సెక్రటరీ.. ఆ పేరు వల్లే అంత హిట్ అయ్యింది | It was such a hit that the name is due to the Secretary .. | Sakshi
Sakshi News home page

సెక్రటరీ.. ఆ పేరు వల్లే అంత హిట్ అయ్యింది

Published Fri, Jan 22 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

సెక్రటరీ.. ఆ పేరు వల్లే  అంత హిట్ అయ్యింది

సెక్రటరీ.. ఆ పేరు వల్లే అంత హిట్ అయ్యింది

సెక్రటరీ నవలకు యాభై ఏళ్లు నిండిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఆ నవలకు నీరాజనం కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా తరాల పాఠకుల రచయిత్రి యద్దనపూడి...
 
తెలుగు సాహిత్యంలో ఒక గురజాడ గేయాన్నో, శ్రీశ్రీ కవితనో, జాషువా పద్యాన్నో కంఠతా చెప్పమంటే చెప్పేవాళ్లు చాలామందే చెబుతారు. కాని ఒక నవలను అభిమానులు కంఠతా జెప్పటం మీరెప్పుడయినా విన్నారా? ఉన్నారు. ఆ నవల సెక్రటరీ. ఆ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి. సెక్రటరీ నవల ప్రచురితమై 50 ఏళ్లయింది. 90 పైగా ప్రచురణలు పూర్తి చేసుకుంది. ఇది అద్వితీయ రికార్డు. సెక్రటరీ గురించి, యద్ధన పూడి సులోచనారాణి ఆలోచనలు, ఆకాంక్షలు, జీవితతత్వం గురించి మనం తెలుసుకుందాం.
 
మృణాళిని: నమస్కారం సులోచనారాణి గారూ
యద్దనపూడి: నమస్కారమండీ

మృణాళిని: సెక్రటరీ ఇప్పటి కీ సజీవంగా, తాజాగా ఉంటుంది. పాఠకుల నుంచి ఈ నవల ఇంత అభిమానం పొందడం పట్ల మీ అనుభూతి ఎలా ఉంది?
యద్దనపూడి: నవలా రచయిత్రిగా నా నవలలకు అభిమానుల నుంచి నేనెన్నో ప్రశంసలు పొందాను. కాని సెక్రటరీ విషయం మాత్రం ప్రత్యేకం. 50 ఏళ్ల తర్వాత కూడా ఈ నవలను ఇంతగా గుర్తుపెట్టుకోవడం, నవలకు నీరాజనం పేరుతో పండుగ చేయడం వింటుంటూనే ఉద్విగ్నంగా అనిపిస్తోంది. ఆనందబాష్పాలతో సరస్వతీదేవి పాదాలు కడగాలనిపిస్తోంది.

మృణాళిని: అప్పట్లో అంటే 1964-65 సంవత్సరంలో జ్యోతి పత్రికలో సీరియల్‌గా వచ్చినప్పుడు, 66లో పుస్తకంగా వచ్చినప్పుడు అప్పటి పాఠకులు వేరు. ఇప్పటి పాఠకులు వేరు. కొత్త పాఠకులు వచ్చి ఉంటారు. అంటే వారి స్పందనలో మీకేమైనా తేడా కనిపించిందా?
యద్దనపూడి: నిజం చెప్పాలంటే స్పందనలో తేడా లేదమ్మా. స్త్రీ మనస్సు అది. 60 ఏళ్ల క్రిందటి స్త్రీ మనస్సు ఏ తీరున ప్రేమను కోరుకుందో నేటి యువతి మనసు కూడా అదే కోరుకుంటోంది. అంటే స్త్రీ మనస్సును తాకేదీ, స్త్రీ మనస్సు ఆశించేదీ ఏదో అంశం అందులో ఉంది. కాబట్టి ఇన్నేళ్లుగా అది మనుషుల్ని అట్లా పట్టి ఉంచిందేమోనని అనుకుంటున్నాను. తరాలు వేరైనా కూడా పాఠకుల రెస్పాన్స్ ఒకటే ఉంది . నవల్లోని రాజశేఖరం పాత్రను ఐడియలైజ్ చేయడం అలా ఉంచితే నిజానికి ఇప్పుడు అమ్మాయిలంతా అప్పటి జయంతిగానే ఉన్నారు. ఆత్మగౌరవంతో పాటు సంపాదన కొరుకుంటున్నారు. అన్నీ ఉన్నా కూడా స్త్రీత్వం పోకుండా ఒక పురుషుడు తనకు తోడు కావాలనుకునే ఆకాంక్ష మాత్రం పోలేదు. అందుకే సెక్రటరీ నవల ఇప్పటికీ పాఠకులతో కొనసాగుతూందేమో అనిపిస్తుంటుంది.
 
