‘సాహితీ పురస్కారాల’కు సూచనలివ్వండి
హైదరాబాద్: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనల్ని ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తోంది. 2013, 2014 సంవత్సరాలకు ప్రదానం చేసే పురస్కారాల ఎంపికకు వివిధ వర్గాల నుంచి వర్సిటీ సూచనలు కోరుతోంది. 2013 పురస్కారాలకైతే 2010 జనవరి నుండి 2012 డిసెంబరు మధ్య కాలంలో వెలువడిన పుస్తకాలను, 2014 పురస్కారాలకైతే 2011 జనవరి నుంచి 2013 డిసెంబరు మధ్య కాలంలో వెలువడిన పుస్తకాలను పరిశీలనకు సూచించాలి.
వచన కవిత, పద్య కవిత, బాల సాహిత్యం, నవల, కథానికల సంపుటి, నాటకం, నాటికల సంపుటి, సాహిత్య విమర్శ, అనువాద సాహిత్యం, వచన రచన, రచయిత్రి ఉత్తమ గ్రంథం అనే 10 ప్రక్రియల్లో అన్ని ప్రక్రియలకు గాని, కొన్నింటికి గాని, తమకు నచ్చిన గ్రంథాలను పురస్కారాలకు సూచించవచ్చు. 2014 పురస్కారాల్లో గేయ కవితా పురస్కారం కూడా ఉంటుంది. ఈ పురస్కారానికి 2009 నుంచి 2013 మధ్యకాలంలో ప్రచురితమైన గేయ కవితా సంపుటాలను సూచించాలి.
సూచనలో ప్రక్రియ పేరు, గ్రంథం పేరు, రచయిత పేరు, చిరునామా, పేజీల సంఖ్య, ప్రచురణ సంవత్సరం, ప్రచురణ కర్త పేరు పేర్కొనాలి. రచయితలు కూడా తమ గ్రంథాలను స్వయంగా సూచించవచ్చు. అనువాద సాహిత్య విభాగానికి తప్ప మిగతా విభాగానికి అవార్డుల కోసం అనువాదాలు, అనుసరణలు సూచించరాదు. వచన రచన అనే ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, తాత్త్విక, వైజ్ఞానిక, స్వీయ చరిత్ర, దేశ చరిత్ర, సంస్కృతి కళలకు సంబంధించిన గ్రంథాలు సూచించవచ్చు. అన్ని ప్రక్రియల్లో గ్రంథాలు 96 పేజీలకు తగ్గరాదు.
బాల సాహిత్యం, నాటకం ప్రక్రియలలో పుటల పరిమితి లేదు. రచయిత మరణించినప్పటికీ 2010 జనవరి నుండి 2013 డిసెంబర్ మధ్య కాలంలో వారి రచన ప్రచురణ పొంది ఉంటే అవార్డుకు సూచించవచ్చు. తెల్ల కాగితంపై పాఠకులు తమ సూచనల్ని రాసి రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్-4 చిరునామాకు సెప్టెంబరు 5లోగా పంపాలని రిజిస్ట్రార్ కె.తోమాసయ్య తెలిపారు.