జీనా హై తో మర్‌నా సీఖో
పుస్తక పరిచయం
పుస్తకంలోకి అడుగు పెట్టకముందే, ఆ కాలాతీత యోధుడు మనల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. ఒక నిమిషం ఏకాగ్రతతో ఆయన కళ్లకేసి చూడండి: ‘నాకు సమాధానాలు కావాలి’ అని అడుగుతున్నాయవి. సెంట్రల్ యూనివర్సిటీ, రోహిత్, జేఎన్‌యూ, అతి సహనం, అతి అసహనం... ఎన్నో అడుగుతూనే ఉన్నాడు. మన దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు, ఉన్నా చెబుతామో లేదో తెలియదు... అయినా సరే లోపలికి వెళతాం.
ఉస్మానియా యూనివర్సిటీలో 1960ల చివరి నుండి-70ల తొలిరోజుల విద్యార్థి ఉద్యమం జార్జిరెడ్డిగా దర్శనమిస్తుంది.
‘ఉద్యమ’ నిర్వచనాలు తారుమారవుతున్న కాలం. సైద్ధాంతిక బలం ఎక్కువై, ఆచరణ బలహీనత ఒక సామాజిక రోగంగా మారుతున్న కాలం. సిద్ధాంత సారం సిద్ధాంతాల్లోనే ఉండిపోయి, ప్రగతిశీల ‘మేధ’ కనిపించీ కనిపించని కాలంలో... జార్జిరెడ్డి జీవితాన్ని చదువుకోవడం అంటే లీలమ్మ, రఘునాథరెడ్డి పుత్రుడి గురించో, అత్యంత ప్రతిభావంతుడైన ఒక విద్యార్థి గురించో, ఇతరుల క్షేమం గురించి తప్ప తన జీవితం గురించి పట్టించుకోని ఒక బలమైన విద్యార్థి నాయకుడి గురించో మాత్రమే చదువుకోవడం కాదు; ‘జీనా హైతో మర్‌నా సీఖో’ అంటూ ఈ కాలానికి అవసరమైన ధైర్యవచనాలను ధైర్యంగా చదువుకోవడం.బా...గా... కుంచించుకుపోయిన జీవితాన్ని విశాలం చేసుకోవడం.
ఈ పుస్తకానికి ముందు చే గువేరా జీవితాన్ని పరిచయం చేశారు ‘చూపు’ కాత్యాయని. జార్జిరెడ్డి గురించి చదువుతున్నంత సేపూ ఎక్కడో ఒక చోట చే గుర్తుకు వస్తూనే ఉంటాడు.
- యాకుబ్ పాషా యం.డి.