మృణాళిని: ఒక జయంతిని, ఒక రాజశేఖరాన్ని సృష్టించడానికి మీకేమైనా నమూనాలున్నాయాండీ? ఎవరి ప్రభావం అయినా ఉందా?
యద్దనపూడి: ఒకసారి రమణ, బాపు, రాఘవులు గార్లు వచ్చి జ్యోతి పత్రిక ప్రారంభిస్తున్నాం నవల రాయమన్నారు. నేను నవల రాయనంటే రాయనన్నాను. ఎందుకంటే అప్పటి వరకు కథలే రాస్తున్నాను. ఐలవ్‌యూ, భానుమతి వంటి కథలు బాగా ఆదరణ పొందాయి. అందుకే బలవంతంగా రాయలేనన్నాను. బాపు, రమణగారు నా ఇబ్బందిని గమనించి పోనీలేండి మీరు పెద్ద కథ రాయండి అని అన్నారు. కథ అయితే రాస్తా అన్నా. కథ రాస్తావా అయితే పేరు చెప్పు అన్నారు. పేరు చెబితే మేము ఇప్పట్నుంచీ పబ్లిసిటీ ఇస్తాం అని చెప్పగా నేను లోపలికి వెళ్లి ఓ కాగితం తీసుకొని సరస్వతీ దేవికి దండం పెట్టుకొని సెక్రటరీ అని రాశా. కథ లేదు, ఏం లేదు. కానీ నాకు తెలిసిన ఒక ఆడపిల్ల టైపిస్టుగా పని చేస్తుండేది. తనతోపాటు జాబ్ చేసేవాడు ఎంత ఏడిపించేవాడో చెప్పి తిట్టిపోస్తుండేది. ఆడపిల్ల, మధ్య తరగతి అమ్మాయి పడే అలాంటి బాధలేవో చెప్పొచ్చు అనుకున్నాను. కాని సెక్రటరీ కాకుండా జయంతి అని పేరు పెడితే ఆ నవల అసలు ఇంత ప్రచారమయ్యేది కాదు అనుకుంటున్నా. ఆ నవల మొదలెట్టినప్పుడు నాకు హీరో పాత్ర గురించి ఏమీ తెలియదు. జయంతి, బామ్మ పాత్రలే ఉండేవి. ఆ తరువాత హీరో వచ్చాడు రాజశేఖర్. ఆ పేరు తట్టిన క్షణమేమిటో గానీ ఇప్పటికీ ఇప్పటికీ ఆడవాళ్ల హృదయాల్లో ఒక ఇమేజ్‌గానే మిగిలిపోయాడు.
 
మృణాళిని (నవ్వుతూ): మాతరం వారమందరమూ ఆ పేరు గలవాళ్లనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అంత పిచ్చి ఉండేదన్నమాట. అదృష్టవశాత్తు మా అల్లుడి పేరు రాజశేఖరం.
యద్దనపూడి: ఔనా!

మృణాళిని: అది కూడా కాకతాళీయం
యద్దనపూడి: మీకో విషయం చెబుతాను. రాజశేఖరం అనే పేరుకు ఎంత పాపులారిటీ అంటే ఓ సారి నేను అమెరికా వెళ్లినప్పుడు సన్మానం చేశారు. నేను అని తెలియగానే కొంత మంది - అందరూ తెలుగువాళ్లే- నా దగ్గరకు వచ్చారు. ఒకతను మేడం మీరు రావాలి అని బయటకు తీసుకెళ్లి ఇండియాలో ఉన్న వాళ్ల అమ్మకు ఫోన్ చేశాడు. అతని పేరు కూడా రాజశేఖరం అట. అమ్మా నాకు పేరు పెట్టావే రాజశేఖరం అని ఆ పాత్ర సృష్టించిన మీ అభిమాన రచయిత్రి ఇక్కడే ఉన్నారు మాట్లాడు అన్నాడు. సంతోషం కలిగింది. ఇంకో ఘటన... ఐదారేళ్ల క్రితం ఒక అమ్మాయిని శ్రావణమాసం నోముల సందర్భంగా కలిశాను. ఏం చేస్తుంటావమ్మా అని అడిగితే ఇంజినీర్‌ని, సెలవు పెట్టాను అని చెప్పింది. మరి నోములు అవి నీకు విసుగు పుట్టవా అని అంటే ఎందుకు పుడుతుంది. ఇవి చేస్తే భర్తకు బాగుంటుందటగా అంది. అయ్యబాబోయ్ ఇంత నమ్మకాలా ... మీ పేరేంటమ్మా అన్నాను. వెంటనే ముఖం కాస్త చికాకుగా పెట్టేసి సువర్ణలత (కీర్తికిరీటాలు హీరోయిన్) అని చెప్పింది. ఆ చికాకును కొనసాగిస్తూ మా అమ్మ నాకేమో సువర్ణలత, మా అన్నకేమో రాజశేఖర్ అని పేరు పెట్టింది అంది. ఎక్కడికెళ్లినా ఈ రాజశేఖరం అనే మాట అలా వస్తూనే ఉంటుంది.
 
మృణాళిని: సెక్రటరీనే తరువాత సినిమాగా తీశారు. సినిమా తీసినప్పుడు మీతో సంప్రదించారా? అసలు మీరు ఇష్టపడ్డారా? నవలను సినిమాగా తీస్తే బాగా వస్తుందని మీరు ఊహించారా?
యద్దనపూడి: సినిమా అనుభవం చాలా డిఫరెంట్. అప్పటికే జీవన తరంగాలు వచ్చింది. రామానాయుడుగారు తీశారు. అది బాగా ఆడింది. బాగా వచ్చింది కూడా. ఆ ఉత్సాహంతోనే సెక్రటరీని సినిమాగా తీస్తా అన్నారు. నేను కూడా ఉత్సాహంగానే ఇచ్చాను. ఆయన అనౌన్స్ చేశారు. సెక్రటరీ సినిమా తీస్తున్నాను నాగేశ్వరరావు హీరో అని. ఇంక లేడీస్ వచ్చారమ్మా మా ఇంటికి గుంపులుగుంపులన్నమాట. మీరు ఆ రైట్స్ ఎలా ఇచ్చారు. మీకు ఆ రైట్ లేదు. వెంటనే వాపస్ తీసుకోండి అని నన్ను డిమాండ్ చేశారు.
 
మృణాళిని: ఎందుకు?
యద్దనపూడి: సినిమా తీయడానికి వీలులేదు. ఎవరూ సూట్ కారు దానికి, మా ఇమేజ్‌నేషన్ అంతా చెడిపోతుంది అంటారు వాళ్లు. రామానాయుడుగారికి విషయం చెప్పా. సినిమా చూసిన తర్వాత అభిప్రాయం మార్చుకుంటారులేండి అన్నారు.
 
మృణాళిని: సెక్రటరీ తరువాత మీ నవలల మిగతా సినిమా రూపాలను కూడా మాట్లాడుకోవాలి. మీనా నవలకు సినిమా ఎక్కువ న్యాయం చేసిందని అంటున్నారు నాతో ఎక్కువగా. మీనా సినిమా చూస్తుంటే మేం మళ్లీ నవలను చూసినట్లే అనిపించింది. మీ ఇతర నవలలతో పోల్చి చూస్తే మీకు అది పూర్తి తృప్తినిచ్చిందా?
యద్దనపూడి: చెప్పాలంటే మీకు లాగే నాకూ మీనా సినిమాయే నచ్చింది.

మృణాళిని: మరో విషయం మీ అన్ని నవలల్లోనూ సెక్రటరీ, మీనా, జీవనతరంగాలు, విజేత అనే నాలుగు నవలలనే చెప్పుకుంటారు. కొంత మంది అయితే ఆరాధన నవల కూడా చెప్పుకుంటారు. మీరు 70కిపైగా నవలలు రాసినా, ఈ నాలుగైదు నవలలనే ఎక్కువగా ప్రస్తావిస్తుంటారు. సున్నితమైన ప్రేమభావాన్ని అత్యద్భుతమైన స్త్రీ పాత్రలను చిత్రించిన రచయిత్రిగా మీరు మా హృదయాల్లో మిగిలే ఉంటారు. కానీ మీరు ఈ ఒక్క ఇమేజ్‌కే పరిమితమయ్యారా?
 యద్దనపూడి: అలా లేదమ్మా. నా అన్ని రకాల నవలలను పాఠకులు ఇష్టంగా చదువుతున్నారు. పార్థును చదువుతున్నారు. ఇతర నవలలనూ చదువుతున్నారు. నవల రాయలేను అన్నదానిని తొలిసారి సెక్రటరీ నవలు రాశాను. అప్పటి నుంచి నవలలే రాస్తున్నాను. అప్పుడే ఎమెస్కో వారు వచ్చారు. పుస్తకాలు చదవడం మనం అలవాటు చేస్తే పుస్తకం కొని చదవడం వారు నేర్పారు. ఎం.ఎన్.రావుగారు వచ్చి చిన్న నవల రాయండమ్మా అని ప్రాధేయపడితే చివరకు ఒక నవల రాశాను. ఆరాధన అలా వచ్చిన చిన్న నవల. ఆయన ఎంత సంతోషంగా ఫీలయ్యారంటే మళ్లీ ఇంకో నవల రాయమన్నారు. బతిమిలాడి బతిమిలాడి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఒక నవల రాయమన్నారు. అదే నా పుట్టినరోజు కూడా. దాంతో చాలా నవలలు వచ్చేశాయి.

మృణాళిని: 50 ఏళ్ల క్రితం వచ్చిన సెక్రటరీని ఇప్పుడు చదివితే, మళ్లీ అందరూ ఫ్రెష్ అవుతున్నారు. అంటే ఒక రచన విలువ ఏమిటన్నప్పుడు, జీవితం గురించి పెద్ద పెద్ద సందేశాలు ఇవ్వటమనే కాదు. మన మనస్సులో ఎప్పడూ తాజాగా ఉండటం అన్నదే ఒక రచనకు ఉన్న ప్రమాణం అయితే మీ రచనలు అన్నీ దాన్ని సాధించాయి అనిపిస్తుంది. ఈరోజు మీరు మీ మనసులోని భావాలను ఆత్మీయంగా మాతో పంచుకున్నారు. మీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరమరికలు లేకుండా మాతో పంచుకున్నందుకు చాలా సంతోషమండీ. ధన్యవాదాలు.
యద్దనపూడి: మీకూ ధన్యవాదాలు.

మృణాళిని: అంటే సీరియల్స్ కాకుండా ఇలా నవలలు రాసేవారన్నమాట.
యద్దనపూడి: ఔను. తరువాత తరువాత సీరియల్స్ రాయను, నవలలే రాస్తానని షిప్ట్ అయిపోయాను. ప్రతి పదేళ్లకు నాలో ఏదో మార్పు. మొదట సీరియల్స్ రాయడం మానేశాను. స్వాతిలో 12 ఏళ్లు సీరియల్స్ రాశాను. కీర్తికిరీటాలు, సుకుమార్ వంటివి ఇలాగే వచ్చాయి. అందుకే సెక్రటరీ వంటి నవలలకే కాకుండా, పార్థు వంటి నవలలకు కూడా పాఠకులు ఏర్పడ్డారు.
 
నేడు(శనివారం) మధ్యాహ్నం గం.12.30లకు సాక్షి టీవీలో ఈ ఇంటర్వ్యూ ప్రసారం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement