- పుస్తక పరిచయం
సుజాత పట్వారి తన పుప్పొడి కవితా సంకలనం తర్వాత పిట్టకు ఆహ్వానం పలుకుతోంది. ఈ సంకలనంలోని కవితలు గతానికీ, వర్తమానానికీ వారధి కట్టే ప్రయత్నం చేస్తాయి. జ్ఞాపకానికి పెద్ద పీట వేస్తూ, కవయిత్రి మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. వర్తమానాన్ని ఎదుర్కోగలిగే బలాన్ని గతం నుండి, జ్ఞాపకాల నుండి, గతించిన వ్యక్తుల నుండి తెచ్చుకుంటుందా కవయిత్రి అనిపిస్తుంది. తాను పోగొట్టుకున్న తన కోసం నిరంతర అన్వేషణ! తాను ఆహ్వానం పలుకుతున్నది చెట్టు మీద ఉన్న పిట్టకు తన లోకం/లోగిలిలోకా లేక తనలో ఉన్న పిట్టకు బయటి ప్రపంచంలోకా అన్న ఆలోచన ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ వెంటాడుతుంది.
బాల్యపు బెంగలే కాదు, భవిష్యత్తుపై ఉత్సుకతే కాదు, ‘ఓ తాత్విక గంభీరత’ను కూడా ఈ కవితలు వెల్లడిస్తాయి. బుద్ధుడికి దొరికిన ఏనుగుపిల్ల, రావి ఆకులు కూడా ఇందులో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముందే చెప్పినట్లు, తన కోసం తనలోకే ఓ అన్వేషణ, అది కూడా సాధ్యపడని ఓ నిరంతర యుద్ధం.
‘యుద్ధాల్ని చూస్తూ చూస్తూ/ యుద్ధంగా మారినదాన్ని/ తుపాను కన్ను కనిపించాలే కానీ/ ధనుర్విద్య ఎంతసేపు’ అంటూ యుద్ధం మీదే యుద్ధాన్ని ప్రకటిస్తుంది.
చిత్రకారుడి ఏమరుపాటు రంగుల బీభత్సం కూడా ఓ అద్భుతమైన జ్ఞాపకంగానో, స్ఫూర్తినిచ్చే సంఘర్షణగానో మిగిలిపోతుంది. జిలేబి కట్టిన కాగితం, మిగిలిన ఆఖరు ముక్క, కాగితంలో దేవుడి బొమ్మ-- దాచుకోలేని, పారవేయనూలేని ద్వైదీభావం ముందు ముందు సుజాత రచనల్లో మరింత చర్చకు వస్తుందని ఆశిస్తున్నా.
- సునీతారాణి
పిట్టకు ఆహ్వానం; సుజాత పట్వారి; వెల: 50; ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపుల్లో. కవయిత్రి ఫోన్: 9440927122