Potti Sreeramulu Telugu University
-
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేస్తే పేరును మారుస్తామన్నారు.కాగా, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘సురవరం ప్రతాపరెడ్డికి తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. వారి అభ్యర్థన మేరకు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చాలని కాంగ్రెస్ పార్టీ తరుఫున నేను సురవరం పేరును ప్రతిపాదిస్తున్నాను. సభలో అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఆమోదం అయితే పేరును మారుస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
జాతీయ విద్యావిధానం అమలు చేయాలి
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): జాతీయ విద్యావిధానాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 15వ స్నాతకోత్సవాలను రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానం అమలు చేయడం వల్ల విద్యార్థుల్లో స్వయం ఉపాధి పెంపొందించడంతో పాటు పోటీ ప్రపంచంలో తట్టుకునే శక్తి కలుగుతోందన్నారు. వివిధ అంశాలపై పరిశోధనలు పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన విద్యార్థులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. పాశ్చాత్య భాషలు భారతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ప్రాంతీయ భాషలను క్షీణింపజేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్‌రావు, రిజిస్ట్రార్ భట్టు రమేశ్‌లతో పాటు వివిధ రంగాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. బంగారు పతకాల ప్రదానం కరోనా కారణంగా రెండేళ్లుగా పట్టాల ప్రదానం నిలిచిపోవడంతో గత విద్యార్థులకు కూడా ఈ ఏడాదే పట్టాలను ప్రదానం చేశారు. జస్టిస్ చంద్రయ్య, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరి కృష్ణలతో పాటు పలువురు ప్రముఖులు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తి చేసిన 21 మంది, పీహెచ్డీ పూర్తిచేసిన 73 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. జస్టిస్ చంద్రయ్యకు డాక్టరేట్ ప్రదానం చేస్తున్న గవర్నర్ తమిళిసై -
12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
నాంపల్లి (హైదరాబాద్): వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ 2018 ఏడాదికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. రామకవచం వెంకటేశ్వర్లు (కవిత), ఆచార్య వెలుదండ నిత్యానందరావు (విమర్శ), డి.అనంతయ్య (చిత్రలేఖనం), ఆర్.గంగాధర్ (శిల్పం), ఓలేటి రంగమణి (నృత్యం), డాక్టర్ ఎస్.కె.వెంకటాచార్యులు (సంగీతం), కల్లూరి భాస్కరం (పత్రికారంగం), రావుల వెంకట్రాజం గౌడ్ (నాటకం), కౌళ్ళ తలారి బాలయ్య (జానపద కళారంగం), డాక్టర్ మలుగ అంజయ్య (అవధానం), ఎన్.అరుణ (ఉత్తమ రచయిత్రి), పి.చంద్రశేఖర ఆజాద్ (నవల) పురస్కారాలకు ఎంపికయ్యారు. (చదవండి: జోనల్ సర్దుబాటు తర్వాత కొత్త ఉద్యోగాలు) డిసెంబరులో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ తెలిపారు. (చదవండి: ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు) -
మంచి బతుకునిచ్చే.. బతుకమ్మ
నాంపల్లి(హైదరాబాద్)/సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలసి బతుకమ్మను ఆడారు. అం తకు ముందు ఎన్టీఆర్ కళామందిరంలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడు కిషన్‌రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సభలో గవర్నర్ ‘అందరికి నమస్కారం’అంటూ ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు నవరాత్రి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి బతుకును ఇచ్చే దేవత బతుకమ్మ అని అభివర్ణించారు. బతుకమ్మ పాటల్లో పదాలపై పరిశోధన జరగాలని, జాగృతి సంస్థ ఇలాంటి ప్రయో గం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య భట్టు రమేష్, విస్తరణల సేవా విభా గం ఇన్చార్జీ రింగు రామ్మూర్తి పాల్గొన్నారు. రాజ్‌భవన్‌లోనూ... రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ ఆడారు. ఇందులో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు పలు రంగాల్లోని మహిళలు పాల్గొన్నారు. -
తెలుగులోనే కథా రచయితలు అధికం
ఈ కథల్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలి: కొలకలూరి ఇనాక్ ‘పాతికేళ్ల కథ’ సంకలనాన్ని ఆవిష్కరించిన కా.రా, జంపాల చౌదరి హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో ఉన్నంతమంది గొప్ప కథా రచయితలు ఏ భారతీయ భాషలో లేరని, ఆ అదృష్టం తెలుగు వారికే ఉందని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. మనసు ఫౌండేషన్, కథా సాహితి నిర్వహణలో వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌లు సంపాదకులుగా 155 మంది రచయితల 336 కథల ‘‘పాతికేళ్ల కథ’’ (1990-2014) సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగింది. ప్రముఖ కవి కె.శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు హాజరై సంకలనాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని ముఖ్య అతిథిగా హాజరైన తానా అధ్యక్షులు జంపాల చౌదరి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇనాక్ మాట్లాడుతూ ఇంత పెద్ద గ్రంథం ముద్రించి, అందరిని చదవగలిగేటట్టు చేసిన వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్లను అభినందించారు. ఇన్ని మంచి కథల్లో కొన్నైనా లేకపోతే అన్నైనా అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలని, తప్పనిసరిగా ఆంగ్లంలోకి అనువాదం చేయించాలని జంపాల చౌదరిని కోరారు. ఇవన్నీ ఆంగ్లంలోకి వస్తే తెలుగులో ఎంతటి గొప్ప రచయితలు ఉన్నారో ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. ఉద్యమాలను గురించి తెలుసుకుని సాహిత్యాన్ని రాసేవారు కొందరైతే.. కొంత జీవితాన్ని, కొంత చదువును రెంటినీ సమన్వయం చేసుకుంటూ రాసేవారు మరికొందరు ఉంటారని అన్నారు. రకరకాల ప్రభావాలతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నవారు ఉన్నప్పటికీ.. ప్రభావాలతో సాహిత్యాన్ని సృష్టించే వారికి పరిమితులుంటాయి కానీ సమాజాన్ని చూసి సాహిత్యాన్ని సృష్టించే వారికి పరిమితులు ఉండవని అన్నారు. తానా అధ్యక్షులు జంపాల చౌదరి మాట్లాడుతూ కథల పుస్తకాల ప్రచురణకు పాతికేళ్ల పాటు ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నానని అన్నారు. భవిష్యత్తులోనూ కథల ప్రచురణకు సహాయాన్ని అందజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయితలు వివినమూర్తి, కేతు విశ్వనాథరెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, వీక్షణం సంపాదకులు ఎన్.వే ణుగోపాల్ హాజరై ప్రసంగించారు. మధ్యాహ్నం జరిగిన పాతికేళ్ల కథాసాహితి జ్ఞాపకాల కలబోత ‘అవలోకనం’ పేరుతో నిర్వహించిన సదస్సుకు వాసిరెడ్డి నవీన్ అధ్యక్షత వహించారు. రచయితల పక్షాన మధురాంతకం నరేంద్ర, పెద్దింటి అశోక్‌కుమార్, కుప్పిలి పద్మ, మహ్మద్ ఖదీర్ బాబు, సభా నిర్వాహకుల పక్షాన నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్, చిత్రకారుల పక్షాన శీలా వీర్రాజు, అనువాదకుల పక్షాన ఎం.శ్రీధర్, పాఠకుల పక్షాన కుర్ర జితేంద్రబాబు, అంబటి మురళీకృష్ణ, వర్మ, పుస్తక విక్రేతల పక్షాన నవోదయ సాంబశివరావు, పత్రికల పక్షాన ఆర్.ఎం.ఉమా మహేశ్వర రావు, ముద్రాపకుల పక్షాన పొన్నపల్లి సీత హాజరై తమ అభిప్రాయాలను, అనుభవాలను సదస్సు ద్వారా వ్యక్తీకరించారు. ఈ సదస్సుకు ఎ.కె.ప్రభాకర్ స్వాగతోపన్యాసం చేయగా మనసు ఫౌండేషన్ ప్రతినిధి ఎం.రాయుడు వందన సమర్పణ చేశారు. -
‘చాన్స్’ కోసం ప్రొఫెసర్ల పోటీ
9 వైస్ చాన్స్‌లర్ పోస్టుల కోసం 450కి పైగా దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్(వీసీ) పోస్టుల కోసం పోటీ తీవ్రమైంది. వైస్ చాన్స్‌లర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే ప్రొఫెసర్ల సీనియారిటీ అర్హతను 10 నుంచి 5 ఏళ్లకు తగ్గించడంతో ఆశావహులు పెరిగారు. ప్రొఫెసర్లే కాకుండా ఏదేని పరిశోధనా సంస్థలో ఐదేళ్లు పనిచేసి ఉన్నా, పరిపాలనా రంగంలో పనిచేసి, ఐదేళ్లపాటు పాలన అనుభవం కలిగి ఉన్నావారు కూడా అర్హులేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని 9 వర్సిటీలు- ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల వీసీ పోస్టుల కోసం ఇప్పటివరకు ఆఫ్‌లైన్ 53 మంది, ఆన్లైన్లో 400 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీ వరకు ఉంది. దీంతో మరో 200కుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఉన్నత విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. వీసీలుగా ఐఏఎస్, ఐపీఎస్‌లకు అవకాశం? వైస్‌చాన్స్‌లర్లుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కొన్ని విశ్వ విద్యాలయాలకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వైస్‌చాన్స్‌లర్లుగా నియమించే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వచ్చే దరఖాస్తులను ప్రొసీజర్ ప్రకారం ఒక్కో యూనివర్సిటీకి వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హతలను బ ట్టి ముగ్గురి పేర్లను సర్చ్ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. ఆ సర్చ్ కమిటీలో యూజీసీ నామినీ, యూనివర్సిటీ నామినీతోపాటు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కూడా సభ్యులుగా ఉంటారు. దీంతో దరఖాస్తు చేసుకోకపోయినా ప్రభుత్వం సూచించే పేరును కూడా ముగ్గురి పేర్లలో ఒకరిగా చేర్చే అవకాశముంది. ఇందులో ప్రభుత్వం తరఫున రిటైర్డ్, పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు రిటైర్డ్ లేదా ప్రస్తుతం పనిచేస్తున్న జూనియర్ ఐపీఎస్ అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వచ్చే నెల 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్న నేపథ్యంలో ఆ తరువాతే ఏయే యూనివర్సిటీకి ఎవరిని వైస్ చాన్స్‌లర్‌గా నియమిస్తారన్నది తేలనుంది. మొత్తానికి జనవరి నెలాఖరుకల్లా వీసీలను నియమించే అవకాశముంది. -
తెలుగువర్శిటీ ఎంఎ దూరవిద్య పరీక్షలు వాయిదా
శ్రీశైలం : పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 3 వ తేదీ నుంచి నిర్వహించే ఎంఎ దూర విద్య కోర్సుల వార్షిక పరీక్షలు వాయిదా వేసినట్లు శ్రీశైలం పీఠం పీఠాధిపతి పి.అప్పారావు మంగళవారం తెలిపారు. హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, కూచిపూడి ప్రాంగణాలలో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేశామని, ఈ వార్షిక పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తారని తెలుగువర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య తోమాసయ్య తెలిపినట్లు శ్రీశైలం పీఠాధిపతి పేర్కొన్నారు. -
‘సాహితీ పురస్కారాల’కు సూచనలివ్వండి
హైదరాబాద్: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనల్ని ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహితీ పురస్కారాలను ప్రదానం చేస్తోంది. 2013, 2014 సంవత్సరాలకు ప్రదానం చేసే పురస్కారాల ఎంపికకు వివిధ వర్గాల నుంచి వర్సిటీ సూచనలు కోరుతోంది. 2013 పురస్కారాలకైతే 2010 జనవరి నుండి 2012 డిసెంబరు మధ్య కాలంలో వెలువడిన పుస్తకాలను, 2014 పురస్కారాలకైతే 2011 జనవరి నుంచి 2013 డిసెంబరు మధ్య కాలంలో వెలువడిన పుస్తకాలను పరిశీలనకు సూచించాలి. వచన కవిత, పద్య కవిత, బాల సాహిత్యం, నవల, కథానికల సంపుటి, నాటకం, నాటికల సంపుటి, సాహిత్య విమర్శ, అనువాద సాహిత్యం, వచన రచన, రచయిత్రి ఉత్తమ గ్రంథం అనే 10 ప్రక్రియల్లో అన్ని ప్రక్రియలకు గాని, కొన్నింటికి గాని, తమకు నచ్చిన గ్రంథాలను పురస్కారాలకు సూచించవచ్చు. 2014 పురస్కారాల్లో గేయ కవితా పురస్కారం కూడా ఉంటుంది. ఈ పురస్కారానికి 2009 నుంచి 2013 మధ్యకాలంలో ప్రచురితమైన గేయ కవితా సంపుటాలను సూచించాలి. సూచనలో ప్రక్రియ పేరు, గ్రంథం పేరు, రచయిత పేరు, చిరునామా, పేజీల సంఖ్య, ప్రచురణ సంవత్సరం, ప్రచురణ కర్త పేరు పేర్కొనాలి. రచయితలు కూడా తమ గ్రంథాలను స్వయంగా సూచించవచ్చు. అనువాద సాహిత్య విభాగానికి తప్ప మిగతా విభాగానికి అవార్డుల కోసం అనువాదాలు, అనుసరణలు సూచించరాదు. వచన రచన అనే ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, తాత్త్విక, వైజ్ఞానిక, స్వీయ చరిత్ర, దేశ చరిత్ర, సంస్కృతి కళలకు సంబంధించిన గ్రంథాలు సూచించవచ్చు. అన్ని ప్రక్రియల్లో గ్రంథాలు 96 పేజీలకు తగ్గరాదు. బాల సాహిత్యం, నాటకం ప్రక్రియలలో పుటల పరిమితి లేదు. రచయిత మరణించినప్పటికీ 2010 జనవరి నుండి 2013 డిసెంబర్ మధ్య కాలంలో వారి రచన ప్రచురణ పొంది ఉంటే అవార్డుకు సూచించవచ్చు. తెల్ల కాగితంపై పాఠకులు తమ సూచనల్ని రాసి రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్-4 చిరునామాకు సెప్టెంబరు 5లోగా పంపాలని రిజిస్ట్రార్ కె.తోమాసయ్య తెలిపారు. -
సగటు మహిళే నా నాయిక
‘కల్పనా సాహిత్యం- రచయిత్రుల కృషి’ సదస్సులో ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సాక్షి, హైదరాబాద్: నాకు ఏ పుస్తకాలూ, కవులూ ప్రేరణ కాదు. సగటు మహిళ త్యాగం, శ్రమ, ఆమె జీవితమే నా రచనలకు ప్రేరణ. నా కథలు, నవలల్లో నాయిక ఆమే’’ అని సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి తెలిపారు. ‘సెక్రటరీ’, ‘మీనా’, ‘జీవన తరంగాలు’ లాంటి ప్రసిద్ధ నవలల ద్వారా కొన్ని తరాలను ఉర్రూతలూపిన యద్దనపూడి చాలా ఏళ్ల తర్వాత మళ్లీ సాహితీ ప్రియుల ముందుకు వచ్చి తన మనసులోని మాటలను పంచుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ‘కల్పనా సాహిత్యం - రచయిత్రుల కృషి’ అనే అంశంపై వర్సిటీలోని మహిళా అధ్యయన కేంద్రం, రచయిత్రులే సభ్యులుగా నడుస్తున్న మహిళా చైతన్య సాహితీ సాంస్కృతిక సంస్థ ‘లేఖిని’ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో యద్దనపూడి ప్రారంభోపన్యాసం చేశారు. ‘‘అప్పట్లో కొంతమంది వంటింటి సాహిత్యం అంటూ స్త్రీల రచనల్ని చిన్నచూపు చూసేవారు. ఆ మాటలకు భిన్నంగా పాఠకులు ఈ రచనలను బాగా ఆదరించారు. అది నాపట్ల, నా రచనలపట్ల ప్రేమానుబంధంగా పరిణమించింది. నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టాను. కథలు రాయడం మొదలుపెట్టాక ఆ ఇల్లే నాకు విస్తృత సమాజంగా అనిపించేది. నేను చదివింది పదే అయినా చూసిన విషయాలు, నా చుట్టూ ఉన్న మనుషుల జీవితాలతోనే మమేకమయ్యాను. అవే నేను రాశాను. నా కలానికి సగటు గృహిణే పెద్ద బలం. నేను, నా పాఠకులు, నా ప్రచురణకర్తలు.. ఇదొక త్రివేణీ సంగమం’’ అని యద్దనపూడి తన రచనా జీవితాన్ని ఆవిష్కరించారు. స్త్రీల రచనలే సమాజానికి మేలు చేశాయి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటూ ‘‘ఈనాడు కవిత్వంకన్నా ఎక్కువ మేలు చేస్తున్నది కథలే. స్త్రీల రచనలు ‘వంటింటి కథలు’ కాదు. అవి ఇంటింటి కథలు’’ అని వ్యాఖ్యానించారు. రచయిత్రుల రచనలు ప్రారంభమై వందేళ్లు గడచినా వాటిపై తగినంత చర్చ జరగడం లేదనీ, అందుకే నిరుడు తెలంగాణ రచయిత్రుల సదస్సు చేసినట్లే, ఈసారి ఈ ప్రయత్నం చేస్తున్నామని మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు, రచయిత్రి సి.మృణాళిని తన అధ్యక్షోపన్యాసంలో పేర్కొన్నారు. సాహితీవేత్త ఆచార్య సుమతీ నరేంద్ర కీలకోపన్యాసం చేస్తూ పత్రికల్లో వచ్చే యద్దనపూడి తదితరుల రచనలను ముందుగా చదవడం కోసం ఆ రోజుల్లో పాఠకుల్లో నెలకొన్న పోటీ వాతావరణాన్ని గుర్తుచేశారు. స్త్రీల రచనలపై వచ్చిన విమర్శల్ని తిప్పి కొడుతూ, ‘‘స్త్రీల రచనలు అమ్మల మనోభావాలనూ, ఉద్యోగినుల సమస్యలనూ, బాల వితంతువుల సమస్యలనూ, ఇష్టంలేని భర్తతో కాపురం చేస్తున్న స్త్రీల వేదనలనూ ప్రతిబింబించాయి. సెక్స్, క్రైమ్, మూఢనమ్మకాలే ప్రధానాంశాలుగా రాసిన నవలలకన్నా ఇవే మెరుగైనవి, సమాజానికి మేలు చేసినవి’’ అని సుమతీ నరేంద్ర విశ్లేషించారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త ముదిగంటి సుజాతారెడ్డి మాట్లాడుతూ, స్త్రీల సాహిత్య ఆవిర్భావం నుంచి 1960ల దాకా సాగిన కృషిని సమీక్షించారు. ‘లేఖిని’ అధ్యక్షురాలు, రచయిత్రి వాసా ప్రభావతి మాట్లాడుతూ ‘‘తెలుగు సమాజాన్ని ఉన్నత స్థాయికి తెచ్చింది రచయిత్రులే’’ అన్నారు. ఈ సదస్సు ద్వారా 1960ల మొదలు ఇప్పటివరకు వచ్చిన స్త్రీల సాహిత్యంపై సింహావలోకనం జరుపుతున్నట్లు తెలిపారు. గౌరవ అతిథిగా హాజరైన కథా రచయిత ఏఎన్ జగన్నాథ శర్మ మాట్లాడుతూ తన రచనా నేపథ్యానికి బీజం వేసింది మహిళలు, మహిళల సాహిత్యమేనన్నారు. రచయిత్రుల సందడి ప్రముఖ రచయిత్రులు డి.కామేశ్వరి, పొత్తూరి విజయలక్ష్మి, డి.శారదా అశోకవర్ధన్, ముక్తేవి భారతి, శాంతకుమారి, కె.బి. లక్ష్మి, సోమరాజు సుశీల తదితరులతోపాటు రచయితలు శ్రీపతి, వేదగిరి రాంబాబు, సుధామ, సుద్దాల అశోక్‌తేజ హాజరవడంతో సభా ప్రాంగణం సాహితీ పరిమళాలు వెదజల్లింది. రామలక్ష్మీ ఆరుద్ర, రంగనాయకమ్మ, అబ్బూరి ఛాయాదేవి, నాయని కృష్ణకుమారి, ఆనందారామం తదితర 15 మంది ప్రముఖ రచయిత్రుల రచనలను విశ్లేషిస్తూ మరో 15 మంది రచయిత్రులు పత్రాలను సమర్పించడం ఈ సదస్సును సాధారణ సమావేశాలకన్నా భిన్నంగా నిలిపింది. -
ఇది మలి మధ్యయుగ చారిత్రక దృశ్యం!
చరిత్ర పరిశోధన లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఒక వాస్తవం గమనించక తప్పదు. గతంతో వర్తమానం సంభాషి స్తూనే ఉంటుంది. సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్య వస్థ, ఆర్థిక వ్యవస్థ, మానవ సంబంధాలు, కళలు ఇవన్నీ గతం పునాది మీదే పటిష్టమవుతాయి. చరి త్ర ప్రస్థానంలోని కొన్ని కొన్ని బిందువులు ఇలాంటి మలుపులకు ఆలవాలంగా ఉంటాయి. తెలుగు వారి చరిత్రలో మలి మధ్యయుగం ఇందుకు నిదర్శనం. చరిత్రకారుల దృష్టి కోణం నుంచి చెప్పాలంటే క్రీస్తు శకం 1324-1724 మధ్య కాలమన్నమాట. ఈ చరి త్రనే ‘మలి మధ్యయుగ ఆంధ్రదేశం’ పేరుతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ సంయుక్తంగా ఇప్పుడు మన ముం దుకు తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర - సం స్కృతి పేరుతో చరిత్ర కాంగ్రెస్ వెలువరిస్తున్న సంపు టాలలో ఇది ఐదవది. సంపాదకులు-ఆర్. సోమా రెడ్డి (విశ్రాంత ఆచార్యులు, చరిత్రశాఖ, ఉస్మాని యా విశ్వవిద్యాలయం). ఒక సమున్నత ఆశయంతో తెలుగువారి చరి త్రను ఎనిమిది సంపుటాలలో అందించాలని ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 1998లో నిర్ణయించింది. అప్పటి నుంచి అవిశ్రాంతంగా జరుగుతున్న కృషి ఫలితంగా వెలువడిన సంపుటాలలో ఇది ఐదవది. మిగిలిన మూడు సంపు టాల పని కూడా దాదాపు పూర్తి కావ చ్చింది. ఈ సంవత్సరాంతానికి ఈ యజ్ఞాన్ని పూర్తి చేయాలని సంపాదక మండలి నిర్ణయించింది. ఐదో సంపుటి కూడా ఆ కాలపు విస్తృత చారిత్రక, సామాజిక చిత్రాన్ని ఆవిష్కరించగలుగుతుంది. ముసునూరి నాయకుల ఆవిర్భావంతో ఆరంభమై, బహ్మ నీలు, కుతుబ్‌షా హీలు, మొగలుల ప్రభావంవరకు వివరించే ఈ గ్రంథం సారం ఏమిటో, ఇంకా చెప్పా లంటే ఆత్మ ఎలాంటిదో ‘సంధిదశ’ పేరుతో సంపా దకుడు రమణీయంగా ఆవిష్కరించారు. కాకతీయు ల తరువాత తెలుగు ప్రాంత రాజకీయ ఐక్యత తుగ్లక్‌ల చేతిలో ఎలా విధ్వంసమైనదో చెబుతూ ఈ పుస్తకం ఆరంభమవుతుంది. ఆపై ముసునూరి నా యకులు, కొండవీడు, రాజమహేంద్రవరం, రెడ్డిరా జ్యాల గురించి వివరణ ఉంది. తెలుగు ప్రాంతాల మీద విజయనగర రాజ్య ప్రభావం మరో ముఖ్యమైన అంశం. ఈ అన్ని శతాబ్దాలలోను తెలుగు ప్రాంతం అనేక పాలక విధానాలను, పరిణామాలను చూసింది. వాటి మీద తెలుగు ప్రజానీకం స్పందన ఏమిటి? సేద్యం, సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, కళల మీద, విద్య మీద ఆయా పాలక వ్యవస్థ ప్రభావం ఎలాంటిది? ఇవన్నీ తరు వాత అధ్యాయాలలో విస్తృతంగా చర్చించారు. ఇను ము-ఉక్కు పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తులు, వర్తక వాణిజ్యాలు, విదేశీ వాణిజ్యం, పట్ట ణీకరణ, విజయనగరంలో దేవదాసీ వ్యవస్థ, వైద్య విధానాలు, ఆహారం, వేడుకలు, ఆహార్యం వంటి అంశాల గురించి నిపుణులు వివరించారు. ఉపోద్ఘా తంలో చెప్పినట్టు ఇదొక సంధిదశ. ఇలాంటి కాలం లో అప్పటికే వేళ్లూనుకుని ఉన్న హిందూమతం, ఇస్లాంల ఉనికి ఎలాంటిది? అప్పుడే కాలూనడానికి ప్రయత్నిస్తున్న క్రైస్తవం అస్తిత్వం ఏమిటి? ఇవి ఆసక్తికరమైన అంశాలు. వీటిని పీవీ పరబ్రహ్మశాస్త్రి వంటి ఉద్దండులు చర్చించారు. రంగస్థల కళల గురించి నాగభూషణశర్మ వంటి నిపుణునితో రాయించడం సముచితంగా ఉంది. సంగీతం, సం స్కృతం, తెలుగు సాహిత్యాలు, స్త్రీల రచనలు, తెలు గు భాషాభివృద్ధి, ఉర్దూ, పర్షియన్ భాషా సాహి త్యాల గురించి కూడా విశ్లేషించారు . ఇంతటి కృషికి ప్రధాన సంపాదకులు వకుళాభరణం రామకృష్ణ, సంపాదకులు సోమారెడ్డి, ఇతర సభ్యులు ఐ. లక్ష్మి, సి. సోమసుందరరావు, కీ.శే. బి. రాజేంద్రప్రసాద్ అభినందనీయులు. ఇది తెలుగు ప్రాంతం రెండుగా విభజించ డానికి ముందు ఎప్పుడో ఆరంభమైన ఆలోచన. రెం డు ప్రాంతాల చరిత్రకారులు ఈ మహా కృషిలో భాగం పంచుకున్నారు. రాబోయే సంపుటాలలో కూ డా కృషిని అందించబోతున్నారు. రెండు ప్రాంతాల ఉమ్మడి చరిత్ర కాబట్టే ఇది సాధ్యమైంది. (‘మలి మధ్య యుగ ఆంధ్రదేశం’ గ్రంథాన్ని నేటి సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టర్ కేవీ రమణాచారి ఆవిష్కరిస్తున్నారు. మండలి బుద్ధ ప్రసాద్, గవర్నర్ చీఫ్ సెక్రటరీ రమేశ్‌కుమార్ ప్రసంగిస్తారు) -
రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి : నాయిని
నాంపల్లి: తెలుగు విద్యార్థులకు మంచి ప్రతిభ ఉందని, మనవాళ్లు ఎక్కడకు పోయినా రాణిస్తారని రాష్ట్ర హోంశాఖా మంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు. అమెరికా తదితర దేశాల్లో తెలుగు ప్రజలు కీలక ఉద్యోగాలు చేస్తున్నారని వెల్లడించారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంగమ్ కళా గ్రూపు ఆధ్వర్యంలో విద్యార్థులకు రాష్ట్రస్థాయి పాటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజకీయాల్లో విబేధాలు రావడంతో రాష్ట్రం బాగా దెబ్బతిన్నదని చెప్పారు. ఆర్థికంగా దెబ్బతిన్న రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పాలకుల పరిపాలన సరిగా లేకపోవడంతోనే తెలుగు వాళ్లు రెండుగా విడిపోవాల్సి వచ్చిందని వెల్లడించారు. పాటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ఢిల్లీలో జరిగే ఫైనల్ పోటీల్లోనూ విజయం సాధిస్తారని ఆకాంక్షించారు. -
నిరంతర అధ్యయనానికే గుర్తింపు
వేడుకగా తెలుగు వర్సిటీ స్నాతకోత్సవం ప్రముఖ సాహితీవేత్త కపిలవాయికి గౌరవ డాక్టరేట్ 62 మందికి పీహెచ్‌డీలు, 59 మందికి బంగారు పతకాల ప్రదానం సాక్షి,సిటీబ్యూరో: మారుతున్న ప్రపంచ పరిణామాల్లో నిరంతర అధ్యయన శీలురుగా మసలుకొంటూ ముందుకు సాగాలని ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి ఉద్బోధించారు. ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ మీరు ఎంచుకున్న రంగంలో నిపుణులు కావాలని సూచించారు. అప్పుడే సమాజం గుర్తించే స్థాయికి చేరగలరన్నారు. శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 13 స్నాతకోత్సవం రవీంద్రభారతిలో నిర్వహించారు. శతాధిక గ్రంధకర్త, ప్రముఖ పండితుడు, కవి, నవలాకారుడు, ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాస్త్ర జ్ఞానం కంటే తనను తాను తెలుసుకున్నప్పుడే తత్త్వజ్ఞుడన్న సంగతి గ్రహించాలన్నారు. అనంతరం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.కవితా ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం, వివిధ పీఠాల అధిపతులు, విశ్వవిద్యాలయ నిర్వహణ మండలి సభ్యులు చెన్నారెడ్డి, సత్తిరెడ్డి, అప్పారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో గడిచిన మూడు విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పట్టాలను ప్రదానం చేశారు. 62 మందికి పీహెచ్‌డీలు, 97 మందికి ఎంఫిల్ పట్టాలను, 59 మందికి బంగారు పతకాలను అందజేశారు. అన్ని కోర్సులకు కలిపి 2128 మందికి, సంగీత, నృత్య విభాగాల్లో 4757 మంది పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా బంగారు పతకాలు, పీహెచ్‌డీలు సాధించిన వారు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బాధ్యతను పెంచింది నృత్యంలో డాక్టరేట్ కొంత కష్టంతో కూడుకున్న పనే అయినా చేశా. లలిత కళల పీఠం నుంచి పట్టా తీసుకోవడం ఆనందంగా ఉంది. డ్యాన్స్‌కు ముక్తాయింపు పీహెచ్డీ. ఈ పట్టా ద్వారా ఆర్ట్స్‌పై నాలెడ్జ్ వస్తుంది. ‘సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రీకరణ’ అంశంపై డాక్టరేట్ చేశాను. - మద్దాళి ఉషా గాయత్రి నా తల్లిదండ్రులకు అంకితం.. నాటక రంగంపై ఉన్న మక్కువతో కష్టమైనా ఇష్టంగా భావించి పరిశోధన చేశా. పీహెచ్డీ వచ్చింది. దీన్ని నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నా. గతంలో కూడా నా రచనలకు నాంది అవార్డు వచ్చింది. పలువురు సాహితీవేత్తలు నాకు సలహాలు ఇచ్చి సహకరించారు. అందరికి కృతజ్ఞతలు. - వి.త్రినాథరావు చాలా సంతోషంగా ఉంది జర్నలిజంలో ఒక అంశంపై అద్యయం చేశాను. కష్టానికి ఫలితమన్నట్టు బంగారు పతకం రావటం మరింత ఆనందం కల్గిస్తోంది. నా కష్టంతో పాటు చాలా మంది తనకి సలహాలు- సూచనలు ఇచ్చి సహకరించారు. భవిష్యత్తులో మరిన్ని అంశాలపై పరిశోధనలు చేస్తా. మా గురువు సత్తిరెడ్డి పొత్సాహం వెలకట్టలేనిది. - భువనగిరి రఘు అమ్మవారి కృపే.. కూచిపూడి నృత్య రూపాల్లో చాలా సార్లు అమ్మవారిపై నృత్యం చేశాను. అమె కృప వల్లే కూచిపూడిలో బంగారు పతకం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మా గురువు సతీమణి సమక్షంలో రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నా. ఈ ఆనందమైన క్షణాలను వర్ణించలేను. జీవితంలో మరువలేను. - నూతి రోహిణి -
సంస్కృతి... సమాజాల సమర్చకుడు
కొత్త పుస్తకం జీవితంలో ఎన్నో కష్టాలు పడి పట్టుదలతో పైకొచ్చిన వ్యక్తి... ఉన్నతాధికారిగా పగ్గాలు చేతిలో ఉన్నా ప్రజల బాగు మర్చిపోని మనిషి... నమ్మి ఇచ్చిన బాధ్యతలను నిజాయితీతో, త్రికరణశుద్ధిగా నెరవేర్చిన పాలనాదక్షుడు... సాహితీ, సాంస్కృతిక రంగాలకు ప్రాణబంధువు... ఐ.ఎ.ఎస్‌గా, అంతకు మించి మంచి మనిషిగా మన్ననలందుకున్న అందరివాడు - రమణాచారి. ఆ కళా హృదయుడి జీవన తరంగాల నుంచి కొన్ని స్మృతి వీచికలు. రమణ బాల్యంలో వారిది ఉమ్మడి కుటుంబం. పూటకు పదిహేను విస్తళ్లు లేవాలి. ఇంటి యజమాని (నాన్నగారి) ఆదాయం మాత్రం నెలకు పాతిక రూపాయలు! ఆ ఇల్లాలు పద్మావతమ్మ అటు అత్తమామలు, మరుదులు, ఇటు తన సంతానం అయిదుగురులో ఎవరికీ ఏదీ లోటు రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. పెద్ద కొడుకు రమణ పొద్దున్నే బాబాయిలతో కలిసి వెళ్లి రెండు కిలోమీటర్ల దూరం నుంచి తాగడానికి నీళ్లు తెచ్చేవారు. తర్వాత అందరి స్నానాలకు బావి నీళ్ల తోడి కాచేవారు. చెల్లెళ్లు అమ్మకు ఇంటి పనిలో సాయం చేసేశారు. రాత్రి ఏడు గంటలకు భోజనాలు అయిపోయేవి. పిల్లలందరూ ఒకే గొంగళి కప్పుకొని నిద్రపోయేవారు. నాలుగున్నరకి నిద్ర లేపేవారు. రోజూ రెండు గంటలు తప్పని సరిగా పాఠాలు చదివేవారు. చిన్నతనంలో వచ్చిన ఆ అలవాటు రమణని ఇప్పటికీ అంటి పెట్టుకునే ఉంది. అప్పట్లో రమణ కాళ్లకు చెప్పులుండేవి కావు. చిన్నాన్నలు వాడేసిన దుస్తులే వేసుకోవాల్సి వచ్చేది. అయితేనేం మొక్కవోని ఆత్మవిశ్వాసం ఉండేది. క్లిష్టమైన పాఠ్యాంశాన్నైనా అవగతం చేసుకోగల నేర్పు ఉండేది. 1975లో వరంగల్లులో కెమిస్ట్రీ లెక్చరరుగా ఉంటోన్న కాలంలో ఓ రోజు రమణ, మరో నలుగురు లెక్చరర్లతో పాటు కలెక్టరేట్‌కి వెళ్లారు. అక్కడ రేషన్‌కార్డు కోసం వెళ్ళినప్పుడు లెక్చరర్లని కూడా చూడకుండా ఓ గుమస్తా వాళ్లను అవమానించాడు. అంతే! ‘నేను కలెక్టర్‌ని కావాలి! లేదా పరిపాలనా రంగంలో ఉన్నత ఉద్యోగిగా ఉండాలి. సామాన్య ప్రజలకు న్యాయం దక్కేలా చేయాలి. గ్రూప్ వన్ పరీక్షలైనా రాస్తాను... అని రమణ పట్టుదలగా పరీక్షలు రాసి, కృతార్థుడయ్యారు. నందమూరి తారక రామారావు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటయ్యాక హైదరాబాద్‌లోని కులీకుతుబ్‌షా డెవలప్మెంట్ అథారిటీని క్రియాశీలంగా మార్చాలని ముఖ్యమంత్రి ఆలోచించారు...మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంత అభివృద్ధికి ఏర్పాటైన సంస్థకి అడ్మినిస్ట్రేటర్‌గా ఎవరిని నియమించాలి? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది? అడ్మినిస్ట్రేటర్ సమర్థుడై ఉండాలి. ఆయనకు ఇంగ్లీషు మాత్రమే వస్తే సరిపోదు, తెలుగు, ఉర్దూ బాషల్లో కూడా మంచి ప్రవేశం ఉండాలి. అన్ని మతాల, వర్గాల వారినీ కలుపుకొని పోగలగాలి. అటువంటి అధికారి ఎవరా? అని మంత్రిమండలిలో చర్చకు వచ్చింది. 1984 నాటికి రమణని భారత ప్రభుత్వం ఐ.ఏ.ఎస్. అధికారిగా కన్ఫర్మ్ చేసింది. ఆ కాలంలోనే నెల్లూరును గజగజలాడించిన పెనుతుపానుకు వేల మంది నిరాశ్రయులయ్యారు. రైతుల పంటలు, జీవితాలు నీళ్లపాలయ్యాయి. సైక్లోన్ స్పెషలాఫీసరుగా రమణ నెల్లూరు జిల్లా ప్రజలకు తక్షణ ప్రభుత్వ సాయం అందించడంలో కృతకృత్యులయ్యారు. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. అయితే ఇంకేం ‘వారినే నియమిద్దాం’ అన్నారు ముఖ్యమంత్రి. కులీకుతుబ్‌షా డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేటర్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత రమణ దృష్టి కులీకుతుబ్‌షా సమాధులవైపు మళ్లింది. ఒక్క ముంతాజ్ బేగం సమాధి తాజ్‌మహల్‌గా ప్రపంచ ప్రసిద్ధి చెందితే ఏడు సమాధుల మాటేమిటి? వాటిని అభివృద్ధి పరిస్తే ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌కు పేరొస్తుంది. ముఖ్యమంత్రి ఎన్టీయార్ పూనికతో కె.వి. రమణాచారి దృఢసంకల్పంతో అది ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకొంది. సుమారు నూరు ఎకరాల పైనున్న సమాధుల ప్రాంతంలో రెండు కోట్లతో అభివృద్ధిపరచే ప్రణాళికను సిద్ధంచేసి అమలుచేశారు. విదేశీ పర్యాటకులకూ ఆ ప్రాంతం ఆకర్షణగా నిలిచింది. ఓ పర్యాయం ఆంధ్ర మహిళాసభలో కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వెళ్లవలసి వచ్చింది. రమణని పిలిచి ప్రసంగం తయారు చేయమన్నారు. రమణ తయారుచేశారు. అది చదివి చెన్నారెడ్డి ఆనందించారు. ముఖ్యంగా ఆ ప్రసంగంలో రమణ ఉదహరించిన ఉర్దూ కవిత ‘లోగోంకే పాస్ వక్త్ హై / నఫ్రత్‌కే వాస్తే / జబ్కే హయాత్ కమ్హై / మొహబ్బత్కే వాస్తే’ (జనం వద్ద వైరం కోసం సమయం ఉంది... కానీ ప్రేమకోసం మాత్రం సమయం లేదు) ఆయన్ని బాగా ఆకట్టుకుంది. దీన్ని చెన్నారెడ్డి తన మిత్రులందరికీ చెప్పారు. ‘‘మా పీఆర్వో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషుల్లో ఉద్దండుడు’’ అంటూ ప్రశంసించారు. అప్పట్నించీ చెన్నారెడ్డి ఇష్టుల్లో రమణ ఒకరు. సాంస్కృతిక శాఖలో అనే కాదు, ఏ శాఖలో అయినా అద్భుతాలు చేయవచ్చు. సృష్టించవచ్చు. మనకెందుకు? మన జీతం మనకొస్తోంది కదా అనుకుంటే చేసేదేముంటుంది! గత నలభై సంవత్సరాలుగా సాంస్కృతికశాఖ పనితీరును చాలా సన్నిహితంగా గమనిస్తూనే ఉన్నవారికి రమణ లాంటి ఇద్దరు ముగ్గురి హయాంలోనే అది చాలా క్రియాశీలంగా పనిచేసిందనిపిస్తుంది. సాంస్కృతికశాఖలో రమణ ఉన్నప్పుడే అఖిలాంధ్ర నాటకోత్సవాలు ప్రవేశపెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారంతో మన తెలుగుజాతి చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించేలా శాతవాహనోత్సవాలు, చాళుక్యోత్సవాలు, విజయనగరోత్సవాలు, కాకతీయోత్సవాలు, గోల్కొండోత్సవాలు - ఇలా ఉత్సవాల పరంపర మొదలుపెట్టి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ‘సౌజన్య సంస్కృతీ పథకం’ ప్రవేశపెట్టి రాష్ట్రంలోని వివిధ సాహితీ, సాంస్కృతిక సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం చేదోడుగా ఉండాలని ఆర్థిక సహకారం అందించారు. రమణ మాటల్లో చెప్పాలంటే ‘‘ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల కంటే సాంస్కృతిక సంస్థలు, సాహితీ సంస్థలు చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వం చేదోడు అందిస్తే విశేష జనాదరణ పొందగలమన్నది నా విశ్వాసం.’’ -
అన్ని భాషల్లోనూ ‘లిపి’ రావాలి
రవ్వా శ్రీహరి =వేడుకగా ‘తిరుమల’ శతజయంతి సదస్సు సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: తిరుమల రామచంద్ర అపూర్వ రచన ‘లిపి : పుట్టుపూర్వోత్తరాలు’ అన్ని భారతీయ భాషాల్లోనూ రావాలని టీటీడీ పబ్లికేషన్స్ పూర్వ ఎడిటర్-ఇన్-చార్జ్ రవ్వా శ్రీహరి అన్నారు. సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, బహు భాషావేత్త తిరుమల రామచంద్ర శతజయంతి సందర్భంగా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సింపోజియం నిర్వహించారు. సాహిత్య అకాడమీ సలహా సంఘం సభ్యుడు ఎన్.గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దక్షిణాది భాషలు-ఉత్తరాది భాషలు-సంస్కృతం మాత్రమే తెలిసినవారు తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు చెప్పలేరన్నారు. సంస్కృతానికి సైతం పూర్వభాష అయిన ప్రాకృతంలో తెలుగు పదాలున్నాయని తిరుమల మాత్రమే చెప్పగలిగారని కొనియాడారు. ‘ప్రాకృత అకాడమీ’ ఎంతో అవసరం సంస్కృతం, ప్రాకృత భాషలు ఒకే పువ్వులోని రెండు రేకలుగా అభివర్ణించే రామచంద్ర, రుగ్వేదంలోని చందోబద్ధ గీతాలు ప్రాకృత భాషవేనని నిరూపించారని ప్రొఫెసర్ చౌడూరి ఉపేంద్రరావు పేర్కొన్నారు. తిరుమల ఆకాంక్ష అయిన ‘ప్రాకృత అకాడమీ’ని, కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా ఏర్పరచాలని సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో చౌడూరి పేర్కొన్నారు. ఆయన ‘తిరుమల రామచంద్ర: పాళి-ప్రాకృత పరిశోధన’ అంశంపై పరిశోధనాపత్రం సమర్పించారు. సూర్యుడు అస్తమిస్తున్నా కిరణాలు ఉన్నతంగానే ఉంటాయన్నట్టు తిరుమల రామచంద్ర ఉన్నతమైన జీవితాన్ని గడిపారని ‘తిరుమల రామచంద్ర-కలం చిత్రాలు’ పరిశోధనా పత్రం సమర్పించిన సీనియర్ జర్నలిస్ట్ ఏబికే ప్రసాద్ అన్నారు. రాజరాజ నరేంద్రుడు కాలాన్ని ‘నన్నయ లిపి’, కాకతీయుల పరిపాలనా కాలాన్ని ‘తిక్కన లిపి’, రెడ్డిరాజుల పరిపాలనా కాలాన్ని ‘శ్రీనాథ లిపి’ అంటారని డాక్టర్ ఎం.నారాయణశర్మ పేర్కొన్నారు. ఈ విషయాలను రామచంద్ర ఆయా కాలాల్లో లిపిలో చోటుచేసుకున్న మార్పులను వివరించారన్నారు. అనంతరం ‘లిపి-పుట్టు పూర్తోత్తరాలు’పై ఆయన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. భారత ఉపఖండంలో పర్యటించి దేశీ నాటకలన్నీ చూసి రాసిన పండితుడు తిరుమల రామచంద్ర అని కల్లూరి భాస్కరం కీర్తించారు. గాథా సప్తశతిలో ‘నాటకం’ ఉందని తిరుమల వెల్లడించినట్టు చెప్పారు. అనంతరం ఆయన ‘తిరుమల రామచంద్ర సాహిత్య వ్యాసాలు-పరిశీలన’ అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. తన ఇంటిలోని గుండ్రాయి గురించి అమ్మను-నాయనమ్మను-తాతను అడిగి తెలుసుకున్న విషయాల ద్వారా తెలుగు వారి చరిత్రను చెప్పిన రామచంద్ర, స్వభావరీత్యా ఆధునికుడని ‘హంపి నుంచి హరప్పాదాకా- ఆత్మ కథాంశాలు’పై పరిశోధనా పత్రం సమర్పించిన ఆర్.వి.రామారావు పేర్కొన్నారు. పేదరికం ఆయన వ్రతం.. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రోగిగా చేరిన తిరుమల.. పారితోషికం కోసం వీధిదీపం వెలుతురులో పత్రికలకు వ్యాసాలు రాశారని ‘వ్యక్తిగా తిరుమల రామచంద్ర’ అంశంపై పరిశోధనా పత్రం సమర్పించిన జి.చెన్నయ్య పేర్కొన్నారు. ఆయన పేదరికాన్ని వ్రతంగా స్వీకరించారని అభివర్ణించారు. భావాన్ని తెలియజేయాలనే లక్ష్య సాధనకు పదాలు పనిముట్లని ‘పాత్రికేయుల రచనలు-పలుకుబడి’పై పరిశోధనా పత్రం సమర్పించిన టి.ఉడయవర్లు అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, బెంగళూరు ఇన్-చార్జ్ ఎస్.పి.మహాలింగేశ్వర్ స్వాగతోపన్యాసం చేసిన ఈ సదస్సులో తిరుమల రామచంద్ర కుటుంబ సభ్యులు, వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు, నందిరాజు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
32 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగు సాహిత్యంతోపాటు, భిన్నకళా, సేవా రంగాల్లో విశేష సేవలందించిన 32మంది ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2012 సంవత్సరానికి కీర్తి పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 28న విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేస్తారు. పురస్కారాలకు ఎంపికైన వారిలో మన్నవ భాస్కర నాయుడు (సృజనాత్మక సాహిత్యం), హరిశివకుమార్ (పరిశోధన), ‘రుక్మిణి’ టి.రాంరెడ్డి (హాస్య రచన), మంగళగిరి ప్రమీలాదేవి (జీవితచరిత్ర), ఎం.కె.దేవకి (ఉత్తమ రచయిత్రి), ఎస్.జ్యోతిరాణి (ఉత్తమ నటి), జానకీనాథ్ (ఉత్తమ నటుడు), స్నిగ్ధ శ్రీ గోపి సత్య ప్రకాష్ (ఉత్తమ నాటక రచయిత), మేడూరి సత్యనారాయణ (హేతువాద ప్రచారం), శ్రీపాద స్వాతి (ఉత్తమ రచయిత్రి), చిన్ని నారాయణ రావు (వచన కవిత), ఎ.వి.జనార్దనరావు (వివిధ ప్రక్రియలు), ఎం.సదాశివ శర్మ (పత్రికా రచన), ఆముదాలమురళి (అవధానం), పరుచూరు జమున (మహిళాభ్యుదయం), వనంలక్ష్మీ కాంతారావు (నాటక రంగం), పేట జయలక్ష్మీ (ఆంధ్ర నాట్యం), నాయుని కృష్ణమూర్తి (నవల), ఎ.ఉషాదేవి (సాహిత్య విమర్శ), మల్లవరపు వెంకటరావు (పద్య కవిత), కె.పి.అశోక్ కుమార్ (గ్రంథాలయకర్త), టి.అశోక్‌బాబు (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), కె.వి.నరేందర్(కథ), అమృతలత (సంఘసేవ, నిరంతర విద్య, వ్యక్తిత్వ వికాసం), శిరోమణి వంశీరామరాజు (సాంస్కృతిక సంస్థా నిర్వహణ), సివి.సర్వేశ్వర శర్మ (జనరంజక విజ్ఞానం), అరుణాసుబ్బారావు (జానపద సంగీతం), చొక్కాపు వెంకటరమణ (ఇంద్రజాలం), టి.వేదాంత సూరి (బాల సాహిత్యం) తదితరులు ఉన్నారు. -
సాహితీ పురస్కారాలకు సూచనల ఆహ్వానం
నాంపల్లి, న్యూస్‌లైన్: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ రచనల్ని ప్రోత్సహించడానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏటా సాహిత్య పురస్కారాలను ప్రదానం చేస్తున్నది. 2012 సంవత్సరానికి ప్రదానం చేసే పురస్కారాల ఎంపికకు వివిధ వర్గాల నుంచి విశ్వవిద్యాలయం సూచనలు కోరుతోంది. వివిధ ప్రక్రియల్లో 2009 జనవరి నుంచి 2011 డిసెంబరు మధ్య కాలంలో తొలిసారిగా ప్రచురణ పొందిన గ్రంథాల్లో పాఠకులు ఉత్తమంగా భావించిన గ్రంథాలను అవార్డులకు సూచించ వచ్చు. వచన, కవిత, పద్య కవిత, బాల సాహిత్యం, నవల, కథానికల సంపుటి, నాటకం/నాటికల సంపుటి, సాహిత్య విమర్శ, అనువాద సాహిత్యం, వచన రచన, రచయిత్రి ఉత్తమ గ్రంథం అనే 10 ప్రక్రియల్లో అన్నింటికి గానీ, కొన్నింటికి గానీ, తమకు నచ్చిన గ్రంథాలను సూచించవచ్చు. అనువాద సాహిత్య, విభాగానికి తప్ప మిగతా విభాగానికి అవార్డుల కోసం అనువాదాలు, అనుసరణలు సూచించరాదు. వచన రచన అనే ప్రక్రియలో సామాజిక, ఆర్థిక, తాత్విక, వైజ్ఞానిక, స్వీయ చరిత్ర, దేశ చరిత్ర, సంస్కృతి, కళలకు సంబంధించిన గ్రంథాలుండవచ్చు. అన్ని ప్రక్రియల్లోనూ ప్రామాణికమైన మౌలిక గ్రంథాలే ఉండాలి. కవితా సంపుటిలైతే కనీసం 60 పేజీలు, మిగతా ప్రక్రియల్లో గ్రంథాలు 96 పేజీలకు తగ్గకూడదు. బాల సాహిత్యం, నాటకం ప్రక్రియల్లో పుటల పరిమితి లేదు. తెల్లకాగితంపై పాఠకులు తమ సూచనల్ని రాసి రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు-4 చిరునామాకు నవంబరు 20 లోగా పంపించాలని వర్సిటీ రిజిస్ట్రార్ కె.ఆశీర్వాదం ఒక ప్రకటనలో కోరారు.