book introduction
-
విలువైన వ్యాస పెన్నిధి
కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రాయలసీమకు చెందిన ప్రాచీన తెలుగు కవుల్ని నేటితరం వారికి పరిచయం చేయాలని ఓ ప్రణాళిక వేసుకుంది. కుమార సంభవం కావ్యకర్త ‘నన్నెచోడుడు’ ఈ ప్రణాళిక ఫలమే. మూల మల్లికార్జున రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో ఏడు వ్యాసాలున్నాయి. మహాపండితుడు నడకుదుటి వీరరాజు పంతులు రాసిన ‘కవిరాజ శిఖామణి కావ్య విశేషములు’ ఈ సంకలనంలోని మొదటి వ్యాసం. కావ్యావతారికలో ఇష్టదేవతా ప్రార్థన, గురుస్తుతి, పూర్వకవి ప్రశంస, కుకవి నింద మొదలైన విషయాల్ని ప్రస్తావించి నన్నెచోడుడు తర్వాతి కవులకు మార్గదర్శి అయ్యారని వీరరాజు పంతులు అన్నారు. కుమార సంభవంలోని కొన్ని పదాల్ని కందుకూరి వీరేశలింగం అన్యదేశ్యాలుగా భావించటం పొరపాటనీ, అవి మూలద్రావిడ భాషా పదాలే అనీ నిరూపించారు. ఆయన వాడిన ‘అప్రతీత పదములు’ అన్నమాట సరికాదనీ, అవి ఆ కవి కాలంలో వ్యవహారంలో వుండి, తర్వాతి కాలంలో కనుమరుగయ్యాయనీ చెప్పారు. ఆయన చర్చించిన ‘శబ్ద పరికర సంపత్తి’ భాగం భాషాశాస్త్రరీత్యా ఎంతో విలువైనది. 1926 నాటి ఈ అమూల్య వ్యాసం ఈ గ్రంథానికి పెన్నిధి. నన్నయ్యకు నన్నోచోడుడు నూరేండ్ల తర్వాతివాడని సోపపత్తికంగా నిరూపించారు వేటూరి ఆనందమూర్తి. చిలుకూరి పాపయ్య శాస్త్రి తమ ‘నన్నెచోడుని వర్ణనా నైపుణ్యము’లో సంస్కృత కవుల వర్ణనల్లో రసదృష్టి ప్రధానమైతే, తెలుగు కవుల వర్ణనల్లో ఆలంకారికత, చాతుర్యం, వైదగ్ధ్యం ప్రాముఖ్యాన్ని వహిస్తాయని చెప్పారు. నన్నెచోడుని కావ్యం అనల్ప కల్పనాశక్తి, అపూర్వ వర్ణనాయుక్తులు సుందర సంగమమనీ; మనస్తత్వ నిరూపణలో తిక్కన, సూరనలకు నన్నెచోడుడు మార్గదర్శకుడనీ అన్నారు సి.నారాయణ రెడ్డి. నన్నెచోడుని వర్ణనల్లోని వన్నెచిన్నెల్ని తమ వ్యాసంలో చక్కగా ప్రదర్శించారు వి.రాజేశ్వరి. రతీమన్మధుల సంవాదంలోని మనస్తత్వ చిత్రణలోని సూక్ష్మతల్ని నిరూపించారు. నన్నెచోడుని అష్టాదశ వర్ణనల్లోని ప్రగల్భతను ప్రస్తుతించారు ఆరుద్ర. కవి గడుసుదనాన్నీ, గమ్మత్తుల్నీ సోదాహరణంగా పేర్కొన్నారు. కుమారసంభవాన్ని తొలిసారిగా (మొదటి సంపుటం 1908, రెండవ సంపుటం 1914) ప్రచురించిన మానవల్లి రామకృష్ణ కవి వ్యాసం, కుమారసంభవం గురించి పరిశోధన చేసిన వేదం వెంకట్రాయశాస్త్రి, అమరేశం రాజేశ్వరశర్మ, తిమ్మావఝల కోదండరామయ్య గార్ల వ్యాసాలు సంకలింపబడివుంటే ఈ గ్రంథం సమగ్రతతో శోభిల్లివుండేది. ఘట్టమరాజు నన్నెచోడుడు (విమర్శ వ్యాసాలు) పేజీలు: 152; వెల: 100 ప్రధాన సంపాదకుడు: ఆచార్య కె.చంద్రయ్య ప్రతులకు: సభ్య కార్యదర్శి మరియు రిజిస్ట్రార్, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం, 1–1254, యర్రముక్క పల్లె, కడప–516004. ఫోన్: 08562–255517 -
పుస్తక పరిచయం
చరిత్ర తాటాకు చప్పుళ్లపై ధిక్కారస్వరం పురాణగాథల్ని సరికొత్తగా పునర్లిఖించడమనే కోవలోకి చేరిన తాజా తెలుగు నవల బెజ్జారపు రవీందర్ ‘తాటక‘. బాధితుల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి పీడకుల దమననీతిని ఎం.ఆర్.ఐ. స్కాన్ చేయడమే ఇటువంటి నవలల ప్రధానోద్దేశం. ఆనంద్ నీలకంఠన్ నవలలు ‘అసుర‘, ‘అజయ’ సాహితీ ప్రపంచంలో ఎంత సంచలనాన్ని సృష్టించాయో తెల్సిందే. మనకు తెల్సిన ‘తాటక‘ రామాయణంలోని ఒక రాక్షస స్త్రీ. యాగ రక్షణార్థం విశ్వామిత్రుడి ఆదేశం మేరకు రామలక్ష్మణులు సంహరించిన పాత్ర. రచయితే చెప్పినట్లు, ‘ఒళ్ళంతా నల్లరంగు పులుముకొని, నోటికి ఇరువైపులా నిమ్మకాయలు, ఎర్రటి కృత్రిమ నాలుక, భారీ కృత్రిమ స్తనాలు, పిరుదులు, కాళ్ళకు గజ్జెలతో భయానకంగా’ తలపుకు వచ్చే రూపం ‘తాటక‘. కానీ చలామణీలో వున్న చరిత్ర మాటున మరుగునపడ్డ చీకటి కోణాల్ని ఆవిష్కరిస్తుంది ‘తాటక‘. ఆధిపత్య బ్రాహ్మణ భావజాలాన్ని బట్టబయలు చేస్తుంది. నాస్తికత్వాన్ని తెగనరకడానికి జరిగిన కుట్రల్ని తేటతెల్లం చేస్తుంది. అటవీభూముల ఆక్రమణకోసం ఆదిమ స్థానిక తెగలను అంతమొందించే దుర్మార్గాలను కళ్ళకు కడ్తుంది. సరళంగా, సూటిగా, సాధ్యమైనంతవరకు సత్యానికి దగ్గరగా ఉందనిపించేట్లుగా సాగిన ఈ రచన కొత్త ప్రశ్నల్ని సంధిస్తుంది. పాఠకుడి చైతన్య పరిధిని విçస్తృతం చేయడానికి ప్రయత్నిస్తుంది. అన్నింటికీ మించి అభివృద్ధి పేరిట అడవుల్లోని గిరిజనులపై దాష్టీకాలు పెచ్చరిల్లుతున్న కాలంలో ‘తాటక’ రిలవెంట్గా తోస్తుంది. ‘బలహీనుడిలోనూ కొన్ని బలహీనత లుంటాయి. అయినా నా సానుభూతి ఎప్పుడూ దెబ్బతిన్నవాడివైపే వుంటుంది’ అంటుంది ఇందులోని ఒక పాత్ర(అష్టకుడు). నవల చేసిన పని కూడా అదే. ‘పరాజితుల గాథలను కీర్తించడం ప్రమాదాల్లోకెల్లా ప్రమాదం’ అంటూనే రచయిత ఆ ప్రమాదాన్ని తలపెట్టాడు. అందుకు నిజంగా అభినందనీయుడు. ఠి ఎమ్మార్ ఆనంద్ తాటక; బెజ్జారపు రవీందర్; 144 పేజీలు; రూ.80; ప్రతులకు: పాలపిట్ట బుక్స్. ఫోన్: 040–27678430 మడేలుమిట్ట కతలు రచన: వింజమూరు మస్తాన్‌బాబు; పేజీలు: 160; వెల: 50; ప్రతులకు: రచయిత, రజక సమాఖ్య కార్యాలయం, 5/360, 2వ అంతస్థు, కె.పి.కాంప్లెక్స్, స్టోన్‌హౌస్‌పేట, నెల్లూరు–524002. ఫోన్: 9491920429 ‘జ్ఞాపకాలుగా కనిపించే ఈ కతలు స్వీయాత్మకంగా ఉంటూనే, సహజ పరిణామాలకు అద్దం పడుతున్నాయి. చాకలివృత్తి జీవుల జీవనపోరాటం ఈ కథల వస్తువు. కథలోని అనుభవాలు ఆశు పద్ధతిని జీర్ణం చేసుక్ను లిఖిత పద్ధతిలో రాయబడ్డాయి.’ ‘జానపదవాణి, పౌరాణిక వాసన, సాంఘిక వాస్తవికత పెనవేసుకుని ఆసక్తికరంగా చదివిస్తాయి.’ ‘కావలి పరిసర ప్రాంత భాషా యాసా పలుకుబళ్ల’తో ‘ఒక కొత్త కుల వాతావరణాన్ని పరిచయం చేస్తాయి.’ -
పుస్తక పరిచయం.. అర్ధనారీశ్వరుడు
ఒక రచయిత తాను చనిపోయానని ప్రకటించుకునేంత వేదనకు గురైంది ఈ పుస్తకం వల్లా? (దేవరన్యాయం, నియోగం సంతానాల పాత్రలు ఎన్నోవున్న) మహాభారత గ్రంథాన్ని అక్కున చేర్చుకోగలిగినవారు పెరుమాళ్ మురుగన్లాంటి రచయితలను ఎందుకు తూలనాడుతున్నారు? అని మద్రాస్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఈ నవల గురించిన కేసులోనా? అనిపిస్తుంది ఈ పుస్తకం పూర్తిచేశాక. పశ్చిమ తమిళనాడులోని నమక్కాల్ జిల్లా తిరుచెంగోడు పట్టణ ప్రాంతంలోని ఓ సామాజిక సాంప్రదాయం ఈ నవలకు నేపథ్యం. పిల్లలు లేనివాళ్లు అక్కడి అర్ధనారీశ్వరుడికి జరిగే రథోత్సవ వేడుకల్లో 14వ రోజున సాంఘిక కట్టుబాట్లను వదిలి, ఆ రాత్రి ఎవరితోనైనా శృంగారంలో పాల్గొని పిల్లల్ని కనవచ్చు. ఆ రోజు కలిసేది సాక్షాత్తూ దేవుడే! పిల్లలు లేని కాళి, పొన్న దంపతుల కథ ఇది. ఇద్దరూ గౌండర్లే. కాని కాళి కాటాయి విభాగానికీ, పొన్న వెంటువ విభాగానికీ చెందినవారు. ప్రేమించి పెళ్లిచేసుకుంటారు. ‘నేను పదిమంది పిల్లలను కన్నా వాడే నా మొదటి పిల్లాడు’ అనుకునేంత ప్రేమ వాళ్లది. కానీ పన్నెండేళ్లయినా వాళ్లకు పిల్లలు కలగరు. ‘నా బదులు నువ్వు ఒక మేకను కట్టుకొని వుంటే అది నేను మింగిన పసరు మందులు మొత్తం మింగివుంటే ఈ పాటికి మందలు మందలుగా పిల్లలను కనేది’ అనుకునేంత బాధ వాళ్లది. ఒక అతిసాధారణ గ్రామీణ జంటకు ఉండగలిగే చైతన్యపు పరిధిలో వారిముందున్న ప్రతి అవకాశాన్నీ స్పృశించాడు రచయిత. ఆ సమాజంలో పిల్లలు లేనివాళ్లు ఎదుర్కోగలిగే సూటిపోటి మాటల్నీ, వివక్షనీ, నిరసననీ అన్నీ చూపించాడు. పిల్లలు లేకుండా ఆనందంగా జీవిస్తున్న నల్లప్ప మామ పాత్రను సమాంతరంగా నడిపించడం ద్వారా ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా వాళ్ల ముందుంచాడు. ‘సంతోషం గురించి తెలియని వెర్రివాళ్లు పిల్లలను పుట్టించి బాధపడనీ. అది చూసి నవ్వుకుందాం మనం’ అంటాడు నల్లప్ప. కానీ అంత గుండె దిటవు లేదు వారికి. ‘ప్రతి ఒకరిని ఏదో ఒక లోపంతోనే సృష్టించాడు ఆ దేవుడు. ఆ లోపాలను సవరించుకునే మార్గాలు కూడా ఆ దేవుడే ఇచ్చాడు.’ మరి ఆ ‘దేవుడి మార్గం’లో వెళ్లాలా? వద్దా? వెళ్లాక మునుపటిలాగా ముఖాలు చూసుకోగలమా? వెళ్లి తీరాలని పట్టుబట్టే పొన్న ఇంటివాళ్లు, వెళ్లమనడానికి నోరురాని కాళి... ఈ సున్నితమైన బాహ్య, అంతః ఘర్షణే నవలంతా నిజానికి! ఏ సంచలనాన్నో సృష్టించడం కోసం కాకుండా, ఒక పాత ఆచారపు ఆలంబనగా కథ నడిపించాడు రచయిత. పక్షాలు వహించకుండా, సంయమనం కోల్పోకుండా, కావాల్సినంత విశృంఖల శృంగారాన్ని దట్టించే అవకాశం వుండీ దాని జోలికి పోకుండా పద్ధతిగా నవలను నడిపించాడు. అయితే, దాచుకునేంత షెల్ఫ్‌లైఫ్ లేని ఈ పుస్తకం వివాదాస్పదం కాకపోయివుంటే ఇంత ఆసక్తితో చదివేలా చేసేదా అన్నది అనుమానమే! ఈ పుస్తకాన్ని ఎల్.ఆర్.స్వామి చక్కగా అనువదించారు. ఏ మాత్రం అభిరుచి లేని ముఖచిత్రంతో ప్రచురించింది మాత్రం విశాలాంధ్ర! పి.శివకుమార్ అర్ధనారీశ్వరుడు; తమిళ మూలం: పెరుమాళ్ మురుగన్; తెలుగు: ఎల్.ఆర్.స్వామి; పేజీలు: 152; వెల: 120; ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ; ఫోన్: 0866-2430302 -
పిట్టకు ఆహ్వానం
- పుస్తక పరిచయం సుజాత పట్వారి తన పుప్పొడి కవితా సంకలనం తర్వాత పిట్టకు ఆహ్వానం పలుకుతోంది. ఈ సంకలనంలోని కవితలు గతానికీ, వర్తమానానికీ వారధి కట్టే ప్రయత్నం చేస్తాయి. జ్ఞాపకానికి పెద్ద పీట వేస్తూ, కవయిత్రి మానసిక సంఘర్షణకు అద్దం పడతాయి. వర్తమానాన్ని ఎదుర్కోగలిగే బలాన్ని గతం నుండి, జ్ఞాపకాల నుండి, గతించిన వ్యక్తుల నుండి తెచ్చుకుంటుందా కవయిత్రి అనిపిస్తుంది. తాను పోగొట్టుకున్న తన కోసం నిరంతర అన్వేషణ! తాను ఆహ్వానం పలుకుతున్నది చెట్టు మీద ఉన్న పిట్టకు తన లోకం/లోగిలిలోకా లేక తనలో ఉన్న పిట్టకు బయటి ప్రపంచంలోకా అన్న ఆలోచన ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ వెంటాడుతుంది. బాల్యపు బెంగలే కాదు, భవిష్యత్తుపై ఉత్సుకతే కాదు, ‘ఓ తాత్విక గంభీరత’ను కూడా ఈ కవితలు వెల్లడిస్తాయి. బుద్ధుడికి దొరికిన ఏనుగుపిల్ల, రావి ఆకులు కూడా ఇందులో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముందే చెప్పినట్లు, తన కోసం తనలోకే ఓ అన్వేషణ, అది కూడా సాధ్యపడని ఓ నిరంతర యుద్ధం. ‘యుద్ధాల్ని చూస్తూ చూస్తూ/ యుద్ధంగా మారినదాన్ని/ తుపాను కన్ను కనిపించాలే కానీ/ ధనుర్విద్య ఎంతసేపు’ అంటూ యుద్ధం మీదే యుద్ధాన్ని ప్రకటిస్తుంది. చిత్రకారుడి ఏమరుపాటు రంగుల బీభత్సం కూడా ఓ అద్భుతమైన జ్ఞాపకంగానో, స్ఫూర్తినిచ్చే సంఘర్షణగానో మిగిలిపోతుంది. జిలేబి కట్టిన కాగితం, మిగిలిన ఆఖరు ముక్క, కాగితంలో దేవుడి బొమ్మ-- దాచుకోలేని, పారవేయనూలేని ద్వైదీభావం ముందు ముందు సుజాత రచనల్లో మరింత చర్చకు వస్తుందని ఆశిస్తున్నా. - సునీతారాణి పిట్టకు ఆహ్వానం; సుజాత పట్వారి; వెల: 50; ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపుల్లో. కవయిత్రి ఫోన్: 9440927122 -
జీనా హై తో మర్నా సీఖో
పుస్తక పరిచయం పుస్తకంలోకి అడుగు పెట్టకముందే, ఆ కాలాతీత యోధుడు మనల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. ఒక నిమిషం ఏకాగ్రతతో ఆయన కళ్లకేసి చూడండి: ‘నాకు సమాధానాలు కావాలి’ అని అడుగుతున్నాయవి. సెంట్రల్ యూనివర్సిటీ, రోహిత్, జేఎన్‌యూ, అతి సహనం, అతి అసహనం... ఎన్నో అడుగుతూనే ఉన్నాడు. మన దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు, ఉన్నా చెబుతామో లేదో తెలియదు... అయినా సరే లోపలికి వెళతాం. ఉస్మానియా యూనివర్సిటీలో 1960ల చివరి నుండి-70ల తొలిరోజుల విద్యార్థి ఉద్యమం జార్జిరెడ్డిగా దర్శనమిస్తుంది. ‘ఉద్యమ’ నిర్వచనాలు తారుమారవుతున్న కాలం. సైద్ధాంతిక బలం ఎక్కువై, ఆచరణ బలహీనత ఒక సామాజిక రోగంగా మారుతున్న కాలం. సిద్ధాంత సారం సిద్ధాంతాల్లోనే ఉండిపోయి, ప్రగతిశీల ‘మేధ’ కనిపించీ కనిపించని కాలంలో... జార్జిరెడ్డి జీవితాన్ని చదువుకోవడం అంటే లీలమ్మ, రఘునాథరెడ్డి పుత్రుడి గురించో, అత్యంత ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి గురించో, ఇతరుల క్షేమం గురించి తప్ప తన జీవితం గురించి పట్టించుకోని ఒక బలమైన విద్యార్థి నాయకుడి గురించో మాత్రమే చదువుకోవడం కాదు; ‘జీనా హైతో మర్నా సీఖో’ అంటూ ఈ కాలానికి అవసరమైన ధైర్యవచనాలను ధైర్యంగా చదువుకోవడం.బా...గా... కుంచించుకుపోయిన జీవితాన్ని విశాలం చేసుకోవడం. ఈ పుస్తకానికి ముందు చే గువేరా జీవితాన్ని పరిచయం చేశారు ‘చూపు’ కాత్యాయని. జార్జిరెడ్డి గురించి చదువుతున్నంత సేపూ ఎక్కడో ఒక చోట చే గుర్తుకు వస్తూనే ఉంటాడు. - యాకుబ్ పాషా యం.డి. -
కిటికీలోంచి వాన
పుస్తక పరిచయం ‘ఆకాశం నుండి భూమికి ఏదో వర్తమానం తీసుకువస్తున్నట్లు రాలే చినుకు... బంగారు తీగలా మెరిసే మెరుపు ’ ఇలా వానని సౌందర్య దృష్టితో చూసిన పదిహేనేళ్ల జవ్వని, జీవితపు ఆటుపోట్లలో చిక్కుకున్న పాతికేళ్ల తర్వాత, ‘పెరుగుతున్న వానలా రోజురోజుకీ అప్పు పెరిగిపోతుంది... వాన పడిన తర్వాత ఏర్పడిన బురదలా ఉంది జీవితం’ అంటుంది. వాన అదే. చూసే దృష్టిలోనే మార్పు. ఇలాంటి కథను సృష్టించిన రచయిత ఆకెళ్ల శివప్రసాద్. ‘కిటికీలోంచి వాన’ 27 కథల సంకలనం. జీవితాన్ని చూసి భయపడి పారిపోదామనుకునే వారూ, జీవితాన్ని ఎదుర్కొని పోరాడే ఆడపిల్లలూ, కళా సాంస్కృతిక రంగాల్లోని కుహనా వ్యక్తులు, అవకాశాల్ని తమకు అనువుగా మార్చుకొనే జర్నలిస్టులు... ఇలా చాలామంది తారసపడతారు. ఆఫీసుల్లో చిన్న చిన్న మొత్తాల్ని తీసుకుని తిరిగి ఇవ్వని వాళ్లంటే మనకు చులకన. అలాంటి ఒక వ్యక్తి ఆ అప్పుల్ని రిటైరయ్యే రోజు తిరిగి తీర్చేస్తే! ఇది ‘అంతరంతరం’ కథ. రిటైరైపోయినవాళ్లకు తమను ఇంట్లో పట్టించుకోవట్లేదన్న న్యూనత ఉంటుంది. అందులోంచి పుట్టిన కథ ‘వినిపించని రాగాలు’. పేదరికంలో ఉన్న ఆడపిల్ల ఒక టెంపరరీ ఉద్యోగంలో అడుగుపెడితే వేధించే మగాళ్లకు కొరతలేదీ దేశంలో. అలాంటి మృగాళ్ల ‘జనారణ్యం’ కథ గుండెల్ని తాకుతుంది. చదువుకోవాలన్న తపనతో ఓ కుర్రాడు (సుకృతం), తన తాతల నాటి గుడిని కాపాడుకోవాలన్న తపనతో మరో కుర్రాడు (మహా సంకల్పం) మనల్ని చాలాకాలం వెంటాడుతారు. ఒక సంస్కృతిలోని సంపదను కాపాడుకోవాలనే సత్యాన్ని ఆర్ద్రంగా ఆవిష్కరించిన కథ ‘సరస్వతి లిపి’. జీవితాన్ని అల్లుకుని పెనవేసుకుంటూ సాగటం శివప్రసాద్ కథల లక్షణం. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల దుఃఖాల్ని, సంతోషాల్ని పాఠకుల ముందు నక్షత్రాల్లా పరుస్తాయి. - సి.ఎస్.రాంబాబు 9490401005 -
కవులు బాల్యమిత్రులు
పుస్తక పరిచయం: ‘హైకూ అంటే ఒక పదచిత్రం. ఆ పదచిత్రం మనసులో సున్నితమైన అనుభూతిని కలిగించాలి. ఆ అనుభూతి లోపల ఒక విధమైన మెలకువ లాంటిది కలిగిస్తుంది, సౌందర్యం పట్ల,’ అంటారు బివివి ప్రసాద్. ఈ జపనీయ కవితారీతిని అనుసరించి, తెలుగులో స్వతంత్ర హైకూలు రాసిన గాలి నాసరరెడ్డి, ఇస్మాయిల్లాగానే బివివి ప్రసాద్ (ఫోన్: 9493478556) కూడా నిక్కమైన హైకూలు రాశారు. వాటిని 1995-99 మధ్య ‘దృశ్యాదృశ్యం’, ‘హైకూ’, ‘పూలు రాలాయి’ సంకలనాలుగా తెచ్చారు. చదవాల్సినట్టుగా చదివితే హైకూలు అద్దే పరిమళం, అవి మేల్కొలిపే కరుణ మామూలుది కాదు. వాటితో స్నేహం కోసమే ఈ పాత పసిడి: గోడలో పూచినపూవు పరిచయం చేసింది మా గోడని కవులు పెద్దయాక పరిచయమైన బాల్యమిత్రులు చేయి పట్టుకుంది నిద్రలో. పాప కలలోకి ఎలా వెళ్లను? చేప దొరికింది విలవిల్లాడింది కొలను కిటికీ ఎవరూ తగిలించని చిత్రపటం మొట్టమొదటి తెలుగు అనువాదం వివిధ విభాగాలలో ఎన్నో ప్రామాణిక గ్రంథాలను ప్రచురించిన తెలుగు అకాడమి, తాజాగా ‘పాణినీయ అష్టాధ్యాయి’ని రెండు భాగాలుగా వెలువరించింది. ‘క్రీ.పూ. 350 నుంచి 250 మధ్యకాలంలో సంస్కృత వ్యాకరణకారుడు పాణిని రచించిన అష్టాధ్యాయి అత్యున్నత మానవమేధకు తార్కాణం అనీ, ఇప్పటివరకు ప్రపంచభాషల్లో ఏ భాషకూ ఇంతటి గొప్ప వ్యాకరణశాస్త్ర గ్రంథం లేదనీ’ ప్రఖ్యాత భాషావేత్త లియొనార్డ్ బ్లూం ఫీల్డ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాకరణశాస్త్రాన్ని ‘ప్రపంచంలోని అన్ని భాషలకు అనువర్తింప చేసుకోవచ్చునని’ మాక్స్‌ముల్లర్ కూడా అభిప్రాయపడ్డారు. ఇలాంటి గ్రంథాన్ని ఆచార్య రవ్వా శ్రీహరి ‘దశాబ్దకాలానికి పైగా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి’ తెలుగులోకి తెచ్చారు. సంస్కృత సూత్రాలను తెలుగు లిపిలో యథాతథంగా పొందుపరిచి, వాటికి తెలుగులో వివరణల్ని ఇస్తూ వ్యాఖ్యానించారు. ఈ గ్రంథం గురించి ‘ప్రవేశిక’ ఇంకా ఇలా తెలియజేస్తోంది: ‘సూత్రరూపంలో రచించిన ఈ వ్యాకరణంలో లౌకిక, వైదిక సంస్కృతభాషల రెండింటి స్వరూపాన్ని వర్ణించే మొత్తం 3981 సూత్రాలు ఉన్నాయి. అష్టాధ్యాయి ఎనిమిదధ్యాయాలుగా విభక్తం కావడం వల్ల దీనికి అష్టాధ్యాయి అనే పేరు వచ్చింది. దీనికి పతంజలి మహర్షి రచించిన మహాభాష్యమనే వ్యాఖ్యానం, వామన జయాదిత్యులు రచించిన కాశికావృత్తి ప్రసిద్ధాలు. కాశికావ్యాఖ్య సూత్రార్థం, ఉదాహరణం, పదప్రయోజనం మొదలైన అంశాలతో కూడి ఉంది. ఈ వృత్తి కాశిలో రచించడం వల్ల కాశిక అనే పేరుతో ప్రసిద్ధమైంది. పఠన పాఠనాదుల్లో ఈ వ్యాఖ్య ఎక్కువ ప్రచారంలో ఉంది. ప్రస్తుత గ్రంథం అష్టాధ్యాయీ గ్రంథానికేకాక కాశికావ్యాఖ్యానానికి కూడా తెలుగులో వెలువడుతున్న మొట్టమొదటి అనువాదం’. పాణినీయ అష్టాధ్యాయి (వామన జయాదిత్యకృత కాశికావృత్తసహితం) తెలుగు అనువాదం: ఆచార్య రవ్వా శ్రీహరి మొదటి సంపుటం (1-4 అధ్యాయాలు) పేజీలు: 934; వెల: 350 రెండవ సంపుటం (5-8 అధ్యాయాలు) పేజీలు: 1048; వెల: 390 ప్రచురణ: తెలుగు అకాడమి, హైదరాబాద్ పంజరపు రంగుల కథ! ‘సంకెళ్ల సవ్వడి’ ఆవిష్కరణ 13 జూన్ నాడు సారస్వత పరిషత్ హాల్, బొగ్గులకుంట(హైదరాబాద్)లో సాయంత్రం 5:30కి జరుగుతుంది. బొజ్జా తారకం అధ్యక్షత వహించే ఈ కార్యక్రమంలో జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, ప్రొ. హరగోపాల్, అరుణ్ ఫరేరా, సీమా ఆజాద్, ఎన్.వేణుగోపాల్, కె.శ్రీనివాస్ పాల్గొంటారు. సాంకేతికంగా మాత్రమే ఇది అనువాద పుస్తకం. సారాంశంలో అచ్చ తెలుగు పుస్తకం. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్త, చిత్రకారుడు అరుణ్ ఫరేరాను రకరకాల ఆరోపణలతో పోలీసులు అరెస్ట్ చేశారు. ‘కలర్స్ ఆఫ్ ద కేజ్’ పేరుతో తన అయిదేళ్ల జైలు జీవిత అనుభవాలకు పుస్తకం రూపం ఇచ్చారు అరుణ్. వాటిని చదువుతుంటే ఒకప్పటి తెలంగాణ కల్లోల కథా చిత్రాలు కళ్ల ముందు వరుస కడుతాయి. ‘కారాగార సాహిత్యం’ మనకు కొత్తదేమీ కాదు. జైలు గోడలు కవిత్వం వినిపించాయి. ఊచలు కథలు వినిపించాయి. ములాఖతులు మౌనగానాలయ్యాయి. అపురూపమైన కారాగార సాహిత్యానికి ‘సంకెళ్ల సవ్వడి’ సరికొత్త చేర్పు. ఈ పుస్తకం ద్వారా, జైలు ప్రపంచంలోకి మనల్ని తీసుకువెళ్లి అండాసెల్ నుంచి గూనఖానా వరకు అణువణువూ పరిచయం చేశారు అరుణ్. అది భౌతిక పరిచయం మాత్రమే కాదు; ఆ గాలిలోని కన్నీటి వేడిని, వేదనను, తిరుగుబాటు తత్వాన్ని, హక్కుల స్పృహ గురించి చేసే పరిచయం కూడా. పుస్తకంతో మమేకం కావడానికి మన పరిచిత ప్రపంచంలో అరుణ్‌లాంటి వాళ్ల కథలు ఎన్నో ఉండి ఉంటాయి. అందుకే ఇది మన తెలుగు రాష్ట్రాల అసలు సిసలు పుస్తకం. దీన్ని చదువుకోవడం అంటే... ఒక వ్యక్తి వైయక్తిక విషాద అనుభవాలను చదువుకోవడం ఎంత మాత్రం కాదు. రాజ్యహింసలోని రాక్షసత్వాన్ని, హక్కుల విధ్వంసాన్ని తెల్లటి పుటల మీద నల్లటి వెలుగులతో చూడడం. ఎన్.వేణుగోపాల్ అనువాదం, ‘పంజరంలో రంగుల ఆకాశం’ పేరుతో బి.అనురాధ రాసిన ముందుమాట పుస్తకాన్ని మరింత చేరువ చేస్తాయి. యాకుబ్ పాషా సంకెళ్ల సవ్వడి (ఒక ‘మావోయిస్ట్’ ఖైదీ జైలు అనుభవాలు) రచన: అరుణ్ ఫరేరా; తెలుగు: ఎన్.వేణుగోపాల్ పేజీలు: 192; వెల: 150; ప్రచురణ: మలుపు, హైదరాబాద్ ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్-500044 కొత్త పుస్తకాలు 1. భారత కార్మికోద్యమ చరిత్ర (1830-2010) రచన: సుకోమల్ సేన్ తెలుగు: కె.కె.డి.హనుమంతరావు, ఎస్.ధనుంజయరావు పేజీలు: 832; వెల: 500 2. కమ్యూనిస్టు యోధుడు-శాసనసభా ధీరుడు నర్రా రాఘవరెడ్డి పేజీలు: 168; వెల: 70 3. నేను- నా ప్రజా జీవితం రచన: పర్సా సత్యనారాయణ పేజీలు: 112; వెల: 60 ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్-తెలంగాణ, ఎమ్హెచ్ భవన్, ప్లాట్ నం. 21/1, అజామాబాద్, ఆర్టీసీ కళ్యాణమండపం దగ్గర, హైదరాబాద్-20 ఫోన్: 040-27660013 అమ్మచీర (కథల సంపుటి) రచన: వేంపల్లి సికిందర్ పేజీలు: 118; వెల: 75 ప్రతులకు: రచయిత, నం. 8, గ్రీన్‌పార్క్ అపార్ట్మెంట్, బ్లాక్ ఎ, డి.ఆర్.మహల్ రోడ్, తిరుపతి-517501; ఫోన్: 9666426875 షట్చక్రాలు- జ్యోతిర్వైద్యం రచన: అడవికొలను మాలతి పేజీలు: 160; వెల: 100 ప్రతులకు: సాహితీ ప్రచురణలు, 29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-520002; ఫోన్: 0866-2436643 సంభవామి యుగే యుగే రచన: ఆర్.శోభాదేవి పేజీలు: 208; వెల: 180 ప్రతులకు: రచయిత్రి, బి-408, సాయికృపా రెసిడెన్సీ, మోతీనగర్, హైదరాబాద్-18; ఫోన్: 8500120960 సాహిత్య ప్రభలు (వ్యాస సంపుటి) రచన: డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్ పేజీలు: 96; వెల: 100 ప్రతులకు: శ్రీలేఖ సాహితి, 14-5/2, శ్రీలేఖ కాలనీ, హసన్‌పర్తి, వరంగల్-506371; ఫోన్: 9949857955 సెల్ఫ్ హిప్నాటిజం రచన: బి.వి.సత్యనాగేష్ పేజీలు: 152; వెల: 80 ప్రతులకు: మైండ్ ఫౌండేషన్, 203, మనోహర్ అపార్ట్మెంట్స్, ఓయూ రోడ్, విద్యానగర్, హైదరాబాద్-44; ఫోన్: 9849064614