కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రాయలసీమకు చెందిన ప్రాచీన తెలుగు కవుల్ని నేటితరం వారికి పరిచయం చేయాలని ఓ ప్రణాళిక వేసుకుంది. కుమార సంభవం కావ్యకర్త ‘నన్నెచోడుడు’ ఈ ప్రణాళిక ఫలమే. మూల మల్లికార్జున రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో ఏడు వ్యాసాలున్నాయి.
మహాపండితుడు నడకుదుటి వీరరాజు పంతులు రాసిన ‘కవిరాజ శిఖామణి కావ్య విశేషములు’ ఈ సంకలనంలోని మొదటి వ్యాసం. కావ్యావతారికలో ఇష్టదేవతా ప్రార్థన, గురుస్తుతి, పూర్వకవి ప్రశంస, కుకవి నింద మొదలైన విషయాల్ని ప్రస్తావించి నన్నెచోడుడు తర్వాతి కవులకు మార్గదర్శి అయ్యారని వీరరాజు పంతులు అన్నారు. కుమార సంభవంలోని కొన్ని పదాల్ని కందుకూరి వీరేశలింగం అన్యదేశ్యాలుగా భావించటం పొరపాటనీ, అవి మూలద్రావిడ భాషా పదాలే అనీ నిరూపించారు. ఆయన వాడిన ‘అప్రతీత పదములు’ అన్నమాట సరికాదనీ, అవి ఆ కవి కాలంలో వ్యవహారంలో వుండి, తర్వాతి కాలంలో కనుమరుగయ్యాయనీ చెప్పారు. ఆయన చర్చించిన ‘శబ్ద పరికర సంపత్తి’ భాగం భాషాశాస్త్రరీత్యా ఎంతో విలువైనది. 1926 నాటి ఈ అమూల్య వ్యాసం ఈ గ్రంథానికి పెన్నిధి.
నన్నయ్యకు నన్నోచోడుడు నూరేండ్ల తర్వాతివాడని సోపపత్తికంగా నిరూపించారు వేటూరి ఆనందమూర్తి. చిలుకూరి పాపయ్య శాస్త్రి తమ ‘నన్నెచోడుని వర్ణనా నైపుణ్యము’లో సంస్కృత కవుల వర్ణనల్లో రసదృష్టి ప్రధానమైతే, తెలుగు కవుల వర్ణనల్లో ఆలంకారికత, చాతుర్యం, వైదగ్ధ్యం ప్రాముఖ్యాన్ని వహిస్తాయని చెప్పారు. నన్నెచోడుని కావ్యం అనల్ప కల్పనాశక్తి, అపూర్వ వర్ణనాయుక్తులు సుందర సంగమమనీ; మనస్తత్వ నిరూపణలో తిక్కన, సూరనలకు నన్నెచోడుడు మార్గదర్శకుడనీ అన్నారు సి.నారాయణ రెడ్డి. నన్నెచోడుని వర్ణనల్లోని వన్నెచిన్నెల్ని తమ వ్యాసంలో చక్కగా ప్రదర్శించారు వి.రాజేశ్వరి. రతీమన్మధుల సంవాదంలోని మనస్తత్వ చిత్రణలోని సూక్ష్మతల్ని నిరూపించారు. నన్నెచోడుని అష్టాదశ వర్ణనల్లోని ప్రగల్భతను ప్రస్తుతించారు ఆరుద్ర. కవి గడుసుదనాన్నీ, గమ్మత్తుల్నీ సోదాహరణంగా పేర్కొన్నారు.
కుమారసంభవాన్ని తొలిసారిగా (మొదటి సంపుటం 1908, రెండవ సంపుటం 1914) ప్రచురించిన మానవల్లి రామకృష్ణ కవి వ్యాసం, కుమారసంభవం గురించి పరిశోధన చేసిన వేదం వెంకట్రాయశాస్త్రి, అమరేశం రాజేశ్వరశర్మ, తిమ్మావఝల కోదండరామయ్య గార్ల వ్యాసాలు సంకలింపబడివుంటే ఈ గ్రంథం సమగ్రతతో శోభిల్లివుండేది.
ఘట్టమరాజు
నన్నెచోడుడు
(విమర్శ వ్యాసాలు)
పేజీలు: 152;
వెల: 100
ప్రధాన సంపాదకుడు: ఆచార్య కె.చంద్రయ్య
ప్రతులకు: సభ్య కార్యదర్శి మరియు రిజిస్ట్రార్, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, యోగి వేమన విశ్వవిద్యాలయం, 1–1254,
యర్రముక్క పల్లె, కడప–516004.
ఫోన్: 08562–255517
Comments
Please login to add a commentAdd a comment