సహా అనేక పాత పుస్తకాల సమాచారాన్ని కలబోసి ఒకచోట అందించారు. ఈ పరిశ్రమ అభినందనీయం. అదే సమయంలో పరస్పర వైరుద్ధ్యాలనూ, పాత తప్పులనూ సరిచేసుకోవాలని మర్చిపోయి రచయిత తడబడ్డారు.
చిత్రంగా ఈ రచనలో మద్రాసు ప్రాంత సినీచరిత్రను ఎత్తిరాయడంలోనూ తప్పులు దొర్లాయి. మద్రాస్‌లో తొలి సినిమా థియేటర్ (పేజీ 47), రఘుపతి వెంకయ్య ఆ హాళ్ళలో సిన్మాలు చూసి సినీరంగం వైపు వచ్చారనడం, ఆయన కుమారుడు ఆర్. ప్రకాశ్ హాలీవుడ్ దిగ్గజం సిసిల్ బి. డిమిలీ దగ్గర శిక్షణ పొందారనే (పేజీ 53) మాట... ఇలా అనేక తప్పుడు పాత పుకార్లనే మళ్ళీ అచ్చేశారు.
హైదరాబాద్‌లో సినిమాటోగ్రాఫ్ ప్రదర్శనలు ఎప్పుడు మొదలయ్యాయన్న విషయంలోనూ పొరబడ్డారు. మద్రాసులో తొలి సినీ ప్రదర్శనలు 1896 డిసెంబర్‌లో ఇచ్చిన స్థానికుడు టి.జె. స్టీవెన్సన్ ఆపై దక్షిణాది అంతటా పర్యటిస్తూ వచ్చి, తెలంగాణ గడ్డపై 1897 ఆగస్ట్‌లో ప్రదర్శనలు ఇచ్చారన్నది చరిత్ర. కానీ, అంతకు ఏడాది ముందే 1896 ఆగస్ట్‌లో జరిగాయని ఈ పుస్తకంలో చెబుతున్నవి– ఒక్కరే కంతలో నుంచి చూసే ‘పీప్ హోల్ షో’లు. అవి సినిమాకు ముందు రూపాలు. అందరూ ఏకకాలంలో చూసే సినిమాటోగ్రాఫ్‌లు కావని గ్రహించాలి.
‘1897 నాటికే సికిందరాబాదు నుండి మదరాసుకు ముడి ఫిలిం సరఫరా అయినట్టు పేర్కొన్నారు స్టీఫెన్ హ్యూస్’ (పేజీ 35) అని రమేశ్‌బాబు ఉట్టంకించారు. కానీ, ఆంగ్ల మూల రచనలో ఎక్కడా ఆ ఊసే లేదు. అలాగే, మూసీ వరదలపై టాపికల్ తీసింది ముంబయ్ కంపెనీ అని చరిత్ర చెబుతున్నా, సంబంధం లేని కలకత్తా మదన్ కంపెనీకీ, ధీరేన్ గంగూలీకీ ఊహల ముడి వేశారీ రచనలో.
తెలుగు సినీ పితామహత్వం విషయంలోనూ ఈ పుస్తక రచయితకు కొన్ని అభ్యంతరాలు ఉన్నట్టున్నాయి. ఆ స్థానిక భావోద్వేగాలనూ, భిన్నాభిప్రాయాలనూ సానుభూతితో అర్థం చేసుకోవాల్సిందే! కానీ, ‘‘తెలుగు సినిమా మూలాలు తమిళనాట ఉన్నప్పుడు, తెలంగాణ సినీ పితామహుడు బెంగాలీయుడు (ధీరేన్ గంగూలీ) కావడంలో తప్పు లేదు’’ (పేజీ 22) అని పుస్తక రచయిత వాదన, అసలు మద్రాసు (చెన్నపట్నం) సహా నేడు తమిళనాడు అంటున్న ప్రాంతంలో సింహభాగం ఒకప్పుడు మన తెలుగు వారిదే!
మన ఏలుబడిలోదే! ఆ చరిత్ర మర్చిపోతే ఎలా? ప్రదర్శన, స్టూడియో, పంపిణీ, చిత్రనిర్మాణం – నాలుగు సెక్టార్లలోనూ మూకీ యుగంలోనే కాలుమోపి, నాలుగింటా తెలుగువారిలో ప్రప్రథముడిగా నిలిచాడు గనకే వెంకయ్యను తెలుగు సినీ పరిశ్రమకు పితామహుడన్నారు. దేశవిదేశాలకు తన సినీ ప్రదర్శన కృషిని విస్తరించి, మూకీ సినిమా తీసిన తొలి తెలుగువాడైన అలాంటి వ్యక్తిని కేవలం మద్రాసుకే పరిమితమన్నట్టుగా తగ్గించి చెప్పడం (పేజీ 51) భావ్యమా?
అలాగే, ‘... మదరాసు రాష్ట్రానికి సంబంధించిన సినిమా విశేషాలన్నీ కూడా ఆ ప్రాంతానికే చెందుతాయి. కానీ, సమైక్య రాష్ట్రం ఏర్పడిన తరువాత అక్కడి పరిణామాలను తెలుగు సినిమా చరిత్రకు తొలిరోజులుగా చరిత్రకెక్కించారు’ (పేజీ 23) అని రచయిత నిందారోపణ చేశారు. నిజామ్ వదిలేశాక బ్రిటీషు ఏలుబడిలో, ప్రెసిడెన్సీలో, మద్రాస్ రాజధానిగా తెలుగు వారు గడిపినకాలం తెలుగువారిది కాకుండా ఎలా పోతుంది?
తమిళుల చరిత్రను తెచ్చి తెలుగు సినిమా చరిత్ర అంటే తప్పు. అంతేకానీ, మద్రాసులో జరిగింది గనక తెలుగు వారి కృషైనా సరే తెలుగు సినీ చరిత్రే కాదని అనడం సబబా? ఒక్కమాటలో... ఇప్పుడు చేయాల్సింది ఆరోపణలు కాదు. ఆలోచనతో... మరుగునపడ్డ స్థానిక చరిత్రల పునర్నిర్మాణం.
హైదరాబాద్ రాష్ట్రం సహా అంతటా తెలుగు వారి సినిమా ప్రస్థానంపై నిర్విరామ కృషి. నిరంతరం సాగాల్సిన ఆ ప్రయత్నంలో మన సినీ చరిత్రకు ఈ పుస్తకం అనేక లోపాలున్నా సరే ఓ కొత్త చేర్పు. మూకీల కాలంలోనే హైదరాబాద్ నుంచి బొంబాయికీ, సినీ రంగానికీ వెళ్ళిన పైడి జైరాజ్ సహా పలువురి సమాచారమే అందుకు సాక్ష్యం.
లోటస్ ఫిలిం కంపెనీ – హైదరాబాదు
(తెలంగాణ సినిమా మూకీ యుగం: 1896 –1932)
రచన – హెచ్. రమేష్‌బాబు
ప్రతులకు – అన్ని ప్రధాన పుస్తక విక్రయశాలల్లో.
పేజీలు – 160, వెల – రూ. 150
– రెంటాల జయదేవ
Comments
Please login to add a commentAdd a comment