రవ్వా శ్రీహరి
=వేడుకగా ‘తిరుమల’ శతజయంతి సదస్సు
సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: తిరుమల రామచంద్ర అపూర్వ రచన ‘లిపి : పుట్టుపూర్వోత్తరాలు’ అన్ని భారతీయ భాషాల్లోనూ రావాలని టీటీడీ పబ్లికేషన్స్ పూర్వ ఎడిటర్-ఇన్-చార్జ్ రవ్వా శ్రీహరి అన్నారు. సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, బహు భాషావేత్త తిరుమల రామచంద్ర శతజయంతి సందర్భంగా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సింపోజియం నిర్వహించారు. సాహిత్య అకాడమీ సలహా సంఘం సభ్యుడు ఎన్.గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దక్షిణాది భాషలు-ఉత్తరాది భాషలు-సంస్కృతం మాత్రమే తెలిసినవారు తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు చెప్పలేరన్నారు. సంస్కృతానికి సైతం పూర్వభాష అయిన ప్రాకృతంలో తెలుగు పదాలున్నాయని తిరుమల మాత్రమే చెప్పగలిగారని కొనియాడారు.
‘ప్రాకృత అకాడమీ’ ఎంతో అవసరం
సంస్కృతం, ప్రాకృత భాషలు ఒకే పువ్వులోని రెండు రేకలుగా అభివర్ణించే రామచంద్ర, రుగ్వేదంలోని చందోబద్ధ గీతాలు ప్రాకృత భాషవేనని నిరూపించారని ప్రొఫెసర్ చౌడూరి ఉపేంద్రరావు పేర్కొన్నారు. తిరుమల ఆకాంక్ష అయిన ‘ప్రాకృత అకాడమీ’ని, కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా ఏర్పరచాలని సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో చౌడూరి పేర్కొన్నారు.
ఆయన ‘తిరుమల రామచంద్ర: పాళి-ప్రాకృత పరిశోధన’ అంశంపై పరిశోధనాపత్రం సమర్పించారు. సూర్యుడు అస్తమిస్తున్నా కిరణాలు ఉన్నతంగానే ఉంటాయన్నట్టు తిరుమల రామచంద్ర ఉన్నతమైన జీవితాన్ని గడిపారని ‘తిరుమల రామచంద్ర-కలం చిత్రాలు’ పరిశోధనా పత్రం సమర్పించిన సీనియర్ జర్నలిస్ట్ ఏబికే ప్రసాద్ అన్నారు.
రాజరాజ నరేంద్రుడు కాలాన్ని ‘నన్నయ లిపి’, కాకతీయుల పరిపాలనా కాలాన్ని ‘తిక్కన లిపి’, రెడ్డిరాజుల పరిపాలనా కాలాన్ని ‘శ్రీనాథ లిపి’ అంటారని డాక్టర్ ఎం.నారాయణశర్మ పేర్కొన్నారు. ఈ విషయాలను రామచంద్ర ఆయా కాలాల్లో లిపిలో చోటుచేసుకున్న మార్పులను వివరించారన్నారు. అనంతరం ‘లిపి-పుట్టు పూర్తోత్తరాలు’పై ఆయన పరిశోధన పత్రాన్ని సమర్పించారు.
భారత ఉపఖండంలో పర్యటించి దేశీ నాటకలన్నీ చూసి రాసిన పండితుడు తిరుమల రామచంద్ర అని కల్లూరి భాస్కరం కీర్తించారు. గాథా సప్తశతిలో ‘నాటకం’ ఉందని తిరుమల వెల్లడించినట్టు చెప్పారు. అనంతరం ఆయన ‘తిరుమల రామచంద్ర సాహిత్య వ్యాసాలు-పరిశీలన’ అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. తన ఇంటిలోని గుండ్రాయి గురించి అమ్మను-నాయనమ్మను-తాతను అడిగి తెలుసుకున్న విషయాల ద్వారా తెలుగు వారి చరిత్రను చెప్పిన రామచంద్ర, స్వభావరీత్యా ఆధునికుడని ‘హంపి నుంచి హరప్పాదాకా- ఆత్మ కథాంశాలు’పై పరిశోధనా పత్రం సమర్పించిన ఆర్.వి.రామారావు పేర్కొన్నారు.
పేదరికం ఆయన వ్రతం..
సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రోగిగా చేరిన తిరుమల.. పారితోషికం కోసం వీధిదీపం వెలుతురులో పత్రికలకు వ్యాసాలు రాశారని ‘వ్యక్తిగా తిరుమల రామచంద్ర’ అంశంపై పరిశోధనా పత్రం సమర్పించిన జి.చెన్నయ్య పేర్కొన్నారు. ఆయన పేదరికాన్ని వ్రతంగా స్వీకరించారని అభివర్ణించారు. భావాన్ని తెలియజేయాలనే లక్ష్య సాధనకు పదాలు పనిముట్లని ‘పాత్రికేయుల రచనలు-పలుకుబడి’పై పరిశోధనా పత్రం సమర్పించిన టి.ఉడయవర్లు అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, బెంగళూరు ఇన్-చార్జ్ ఎస్.పి.మహాలింగేశ్వర్ స్వాగతోపన్యాసం చేసిన ఈ సదస్సులో తిరుమల రామచంద్ర కుటుంబ సభ్యులు, వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు, నందిరాజు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అన్ని భాషల్లోనూ ‘లిపి’ రావాలి
Published Mon, Dec 23 2013 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement