మానవునికి భక్తి అత్యవసరం. భగవంతుడితో భావయుక్త సంబంధం కలిగినదే భక్తి. పరమాత్మపై అనంతమైన ప్రేమ భక్తిలో వ్యక్తమవుతుంది. భక్తి, ప్రేమ... ఈరెండూ పొందడం చాలా సులువుగా అనిపించినా, వాటిని ఒక్కసారిగా పొందాలంటే ఎంతో కష్టం. భక్తితత్వంలో కోరికలకు తావులేదు. భక్తుడు తన మానస సముద్రంలోని ప్రతి నీటిబొట్టులోనూ దైవాన్ని మాత్రమే చూస్తాడు. పరమాత్మకు పూర్తిగా వశం కావడం వల్ల అమృతుడవుతాడు.
‘మోక్ష కారణ సామగ్య్రాం భక్తిరేవ గరీయసీ’ అని భక్తి ప్రాముఖ్యాన్ని వెల్లడించింది భాగవత పురాణం. నిర్గుణాన్ని సగుణం చేయగల శక్తి భక్తికే ఉంది. భక్తి లేకపోతే బ్రహ్మజ్ఞానం అలభ్యమని కూడా నొక్కి పలికింది. కనుక మానవుడు ముందుగా భగవంతుని ఆశ్రయించాలి. భక్తిసంయుతమైన మనస్సుకు అధిక శక్తి లభిస్తుంది. భక్తి ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ తనతో భక్తుని నడిపిస్తుంది. నిజమైన భక్తిజ్ఞానంతోపాటు వృద్ధి చెందుతూ ఉంటుంది. భక్తి- శ్రవణాది నవవిధ భక్తిమార్గాల ద్వారా సర్వేంద్రియ సద్వినియోగం చేస్తుంది. లౌకిక విషయాలవైపు విచ్చలవిడిగా పరుగులు తీసే ఇంద్రియాలనే అశ్వాలకు కళ్లెం వేసి అదుపులో పెడుతుంది. బాహ్యేంద్రియ నిగ్రహాన్ని కలిగించి, అంతరింద్రియ నిగ్రహానికి దారి చూపుతుంది. వినయ విధేయతలను అందించి అహంకార నిర్మూలనం గావిస్తుంది. బాల్యం నుండి ఒక క్రమశిక్షణను పాటించే వారి జీవితం ఆనందమయం అవుతుందనే సూత్రం భక్తిలో ఇమిడి ఉంది.
అయితే ఇందుకోసం ప్రప్రథమంగా మనిషిలో మనోనిగ్రహం ఏర్పడాలి. అప్పుడుగాని ఏకాగ్రత రాదు. ఏకాగ్రత కలిగితే గాని జపం సాగదు. జపంలో ఏకత్వం సిద్ధిస్తేగాని ధ్యానం కుదరదు. ధ్యానం కుదిరితేగాని భక్తిపట్ల ఆసక్తి ఏర్పడదు. కనుక తప్పనిసరిగా శాస్త్రప్రబోధం వినాలి. అనన్య భక్తులైన మహనీయుల అడుగుజాడలలో నడవాలి. అప్పుడే ఆ వ్యక్తిలో భక్తి జనించి నెమ్మదిగా వికసిస్తుంది.
నిజానికి ఈ కలియుగంలో నిజమైన భక్తిభావన కలగడమే కష్టం. ఏ కొద్దిపాటి భక్తి భావన మనలో కలిగినా దాన్ని ప్రేరేపించడం ఉత్తమం. ఇంతకు మించి ఈ యుగంలో భవసాగరం దాటడానికి వేరేమార్గం లేదు. కృతయుగంలో తపస్సు చేతనూ, త్రేతాయుగంలో యజ్ఞం వల్లనూ, ద్వాపరయుగంలో పరిచర్య ద్వారానూ, కలియుగంలో కేవలం భక్తిమార్గాన మాత్రమే దైవప్రాప్తి కలుగుతుందని నారదసూత్రాలు చెబుతున్నాయి.
ఈ భక్తి నడకను బట్టి నవవిధ భక్తులుగా విభజించింది భాగవతం. శ్రవణ, కీర్తన, అర్చన భక్తులచే నిగ్రహం, బాహ్యేంద్రియ సద్వినియోగం, స్మరణ భక్తిచే మనస్సంయమనం, పాదసేవన, వందన భక్తులచే అహంకార నాశనం, దాస్యభక్తిచే సేవాభావం, సఖ్యభక్తిచే ఏకాత్మత, ఆత్మనివేదన భక్తిచే బుద్ధి భక్తుడికి లభిస్తాయి. ఇవన్నీ పరిపక్వత పొందితే గానీ భక్తిమార్గంలో ప్రయాణం చేయలేరు.
భక్తివిధానాలన్నింటికీ శ్రవణం చాలా ముఖ్యం. శ్రవణం అంటే వినడం అని అర్థం. శ్రవణం సరిగా ఉంటే తర్వాత భక్తి విధానాలన్నీ సులభంగా సిద్ధిస్తాయి. విద్యలో శ్రద్ధ ఉంటే ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడవుతాడు. సంగీతంలో శ్రద్ధ ఉంటే గొప్ప సంగీత విద్వాంసునిగా రాణిస్తాడు. తపస్సులో శ్రద్ధ ఉంటే తపోనిధి అవుతాడు. దైవం పట్ల శ్రద్ధ ఉంటే మహాజ్ఞానిగా శోభిస్తాడు.
అందుకే శ్రద్ధగా శ్రవణం చేయాలని శాస్త్రం ఆదేశిస్తోంది. ఆ విధంగా శ్రవణం చేసి తమ జీవితాలను పునీతం గావించుకున్న వారిలో పరీక్షిన్మహారాజు, కులశేఖరాళ్వారు, తులసీదాసు మొదలైన వారెందరో ఉన్నారు. కనుకనే శ్రద్ధవిశ్వాసాలే భక్తికి పునాదులని పురాణాలు ఉద్ఘోషిస్తున్నాయి.
- చోడిశెట్టి శ్రీనివాసరావు
శ్రద్ధ, విశ్వాసాలే భక్తికి పునాదులు
Published Wed, Dec 4 2013 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement