
ఒకసారి మార్క్ ట్వేన్ ఉపన్యాసాలు ఇస్తూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అట్లా ఒక కొత్త ఊరికి వెళ్ళాడు. అక్కడ గడ్డం గీయించుకోవడానికి మంగలి షాపులోకి వెళ్ళాడు. మాటల సందర్భంలో తాను ఆ ఊరికి రావడం మొదటిసారి అని కూడా చెప్పాడు.
మంచి దినాన వచ్చావు, ఇవాళ మార్క్ ట్వేన్ ఉపన్యాసం ఉంది. వెళ్లాలి అనుకుంటున్నావా? అని అడిగాడు, మంగలి.
వెళ్లక తప్పదు, అన్నాడు మనవాడు.
మరి టికెట్ కొన్నావా? అని అడిగాడు, అతను.
లేదు, అన్నాడు ట్వేన్.
అయితే ఉపన్యాసం సాంతం నిలబడి ఉండక తప్పదు, హెచ్చరించాడు అతను.
మామూలుగా అంతే. ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చినా నేను నిలబడే ఉంటాను, జవాబిచ్చాడు ట్వేన్.
-డా.కె.బి.గోపాలం