కర్నూలు(కల్చరల్): లుగు దశాబ్దాలుగా సాహితీ పూదోటకు ఆయన విశిష్ట వనమాలి. తెలుగు సాహిత్యంలోని కవిత్వం కథా ఝరులు ప్రవహిస్తున్న తీరు తెన్నులను పరిశీలిస్తూ.. తన కలంతో ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ విమర్శకుడిగా, ఉత్తమ విశ్లేషకుడిగా రాణించారు. చిత్తూరు జిల్లాలో పుట్టి, అనంతపురం విశ్వవిద్యాలయంలో తెలుగు పాఠాలు చెప్పి, కర్నూలు జిల్లాతో వియ్యమంది, ఆత్మీయానుబంధం ఏర్పరచుకొని ప్రస్తుతం కడప వేమన యూనివర్శిటీ తెలుగు విభాగంలో తన సేవలనందిస్తున్నారు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి.
రాయలసీమ ప్రజల, ఆంధ్ర తెలుగు జనుల ఆత్మబంధువైన ఆయన ఉత్తమ సాహితీ విమర్శకు చిరునామా. తాను రచించిన మన తెలుగు నవలలు కథానికలు అనే విమర్శనా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమికి ఎంపికైన తొలి తెలుగు సాహితీవేత్తగా సీమ సాహితీ చరిత్ర పుటల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సలహా మండలి సభ్యులుగా, అనుభవజ్ఞులైన సాహితీ విమర్శకులుగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎందరెందరో శిష్య గణానికి ఉత్తమ అధ్యాపకులుగా డాక్టర్ రాచపాళెం తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించారు. శనివారం కర్నూలులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సీమస్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సాహిత్య విశేషాలు మీకోసం...
ప్రశ్న: తెలుగు సాహిత్యంలో విమర్శకున్న ప్రాధాన్యత ఏమిటి?
రాచపాళెం: సాహిత్యానికి విమర్శ టార్చ్‌లైట్ లాంటిది. మంచి విమర్శ ఉంటే అదే స్థాయిలో సాహితీ సృ జన జరుగుతుంటుంది. మంచి సాహిత్యం వస్తుంటే.. అలాంటి సమాజమే ఏర్పడుతుంది. ఏ అరమరికలు, వ్యత్యాసాలు లేని సామ్యవాద సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్య సృ జన జరగాలి. విమర్శ ఉత్తమ సాహితీ సృ జనకు దోహదపడుతుంది.
ప్రశ్న: సాహిత్యం ద్వారా సామాజిక పరివర్తన జరుగుతుందన్నది వాస్తవమా! ఒక ఉదాహరణ ఇవ్వగలరా?
రాచపాళెం : మంచికథ, మంచి నవల, మంచి కవిత చదివాక మనిషిలో మార్పు తప్పకుండా వస్తుంది. సాహిత్యం ద్వారా సామాజిక పరివర్తన జరుగుతుందన్నది వాస్తవం. ఉదాహరణకు.. దళిత సాహిత్యం వచ్చాక దళితులను చులకనగా చూడటం, స్త్రీవాదం వచ్చాక స్త్రీలను చులకనగా చూడడం తగ్గింది. అభ్యుదయ సాహిత్యం వచ్చాక శ్రామికుల పట్ల చిన్న చూపు తగ్గింది. సాహిత్యం మనుషులను మారుస్తుంది.
ప్రశ్న : అస్తిత్వ వాదాలు ఎలా పుట్టుకొచ్చాయి? వాటివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా?
రాచపాళెం : అస్తిత్వవాదాలు సాహిత్యంలో అనివార్యంగా పుట్టుకొచ్చాయి. నిష్కారణంగా రాలేదు. మార్క్సిజాన్ని భారతీయ సామాజిక శక్తులకు అనుకూలంగా మలచడంలో మార్క్సిస్టు దృ క్పథంలో ఏర్పడ్డ వెలితిని భర్తీ చేసేందుకు అస్తిత్వవాదాలు వచ్చాయి. మన దేశంలో కులం బలమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఇక్కడ అంబేద్కరిజం, మార్క్సిజం సమానంగా పయనించాలి. దోపిడీని ప్రశ్నించాలి. వివక్షనూ ప్రశ్నించాలి. అస్తిత్వవాదాలు కొంత మేరకు విజయాన్ని సాధించాయి.
ప్రశ్న : విభజన అనంతరం రాయలసీమ రచయితల బాధ్యత ఏమిటి?
రాచపాళెం : విభజనానంతరం రాయలసీమ రచయితలు రెండు పాత్రలు పోషించాలి. తమ ప్రాదేశిక సమస్యలను చిత్రిస్తూ, తమ ప్రాంత అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు చేయాలి. ప్రత్యేక రాయలసీమ ఆవశ్యకతను, స్థితిగతుల తీవ్రతను కూడా చిత్రించాలి. సీమలో సాగునీరు తాగునీరు, కరువు, శ్రమదోపిడీ తదితర అంశాలకు సంబంధించిన సీమ బతుకు చిత్రాన్ని రచయితలు మరింత బలంగా ఆవిష్కరించాలి.
ప్రశ్న: తెలుగు సాహిత్యంలో పాతతరం రచయితల రచనలే కనిపిస్తున్నాయి. కారణం ఏమిటి ?
రాచపాళెం : సమాజం గురించి యువతను ఆలోచింపజేయకుండా చాలా శక్తులు అడ్డుకుంటున్నాయి. సామాజిక సమస్యల నుంచి ప్రస్తుత బూర్జువా రాజకీయాలు, సినిమాలు, టీవీ యువత దృష్టిని మళ్లిస్తున్నాయి. చదువుకున్న వెంటనే సులభ సంపాదనవైపు ఆకర్షించే కెరీరిజం పెంచే స్వార్థ పూరిత వ్యవస్థ యువతను కలుషితం చేస్తోంది. ఈ కుట్రను యువత గుర్తించి సాహిత్యాన్ని చదవడం అలవర్చుకోవాలి. సామాజిక సమస్యలు వాటి పరిష్కారం గురించి ఆలోచిస్తే యువ రచయితలు పుట్టుకొస్తారు.
సీమ బతుకు చిత్రాన్ని బలంగా ఆవిష్కరించాలి
Published Sun, Jan 11 2015 4:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM
Advertisement
Advertisement