రెండు వేల ఏళ్ల లంచావతారం | One Of The Essay Of Prof pulikonda subbachary | Sakshi
Sakshi News home page

రెండు వేల ఏళ్ల లంచావతారం

Published Mon, May 4 2020 12:02 AM | Last Updated on Mon, May 4 2020 12:02 AM

One Of The Essay Of Prof pulikonda subbachary - Sakshi

ఒక పరీక్షార్థం వచ్చే పరీక్షకునికి కానీ, అవతలి పార్టీవారి పక్షాన వచ్చే దూతకు కానీ లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకునే అలవాటు కనీసం 13వ శతాబ్దం నాటికే ఉందని దీన్ని బట్టి నిక్కచ్చిగా తెలుస్తూ ఉంది. ఇక లంచం ఇచ్చే పద్ధతి నన్నయ నాటికి అంటే 11 వ శతాబ్దికి కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విషయం సంస్కృత భారతంలో కూడా వర్ణితమైన కారణంగా కనీసం రెండు వేల సంవత్సరాల నాడే ఈ పద్ధతి ఉందని చెప్పవచ్చు.

మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాపసింగ్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన మొదటి ప్రసంగంలోనే ‘‘లంచం అనేది భారత దేశంలో ఒక జీవన విధానం అయింది’’ అని చెప్పాడు. లంచం అనే పదానికి చాలా పర్యాయ పదాలు పుట్టాయి. ‘టేబుల్‌ కింద చేయి’, ‘చేయి తడపడం’, ‘గీతం’, ‘పై సంపాదన’, ఇలా చాలా వ్యక్తీకరణలలో మన భాషలో ఇది నిలబడింది. ‘లంచం లేనిదే మంచం ఎక్కడట’ అనే సామెత కూడా వచ్చింది. ఈ లంచం అనే పదం తెలుగు భాషలోనికి ఎప్పుడు చేరింది అని పరిశీలించివచ్చు. 
లంచం ఇవ్వడం అనే ఘట్టం ఆదికావ్యం మహాభారతంలోనే కనిపిస్తుంది. నన్నయ ఆది పర్వంలో అస్తీకుడి కథలో ఇది కనిపిస్తుంది. వారం రోజులలో తక్షకుడు అనే సర్పం కరవడం వల్ల నువ్వు మరణిస్తావని పరీక్షిత్తును శృంగి శపిస్తాడు. పరీక్షిన్మహారాజు పెద్ద ఒంటి స్తంభం మేడ కట్టుకొని దాని చుట్టూ కింద మంట పెట్టించి ఏ పామూ పైకి రాకుండా రాజవైద్యులను పెట్టుకొని ఉన్నాడు.

కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఎంతటి విషాన్నైనా హరించి చనిపోయిన వారిని కూడా బతికిస్తాడని చెప్పగా ఆయనను కూడా పిలిపించమని భూరి దక్షిణలు ఇస్తామని పిలిపిస్తారు. రాజును బతికిస్తే ధనంతో పాటు ఇతర బహుమతులు వస్తాయని హస్తినాపురానికి బయలుదేరాడు కాశ్యపుడు. తక్షకుడు అడవి మార్గంలో వస్తూ కాశ్యపుని  మార్గమధ్యంలోనే ఆపుతాడు. ‘నేను రాజును అతనికి ఉన్న శాపం ప్రకారం చంపబోతున్నాను. నేను ఏ ప్రాణినైనా చంపగలిగిన శక్తి ఉన్నవాడిని. నువ్వు రాజును ఎలా తిరిగి బ్రతికించగలవు?’ అని అడుగుతాడు. ‘నాకూ అంతటి శక్తి ఉంది. నేను ఏ విష ప్రభావాన్నయినా విరగ దీసి, తిరిగి బతికించగలను’ అని చెబుతాడు కాశ్యపుడు. ‘అయితే ఈ వృక్షాన్ని నేను కాటువేసి చంపుతాను, తిరిగి దీన్ని బతికించు, దానితో నీ శక్తి తెలుస్తుంది’ అంటాడు తక్షకుడు. అని ఒక పెద్ద వటవృక్షాన్ని కాటు వేస్తాడు. అది క్షణాలలో భస్మీపటలం అవుతుంది. వెంటనే కాశ్యపుడు ఒక మంత్రాన్ని పఠించి, తిరిగి దాన్ని బతికిస్తాడు.

చెట్టు తిరిగి ఫల పుష్పాలతో ఎప్పటిలాగా బతికింది. తక్షకుడు ఆశ్చర్యపోయాడు. ఇతను రాజును తిరిగి బతికించగలడు అనే నమ్మకం వచ్చి, రాజు ఇచ్చే ధనాన్ని నేనే ఇస్తాను; నీవు వెనక్కు వెళ్ళి పో అంటాడు. దానికి కాశ్యపుడు అంగీకరించడు. రాజు ఇచ్చే ధనంకన్నా రెట్టింపు ఇస్తానని చెప్పి, తిరిగి ఇంటికి పోయటట్లు చేస్తాడు తక్షకుడు. తెలుగు సాహిత్యంలో లంచం ఇచ్చి పని చేయించుకున్న ఘట్టం మొదటి సారిగా వర్ణించబడింది ఇదే. ఇక్కడ లంచం అనే పదం వాడలేదు కాని ఈ విషయాన్ని స్పష్టంగా వర్ణించాడు నన్నయ. అయితే ఇది 11వ శతాబ్దంలోనే ఉంది అని అనుకోనక్కరలేదు. ఇదే కథ వ్యాసుని సంస్కృత మహాభారతంలో కూడా ఇదే విధంగా ఉంది(ఆది పర్వం 43వ అధ్యాయం). సూక్తాంకర్‌ సంశోధించిన వ్యాసభారతం భండార్కర్‌ ప్రతిలో ఈ వర్ణన యథాతథంగా ఉంది. కాశ్యపుడు తన పనికోసం బయలు దేరితే తక్షకుడు తన పని కావడానికి అవరోధంగా ఉన్న కాశ్యపుని తప్పించడానికి లంచం ఇచ్చాడని స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. అయితే తెలుగు భారతంలో కానీ, సంస్కృత భారతంలో కానీ దీన్ని ధనం అన్నారే కాని లంచం అనలేదు. కాని ఇక్కడ జరిగింది లంచమే. (కాశ్యప ఉవాచ:  ధనార్థీ యాంయహం తత్ర తన్మే దేహి భుజంగమ! తతోహం వినివర్తిష్యే స్వాపతేయం ప్రగృహ్య వై!!)

ఇదే తెలుగు మహాభారతంలో లంచం అనే పదాన్ని స్పష్టంగా వర్ణించిన ఘట్టం తిక్కన రచన అయిన ఉద్యోగపర్వంలో ఉంది. అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత పాండవులు ఒక దూతని కౌరవుల దగ్గరికి పంపుతారు. ధృతరాష్ట్రుడు సమాధానం అతనికి చెప్పకుండా తాము కూడా ఒక దూతని పంపించి మా అభిప్రాయం చెబుతాము అని అంటాడు. తర్వాత సంజయ రాయబారం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు రాజ్యం ఇస్తామని చెప్పకుండా మీరు అక్కడే ఉపప్లావ్యంలో సుఖంగా ఉండండి అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవ దూతగా వస్తున్నాడు అని తెలిసిన తర్వాత విదురుడు «ధృతరాష్ట్రుని కడకు వచ్చి మంతనాలు చేస్తాడు. స్వాగత ఏర్పాట్లు ఏం చేయాలో మంత్రి అయిన విదురునికి చెబుతూ–
కం‘‘ వివిధ మణిమయ రథంబులు,
జవనాశ్వంబులును, భద్రసామజములు ర
త్న విభూషణములు దాసీ 
నివహంబులు జాల గృష్ణునికి నేనిత్తున్‌ 
(ఉద్యో. 3–157 పద్యం)
ఇవన్నీ ఇద్దాము అంటాడు ధృతరాష్ట్రుడు. ఇంకా చాలా ఇవ్వాలి, పెద్ద ఉత్సవం చేయాలి అని నాలుగు పద్యాలలో వచనంలో కూడా చెబుతాడు. ఇదంతా విని విదురుడు, మహారాజా ఇప్పుడు కూడా మీరు సరిగ్గా ఆలోచించడం లేదు; వచ్చే దూతను ప్రీతుని చేయడానికి ఈ పనులు అన్నీ చేయడం ఎందుకు? దీని బదులు పాండవులకు కనీసం ఐదూళ్ళు ఇస్తే సరిపోతుంది కదా అని అంటాడు (పద్యం 158). తర్వాత ఒక పద్యంలో విదురుడు చెప్పిన మాటలని తిక్కన సూటిగా వర్ణిస్తూ దూతకి లంచం ఇస్తావా అని అంటాడు.

ఉ‘‘    నీతలపేను గంటి నొక నేర్పున శౌరికి లంచ మిచ్చి సం
    ప్రీతుని జేసి కార్యగతి భేదము సేయగ జూచె దింత బే
    లైతి గదే సుమేరు సదృశార్థము జూచియు బార్థు బాయునే
    యాతడు క్రీడిభక్తియును నచ్యుతు పెంపును నీవెఱుంగవే. 
అతనికి అర్జునుడు అతి ప్రేమాస్పదుడైనవాడు కాబట్టి అచ్యుతుడు అతడు, నీ ఆలోచనలు మానుకో అని చెబుతాడు విదురుడు. ఒక పరీక్షార్థం వచ్చే పరీక్షకునికి కానీ, అవతలి పార్టీవారి పక్షాన వచ్చే దూతకు కానీ లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకునే అలవాటు కనీసం 13వ శతాబ్దం నాటికే ఉందని దీన్ని బట్టి నిక్కచ్చిగా తెలుస్తూ ఉంది. ఇక లంచం ఇచ్చే పద్ధతి నన్నయ నాటికి అంటే 11 వ శతాబ్దికి కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విషయం సంస్కృత భారతంలో కూడా వర్ణితమైన కారణంగా కనీసం రెండు వేల సంవత్సరాల నాడే ఈ పద్ధతి ఉందని చెప్పవచ్చు. పైన చెప్పిన ఉద్యోగ పర్వ ఘట్టం వ్యాస భారతంలో కూడా ఇదే పద్ధతిలో వర్ణితం అయింది. లంచం అనే మాటకు ‘ఉత్కోచ’ అనే పదమే సాహిత్యంలో వాడారు. మోనియర్‌ విలియమ్స్‌ సంస్కృత–ఇంగ్లీషు నిఘంటువులో ‘ఉత్కోచ’ అంటే bటజీb్ఛ అనే అర్థాన్నే ఇచ్చింది. ధనం ఇచ్చి ఏమి ఇచ్చినా కృష్ణుని పొందలేవు, అర్జునునితో ఆయన బంధాన్ని విడదీయలేవు అని ధృతరాష్ట్రునికి చెప్పి ఐదు గ్రామాలనైనా ఇవ్వు అని అంటాడు. (ఉద్యోగపర్వం: 87–10, 11). 
లంచం అనే మాట ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఇంకా చాలా చోట్ల వినియుక్తమైంది.  శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో ఈ మాటని వాడాడు.

శా‘‘ కాంచీకంకణ తారహర ఘటికా గ్రైవేయ భూషావళుల్‌
    లంచంబిత్తురు దూతికా తతికి లీల బెండపూడన్ననిన్‌
    బంచాస్తోప్రము తారతార కవయం ప్రార్థించి లోలపలన్‌
    పంచారామములందు బల్వెల పురిం ఫ్రౌఢేందు బింబాననల్‌ 
(ఆ. 1–77)
అని శార్దూల పద్యంలో వర్ణిస్తాడు. ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే లంచం అనే మాట ప్రాస స్థానంలో ఉంది. పదిహేనో శతాబ్దంలో లంచం అనే మాటకు సంబంధించిన ఉనికికి ఇది తిరుగలేని సాక్ష్యం. శ్రీనాథుడు 15వ శతాబ్దం వాడు. భాగవతంలో కూడా లంచం అనే మాట ఉంది. పంచమ స్కందంలో శుకయోగి పరీక్షిత్తుకు నరక లోకాన్ని వర్ణించి చెప్పే ఘట్టంలో వివిధ శిక్షలను గురించి వర్ణిస్తూ చాలా పద్యాలు రాస్తూ ఒక సీసపద్యంలో– 
‘‘లంచంబు గొని సాక్షి వంచించి యనృతంబు బలికెడు పాపాత్ము బట్టి కట్టి యంత మానక వీచియను నరకమందు శతయోజనోన్నత శైల శిఖరమున దలక్రిందుగా నునిచి యదోముఖంబుగ బడదొబ్బిన...’’ (పంచమ స్కందం –154) అని స్పష్టంగా వర్ణించాడు పోతన మహాకవి. దొబ్బిన అనే మాట కూడా వాడాడు. అంతే కాదు, లంచం తిని దొంగ సాక్ష్యం చెప్పే విషయం కూడా ఇక్కడ రికార్డు అయింది. పోతనామాత్యుడు కూడా 15వ శతాబ్ది వాడు.  శ్రీనాథునికి సమకాలికుడు. ఓరుగల్లు ప్రాంతంలో కాకతీయుల పాలనలో కూడా లంచం తీసుకొని దొంగ సాక్ష్యాలు చెప్పే స్థితి ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక కుచేలోపాఖ్యానంలో కూడా కృష్ణుని భవనానికి పోయినప్పుడు అక్కడ ద్వారాల దగ్గర ఉండే కాపలా వారికి ఒకటో రెండే పణాలు ఇవ్వాలన్నా కూడా లేవే అని కుచేలుడు అనుకుంటాడని పోతన వర్ణించాడు. (దశమ. 972). ఇక్కడ ద్వారపాలకులకు ఇచ్చేదాన్ని పరిదానం అని అన్నాడు. 

‘లంచపంచములు’ అనే జంటపదాల్ని కూడా కావ్యాలలో వాడారు. కువలయాశ్వ చరిత్రలో, పరమయోగి విలాసం అనే ద్విపద కావ్యంలోనూ లంచపంచములు అనే ప్రయోగాలున్నాయి. ఈ తర్వాతి కాలంలో కూడా లంచం అనేమాట ప్రయోగం అయింది. దశకుమార చరిత్ర (దుగ్గన), కేయూరబాహు చరిత్ర (మంచెన) లలో లంచమువెట్టు అనే ప్రయోగం ఉంది. ఈ సాహిత్య గ్రంథాలలోని సాక్ష్యాలను బట్టి నాటి సామాజిక జీవనం ఎలా ఉండేది అనే విషయం కూడా మనకు బాగా అవగతం అవుతూ ఉంది. పురాణపాత్రలే లంచం ఇవ్వడం తీసుకోవడం ఇవ్వజూపి పనులు చేయించుకునే తీరు గమనించాలి. మధ్యయుగాలలో లంచంతో దొంగ సాక్ష్యాలు చెప్పించే విషయం కూడా గమనించాలి. ఆ కాలం నుండీ నేటి దాకా దీని విశ్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి దీని చరిత్రను తెలుసుకోవడానికి ఈ సాహిత్య ఆకరాలు పనికి వస్తాయి. 

ప్రొ‘‘ పులికొండ సుబ్బాచారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement