ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.
పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్‌కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.
రెండో దెబ్బ
రూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.
మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment