తెలుగులోనే కథా రచయితలు అధికం
ఈ కథల్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలి: కొలకలూరి ఇనాక్
‘పాతికేళ్ల కథ’ సంకలనాన్ని ఆవిష్కరించిన కా.రా, జంపాల చౌదరి
హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో ఉన్నంతమంది గొప్ప కథా రచయితలు ఏ భారతీయ భాషలో లేరని, ఆ అదృష్టం తెలుగు వారికే ఉందని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. మనసు ఫౌండేషన్, కథా సాహితి నిర్వహణలో వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌లు సంపాదకులుగా 155 మంది రచయితల 336 కథల ‘‘పాతికేళ్ల కథ’’ (1990-2014) సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగింది. ప్రముఖ కవి కె.శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు హాజరై సంకలనాన్ని ఆవిష్కరించారు.
తొలి ప్రతిని ముఖ్య అతిథిగా హాజరైన తానా అధ్యక్షులు జంపాల చౌదరి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇనాక్ మాట్లాడుతూ ఇంత పెద్ద గ్రంథం ముద్రించి, అందరిని చదవగలిగేటట్టు చేసిన వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్‌లను అభినందించారు. ఇన్ని మంచి కథల్లో కొన్నైనా లేకపోతే అన్నైనా అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలని, తప్పనిసరిగా ఆంగ్లంలోకి అనువాదం చేయించాలని జంపాల చౌదరిని కోరారు. ఇవన్నీ ఆంగ్లంలోకి వస్తే తెలుగులో ఎంతటి గొప్ప రచయితలు ఉన్నారో ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. ఉద్యమాలను గురించి తెలుసుకుని సాహిత్యాన్ని రాసేవారు కొందరైతే.. కొంత జీవితాన్ని, కొంత చదువును రెంటినీ సమన్వయం చేసుకుంటూ రాసేవారు మరికొందరు ఉంటారని అన్నారు.
రకరకాల ప్రభావాలతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నవారు ఉన్నప్పటికీ.. ప్రభావాలతో సాహిత్యాన్ని సృష్టించే వారికి పరిమితులుంటాయి కానీ సమాజాన్ని చూసి సాహిత్యాన్ని సృష్టించే వారికి పరిమితులు ఉండవని అన్నారు. తానా అధ్యక్షులు జంపాల చౌదరి మాట్లాడుతూ కథల పుస్తకాల ప్రచురణకు పాతికేళ్ల పాటు ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నానని అన్నారు. భవిష్యత్తులోనూ కథల ప్రచురణకు సహాయాన్ని అందజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయితలు వివినమూర్తి, కేతు విశ్వనాథరెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, వీక్షణం సంపాదకులు ఎన్.వే ణుగోపాల్ హాజరై ప్రసంగించారు. మధ్యాహ్నం జరిగిన పాతికేళ్ల కథాసాహితి జ్ఞాపకాల కలబోత ‘అవలోకనం’ పేరుతో నిర్వహించిన సదస్సుకు వాసిరెడ్డి నవీన్ అధ్యక్షత వహించారు.
రచయితల పక్షాన మధురాంతకం నరేంద్ర, పెద్దింటి అశోక్‌కుమార్, కుప్పిలి పద్మ, మహ్మద్ ఖదీర్ బాబు, సభా నిర్వాహకుల పక్షాన నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్, చిత్రకారుల పక్షాన శీలా వీర్రాజు, అనువాదకుల పక్షాన ఎం.శ్రీధర్, పాఠకుల పక్షాన కుర్ర జితేంద్రబాబు, అంబటి మురళీకృష్ణ, వర్మ, పుస్తక విక్రేతల పక్షాన నవోదయ సాంబశివరావు, పత్రికల పక్షాన ఆర్.ఎం.ఉమా మహేశ్వర రావు, ముద్రాపకుల పక్షాన పొన్నపల్లి సీత హాజరై తమ అభిప్రాయాలను, అనుభవాలను సదస్సు ద్వారా వ్యక్తీకరించారు. ఈ సదస్సుకు ఎ.కె.ప్రభాకర్ స్వాగతోపన్యాసం చేయగా మనసు ఫౌండేషన్ ప్రతినిధి ఎం.రాయుడు వందన సమర్పణ చేశారు.