నిరంతర అధ్యయనానికే గుర్తింపు
- వేడుకగా తెలుగు వర్సిటీ స్నాతకోత్సవం
- ప్రముఖ సాహితీవేత్త కపిలవాయికి గౌరవ డాక్టరేట్
- 62 మందికి పీహెచ్‌డీలు, 59 మందికి బంగారు పతకాల ప్రదానం
సాక్షి,సిటీబ్యూరో: మారుతున్న ప్రపంచ పరిణామాల్లో నిరంతర అధ్యయన శీలురుగా మసలుకొంటూ ముందుకు సాగాలని ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి ఉద్బోధించారు. ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని సముపార్జించుకుంటూ మీరు ఎంచుకున్న రంగంలో నిపుణులు కావాలని సూచించారు. అప్పుడే సమాజం గుర్తించే స్థాయికి చేరగలరన్నారు.
శనివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 13 స్నాతకోత్సవం రవీంద్రభారతిలో నిర్వహించారు. శతాధిక గ్రంధకర్త, ప్రముఖ పండితుడు, కవి, నవలాకారుడు, ప్రముఖ సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శాస్త్ర జ్ఞానం కంటే తనను తాను తెలుసుకున్నప్పుడే తత్త్వజ్ఞుడన్న సంగతి గ్రహించాలన్నారు. అనంతరం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.కవితా ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం, వివిధ పీఠాల అధిపతులు, విశ్వవిద్యాలయ నిర్వహణ మండలి సభ్యులు చెన్నారెడ్డి, సత్తిరెడ్డి, అప్పారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో గడిచిన మూడు విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పట్టాలను ప్రదానం చేశారు. 62 మందికి పీహెచ్‌డీలు, 97 మందికి ఎంఫిల్ పట్టాలను, 59 మందికి బంగారు పతకాలను అందజేశారు. అన్ని కోర్సులకు కలిపి 2128 మందికి, సంగీత, నృత్య విభాగాల్లో 4757 మంది పట్టాలు అందుకున్నారు. ఈ సందర్భంగా బంగారు పతకాలు, పీహెచ్‌డీలు సాధించిన వారు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.
బాధ్యతను పెంచింది
నృత్యంలో డాక్టరేట్ కొంత కష్టంతో కూడుకున్న పనే అయినా చేశా. లలిత కళల పీఠం నుంచి పట్టా తీసుకోవడం ఆనందంగా ఉంది. డ్యాన్స్‌కు ముక్తాయింపు పీహెచ్‌డీ. ఈ పట్టా ద్వారా ఆర్ట్స్‌పై నాలెడ్జ్ వస్తుంది. ‘సాహిత్యంలో సత్యభామ పాత్ర చిత్రీకరణ’ అంశంపై డాక్టరేట్ చేశాను.
- మద్దాళి ఉషా గాయత్రి
నా తల్లిదండ్రులకు అంకితం..
నాటక రంగంపై ఉన్న మక్కువతో కష్టమైనా ఇష్టంగా భావించి పరిశోధన చేశా. పీహెచ్‌డీ వచ్చింది. దీన్ని నా తల్లిదండ్రులకు అంకితమిస్తున్నా. గతంలో కూడా నా రచనలకు నాంది అవార్డు వచ్చింది. పలువురు సాహితీవేత్తలు నాకు సలహాలు ఇచ్చి సహకరించారు. అందరికి కృతజ్ఞతలు.
- వి.త్రినాథరావు
చాలా సంతోషంగా ఉంది
జర్నలిజంలో ఒక అంశంపై అద్యయం చేశాను. కష్టానికి ఫలితమన్నట్టు బంగారు పతకం రావటం మరింత ఆనందం కల్గిస్తోంది. నా కష్టంతో పాటు చాలా మంది తనకి సలహాలు- సూచనలు ఇచ్చి సహకరించారు. భవిష్యత్తులో మరిన్ని అంశాలపై పరిశోధనలు చేస్తా. మా గురువు సత్తిరెడ్డి పొత్సాహం వెలకట్టలేనిది.
- భువనగిరి రఘు
అమ్మవారి కృపే..
కూచిపూడి నృత్య రూపాల్లో చాలా సార్లు అమ్మవారిపై నృత్యం చేశాను. అమె కృప వల్లే కూచిపూడిలో బంగారు పతకం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మా గురువు సతీమణి సమక్షంలో రెండు గోల్డ్ మెడల్స్ అందుకున్నా. ఈ ఆనందమైన క్షణాలను వర్ణించలేను. జీవితంలో మరువలేను.
- నూతి రోహిణి