తెలంగాణ సాహిత్యం ‘ప్రత్యేకం’ | Special to Telangana literature | Sakshi
Sakshi News home page

తెలంగాణ సాహిత్యం ‘ప్రత్యేకం’

Published Wed, Sep 23 2015 3:03 AM | Last Updated on Sun, Sep 3 2017 9:47 AM

తెలంగాణ సాహిత్యం ‘ప్రత్యేకం’

తెలంగాణ సాహిత్యం ‘ప్రత్యేకం’

* ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర
* పోటీ పరీక్షల్లో వచ్చే ప్రశ్నల సరళిపై నిశిత పరిశీలన అవసరం
* తెలుగు సాహిత్యంపై నందిని సిధారెడ్డి ఇంటర్వ్యూ
* సాహిత్యంలో ప్రశ్నలు ఎలా అడిగారన్న అవగాహనతో జవాబులు రాయాలని సూచన

 
తెలంగాణ ఉద్యమంలో సాహిత్యానికి ఉన్న పాత్ర ప్రత్యేకమైంది. సాహిత్యంతోపాటు సంస్కృతి, కళలు ప్రజలను ఏకం చేసి ఉద్యమం వైపు నడిపించాయి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేలా తోడ్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో ఉద్యోగులుగా చేరబోయే వారికి తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, కళలు, పాటల ప్రాధాన్యం తెలిసి ఉండాలి. అందుకే టీఎస్‌పీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో వీటిపై కచ్చితంగా ప్రశ్నలు ఉంటాయి. ఉద్యమ సమయంలో సాహిత్యంతో చైతన్యం తెచ్చిన వారిలో నందిని సిధారెడ్డి ఒకరు. ‘నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ..’ వంటి పాటలు, రచనలతో ఉద్యమానికి చేదోడుగా నిలిచిన ఆయన టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. పోటీ పరీక్షలకు సిలబస్‌ను ప్రకటించిన నేపథ్యంలో సాహిత్యం విషయంలో అభ్యర్థులు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై నందిని సిధారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...
 
 సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రంలో ఉద్యోగంలోకి వచ్చే వారికి తెలంగాణ ఉద్యమ సమయం, అంతకుముందు తెలంగాణ సాహిత్య చరిత్ర తదితర అంశాలపై అవగాహన ఉండాలన్నదే ప్రతి ఒక్కరి ఉద్దేశం. ప్రధానంగా గ్రూప్-1 జనరల్‌స్టడీస్‌లో 11వ అంశంగా, గ్రూప్-2 జనరల్ స్టడీస్‌లో 7వ అంశంగా ‘సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ’ గురించి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సాహిత్యాన్ని ప్రత్యేకంగా చదువుకోవాలి. అభ్యర్థులు దృష్టి సారించాల్సిన ప్రధాన అంశాలివి..
 
 సంస్కృతి: ఒక జాతి జీవన విధానమే సంస్కృతి. ఆచార వ్యవహారాలు వేషభాషలు, అలవాట్లు, పండుగలు, వేడుకలు. సుఖదుఃఖాలు, భావోద్వేగాలు, కళలు, సాహిత్యం మతం, రాజకీయాలు అన్నింటి మౌలిక అంశాలు సంస్కృతిలో ఉంటాయి.
 
 తెలంగాణ సాహిత్యం, భాష: భాషకు సంబంధించిన చర్చను సంస్కృతిలో భాగంగా అధ్యయనం చేయా లి. తెలుగు మౌలిక స్వరూపం తెలంగాణ భాషలోనే ఉంది. అనేక శాసనాలు దీనిని చెబుతున్నాయి. తెలంగాణ అనే పదం ఆధారంగానే ఏర్పడింది తెలుగు. ఆదివాసులైన గోండుల మూల పురుషుడికి నలుగు రు కొడుకులు. వారు టేకం, మాసం, పూనం, తెలిం గం. నాలుగో కొడుకు తెలింగం. అతని సంతతిగా ఉన్నవారే తెలుంగులు లేదా తెలంగాణ వారు. తెలుంగు ఆధారంగానే ఇక్కడ ఏర్పడిన సంతతికి తెలుంగణం అనే పేరుంది. 15వ శతాబ్దానికి సంబంధించిన ఒక శాసనంలో తెలంగాణపురం అనే ప్రస్తావ న ఉంది. దాని ఆధారంగానే తెలంగాణ అనేది తెలు గు యొక్క ప్రాతినిధ్యాన్ని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. ఈ అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలి.
 
 కళలు: ఇప్పుడు కళలన్నీ (జానపద కళలు, సంప్రదాయ కళలు) బతికి ఉన్న ప్రాంతం ఏదంటే తెలంగాణ అనే చెప్పాలి. తెలంగాణలో జానపద కళకు ఎంత ప్రాధాన్యం ఉందో ఉద్యమ కాలంలో కళలకు అంతే ప్రాధాన్యం ఉంది. 18 ఏళ్ల ఉద్యమకాలంలో విసృ్తతంగా ప్రజల్లో నానింది గానకళ. పాట అనేది తెలంగాణ ప్రజల ప్రతి మూలమలుపులో, ప్రజల భావోద్వేగాల్లో ఉంది. ఉద్యమానికి పాట ప్రక్రియ వేదికగా నిలిచింది. దీనిని గమనంలోకి తీసుకోవాలి. తెలంగాణలో శిల్పకళ బాగా వర్ధిల్లింది. రామప్ప అనే శిల్పి పేరున దేవాలయమే ఉంది. ఆయన చెక్కిన నాగిని శిల్పం, ఒక స్త్రీ కాలికి ముల్లు గుచ్చితే తీస్తున్నట్లు చెక్కిన శిల్పం అరుదైనవి. అలాగే వేయి స్తంభాల గుడి, కాకతీయుల కాలపు కళాతోరణం ఇక్కడి శిల్పకళకు ప్రతీకగా చెప్పవచ్చు. అంతర్జాతీయ ఖ్యాతి చెందిన చిత్రకారులు ఇక్కడి వారే. కాపు రాజయ్య, లక్ష్మాగౌడ్, వైకుంఠం, పీటీ రెడ్డి వంటి వారు ఎంతో ఆదరాభిమానాలు పొందారు. ఇంకా వెలుగు చూడాల్సిన పెయింట్స్ అనేక గుహల్లో ఉన్నాయి. వాటిపై పరిశోధన, అన్వేషణ జరగాలి.
 
 సాహిత్యం: శాతవాహనుల కాలానికి సంబంధించి ప్రాకృత సాహిత్యం, అనంతర దశలో చాళుక్య యుగంలో సంస్కృత సాహిత్యం, కాకతీయులకు ముందు దశలో ఉన్న కుర్క్యాల సాహిత్యం ఉన్నాయి. 946 సంవత్సరానికి సంబంధించిన కుర్క్యాల శాసనంలో సాహిత్యం పరిఢవిల్లినట్లు ఉంది. అందులో మూడు కంద పద్యాలు ఉన్నాయి. నన్నయ కంటే ముందు యుగానిదీ శాసనం. నన్నయ మహాభారతం రచన కంటే ముందే ఇక్కడ పద్య రచన ఉన్నట్లు ఈ శాసనం చెబుతోంది.
 
 నన్నయ-సోమన మధ్య తేడా..: ఇక కాకతీయుల యుగం నాటిది శైవ సాహిత్యం. పాల్కురికి సోమన తెలంగాణకు సంబంధించిన ఆదికవి. స్థానికంగా జీవించిన శైవభక్తుల కథలను ఆయన సాహిత్యానికి వస్తువుగా స్వీకరించారు. నన్నయ్యది అనువాద సాహిత్యమైతే  సోమనది స్వతంత్ర సాహిత్యం. ఇక్కడ జానపద సాహిత్యం ఎంత విస్తృతంగా ఉందో ఆయ న రచనల్లో పేర్కొన్నారు. ఆయన రాసిన వృశాధిప శతకం తెలుగులోనే మొదటి శతకం. అయితే అభ్యర్థు లు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేపుడు సాధారణంగా ఆదికవి ఎవరని అడిగితే నన్నయ అనే రాయాలి. తెలంగాణ ఆదికవి ఎవరు? లేదా మన ఆదికవి ఎవరని అడిగితే సోమనాథుడు అని రాయాలి.
 
 యుగ విభజన ఎలా చేయాలంటే..:  తెలుగు సాహిత్యం అధ్యయనంలో సోమనాథుని కేంద్రంగా సాహిత్య యుగ విభజన చేయాలి. 1.సోమనకు పూర్వయుగ సాహిత్యం, పరిశీలన; 2.సోమన యుగ సాహిత్యం; 3.బమ్మెర పోతన యుగం సాహిత్యం; 4.కురవి గోపరాజు యుగ సాహిత్యంగా విభజన చేసుకొని చదువుకోవాలి. సోమన యుగ సాహిత్యం తె నుగు భాషలో, దేశీ చందస్సులో (ద్విపద సాహిత్యంలో) ఉండగా... పోతన సంస్కృతాన్ని తెలుగును కలిపి మధ్యేమార్గంలో కవిత్వాన్ని రాశారు. ఇక కురవి గోపరాజు యుగంలో చాలా సాహిత్యం వచ్చింది. ఇది కుతుబ్‌షాహీల పరిపాలనకు సంబంధించింది. ఈ కాలంలోనే తెలుగులో అచ్చతెనుగు కావ్యం వచ్చింది. అది పొన్నగంటి తెలగన రాసిన యయాతి చరిత్ర. గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అనే కావ్యం రాశారు. అలాగే అద్దంకి గంగాధర కవి తపతి సంహరణోపాఖ్యానం రాశారు. మల్లారెడ్డి రాజుగా ఉండి షట్‌చక్రవర్తి చరిత్ర రాశారు.
 
 ఆధునిక సాహిత్యం: ఆధునిక సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. 19వ శతాబ్ది అనంతరం కాలం అంతా ఆధునిక సాహిత్యం. 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ చరిత్ర అనేక మలుపులు తిరిగిం ది. ఈ శతాబ్దంలోనే తెలంగాణలో కథ, నవల, వచన కవిత, పాట, పద్యం, నాటకం, వ్యాసం, విమర్శ, ఆత్మకథలు, గేయ కవిత వచ్చాయి. మిగతా ప్రాంతా ల్లో లేనట్లుగా ఇక్కడ సామాజిక ఉద్యమాలు విరివిగా జరగడం వల్ల సాహిత్యం దానిని ప్రతిఫలించింది.
 
 తొలి ఉద్యమంలో...: నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సాయుధ ఉద్యమం చేశారు. అది సాహిత్యంలో ప్రతిబింబించింది. వీటిని చిత్రిస్తూ సురవరం ప్రతాపరెడ్డి పలు రచనలు రాశారు. అలాగే నిజాం ఆంధ్రలో తెలుగు కవులు పూజ్యం అని ముడుంబై రాఘవాచార్యులు అనే పండితుడు పేర్కొంటే సురవరం ప్రతాపరెడ్డి స్పందించి ఇక్కడి తెలుగు కవులు రాసిన 354 కవితలను సేకరించి గోలుకొండ కవుల పేరుతో సంచిక వేశారు. అయితే దీనిని తెలుగు సాహిత్య చరిత్రలో పేర్కొనలేదు. ఇది ఆంధ్రా కవుల వివక్షకు నిదర్శనం. ఇక వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, గంగు లాంటి నవలలు రాశారు. దాశరథి రంగాచార్యులు జానపదం, మోదుగుపూలు నవలలు రాశారు. నెల్లూరు కేశవస్వామి యుగాంతం వంటి కథ రాశారు. ఆవుల పిచ్చయ్య కథలు, దాశరథి కథలు రాశారు.
 
 కవితలు: దాశరథి రాసిన అగ్నిధార, కాళోజీ రాసిన నా గొడవ, సుద్దాల హన్మంతు పాటలు, బండి యాదగిరి (బండెనుక బండి కట్టి) వంటివన్నీ అప్పటి పోరాటాన్ని చిత్రించాయి.
 1950లలో విశాలాంధ్ర సాహిత్యం: ఇక తరువాతి కాలంలో తెలుగు వాళ్లకు ఒక రాష్ట్రం ఉండాలనే ఉద్యమం నడిచింది. అందులో తెలంగాణ ప్రజలు రెండు భాగాలుగా ఆలోచించారు. విశాలాంధ్ర సాహిత్యం వచ్చింది. దాశరథి రాసిన మహాంధ్రోదయం, వనమామలై వరదాచర్యులు రాసిన కవిత్వాలు వచ్చాయి. దేవులపల్లి రామానుజరావు రాసిన వ్యాసాలు విశాలాంధ్ర వైపు నడిపించాయి.
 
 1969లో రెండో ఉద్యమం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడిన ఇబ్బందులు, వివక్ష, అణ చివేత, అన్యాయానికి వ్యతిరేకంగా 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇందులో సాహిత్యం, పాటలు వచ్చాయి. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలిచి అన్ని భావోద్వేగాలను ప్రకటించిన కవి కాళోజీ నారాయణరావు. భాషా సాహిత్యాన్ని ప్రశ్నిస్తూ అనేక కవితలు రాశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించారు. విశాలాంధ్రవాదం నుంచి ప్రత్యేకవాదంపైకి వచ్చారు.
 
 విప్లవోద్యమం: ఆ తరువాత విప్లవోద్యమం. మూడు దశాబ్దాలపాటు విప్లవోద్యమం ప్రధానంగా సాగింది. ఇది మూడో పెద్ద సామాజిక ఉద్యమం. ఈ సమయంలో చాలా సాహిత్యం వచ్చింది. చెరబండరాజు, వరవరరావు వంటి వారు జైలు జీవితం అనుభవిస్తూ సాహిత్యం సృష్టించారు. గూడ అంజయ్య (ఊరు మనదిరా), గద్దర్ (సిరిమల్లే చెట్టుకింద లచ్చుమమ్మా) వంటి పాటలు విసృ్తతంగా ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాయి. వరవరరావు రాసిన భవిష్యత్తు చిత్రపటం కవిత సంపుటిని అప్పటి ప్రభుత్వం నిషేధించింది కూడా.
 
 సంస్కృతి: సంస్కృతులు, పండుగల్లో తెలంగాణ ముద్ర ఉన్న వాటిపై దృష్టిపెట్టాలి. బతుకమ్మ, బోనాలు, పీరీలు, దసరా వంటివి తెలుసుకోవాలి. పీరీల పండుగ ముస్లింలది అయినా హిందువులు ఆడుతారు. మత సామరస్యం, ఐక్యత. సహజీవనానికి ఇది ప్రతీక. ఇక్కడ ఎక్కువగా తిరుగుబాట్లు, ఉద్యమాలు ఉన్నాయి. ఇవన్నీ సంస్కృతిలో భాగమే.
 
 ఎలా చదవాలంటే...
 సిలబస్‌పై అవగాహన తెచ్చుకోవాలి, తరువాత కావాల్సిన సమాచారం, గ్రంథాలను సేకరించుకోవాలి. వాటి ప్రత్యేకతలను గుర్తించి చదువుకోవాలి. సాహిత్యం, చరిత్ర, సంస్కృతి ఏ అంశమైనా వాటి ప్రత్యేకతలను గుర్తించాలి. ప్రత్యేకతలపైనే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు తొలి రచనను ప్రత్యేక అంశంగా భావించవచ్చు. కొన్నిసార్లు ఉద్యమ ప్రతిబింబంగా ఉన్న రచనలను ప్రత్యేకంగా భావించవచ్చు. కొన్నిసార్లు వస్తురూపాల మేళవింపు ప్రాచుర్యాన్ని ప్రత్యేకంగా భావించ వచ్చు.
 
 ఉదాహరణకు తడకమళ్ల కృష్ణారావు 1860లో రాసిన కంబుకందర చరిత్ర తెలంగాణ మొదటి నవల అంటాం. కాని దానికి నవల లక్షణాలు లేవన్న వాదన వచ్చింది. అయినా తెలంగాణ మొదటి నవలగా దానినే పేర్కొంటాం. అయితే నవలల్లో పరిణతి పొందిన నవల ఏదంటే వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన ప్రజలమనిషి. నవలల్లో ప్రత్యేకమైన శిల్పాన్ని సాధించిన వ్యక్తిగా అంపశయ్య నవీన్ ‘అంపశయ్య’ను చెప్పవచ్చు. హాస్టల్ విద్యార్థి ఒకరోజు దినచర్యలను చైతన్య స్రవంతి శిల్పంలో నవీన్ రాసిన నవల అంపశయ్య. అలాంటి ప్రత్యేకతను గుర్తించాలి.
 
 మలిదశ ఉద్యమం
 అందరి కళ్ల ముందు జరిగిందీ, తెలంగాణ కలసాకారమైందీ మలి దశ ఉద్యమంతోనే. ఈ సమయంలో వచ్చిన అల్లం రాజయ్య కథలు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథ, బీఎస్ రాములు కథలు, సాహు కథలు ప్రత్యేకంగా చదువుకోవాలి. ఆ సమయంలోనే వచ్చిన కొమురం భీం నవలా ముఖ్యమైందే. ఈ మలిదశ ఉద్యమంలో సాహిత్యం కీలక పాత్ర పోషించింది. గోరటి వెంకన్న, గద్దర్, సిధారెడ్డి, గూడ అంజయ్య, అంద్శైమొదలైనవాళ్లు తెలంగాణ ఉద్యమాన్ని పదును పెట్టే పాటలు అందించారు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన మత్తడి, పొక్కిలి, వేముగంటి మురళీకృష్ణ మునుము రచనలు ఉద్యమాలకు ప్రతిబింబంగా నిలిచాయి.
 
 అందుబాటులో ఉన్న పుస్తకాలు..
 సాహిత్యంలో: ముదిగంటి సుజాతారెడ్డి రాసిన తెలంగాణ సాహిత్య చరిత్ర. ఎస్సీ రామారావు రాసిన తెలంగాణ సాహిత్య చరిత్ర, తూర్పు మల్లారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన తెలంగాణ సాహిత్యం జీవిత చిత్రణం.
 
 సంస్కృతికి సంబంధించి: ఇగురం-తెలంగాణ భాష సాంస్కృతిక వ్యాసాలు. వట్టికోట ఆళ్వారుస్వామి సంకలనం చేసిన తెలంగాణం - తెలంగాణ సంస్కృతి సాంస్కృతిక ప్రచురించిన ఆర్ట్ ఎట్ తెలంగాణ పుస్తకాలు చదవొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement