‘చాన్స్’ కోసం ప్రొఫెసర్ల పోటీ
9 వైస్ చాన్స్‌లర్ పోస్టుల కోసం 450కి పైగా దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల వైస్‌చాన్స్‌లర్(వీసీ) పోస్టుల కోసం పోటీ తీవ్రమైంది. వైస్ చాన్స్‌లర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే ప్రొఫెసర్ల సీనియారిటీ అర్హతను 10 నుంచి 5 ఏళ్లకు తగ్గించడంతో ఆశావహులు పెరిగారు. ప్రొఫెసర్లే కాకుండా ఏదేని పరిశోధనా సంస్థలో ఐదేళ్లు పనిచేసి ఉన్నా, పరిపాలనా రంగంలో పనిచేసి, ఐదేళ్లపాటు పాలన అనుభవం కలిగి ఉన్నావారు కూడా అర్హులేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని 9 వర్సిటీలు- ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల వీసీ పోస్టుల కోసం ఇప్పటివరకు ఆఫ్‌లైన్ 53 మంది, ఆన్‌లైన్‌లో 400 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీ వరకు ఉంది. దీంతో మరో 200కుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఉన్నత విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
వీసీలుగా ఐఏఎస్, ఐపీఎస్‌లకు అవకాశం?
వైస్‌చాన్స్‌లర్లుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కొన్ని విశ్వ విద్యాలయాలకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వైస్‌చాన్స్‌లర్లుగా నియమించే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వచ్చే దరఖాస్తులను ప్రొసీజర్ ప్రకారం ఒక్కో యూనివర్సిటీకి వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హతలను బ ట్టి ముగ్గురి పేర్లను సర్చ్ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. ఆ సర్చ్ కమిటీలో యూజీసీ నామినీ, యూనివర్సిటీ నామినీతోపాటు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కూడా సభ్యులుగా ఉంటారు. దీంతో దరఖాస్తు చేసుకోకపోయినా ప్రభుత్వం సూచించే పేరును కూడా ముగ్గురి పేర్లలో ఒకరిగా చేర్చే అవకాశముంది. ఇందులో ప్రభుత్వం తరఫున రిటైర్డ్, పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు రిటైర్డ్ లేదా ప్రస్తుతం పనిచేస్తున్న జూనియర్ ఐపీఎస్ అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వచ్చే నెల 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్న నేపథ్యంలో ఆ తరువాతే ఏయే యూనివర్సిటీకి ఎవరిని వైస్ చాన్స్‌లర్‌గా నియమిస్తారన్నది తేలనుంది. మొత్తానికి జనవరి నెలాఖరుకల్లా వీసీలను నియమించే అవకాశముంది.