Guided
-
సీమ బతుకు చిత్రాన్ని బలంగా ఆవిష్కరించాలి
కర్నూలు(కల్చరల్): లుగు దశాబ్దాలుగా సాహితీ పూదోటకు ఆయన విశిష్ట వనమాలి. తెలుగు సాహిత్యంలోని కవిత్వం కథా ఝరులు ప్రవహిస్తున్న తీరు తెన్నులను పరిశీలిస్తూ.. తన కలంతో ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ విమర్శకుడిగా, ఉత్తమ విశ్లేషకుడిగా రాణించారు. చిత్తూరు జిల్లాలో పుట్టి, అనంతపురం విశ్వవిద్యాలయంలో తెలుగు పాఠాలు చెప్పి, కర్నూలు జిల్లాతో వియ్యమంది, ఆత్మీయానుబంధం ఏర్పరచుకొని ప్రస్తుతం కడప వేమన యూనివర్శిటీ తెలుగు విభాగంలో తన సేవలనందిస్తున్నారు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. రాయలసీమ ప్రజల, ఆంధ్ర తెలుగు జనుల ఆత్మబంధువైన ఆయన ఉత్తమ సాహితీ విమర్శకు చిరునామా. తాను రచించిన మన తెలుగు నవలలు కథానికలు అనే విమర్శనా గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమికి ఎంపికైన తొలి తెలుగు సాహితీవేత్తగా సీమ సాహితీ చరిత్ర పుటల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు సలహా మండలి సభ్యులుగా, అనుభవజ్ఞులైన సాహితీ విమర్శకులుగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎందరెందరో శిష్య గణానికి ఉత్తమ అధ్యాపకులుగా డాక్టర్ రాచపాళెం తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలందించారు. శనివారం కర్నూలులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సీమస్థాయి విద్యా వైజ్ఞానిక సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సాహిత్య విశేషాలు మీకోసం... ప్రశ్న: తెలుగు సాహిత్యంలో విమర్శకున్న ప్రాధాన్యత ఏమిటి? రాచపాళెం: సాహిత్యానికి విమర్శ టార్చ్‌లైట్ లాంటిది. మంచి విమర్శ ఉంటే అదే స్థాయిలో సాహితీ సృ జన జరుగుతుంటుంది. మంచి సాహిత్యం వస్తుంటే.. అలాంటి సమాజమే ఏర్పడుతుంది. ఏ అరమరికలు, వ్యత్యాసాలు లేని సామ్యవాద సమాజం ఏర్పడాలంటే మంచి సాహిత్య సృ జన జరగాలి. విమర్శ ఉత్తమ సాహితీ సృ జనకు దోహదపడుతుంది. ప్రశ్న: సాహిత్యం ద్వారా సామాజిక పరివర్తన జరుగుతుందన్నది వాస్తవమా! ఒక ఉదాహరణ ఇవ్వగలరా? రాచపాళెం : మంచికథ, మంచి నవల, మంచి కవిత చదివాక మనిషిలో మార్పు తప్పకుండా వస్తుంది. సాహిత్యం ద్వారా సామాజిక పరివర్తన జరుగుతుందన్నది వాస్తవం. ఉదాహరణకు.. దళిత సాహిత్యం వచ్చాక దళితులను చులకనగా చూడటం, స్త్రీవాదం వచ్చాక స్త్రీలను చులకనగా చూడడం తగ్గింది. అభ్యుదయ సాహిత్యం వచ్చాక శ్రామికుల పట్ల చిన్న చూపు తగ్గింది. సాహిత్యం మనుషులను మారుస్తుంది. ప్రశ్న : అస్తిత్వ వాదాలు ఎలా పుట్టుకొచ్చాయి? వాటివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? రాచపాళెం : అస్తిత్వవాదాలు సాహిత్యంలో అనివార్యంగా పుట్టుకొచ్చాయి. నిష్కారణంగా రాలేదు. మార్క్సిజాన్ని భారతీయ సామాజిక శక్తులకు అనుకూలంగా మలచడంలో మార్క్సిస్టు దృ క్పథంలో ఏర్పడ్డ వెలితిని భర్తీ చేసేందుకు అస్తిత్వవాదాలు వచ్చాయి. మన దేశంలో కులం బలమైన పాత్ర పోషిస్తుంది. అందుకే ఇక్కడ అంబేద్కరిజం, మార్క్సిజం సమానంగా పయనించాలి. దోపిడీని ప్రశ్నించాలి. వివక్షనూ ప్రశ్నించాలి. అస్తిత్వవాదాలు కొంత మేరకు విజయాన్ని సాధించాయి. ప్రశ్న : విభజన అనంతరం రాయలసీమ రచయితల బాధ్యత ఏమిటి? రాచపాళెం : విభజనానంతరం రాయలసీమ రచయితలు రెండు పాత్రలు పోషించాలి. తమ ప్రాదేశిక సమస్యలను చిత్రిస్తూ, తమ ప్రాంత అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు చేయాలి. ప్రత్యేక రాయలసీమ ఆవశ్యకతను, స్థితిగతుల తీవ్రతను కూడా చిత్రించాలి. సీమలో సాగునీరు తాగునీరు, కరువు, శ్రమదోపిడీ తదితర అంశాలకు సంబంధించిన సీమ బతుకు చిత్రాన్ని రచయితలు మరింత బలంగా ఆవిష్కరించాలి. ప్రశ్న: తెలుగు సాహిత్యంలో పాతతరం రచయితల రచనలే కనిపిస్తున్నాయి. కారణం ఏమిటి ? రాచపాళెం : సమాజం గురించి యువతను ఆలోచింపజేయకుండా చాలా శక్తులు అడ్డుకుంటున్నాయి. సామాజిక సమస్యల నుంచి ప్రస్తుత బూర్జువా రాజకీయాలు, సినిమాలు, టీవీ యువత దృష్టిని మళ్లిస్తున్నాయి. చదువుకున్న వెంటనే సులభ సంపాదనవైపు ఆకర్షించే కెరీరిజం పెంచే స్వార్థ పూరిత వ్యవస్థ యువతను కలుషితం చేస్తోంది. ఈ కుట్రను యువత గుర్తించి సాహిత్యాన్ని చదవడం అలవర్చుకోవాలి. సామాజిక సమస్యలు వాటి పరిష్కారం గురించి ఆలోచిస్తే యువ రచయితలు పుట్టుకొస్తారు. -
శ్రద్ధ, విశ్వాసాలే భక్తికి పునాదులు
మానవునికి భక్తి అత్యవసరం. భగవంతుడితో భావయుక్త సంబంధం కలిగినదే భక్తి. పరమాత్మపై అనంతమైన ప్రేమ భక్తిలో వ్యక్తమవుతుంది. భక్తి, ప్రేమ... ఈరెండూ పొందడం చాలా సులువుగా అనిపించినా, వాటిని ఒక్కసారిగా పొందాలంటే ఎంతో కష్టం. భక్తితత్వంలో కోరికలకు తావులేదు. భక్తుడు తన మానస సముద్రంలోని ప్రతి నీటిబొట్టులోనూ దైవాన్ని మాత్రమే చూస్తాడు. పరమాత్మకు పూర్తిగా వశం కావడం వల్ల అమృతుడవుతాడు. ‘మోక్ష కారణ సామగ్య్రాం భక్తిరేవ గరీయసీ’ అని భక్తి ప్రాముఖ్యాన్ని వెల్లడించింది భాగవత పురాణం. నిర్గుణాన్ని సగుణం చేయగల శక్తి భక్తికే ఉంది. భక్తి లేకపోతే బ్రహ్మజ్ఞానం అలభ్యమని కూడా నొక్కి పలికింది. కనుక మానవుడు ముందుగా భగవంతుని ఆశ్రయించాలి. భక్తిసంయుతమైన మనస్సుకు అధిక శక్తి లభిస్తుంది. భక్తి ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ తనతో భక్తుని నడిపిస్తుంది. నిజమైన భక్తిజ్ఞానంతోపాటు వృద్ధి చెందుతూ ఉంటుంది. భక్తి- శ్రవణాది నవవిధ భక్తిమార్గాల ద్వారా సర్వేంద్రియ సద్వినియోగం చేస్తుంది. లౌకిక విషయాలవైపు విచ్చలవిడిగా పరుగులు తీసే ఇంద్రియాలనే అశ్వాలకు కళ్లెం వేసి అదుపులో పెడుతుంది. బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలిగించి, అంతరింద్రియ నిగ్రహానికి దారి చూపుతుంది. వినయ విధేయతలను అందించి అహంకార నిర్మూలనం గావిస్తుంది. బాల్యం నుండి ఒక క్రమశిక్షణను పాటించే వారి జీవితం ఆనందమయం అవుతుందనే సూత్రం భక్తిలో ఇమిడి ఉంది. అయితే ఇందుకోసం ప్రప్రథమంగా మనిషిలో మనోనిగ్రహం ఏర్పడాలి. అప్పుడుగాని ఏకాగ్రత రాదు. ఏకాగ్రత కలిగితే గాని జపం సాగదు. జపంలో ఏకత్వం సిద్ధిస్తేగాని ధ్యానం కుదరదు. ధ్యానం కుదిరితేగాని భక్తిపట్ల ఆసక్తి ఏర్పడదు. కనుక తప్పనిసరిగా శాస్త్రప్రబోధం వినాలి. అనన్య భక్తులైన మహనీయుల అడుగుజాడలలో నడవాలి. అప్పుడే ఆ వ్యక్తిలో భక్తి జనించి నెమ్మదిగా వికసిస్తుంది. నిజానికి ఈ కలియుగంలో నిజమైన భక్తిభావన కలగడమే కష్టం. ఏ కొద్దిపాటి భక్తి భావన మనలో కలిగినా దాన్ని ప్రేరేపించడం ఉత్తమం. ఇంతకు మించి ఈ యుగంలో భవసాగరం దాటడానికి వేరేమార్గం లేదు. కృతయుగంలో తపస్సు చేతనూ, త్రేతాయుగంలో యజ్ఞం వల్లనూ, ద్వాపరయుగంలో పరిచర్య ద్వారానూ, కలియుగంలో కేవలం భక్తిమార్గాన మాత్రమే దైవప్రాప్తి కలుగుతుందని నారదసూత్రాలు చెబుతున్నాయి. ఈ భక్తి నడకను బట్టి నవవిధ భక్తులుగా విభజించింది భాగవతం. శ్రవణ, కీర్తన, అర్చన భక్తులచే నిగ్రహం, బాహ్యేంద్రియ సద్వినియోగం, స్మరణ భక్తిచే మనస్సంయమనం, పాదసేవన, వందన భక్తులచే అహంకార నాశనం, దాస్యభక్తిచే సేవాభావం, సఖ్యభక్తిచే ఏకాత్మత, ఆత్మనివేదన భక్తిచే బుద్ధి భక్తుడికి లభిస్తాయి. ఇవన్నీ పరిపక్వత పొందితే గానీ భక్తిమార్గంలో ప్రయాణం చేయలేరు. భక్తివిధానాలన్నింటికీ శ్రవణం చాలా ముఖ్యం. శ్రవణం అంటే వినడం అని అర్థం. శ్రవణం సరిగా ఉంటే తర్వాత భక్తి విధానాలన్నీ సులభంగా సిద్ధిస్తాయి. విద్యలో శ్రద్ధ ఉంటే ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. సంగీతంలో శ్రద్ధ ఉంటే గొప్ప సంగీత విద్వాంసునిగా రాణిస్తాడు. తపస్సులో శ్రద్ధ ఉంటే తపోనిధి అవుతాడు. దైవం పట్ల శ్రద్ధ ఉంటే మహాజ్ఞానిగా శోభిస్తాడు. అందుకే శ్రద్ధగా శ్రవణం చేయాలని శాస్త్రం ఆదేశిస్తోంది. ఆ విధంగా శ్రవణం చేసి తమ జీవితాలను పునీతం గావించుకున్న వారిలో పరీక్షిన్మహారాజు, కులశేఖరాళ్వారు, తులసీదాసు మొదలైన వారెందరో ఉన్నారు. కనుకనే శ్రద్ధవిశ్వాసాలే భక్తికి పునాదులని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి. - చోడిశెట్టి శ్రీనివాసరావు -
నీ ప్రవర్తన అంతటిమీద ఆయనకు అధికారమిస్తే ఆయన నీ త్రోవనుసరళం చేస్తాడు
దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చి నష్టపోయినవారు, ఆ స్థానం ఆయనకివ్వకుండా లాభపడినవారు లోకంలో ఉండరు. దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చిన వారెవ్వరూ జీవితంలో చివరిస్థానంలో ఉండరు. ప్రసిద్ధ జర్మన్ శిల్పి జోహాన్ హెన్రిచ్ 18వ శతాబ్దంలో రెండేళ్లు శ్రమించి యేసుక్రీస్తు శిల్పాన్ని చెక్కాడు. దాన్ని ముందుగా ఒక వ్యక్తికి చూపిస్తే, ఎవరీయన? గొప్ప చక్రవర్తా? అనడిగాడు. తన వైఫల్యాన్ని గ్రహించి ఈసారి ఆరేళ్ల శ్రమతో మరో శిల్పాన్ని చెక్కాడు. అది చూసిన ప్రజల కళ్లలో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. ‘‘మొదటిసారి నా నైపుణ్యాన్ని నమ్మాను. రెండవసారి ఆ యేసునే న మ్మాను. ఆయనే నా దగ్గరుండి నాతో చెక్కించారు’’ అంటూ హెన్రిచ్ సాక్ష్యం చెప్పాడు. ఆ శిల్పాన్ని నియంత నెపోలియన్ మెచ్చుకుని తాను ఆరాధించే వీనస్ దేవత బొమ్మను చెక్కమని ఆదేశిస్తే, యేసుక్రీస్తు రూపాన్ని చెక్కిన ఈ చేతులతో మరే రూపాన్నీ చెక్కలేనని నిరాకరించి ఆయన ఆగ్రహానికి గురయ్యాడు. బైబిలులోని ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రస్తావించిన ఏడు చర్చిల్లో చివరికి ఫిలడెల్ఫియా, లవొదికయ. ఈ రెండింటికీ అసలు పోలికే లేదు. ఫిలడెల్ఫియా చర్చిలో ఎత్తి చూపడానికి దేవునికి ఒక్క లోపమూ కనపడలేదు. లవొదికయ చర్చిలో మెచ్చుకొనడానికి ఒక్క లక్షణమూ కనపడలేదు. దేవుడే సర్వస్వంగా జీవించిన చర్చి ఫిలడెల్ఫియా కాగా, ధనవృద్ధి బాటలో పడి దేవుణ్ణి దూరం పెట్టిన చర్చి లవోదికయ. అయితే దేవుణ్ణి పూర్తిగా విస్మరించలేదు, చర్చి తలుపు బయట నిలబెట్టిందంతే! చర్చి వెలుపల ఉండాల్సిన ధనానికి అంటే లోకానికి లోపల ప్రధానాసనం వేసి చర్చిలో ప్రధానాసనంలో ఉండాల్సిన దేవుణ్ణి తలుపు బయట నిలబెట్టింది. ధనాన్ని హత్తుకుని యేసుక్రీస్తును నిరాదరించిన దేవుడు లేని డబ్బు చర్చి అది. అందువల్ల నీవు చల్లగానైనా, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావంటూ యేసుప్రభువు అత్యంత తీవ్రమైన పదజాలంతో లవొదికయ చర్చిపై అభియోగాలు మోపాడు. అయితే అంత నిరాదరణకు గురై కూడా యేసుక్రీస్తు తానింకా తలుపు వెలుపలే నిలబడి తనను లోపలికి రానివ్వడం కోసం, తలుపు తడుతున్నానని చెప్పడం తిరుగులేని ఆయన ప్రేమకు, కృపకు, క్షమాపణకు నిదర్శనం (ప్రకటన 3:7-22). చాలామంది విశ్వాసుల సమస్య దేవుడు లేకపోవడం కాదు. దేవునికి దూరంగా, లోకానికి దగ్గరగా ఉండటమే వారి ప్రధాన సమస్య. ఈ జోడు గుర్రాల స్వారీలోనే విశ్వాసులు బొక్కబోర్లా పడి చేదు అనుభవాలు పొందుతుంటారు. మన జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు ప్రథమస్థానాన్ని కోరుకుంటాడు. దేవుడూ లోకమూ కావాలనుకునే తప్పుడు ప్రాధాన్యతాక్రమంలో ఆయన అసలు ఇమడడు. మన జీవితంలో, కుటుంబంలో ఆయన మొదటి స్థానంలో లేకుంటే దేవుడసలు లేనట్టే!! దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చి నష్టపోయినవారు, ఆ స్థానం ఆయనకివ్వకుండా లాభపడినవారు లోకంలో ఉండరు. దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చిన వారెవ్వరూ జీవితంలో చివరిస్థానంలో ఉండరు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారమిస్తే ఆయన నీ త్రోవను సరళం చేస్తాడన్నది దేవుని వాగ్దానం (సామెతలు 3:6). ఆయన అధికారానికి లోబడటంలోని అపారమైన ఆశీర్వాదాలను అడ్డుకోవడానికే సాతాను మనల్ని ప్రలోభపెట్టి దేవుని స్థానంలో ధనాన్ని, లోకాన్ని తెచ్చి మన జీవితంలో ప్రతిష్టిస్తూంటాడు. దేవుని రాజ్యనిర్మాణం జరుపవలసిన వారితో సాతాను ఆ విధంగా తన రాజ్యాన్ని నిర్మింప జేసుకుంటున్నాడు. ‘‘మీరు బైబిలు మాత్రమే ఉపదేశిస్తారెందుకు?’’ అని ప్రసిద్ధ బాప్టిస్టు ప్రబోధకుడు పాస్టర్ ఎడ్రియన్ రోజర్స్‌ను ఇక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే, ‘ై‘బెబిలు తప్ప మరొకటి అర్థం చేసుకునేంత తెలివితేటలు నాకు లేవు. అయితే జీవితాల్ని, కుటుంబాల్ని కట్టగల శక్తి బైబిలుకే ఉందన్న సత్యాన్ని గ్రహించేంత తెలివి మాత్రం నాకుంది’’ అన్నాడాయన. బైబిలు తప్ప డబ్బు మాటే ఎత్తని ఆయన ప్రసంగాలు వినడానికి వేలాదిమంది 30 ఏళ్లపాటు ఆయన పాస్టరుగా ఉన్న చర్చిలో వారం వారం నిండిపోయేవారు. దేవుడంటే మాకు చాలా అభిమానం అంటారు చాలామంది. అభిమానులు సినీతారలకు, క్రికెటర్లకు కావాలి. దేవునికి సంపూర్ణ విధేయత చూపించే అనుచరులు కావాలి. దేవునితో సాన్నిహిత్యం పెరిగేకొద్దీ విశ్వాసి లోకానికి దినదినం దూరమవుతాడు. తేనెను ఆస్వాదించిన నోటికి మరేదీ రుచినివ్వనట్టే, దేవుని ప్రేమను, కృపను రుచి చూసిన విశ్వాసికి ‘ధనవృద్ధి’ చాలా తుచ్ఛమైనదిగా కనిపిస్తుంది. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్