మూర్తిదేవికి ‘గబ్బిలాల’ స్వాగతం | Bats welcome to Murthidevi, telugu literature | Sakshi
Sakshi News home page

మూర్తిదేవికి ‘గబ్బిలాల’ స్వాగతం

Published Thu, Sep 29 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

Bats welcome to Murthidevi, telugu literature

తెలుగు సాహిత్యం నిద్రాణం నుంచి జాషువా రాకతో మేలుకున్నది. దాని వేలుపట్టి వెలుగులో నడిపించిన వారు ఆచార్య కొలకలూరి ఇనాక్. నేటికి తెలుగు సాహి త్యాన్ని మెరుగులు దిద్దుతూ మరమ్మతు చేస్తున్న వారిలో ప్రథముడాయన. 78 ఏళ్ల ఇనాక్ ఆరు పదుల వర్తమాన సాహిత్య జీవన కవనమై చరిస్తూ, సజీవంగా చలిస్తూ 87 గ్రంథాల సృష్టికర్తగా వర్ధిల్లుతున్నారు. పట్టుకున్న ప్రతీ సాహిత్య ప్రక్రియను పండించటంలో ఎదురులేని కృషీ వలుడు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో వచ్చిన బహుళ సాహిత్య ప్రక్రియల్లో రచనను కొనసాగించి తెలుగు సాహిత్యానికి పరిపుష్టిని చేకూర్చి పరిపూర్ణం చేశారు. తెలుగు సాహిత్య రంగానికి పెద్ద దిక్కుగా గమనం చూపిస్తూ నడుస్తున్న చరిత్రగా ప్రయాణం చేస్తున్నారు. గ్రంథాల సంఖ్యల్లోనే కాకుండా వాటిలోని విలువల్ని కూడా సాధించాడు. సుదీర్ఘమైన, సువిశాలమైన, వైవిధ్య కథాభరిత విశిష్ట వ్యక్తిత్వ చిత్రీకరణల సముదాయం కొలకలూరి ఇనాక్ సాహిత్యం.
 
 సరిహద్దులతో బంధించలేనంత అనుబంధాలు పెంపొందించుకున్న పెద్ద మనిషి ఇనాక్. సాహిత్య కూడలి మధ్యన కూర్చుని ఏ దారిన ప్రయాణించాలో చాలామంది సాహితీకారులకు తోచనట్టి సందర్భాలు ఉంటున్న నేపథ్యంలో తాను మాత్రం కూడలి మధ్యనే సాహిత్య తపస్సు చేస్తూ అన్ని దారులను, వాటి పిల్లదా రులను కూడా పలకరించి పరిపాలిస్తాడు. పొందికగా బోధివృక్షమై మార్గాన్ని చూపెడతాడు. పతనం అంచున కూడా శిఖరం అధిరోహించడం ఎలాగో తెలిసిన విలక్షణ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్.
 
 ఆకలి మంటల కార్ఖానా ఆయన జీవితం. లోకం పోకడలో పడి హృదయం లేని మనిషిగా బ్రతకటానికి ఏనాడూ ఇష్టపడని తత్వం ఆయనది. వాదాల గాథల్లో పడి కొట్టుకుపోలేదు. తన జీవితగాథను తన వాదంగా బయలు పరిచాడు. సాహిత్య ముడి సరుకు అయిన మాదిగ తత్వపు చెలిమే సమస్త మానవతత్వ వాదాలకు మూలమని నిత్య నూతనంగా ఊరింప జేస్తున్న జాంబ వంతుడు.
 
 తాను సృష్టించిన సాహిత్యంలో తమ తమ వాదాలను వెతుక్కునేలా, వెతుక్కోకుండా ఉండలేనంత స్ఫూర్తిని, స్పృహను తన సాహిత్యంలో పొందుపరచిన విలుకాడు భుజంగరాయుడు. విమర్శ రాయకుండా ఉండలేక, రాస్తున్నప్పుడు ఏ విమర్శకుడు కూడా నటిం పునకు లోనవకుండా విమర్శ రాసే సాహిత్యాన్ని సృష్టించిన ఆచార్య కొలకలూరి ఇనాక్ కలం యొక్క కండరాల శక్తి భారతీయ సాహిత్యపు దిమ్మెలమీద జెండాను, ఎజెండాను ప్రకటింప జేసిన సాహిత్య ‘కల్న ల్’గా గౌరవం పొందారు.
 
 మునివర్గ, శిష్టవర్గ దృష్టికి ప్రత్యామ్నాయంగా జనుల విభిన్నత్వ దృష్టిలో నుండి సాహిత్యాన్ని రంగరిం చినా మునులు, శిష్టులు, జనులు జేజేలు పలుకుతున్న ఈ సాహిత్య తరువుని మూర్తిదేవి పురస్కారం వరించిన సందర్భంలో మాతాత ఆచార్య కొలకలూరి ఇనాక్‌కి శుభాకాంక్షలు తెలుపుకుంటూ....
 (ఆచార్య కొలకలూరి ఇనాక్‌ని నేడు ‘మూర్తిదేవి’ అవార్డుతో సత్కరిస్తున్న సందర్భంగా)
 డప్పోల్ల రమేష్, వ్యవస్థాపక అధ్యక్షులు, బహుజనం సాంస్కృతిక వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement