దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చి నష్టపోయినవారు, ఆ స్థానం ఆయనకివ్వకుండా లాభపడినవారు లోకంలో ఉండరు. దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చిన వారెవ్వరూ జీవితంలో చివరిస్థానంలో ఉండరు.
ప్రసిద్ధ జర్మన్ శిల్పి జోహాన్ హెన్‌రిచ్ 18వ శతాబ్దంలో రెండేళ్లు శ్రమించి యేసుక్రీస్తు శిల్పాన్ని చెక్కాడు. దాన్ని ముందుగా ఒక వ్యక్తికి చూపిస్తే, ఎవరీయన? గొప్ప చక్రవర్తా? అనడిగాడు. తన వైఫల్యాన్ని గ్రహించి ఈసారి ఆరేళ్ల శ్రమతో మరో శిల్పాన్ని చెక్కాడు. అది చూసిన ప్రజల కళ్లలో తెలియకుండానే నీళ్లు తిరిగాయి. ‘‘మొదటిసారి నా నైపుణ్యాన్ని నమ్మాను. రెండవసారి ఆ యేసునే న మ్మాను. ఆయనే నా దగ్గరుండి నాతో చెక్కించారు’’ అంటూ హెన్‌రిచ్ సాక్ష్యం చెప్పాడు. ఆ శిల్పాన్ని నియంత నెపోలియన్ మెచ్చుకుని తాను ఆరాధించే వీనస్ దేవత బొమ్మను చెక్కమని ఆదేశిస్తే, యేసుక్రీస్తు రూపాన్ని చెక్కిన ఈ చేతులతో మరే రూపాన్నీ చెక్కలేనని నిరాకరించి ఆయన ఆగ్రహానికి గురయ్యాడు.
బైబిలులోని ప్రకటన గ్రంథంలో దేవుడు ప్రస్తావించిన ఏడు చర్చిల్లో చివరికి ఫిలడెల్ఫియా, లవొదికయ. ఈ రెండింటికీ అసలు పోలికే లేదు. ఫిలడెల్ఫియా చర్చిలో ఎత్తి చూపడానికి దేవునికి ఒక్క లోపమూ కనపడలేదు. లవొదికయ చర్చిలో మెచ్చుకొనడానికి ఒక్క లక్షణమూ కనపడలేదు. దేవుడే సర్వస్వంగా జీవించిన చర్చి ఫిలడెల్ఫియా కాగా, ధనవృద్ధి బాటలో పడి దేవుణ్ణి దూరం పెట్టిన చర్చి లవోదికయ. అయితే దేవుణ్ణి పూర్తిగా విస్మరించలేదు, చర్చి తలుపు బయట నిలబెట్టిందంతే! చర్చి వెలుపల ఉండాల్సిన ధనానికి అంటే లోకానికి లోపల ప్రధానాసనం వేసి చర్చిలో ప్రధానాసనంలో ఉండాల్సిన దేవుణ్ణి తలుపు బయట నిలబెట్టింది. ధనాన్ని హత్తుకుని యేసుక్రీస్తును నిరాదరించిన దేవుడు లేని డబ్బు చర్చి అది. అందువల్ల నీవు చల్లగానైనా, వెచ్చగానైనా లేవు, నులివెచ్చగా ఉన్నావంటూ యేసుప్రభువు అత్యంత తీవ్రమైన పదజాలంతో లవొదికయ చర్చిపై అభియోగాలు మోపాడు.
అయితే అంత నిరాదరణకు గురై కూడా యేసుక్రీస్తు తానింకా తలుపు వెలుపలే నిలబడి తనను లోపలికి రానివ్వడం కోసం, తలుపు తడుతున్నానని చెప్పడం తిరుగులేని ఆయన ప్రేమకు, కృపకు, క్షమాపణకు నిదర్శనం (ప్రకటన 3:7-22). చాలామంది విశ్వాసుల సమస్య దేవుడు లేకపోవడం కాదు. దేవునికి దూరంగా, లోకానికి దగ్గరగా ఉండటమే వారి ప్రధాన సమస్య. ఈ జోడు గుర్రాల స్వారీలోనే విశ్వాసులు బొక్కబోర్లా పడి చేదు అనుభవాలు పొందుతుంటారు. మన జీవితాల్లో, కుటుంబాల్లో దేవుడు ప్రథమస్థానాన్ని కోరుకుంటాడు. దేవుడూ లోకమూ కావాలనుకునే తప్పుడు ప్రాధాన్యతాక్రమంలో ఆయన అసలు ఇమడడు.
మన జీవితంలో, కుటుంబంలో ఆయన మొదటి స్థానంలో లేకుంటే దేవుడసలు లేనట్టే!! దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చి నష్టపోయినవారు, ఆ స్థానం ఆయనకివ్వకుండా లాభపడినవారు లోకంలో ఉండరు. దేవునికి ప్రథమ స్థానాన్నిచ్చిన వారెవ్వరూ జీవితంలో చివరిస్థానంలో ఉండరు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారమిస్తే ఆయన నీ త్రోవను సరళం చేస్తాడన్నది దేవుని వాగ్దానం (సామెతలు 3:6). ఆయన అధికారానికి లోబడటంలోని అపారమైన ఆశీర్వాదాలను అడ్డుకోవడానికే సాతాను మనల్ని ప్రలోభపెట్టి దేవుని స్థానంలో ధనాన్ని, లోకాన్ని తెచ్చి మన జీవితంలో ప్రతిష్టిస్తూంటాడు.
దేవుని రాజ్యనిర్మాణం జరుపవలసిన వారితో సాతాను ఆ విధంగా తన రాజ్యాన్ని నిర్మింప జేసుకుంటున్నాడు.
‘‘మీరు బైబిలు మాత్రమే ఉపదేశిస్తారెందుకు?’’ అని ప్రసిద్ధ బాప్టిస్టు ప్రబోధకుడు పాస్టర్ ఎడ్రియన్ రోజర్స్‌ను ఇక ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే, ‘ై‘బెబిలు తప్ప మరొకటి అర్థం చేసుకునేంత తెలివితేటలు నాకు లేవు. అయితే జీవితాల్ని, కుటుంబాల్ని కట్టగల శక్తి బైబిలుకే ఉందన్న సత్యాన్ని గ్రహించేంత తెలివి మాత్రం నాకుంది’’ అన్నాడాయన. బైబిలు తప్ప డబ్బు మాటే ఎత్తని ఆయన ప్రసంగాలు వినడానికి వేలాదిమంది 30 ఏళ్లపాటు ఆయన పాస్టరుగా ఉన్న చర్చిలో వారం వారం నిండిపోయేవారు. దేవుడంటే మాకు చాలా అభిమానం అంటారు చాలామంది. అభిమానులు సినీతారలకు, క్రికెటర్లకు కావాలి. దేవునికి సంపూర్ణ విధేయత చూపించే అనుచరులు కావాలి. దేవునితో సాన్నిహిత్యం పెరిగేకొద్దీ విశ్వాసి లోకానికి దినదినం దూరమవుతాడు. తేనెను ఆస్వాదించిన నోటికి మరేదీ రుచినివ్వనట్టే, దేవుని ప్రేమను, కృపను రుచి చూసిన విశ్వాసికి ‘ధనవృద్ధి’ చాలా తుచ్ఛమైనదిగా కనిపిస్తుంది.
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
నీ ప్రవర్తన అంతటిమీద ఆయనకు అధికారమిస్తే ఆయన నీ త్రోవనుసరళం చేస్తాడు
Published Sat, Nov 23 2013 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement