essay
-
Viral: పెళ్లి అంటే ఏంటి?.. పిల్లాడి దిమ్మతిరిగే సమాధానం.. నవ్వాపుకోలేరు!
స్కూల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం కామన్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఆధారంగా ఎగ్జామ్స్ పెడుతుంటారు. జనరల్ నాలెడ్జ్, సామాజిక అంశాలపై వ్యాస రచన పోటీలు కూడా ఉంటాయి. అయితే కొన్నిసార్లు పరీక్షల్లో పిల్లలు రాసే సమాధానాలు విచిత్రంగా ఉంటాయి. ప్రశ్నతో సంబంధం లేకుండా ఏదో ఏదో రాస్తుంటారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఓ విద్యార్థి 10 మార్కుల ప్రశ్నలో పెళ్లి అంటే ఏంటో వివరించమని అడిగారు. పెళ్లిపై బాలుడి చెప్పిన సమాధానం నెటిజన్లను నవ్విస్తోంది. సోషల్ స్టడీస్ పరీక్ష పత్రంలో పెళ్లి అంటే ఏంటని అడిగారు. విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్‌ను సోషల్ మీడియాలోషేర్ చేశారు. అందులో ‘యువతికి ఆమె తల్లిదండ్రులు నువ్వు ఇప్పుడు పెద్ద అమ్మాయివి అయ్యావు అని చెప్పినప్పుడు పెళ్లి జరుగుతుంది. మేము నీకు ఇక తిండి పెట్టి పోషించలేమని, వెళ్లి నీకు తిండి పెట్టే వ్యక్తిని వెతుక్కోవడం మంచిదని ఆమెకు తల్లిదండ్రులు చెప్తారు. మరోవైపు నువ్వు పెద్దవాడివి అయ్యావు, పెళ్లి చేసుకో అంటూ అబ్బాయికి కూడా వాళ్ల తల్లిదండ్రులు చెబుతుంటారు. అప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిని యువతి కలుసుకుంటుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని చివరికి ఇద్దరు కలిసి జీవించడానికి అంగీకరిస్తారు. ఇక పిల్లలను కనడానికి తప్పుడు పనులు చేయడం ప్రారంభిస్తారు’ అని విద్యార్థి రాసుకొచ్చాడు. What is marriage? 😂 pic.twitter.com/tM8XDNd12P — Velu (@srpdaa) October 11, 2022 అయితే బాలుడి సమాధానం చూసిన టీచర్ అతడు రాసిన మొత్తం జవాబును కొట్టివేసింది. పది మార్కులకు గాను సున్నా వేసింది. అంతేగాక నాన్సెన్స్ అంటూ రిమార్క్ రాసి పెట్టింది. కాగా పిల్లవాడు తెలిసి తెలియక రాసిన సమాధానం నెటిజన్లను ఆకర్షిస్తుంది. చాలా ఫన్నీగా ఉందంటూ బాలుడి నిజాయితీని మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: Army Dog Zoom: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ‘జూమ్’ మృతి -
భర్తను హత్య చేసేందుకే...ఆ నవల రాసిందా?
Author goes on trial for her spouses Assassinate Case: కొన్ని కేసులు చాలా విచిత్రంగా ఉంటాయి. నిందితులు తాము చేయాలనుకునే నేరం కోసమే ఇలాంటి విచిత్రమైన పనులు చేస్తారో లేక యాదృచ్చికంగా జరుగుతాయో తెలియదు. కానీ ఇక్కడొక రచయిత విషయంలో అలానే జరిగింది. వివరాల్లోకెళ్తే...నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ రొమాన్స్ కథల స్వీయ రచయిత. అయితే ఆమె ప్రస్తుతం తన భర్త డేనియల్ బ్రోఫీకి సంబంధించిన హత్య కేసుని ఎదుర్కొంటోంది. ఈ మేరకు నాన్సీ 2018లో అరెస్టు అయినప్పటి నుంచి కస్టడీలోనే ఉంది. ఆమె భర్త సౌత్‌వెస్ట్ పోర్ట్‌ల్యాండ్‌లోని ఒరెగాన్ క్యులినరీ ఇన్స్టిట్యూట్లో విధులు నిర్వర్తించడానికి వెళ్తున్న సమయంలో హత్యకు గురైయ్యాడు. ఆయన్ని ఎవరో తపాకీతో కాల్చి చంపారు. అయితే ఆమె తన భర్త మృతి చెందడానికి కొన్ని వారాల ముందు హౌ టు మర్డర్ యువర్ హస్బెండ్ అనే పేరుతో ఒక నవల రాయడం గమనార్హం. తొలత ఆమె భర్త మరణం పోలీసులకు ఒక మిస్టరీ కేసుగా అనిపించింది. అయితే తదనంతర విచారణల నేపథ్యంలో ఆమె అసలైన నిందితురాలిగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు ట్రాఫిక్ కెమెరాల్లో ఆమె భర్త హత్య జరగడానికి ముందు ఆ ప్రాంతంలో తిరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఆమె కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. అయితే న్యాయమూర్తి సీనియర్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీ షాన్ ముల్ట్నోమా కౌంటీ సుమారు 10 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ కోసం లాంటి దారుణానికి ఆమె ఒడిగట్టిందని అన్నారు.అంతేకాదు ఆమె అక్రమ సంపాదనతో చాలా లాభపడిందని కూడా అన్నారు. అయితే ఆమె గతంలో ఎలాంటి నేరారోపణలకు పాల్పడలేదన్నారు. ఈ మేరకు ఈ కేసు ఏడు వారాలపాటు విచారణ కొనసాగనుందని న్యాయమూర్తి తెలిపారు. (చదవండి: ఇంజనీరింగ్, ఎంబీఏ చదివారు.. విలాసాల కోసం యూట్యూబ్ చూసి..) -
నేను నేనే...
ఓ సాధువు తన శిష్యుడిని పిలిచి ‘‘ఓ రోజంతా నువ్వు రాజుగారి కోటలో ఉండి పాఠం నేర్చుకురా’’ అని ఆదేశించారు.‘‘ఆశ్రమంలో నేర్చుకోని పాఠాన్ని రాజుగారి కోటలో ఏం నేర్చుకుంటాను’’ అని మనసులో అనుకున్నా గురువుగారి ఆజ్ఞగా శిష్యుడు సరేనని రాజుగారి కోటకు వెళ్ళాడు. ఆ శిష్యుడు రాజుగారి ఆస్థానానికి వెళ్ళి గురువుగారి మాట చెప్పాడు. అలాగా అని రాజుగారు ఆ యువకుడికి ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా సకల మర్యాదలతో చూసుకున్నాడు. రాజుగారి కోటలో ఎటు చూసినా ఆటాపాటలే. విలాసాలకు ఏ మాత్రం లోటు లేకుండా ఉంది. కానీ ఇవేవీ అతనికి నచ్చలేదు. ఒంటి మీద జెర్రులు పాకుతున్నట్లు అనిపించింది అతనికి. అయినా మనసుని నియంత్రించుకుని పగలంతా కోటలో గడిపాడు. రాత్రి కాగానే నిద్రపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే రాజు ఆ యువకుడిని పిలిచి దగ్గర్లోనే ఉన్న కోనేటిలో స్నానం చేసి వద్దాం అన్నాడు. యువకుడు, రాజు ఇద్దరూ వెళ్ళారు. అప్పుడు ఉన్నట్లుండి రాజుగారి కోటలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చూపించాడు రాజు. ఆ యువకుడు స్నానం మానేసి కోట వైపు వెంటనే పరుగెత్తాడు. అక్కడ ఉంచేసిన తన కౌపీనం తగలబడిపోకుండా ఉండేందుకు పరుగెత్తాడు. కౌపీనం తీసుకుని యువకుడు కోనేటి వద్దకు చేరుకున్నాడు. అప్పటికీ రాజుగారు అక్కడే నింపాదిగా స్నానం చేస్తూ కనిపించారు. కోట ఓ పక్క అగ్నిప్రమాదంలో చిక్కుకోగా ఈ రాజు ఏ మాత్రం దిగులుపడకుండా ఇలా జలకాలాడుతున్నాడేమిటి చెప్మా అనుకున్నాడు మనసులో ఆ యువకుడు. కానీ తాను మాత్రం తన కౌపీనం కోసం ఇలా పరుగులు తీసానేమిటీ అని సిగ్గుతో తలదించుకున్నాడు. రాజుగారికి నమస్కరించి ‘‘ఏ విధంగా మీరిలా నిశ్చలంగా ఉండగలిగారు’’ అని యువకుడు అడిగాడు. అప్పుడు రాజు చెప్పాడు ... ‘‘ఈ కోట నాదనే తలపు ఉండి ఉంటే నేనూ పరుగెత్తే వాడిని, అది ఒట్టి కోటే. నేను నేనే. అంతే తప్ప కోట నాదెలా అవుతుంది. నేను చనిపోయిన తర్వాత కూడా ఆ కోట అక్కడే ఉంటుంది. కౌపీనం నీదని, కోట నాదని నువ్వు అనుకున్నావు కనుకే పరుగెత్తుకుని వెళ్ళి నీ కౌపీనాన్ని మాత్రం తెచ్చుకున్నావు... కోట సంగతి వదిలేశావు. కానీ నేనలా అనుకోలేదు. కనుకే పరుగెత్తలేదు. మనిషి తన మనసు ఇష్టాయిష్టాలకు దాసోహమవుతున్నాడు. ఇష్టాయిష్టాలను వదులుకున్నవాడే ఇందులోంచి విముక్తి పొందుతాడు’’ అని రాజు చెప్పేసరికి తననెందుకు ఓ రోజు కోటలో ఉండి పాఠం నేర్చుకోమన్నాడో గ్రహించాడు ఆ యువకుడు. – యామిజాల జగదీశ్ -
వారి మాట సలహా కాదు, శాసనం
గింజ రాతి మీద ఉంటే వర్షం పడ్డా మొలకెత్తదు. అది భూమిలో ఉంటే ఒక్క వానకే మొలకెత్తుతుంది. అలా అసలు మనిషికి ఉండాల్సిన ప్రథమ లక్షణం నేను అవతలి వాళ్ళు చెప్పిన మాట వింటాను, అది సహేతుకంగా ఉంటే, నాకు వృద్ధిని కల్పించేది అయితే తప్పకుండా పాటిస్తాననే గుణం ఉండాలి. కొందరి విషయంలో మాత్రం నీ బుద్ధితో విచారణ ఉండకూడదు. వారు నా మంచికి చెప్పారా, చెప్పలేదా అని నీ జీవితం మొత్తం మీద ఆలోచించాల్సిన అవసరం లేని వాళ్ళు ముగ్గురున్నారు. వారు ఎప్పుడు ఏం చెప్పినా నీ అభ్యున్నతి కోరి చెబుతారు తప్ప నిన్ను పాడుచేయడానికి వారి ప్రాణం పోయినా చెప్పరు. ఎవరా ముగ్గురు? తల్లి, తండ్రి, గురువు. అందుకే వాళ్ళ మాట శాసనమే తప్ప సలహా కాదు. దానిని చెవి ఒగ్గి వినగలగాలి. అలా వినని వాడిని ఉద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదు. శ్రీరామాయణంలో రావణాసురుడికి మొదట మారీచుడు చెప్పాడు..‘‘సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య, వక్తా శ్రోతా చ దుర్లభః’’–అని. ఈ లోకంలో ఎవడు ఎలా పోతే మనకేం. ఏవో నాలుగు మాటలు పొగిడేస్తే గొడవ వదిలిపోతుంది. మనకేం కాదు. మనతో స్నేహంగానే ఉంటాడు. అయినా మనం చెబితే మాత్రం వాడు వింటాడా...వద్దు చెప్పొద్దు. వాడు ఎలా పాడయిపోతే మనకెందుకు, పొగిడేస్తే సరి... అని మాట్లాడేవాళ్లు ఈ లోకంలో కోటాను కోట్లమంది ఉంటారు రావణా ! నువ్వు తప్పు చేస్తున్నా సరే, చాలా మంచి మార్గం.. అలాగే ఉండండి... అని చెప్పేవాళ్ళు దొరుకుతారు. నీ అభ్యున్నతిని కోరి మాట కఠినంగా అనిపించినా నీ క్షేమం కోసం మాట్లాడేవాడు దొరకనే దొరకడు. ఒకవేళ దొరికినా వినేవాడు ఉండడు. మారీచుడు అంత చెప్పినా వినలేదు, తోడబుట్టినవాడు కుంభకర్ణుడు చెప్పాడు, విభీషణుడు, సుగ్రీవుడు, తల్లి కైకసి, మంత్రులు చెప్పారు. సీతమ్మ తల్లి చెప్పింది –‘‘మాట విను. నీ వారియందు మనసు పెట్టుకో. ధర్మమయి పోతుంది. పరకాంతలందు మనసు ఉంచకు. పట్టి కుదిపేస్తుంది.’ అని చెప్పింది ... వినలేదు.. చివరకు యుద్ధభూమిలో నిట్టనిలువునా ఏ రథం కూడా లేకుండా నిలబడిపోయిన రావణుడిని చూసి–‘‘పో.. అంతఃపురానికి .. రేపు రా’ అన్నాడు రామచంద్ర మూర్తి. ఆ ఒక్కసారయినా మనసు మార్చుకుని మళ్ళీ తన తప్పు తాను తెలుసుకుని మంచి మాటలు గుర్తు చేసుకుని ఉండి ఉంటే... ఎలా ఉండేదో.. కానీ రావణుడు వినలేదు. ‘‘నా దగ్గరకొచ్చి ‘రామా! నేను నీవాడను’అని పడిపతే రక్షిస్తాను’’ అన్నాడు రాముడు. ‘నేనెన్నటికీ వినను’ అన్నందుకు పర్యవసానం ఏమయిందో తెలుసు కదా!. చివరకు పది తలలు తెగిపడిపోయాయి. కట్టుకున్న భార్య మండోదరి వచ్చి ‘‘ఓరి పిచ్చివాడా ! నిన్ను రామచంద్రమూర్తి సంహరించాడని లోకం అనుకుంటున్నది. కానీ నిన్ను సంహరించినవాడు రామచంద్రమూర్తి కాదు... నీ ఇంద్రియ లౌల్యం. మాట వినని తనమే నిన్ను నిలువునా చంపేసింది’’ అన్నది. నిజంగా మన మంచిని కోరి పరుషంగా ఉన్నా... అంత ధైర్యంగా చెప్పగలిగిన వాడు దొరికితే... వాడి ఆర్తిని అర్థం చేసుకుని వినగలిగినవాడు దొరికితే అది లోకకళ్యాణమే. కృష్ణుడు చెప్పాడు–అర్జునుడు విన్నాడు–భగవద్గీత లోకానికి అందింది. పరీక్షిత్తు అడిగాడు–శుకుడు చెప్పాడు–భాగవతం లోకానికి పనికొచ్చింది. యుద్ధభూమిలో అగస్త్యుడు చెప్పాడు– రాముడు విన్నాడు–ఆదిత్య హృదయం సకల భక్తజనావళిని ఆదుకుంటున్నది. ఇవన్నీ ఎప్పుడు.. అసలు వినేవాడు ఒకడుంటే కదూ..!!! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కళకళలాడే పదజాలం
తూము అంటే రంధ్రం అని అర్థం. గొడ్డలికి కర్రపెట్టే రంధ్రాన్ని కూడా తూము అనే అంటారు. తూము అనే పదానికి «కొలత అని అర్థమూ ఉంది. ఫిరదౌసికి రాజు తనపైన కావ్యం రాస్తే తూము బంగారు నాణాలు ఇస్తానని వాగ్దానం చేసి, గొడ్డలి తూములో పది నాణాలు పెట్టి ఇచ్చి మోసం చేశాడని జానపద కథ. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏఱ్లు పూచి పాఱుతున్నాయి. చెఱువులు తనకం తనకం లాడతన్నాయి. చెఱువులు మాట్లాడే కాలంలో వాటి భాష ఎలా ఉంటుంది. ఒక పదాన్ని పట్టుకుంటే ఒక్కోసారి ఎన్నో శబ్దాలు, పూలకొమ్మ పట్టుకొని గుంజితే పూలు జలజలా రాలినట్లు రాలతాయి. పొంగిపొర్లు, పాఱు, తనకంతనకంలాడు. ఈ మూడు క్రియాపదాలు. పొరలు, పాఱు అన్నా వేగంగా ముందుకు పోవు అనే అర్థాలున్నాయి. తనకంతనకం లాడు అనేది ధ్వన్యనుకరణ శబ్దం. చెఱువు పూర్తిగా నిండినప్పుడు అలలు చేసే శబ్దం. ఎన్నో వందల ఏండ్ల క్రితమే చెఱువులు తవ్వించినట్లు మనకు ఆధారాలు దొరుకుతాయి. రాజులు, సంపన్నులు నూతులు, చెఱువులు తవ్వించడం పుణ్యకార్యంగా భావించారు. ‘చెఱువు’ అచ్చతెలుగు పదం. చెరువు అని రాస్తే దూర్చు, లోపలికి నెట్టు, చెక్కు అనే అర్థాలున్నాయి. చెఱువు పదానికి తిక్కన శాంతి పర్వంలోనే ప్రయోగం ఉంది. తర్వాతి చాలా కవుల ప్రయోగాలలో చెఱువు ఉంది. గుండె చెఱువు కావడం అనే పలుకుబడికి అర్థం మనస్సు కరుణతో నిండింది, దుఃఖం వచ్చింది అని. నీటి ఒరవడి ఉన్న దగ్గర ఎక్కడ పల్లపు నేలలో నీరు పాఱుతుందో చూచి అక్కడ కట్ట కడతారు. ఇలా కట్టాలంటే అక్కడ ఇంకా తవ్వి కట్ట కడతారు. చెఱువుతవ్వు అనేది క్రియాపదం, తవ్వు అనే క్రియా పదానికి విస్తృతమైన క్రియాపదంగా చూడాలి. చెఱువు తవ్వడానికి, కట్టకట్టడానికి ముందు బలి ఇవ్వాలి అనే సంప్రదాయం ఉంది. చెఱువు తవ్వడం, అదే మట్టితో కట్టకట్టడం ఒకేసారి జరిగే పనులు. ఇక చెఱువు కట్టకు రెండు కొసలు ఉంటాయి. ఒక కొసను కట్టతోక అంటారు. మరొక కొసలో రాతికట్టడం ఉంటుంది. చెఱువులో ఏ మట్టానికి నీరు నిల్వ ఉండాలి అని నిర్ణయించుకొని ఆ మట్టం ప్రకారం రాతి గోడను కడతారు. చెఱువు నిండింది అని అంటే ఈ రాతిగోడ ఎంత ఎత్తులో ఉందో అంత నీటిమట్టం వచ్చింది అని అర్థం. ఇలా నిండిన తర్వాత నీరు ఈ గోడ లేదా రాతికట్ట దూకి బయటికి పోతుంది. ఈ రాతి గోడనే ‘అలుగు’ అంటారు. దీనికి ఇంకా ‘మత్తడి’, ‘కత్తవ’ అనే పేర్లు ఉన్నాయి. చెఱువు నిండి ‘అలుగు పారింది’ అంటారు. తెలంగాణలో ‘అలుగెల్లింది’ అని కూడా అంటారు. అలుగు అనే పదానికి కోపగించు అనే అర్థం కూడా ఉంది. ఈ అర్థంలో నన్నయ ఆదిపర్వంలోనే ప్రయోగాలున్నాయి. కాని మధ్యయుగపు కావ్యాలలో అలుగు అనేమాటకు చెఱువుకట్ట, చివరి రాతికట్ట అనే అర్థంలో ప్రయోగం ఉంది. విక్రమార్క చరిత్రలో ఈ ప్రయోగం కనిపిస్తుంది. అలుగు అంటే బాణం పదునైన కొస అనే అర్థం ఉంది. గడ్డపారలో వెడల్పుగా పదునుగా ఉండే భాగం అనే అర్థం ఉంది. ‘‘తనువున విరిగిన అలుగుల ననువున పుచ్చంగ వచ్చు నతినిష్ఠురతన్ మనమున నాటిన మాటలు...’’ అనే తిక్కన ప్రయోగం ఉంది. ఇక తెలంగాణలో చెఱువు నిండి ‘మత్తడి దుంకింది’ అని అనడం పరివ్యాప్తంగా ఉంది. ‘మత్తడి దుంకు’ అనేది క్రియాపదం. దుముకు, దుంకు, దూకు అనేవి ఒకే క్రియకు భిన్న రూపాలు. మత్తడి అనే మాట సర్కారు జిల్లాలలో ఎక్కడా లేదు. రాయల సీమలో కూడా అలుగు అనే మాటే ఉంది. కాని మత్తడి లేదు. ఈ పదం సూర్యరాయాంధ్ర నిఘంటువులో కాని ఇతర నిఘంటువులలో కాని లేదు. ఒక్క శ్రీహరి నిఘంటువులోనే ఉంది. ఇక తెలంగాణలోని ఖమ్మం జిల్లా కృష్ణా జిల్లా గోదావరి జిల్లాలలో ‘కత్తవ’ అనే మాట ఉంది. కిందికి నెల్లూరు జిల్లా వరకు ఈ పదం వినియోగంలో ఉంది. అంటే చెఱువు నీరు పారే రాతికట్ట అనే అర్థం. ఈ పదం కూడా సూర్యారాయాంధ్ర నిఘంటువుకు ఎక్కలేదు. నెల్లూరు జిల్లాలో ఇంకొక పదం కూడా వ్యవహారంలో ఉంది. కలుజు అని అంటారు. చెఱువు నిండి అలుగు పారేదాన్ని కలుజు పారతంది అంటారు. చిత్తూరు జిల్లాలో మొరవ అంటారు. మొరవ పాఱింది అంటారు. ఈ పదం వ్యవసాయపదకోశంలో కూడా ఎక్కింది. మిగతా పైన చెప్పిన పదాలు కూడా వ్యవసాయ కోశంలో ఉన్నాయి. ఇక్కడ చెప్పిన కలుజు, మొరవ అనే పదాలు రెండూ బ్రౌన్ నిఘంటువులోనికి చేరాయి. మొరవ అనే పదానికి మొక్కబోయిన అనే అర్థం కూడా ఉంది. వ్యవసాయ సంస్కృతి పెరిగిన ఫలితంగా ఏర్పడిన మనిషి తొలినాటి ఆవిష్కరణలలో ఈ చెఱువు ఒకటి. నీటిని ఆపడానికి చిన్నకట్ట కట్టి దాన్ని ‘కుంట’ అని పిలిచే వారు. కుంట అంటే చాలా చిన్న చెఱువు అనే అర్థం. దీనికి సాధారణంగా అలుగు ఉండదు. ‘కుంట’ అంటే భూమి పరిమాణాన్ని కొలిచే ఒక కొలత అని కూడా అర్థం ఉంది. నాలుగు కుంటలు అయితే ఒక ఎకరం అవుతుంది. కుంట గ్రామవాచక ప్రత్యయంగా కూడా ఉంది. కానుకుంట, దామకుంట, నాగమయ్యకుంట, అనేవి గ్రామనామాలు. ఇక చెఱువులు మరి పెద్దవి అయితే సముద్రం అని అనడం కూడా ఉంది. తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఉన్న ఉదయసముద్రం అలాంటి చాలా పెద్దచెఱువు, సముద్రం గ్రామవాచకంగా ఉన్న పేర్లు రాయలసీమలో తెలంగాణలో సర్కారాంధ్రలో కూడా చాలా ఉన్నాయి. ఇక చెఱువు చాలా పెద్దది అయి చాలా కాలం అలుగు పారుతుంది. ఇది చాలా దూరం పోయిన పక్షంలో దీన్ని ‘అలుగువాగు’ అంటారు. అలా పారిన అలుగు వాగు కొంత దూరం పోయిన తర్వాత ఈ వాగు మీద ఇంకొక చెఱువు కడతారు. ఆ చెఱువు పారిన అలుగు వాగు మీద తర్వాత కొద్ది దూరంలో మరొక చెఱువు కడతారు. ఇలా ఒక దాని తర్వాత ఒకటిగా నీటి ఒరవ ఉన్న ప్రాంతంలో కట్టిన చెఱువులనే ‘గొలుసు చెఱువులు’ అంటారు. ఖమ్మం జిల్లాలో మర్లపాడు చెఱువు నిండి అలుగువాగు సుమారు మూడు కి.మీ ప్రవహిస్తుంది. అక్కడ ఇనగాలి గ్రామంలో దీనికి కట్టకట్టి చెఱువు చేశారు. తర్వాత ఈ చెఱువు అలుగుపారి మొలుగుమాడు గ్రామం వద్ద చెఱువు కట్టారు. ఇక చెఱువుకు లోతట్టు వెలితట్టు అని రెండు భాగాలు ఉంటాయి. లోతట్టులోనే నీరు ఉంటుంది. వెలితట్టులో వరిపొలాలు ఉంటాయి. ఇక అలుగు పొంగి పారినప్పుడు ఆ నీరు ఈ వరిపొలాల మీదికి రాకుండా ఒడ్డుపొడుగునా కట్టకడతారు. ఈ కట్టని ‘ఉద్దికట్ట’ అంటారు. ఇక చెఱువుకట్ట, చెఱువు రెండూ ఒక దేవతతో సమానం. అందుకే చెఱువుకట్ట తెగకుండా నరబలి ఇచ్చిన ఘట్టాలు చరిత్రలో జరిగినాయి. మనకు ముసలమ్మ మరణం కథ అనేది రాయలసీమలోనే జరిగింది. ప్రతి చెఱువు కట్టమీద ఒక దేవత ఉంటుంది. ఆమెనే కట్టమైసమ్మ అంటారు. ఒక్కో చెఱువు పైన గంగమ్మదేవత ఉంటుంది. పేరు ఏదైనా చెఱువును దేవతగా భావించి తమకు అన్నం పెట్టే ప్రకృతి వనరును పూజించడమే ఇక్కడ మనం గమనించాలి. మనకు వరి పొలాలు రెండు రకాలుగా పండుతాయి. చెఱువు కింద పండే సాగుని ‘చెఱువాయి’ పంట అని, వర్షం మీద ఆధారపడే దాన్ని ‘ఆకాశవాయి’ పంట అని అంటారు. ఇక చెఱువు నీరు ‘తూము’ ద్వారా పొలాల లోనికి వదులుతారు. తూము అంటే రంధ్రం అని అర్థం. ఈ తూముకు కూడా కొబ్బరి కాయలు కొట్టి కోళ్ళను కోసి పూజచేయడం ఉంది. గొడ్డలికి కర్రపెట్టే రంధ్రాన్ని కూడా తూము అనే అంటారు. తూము అనే పదానికి ధాన్యం కొలత అని అర్థం ఉంది. ఫిరదౌసికి రాజు తనపైన కావ్యం రాస్తే తూము బంగారు నాణాలు ఇస్తానని వాగ్దానం చేసి గొడ్డలి తూములో పది నాణాలు పెట్టి ఇచ్చి మోసం చేశాడని జానపద కథ ఉంది. తూము ఇంటి పేరుగా కలవారు చాలా మంది తెలంగాణ లో ఉన్నారు. తూము నరసింహదాసు గొప్ప వాగ్గేయకారుడు. తూములూరు అనే ఊరు కూడా ఉంది. చెఱువు లోతట్టున ఒండ్రుమట్టి చేరుతుంది. దీన్ని ‘చెఱువుమట్టి’ అంటారు. ఇది సారవంతమైనది అని రైతులు తమ పొలాలలో ఎరువుగా వేసుకుంటారు. కొన్ని మంచినీళ్ళ చెఱువులు ఉంటాయి. ఇలా చెఱువు చుట్టూతా చాలా భాష ఉంది. చెఱువును కదిలిస్తే అది మాట్లాడుతుంది. మన సంస్కృతిలో చెఱువు విడదీయరాని భాగం. ఇది మన పల్లె సొగసు. ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి -
రెండు వేల ఏళ్ల లంచావతారం
ఒక పరీక్షార్థం వచ్చే పరీక్షకునికి కానీ, అవతలి పార్టీవారి పక్షాన వచ్చే దూతకు కానీ లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకునే అలవాటు కనీసం 13వ శతాబ్దం నాటికే ఉందని దీన్ని బట్టి నిక్కచ్చిగా తెలుస్తూ ఉంది. ఇక లంచం ఇచ్చే పద్ధతి నన్నయ నాటికి అంటే 11 వ శతాబ్దికి కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విషయం సంస్కృత భారతంలో కూడా వర్ణితమైన కారణంగా కనీసం రెండు వేల సంవత్సరాల నాడే ఈ పద్ధతి ఉందని చెప్పవచ్చు. మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాపసింగ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన మొదటి ప్రసంగంలోనే ‘‘లంచం అనేది భారత దేశంలో ఒక జీవన విధానం అయింది’’ అని చెప్పాడు. లంచం అనే పదానికి చాలా పర్యాయ పదాలు పుట్టాయి. ‘టేబుల్ కింద చేయి’, ‘చేయి తడపడం’, ‘గీతం’, ‘పై సంపాదన’, ఇలా చాలా వ్యక్తీకరణలలో మన భాషలో ఇది నిలబడింది. ‘లంచం లేనిదే మంచం ఎక్కడట’ అనే సామెత కూడా వచ్చింది. ఈ లంచం అనే పదం తెలుగు భాషలోనికి ఎప్పుడు చేరింది అని పరిశీలించివచ్చు. లంచం ఇవ్వడం అనే ఘట్టం ఆదికావ్యం మహాభారతంలోనే కనిపిస్తుంది. నన్నయ ఆది పర్వంలో అస్తీకుడి కథలో ఇది కనిపిస్తుంది. వారం రోజులలో తక్షకుడు అనే సర్పం కరవడం వల్ల నువ్వు మరణిస్తావని పరీక్షిత్తును శృంగి శపిస్తాడు. పరీక్షిన్మహారాజు పెద్ద ఒంటి స్తంభం మేడ కట్టుకొని దాని చుట్టూ కింద మంట పెట్టించి ఏ పామూ పైకి రాకుండా రాజవైద్యులను పెట్టుకొని ఉన్నాడు. కాశ్యపుడు అనే బ్రాహ్మణుడు ఎంతటి విషాన్నైనా హరించి చనిపోయిన వారిని కూడా బతికిస్తాడని చెప్పగా ఆయనను కూడా పిలిపించమని భూరి దక్షిణలు ఇస్తామని పిలిపిస్తారు. రాజును బతికిస్తే ధనంతో పాటు ఇతర బహుమతులు వస్తాయని హస్తినాపురానికి బయలుదేరాడు కాశ్యపుడు. తక్షకుడు అడవి మార్గంలో వస్తూ కాశ్యపుని మార్గమధ్యంలోనే ఆపుతాడు. ‘నేను రాజును అతనికి ఉన్న శాపం ప్రకారం చంపబోతున్నాను. నేను ఏ ప్రాణినైనా చంపగలిగిన శక్తి ఉన్నవాడిని. నువ్వు రాజును ఎలా తిరిగి బ్రతికించగలవు?’ అని అడుగుతాడు. ‘నాకూ అంతటి శక్తి ఉంది. నేను ఏ విష ప్రభావాన్నయినా విరగ దీసి, తిరిగి బతికించగలను’ అని చెబుతాడు కాశ్యపుడు. ‘అయితే ఈ వృక్షాన్ని నేను కాటువేసి చంపుతాను, తిరిగి దీన్ని బతికించు, దానితో నీ శక్తి తెలుస్తుంది’ అంటాడు తక్షకుడు. అని ఒక పెద్ద వటవృక్షాన్ని కాటు వేస్తాడు. అది క్షణాలలో భస్మీపటలం అవుతుంది. వెంటనే కాశ్యపుడు ఒక మంత్రాన్ని పఠించి, తిరిగి దాన్ని బతికిస్తాడు. చెట్టు తిరిగి ఫల పుష్పాలతో ఎప్పటిలాగా బతికింది. తక్షకుడు ఆశ్చర్యపోయాడు. ఇతను రాజును తిరిగి బతికించగలడు అనే నమ్మకం వచ్చి, రాజు ఇచ్చే ధనాన్ని నేనే ఇస్తాను; నీవు వెనక్కు వెళ్ళి పో అంటాడు. దానికి కాశ్యపుడు అంగీకరించడు. రాజు ఇచ్చే ధనంకన్నా రెట్టింపు ఇస్తానని చెప్పి, తిరిగి ఇంటికి పోయటట్లు చేస్తాడు తక్షకుడు. తెలుగు సాహిత్యంలో లంచం ఇచ్చి పని చేయించుకున్న ఘట్టం మొదటి సారిగా వర్ణించబడింది ఇదే. ఇక్కడ లంచం అనే పదం వాడలేదు కాని ఈ విషయాన్ని స్పష్టంగా వర్ణించాడు నన్నయ. అయితే ఇది 11వ శతాబ్దంలోనే ఉంది అని అనుకోనక్కరలేదు. ఇదే కథ వ్యాసుని సంస్కృత మహాభారతంలో కూడా ఇదే విధంగా ఉంది(ఆది పర్వం 43వ అధ్యాయం). సూక్తాంకర్ సంశోధించిన వ్యాసభారతం భండార్కర్ ప్రతిలో ఈ వర్ణన యథాతథంగా ఉంది. కాశ్యపుడు తన పనికోసం బయలు దేరితే తక్షకుడు తన పని కావడానికి అవరోధంగా ఉన్న కాశ్యపుని తప్పించడానికి లంచం ఇచ్చాడని స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. అయితే తెలుగు భారతంలో కానీ, సంస్కృత భారతంలో కానీ దీన్ని ధనం అన్నారే కాని లంచం అనలేదు. కాని ఇక్కడ జరిగింది లంచమే. (కాశ్యప ఉవాచ: ధనార్థీ యాంయహం తత్ర తన్మే దేహి భుజంగమ! తతోహం వినివర్తిష్యే స్వాపతేయం ప్రగృహ్య వై!!) ఇదే తెలుగు మహాభారతంలో లంచం అనే పదాన్ని స్పష్టంగా వర్ణించిన ఘట్టం తిక్కన రచన అయిన ఉద్యోగపర్వంలో ఉంది. అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత పాండవులు ఒక దూతని కౌరవుల దగ్గరికి పంపుతారు. ధృతరాష్ట్రుడు సమాధానం అతనికి చెప్పకుండా తాము కూడా ఒక దూతని పంపించి మా అభిప్రాయం చెబుతాము అని అంటాడు. తర్వాత సంజయ రాయబారం జరుగుతుంది. ధృతరాష్ట్రుడు రాజ్యం ఇస్తామని చెప్పకుండా మీరు అక్కడే ఉపప్లావ్యంలో సుఖంగా ఉండండి అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవ దూతగా వస్తున్నాడు అని తెలిసిన తర్వాత విదురుడు «ధృతరాష్ట్రుని కడకు వచ్చి మంతనాలు చేస్తాడు. స్వాగత ఏర్పాట్లు ఏం చేయాలో మంత్రి అయిన విదురునికి చెబుతూ– కం‘‘ వివిధ మణిమయ రథంబులు, జవనాశ్వంబులును, భద్రసామజములు ర త్న విభూషణములు దాసీ నివహంబులు జాల గృష్ణునికి నేనిత్తున్ (ఉద్యో. 3–157 పద్యం) ఇవన్నీ ఇద్దాము అంటాడు ధృతరాష్ట్రుడు. ఇంకా చాలా ఇవ్వాలి, పెద్ద ఉత్సవం చేయాలి అని నాలుగు పద్యాలలో వచనంలో కూడా చెబుతాడు. ఇదంతా విని విదురుడు, మహారాజా ఇప్పుడు కూడా మీరు సరిగ్గా ఆలోచించడం లేదు; వచ్చే దూతను ప్రీతుని చేయడానికి ఈ పనులు అన్నీ చేయడం ఎందుకు? దీని బదులు పాండవులకు కనీసం ఐదూళ్ళు ఇస్తే సరిపోతుంది కదా అని అంటాడు (పద్యం 158). తర్వాత ఒక పద్యంలో విదురుడు చెప్పిన మాటలని తిక్కన సూటిగా వర్ణిస్తూ దూతకి లంచం ఇస్తావా అని అంటాడు. ఉ‘‘ నీతలపేను గంటి నొక నేర్పున శౌరికి లంచ మిచ్చి సం ప్రీతుని జేసి కార్యగతి భేదము సేయగ జూచె దింత బే లైతి గదే సుమేరు సదృశార్థము జూచియు బార్థు బాయునే యాతడు క్రీడిభక్తియును నచ్యుతు పెంపును నీవెఱుంగవే. అతనికి అర్జునుడు అతి ప్రేమాస్పదుడైనవాడు కాబట్టి అచ్యుతుడు అతడు, నీ ఆలోచనలు మానుకో అని చెబుతాడు విదురుడు. ఒక పరీక్షార్థం వచ్చే పరీక్షకునికి కానీ, అవతలి పార్టీవారి పక్షాన వచ్చే దూతకు కానీ లంచం ఇచ్చి తమ వైపు తిప్పుకునే అలవాటు కనీసం 13వ శతాబ్దం నాటికే ఉందని దీన్ని బట్టి నిక్కచ్చిగా తెలుస్తూ ఉంది. ఇక లంచం ఇచ్చే పద్ధతి నన్నయ నాటికి అంటే 11 వ శతాబ్దికి కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విషయం సంస్కృత భారతంలో కూడా వర్ణితమైన కారణంగా కనీసం రెండు వేల సంవత్సరాల నాడే ఈ పద్ధతి ఉందని చెప్పవచ్చు. పైన చెప్పిన ఉద్యోగ పర్వ ఘట్టం వ్యాస భారతంలో కూడా ఇదే పద్ధతిలో వర్ణితం అయింది. లంచం అనే మాటకు ‘ఉత్కోచ’ అనే పదమే సాహిత్యంలో వాడారు. మోనియర్ విలియమ్స్ సంస్కృత–ఇంగ్లీషు నిఘంటువులో ‘ఉత్కోచ’ అంటే bటజీb్ఛ అనే అర్థాన్నే ఇచ్చింది. ధనం ఇచ్చి ఏమి ఇచ్చినా కృష్ణుని పొందలేవు, అర్జునునితో ఆయన బంధాన్ని విడదీయలేవు అని ధృతరాష్ట్రునికి చెప్పి ఐదు గ్రామాలనైనా ఇవ్వు అని అంటాడు. (ఉద్యోగపర్వం: 87–10, 11). లంచం అనే మాట ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఇంకా చాలా చోట్ల వినియుక్తమైంది. శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో ఈ మాటని వాడాడు. శా‘‘ కాంచీకంకణ తారహర ఘటికా గ్రైవేయ భూషావళుల్ లంచంబిత్తురు దూతికా తతికి లీల బెండపూడన్ననిన్ బంచాస్తోప్రము తారతార కవయం ప్రార్థించి లోలపలన్ పంచారామములందు బల్వెల పురిం ఫ్రౌఢేందు బింబాననల్ (ఆ. 1–77) అని శార్దూల పద్యంలో వర్ణిస్తాడు. ఇక్కడ ముఖ్యమైన విషయమేమంటే లంచం అనే మాట ప్రాస స్థానంలో ఉంది. పదిహేనో శతాబ్దంలో లంచం అనే మాటకు సంబంధించిన ఉనికికి ఇది తిరుగలేని సాక్ష్యం. శ్రీనాథుడు 15వ శతాబ్దం వాడు. భాగవతంలో కూడా లంచం అనే మాట ఉంది. పంచమ స్కందంలో శుకయోగి పరీక్షిత్తుకు నరక లోకాన్ని వర్ణించి చెప్పే ఘట్టంలో వివిధ శిక్షలను గురించి వర్ణిస్తూ చాలా పద్యాలు రాస్తూ ఒక సీసపద్యంలో– ‘‘లంచంబు గొని సాక్షి వంచించి యనృతంబు బలికెడు పాపాత్ము బట్టి కట్టి యంత మానక వీచియను నరకమందు శతయోజనోన్నత శైల శిఖరమున దలక్రిందుగా నునిచి యదోముఖంబుగ బడదొబ్బిన...’’ (పంచమ స్కందం –154) అని స్పష్టంగా వర్ణించాడు పోతన మహాకవి. దొబ్బిన అనే మాట కూడా వాడాడు. అంతే కాదు, లంచం తిని దొంగ సాక్ష్యం చెప్పే విషయం కూడా ఇక్కడ రికార్డు అయింది. పోతనామాత్యుడు కూడా 15వ శతాబ్ది వాడు. శ్రీనాథునికి సమకాలికుడు. ఓరుగల్లు ప్రాంతంలో కాకతీయుల పాలనలో కూడా లంచం తీసుకొని దొంగ సాక్ష్యాలు చెప్పే స్థితి ఉందని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక కుచేలోపాఖ్యానంలో కూడా కృష్ణుని భవనానికి పోయినప్పుడు అక్కడ ద్వారాల దగ్గర ఉండే కాపలా వారికి ఒకటో రెండే పణాలు ఇవ్వాలన్నా కూడా లేవే అని కుచేలుడు అనుకుంటాడని పోతన వర్ణించాడు. (దశమ. 972). ఇక్కడ ద్వారపాలకులకు ఇచ్చేదాన్ని పరిదానం అని అన్నాడు. ‘లంచపంచములు’ అనే జంటపదాల్ని కూడా కావ్యాలలో వాడారు. కువలయాశ్వ చరిత్రలో, పరమయోగి విలాసం అనే ద్విపద కావ్యంలోనూ లంచపంచములు అనే ప్రయోగాలున్నాయి. ఈ తర్వాతి కాలంలో కూడా లంచం అనేమాట ప్రయోగం అయింది. దశకుమార చరిత్ర (దుగ్గన), కేయూరబాహు చరిత్ర (మంచెన) లలో లంచమువెట్టు అనే ప్రయోగం ఉంది. ఈ సాహిత్య గ్రంథాలలోని సాక్ష్యాలను బట్టి నాటి సామాజిక జీవనం ఎలా ఉండేది అనే విషయం కూడా మనకు బాగా అవగతం అవుతూ ఉంది. పురాణపాత్రలే లంచం ఇవ్వడం తీసుకోవడం ఇవ్వజూపి పనులు చేయించుకునే తీరు గమనించాలి. మధ్యయుగాలలో లంచంతో దొంగ సాక్ష్యాలు చెప్పించే విషయం కూడా గమనించాలి. ఆ కాలం నుండీ నేటి దాకా దీని విశ్వరూపాన్ని అవగాహన చేసుకోవడానికి దీని చరిత్రను తెలుసుకోవడానికి ఈ సాహిత్య ఆకరాలు పనికి వస్తాయి. ప్రొ‘‘ పులికొండ సుబ్బాచారి -
ఏ ఇంటి కోడలు కలికి కామాక్షి?
ఈ గేయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో చాలా భావస్వామ్యం వున్న గేయాలు దొరుకుతున్నాయి. అయితే, దీన్ని అచ్చమైన పల్లెపాటగా పరిగణించడం కష్టం. జానపద గేయాల ఫణితిని శ్రద్ధగా గమనించిన శిష్టజనులెవ్వరో ఈ గేయాన్ని కళాత్మకంగా మలిచారని తోస్తుంది. కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో బోసి అప్పుడే వచ్చేడు ఆమె పెద్దన్న కాళ్లకు నీళ్లిచ్చి కన్నీరు నింపె– ఇలా సాగే ఈ జానపద గేయం తెలుగునాట ఆబాలగోపాలానికీ ప్రీతిపాత్రమయింది. బిరుదురాజు రామరాజు సిద్ధాంత వ్యాసం ‘తెలుగు జానపద గేయ సాహిత్యము’లో చోటు చేసుకున్న తర్వాత పామర ప్రజానీకం నోట్లోంచి పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కి పండితాదరణ కూడా పొందగలిగింది. ఈ గేయానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో చాలా భావస్వామ్యం వున్న గేయాలు దొరుకుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన రీతిలో వినబడే ఈ పాట ముఖ్యాంశం – అత్తగారింట్లో ఆరళ్ల పాలైన కోడలి జీవితం. పదిమంది నోళ్లలో నానుతున్న ఈ పాటలో ఆమె పుట్టింటికి చెల్లెలు పెళ్లికని వెళ్లి, మరదుల పెళ్లికి తిరిగి వస్తానంటుంది. కానీ అసలైన జానపద గేయాల్లో అత్తింటి ముఖం చూడనని భీష్మ ప్రతిజ్ఞ చేయడం గమనించదగ్గ విషయం. చొక్కాపు నారాయణస్వామి సేకరించిన ‘పుట్టింటికి’ అన్న కర్నూలు జిల్లాలోని గేయంలో కోడలు పిల్ల అత్తగారింట పెద్దలందరినీ పుట్టింటికి పోవడానికి అనుమతి అడిగి చిట్టచివర మొగుడిని కోరగా అతను– వండుకో వరికూడు దానిమ్మలో కట్టుకో సద్దికూడు దానిమ్మలో ఎత్తుకో బాలున్ని దానిమ్మలో ఎగురు గుర్రాన్ని దానిమ్మలో– అంటూ సంతోషంగా వెళ్లి రమ్మంటాడు. అప్పుడామె ఏం చేసిందంటారు? ఎగిరే గుర్రాన్ని దానిమ్మలో దుమ్ముల్లు రేగా దానిమ్మలో పారే గుర్రాము దానిమ్మలో చెంగల్వపట్నానికి దానిమ్మలో–ఆమె గుర్రమెక్కి, అన్నతోనో, తమ్మునితోనో పుట్టింటికి బయలుదేరింది. పుట్టిల్లు చెంగల్వపట్నంలో ఉందట. ఆమె వూరు తామరకొలను అయితే ఆమె జీవితం ఎంత ఆనందంగా సాగిపోతుందో! ఈ గేయంలో చిత్రింపబడ్డ స్త్రీ ఎలాంటి మానసిక, శారీరక హింసలకూ గురి కాలేదన్నమాట. ఈ గేయం ‘తేనెసొనలు’(1974) లోనిది. గోపు లింగారెడ్డి సేకరించిన గేయం(తెలంగాణ శ్రామిక గేయాలు, 1982)లో దీపావళి పండుగకు పుట్టింటికి పిల్చుకు పోవడానికి వచ్చిన అన్నలకు చెల్లెలు ‘‘కాళ్లకు నీళ్లిచ్చి కన్నీళ్లు దీసె’’. అప్పుడామె అన్నలు ‘‘ఎందుకూ కష్టాలు ఏమి కష్టాలు’’ అని ఆదుర్దా పడుతూ అత్తగారి అనుమతి తీసుకొని, వెంటనే బయలుదేరమంటారు. అప్పుడామె అత్త, మామ, బావ, తోడికోడలు వగైరాలను అడిగి ఆఖరికి పెనిమిటి అనుమతి అడిగితే, అతను ఇప్పుడే బయలుదేరమంటాడు. మళ్లీ ఎప్పుడొస్తావు అంటే ఆ ముద్దరాలు అంటుంది గదా! ‘‘ఏటి మీద యెర్రజొన్న పండిన్ననాడు సీతారామచంద్ర ఏడు పుట్ల మన గరిసె నిండిన్ననాడూ సీతారామచంద్ర పాటిమీద పచ్చజొన్న పండిన్ననాడూ సీతారామచంద్ర పది పుట్ల మన గరిసె నిండిన్ననాడూ సీతారామచంద్ర నక్కలూ నాగండ్లు దున్నిన్ననాడు సీతారామచంద్ర కుందేల్లు సద్దూలు మోసిన్ననాడూ సీతారామచంద్ర వరిపొట్టు సేతాడు పేనిన్ననాడూ సీతారామచంద్ర మా యత్త మా మామ సచ్చిన్ననాడూ సీతారామచంద్ర తడిబట్ట స్నానాల కంటూ వచ్చేనూ సీతారామచంద్ర– పాపం, ఈ కోడలు అత్తారింట్లో ఎన్ని కష్టాల పాలయిందో! అందుకే అత్తవారింటికి తిరిగి రావడానికి పెట్టిన షరతులన్నీ అసంభావ్యాలే. పాలమూరు జిల్లా జానపద గేయాలు(1994)లోని ఓ పాట దాదాపు ఇదే వరుసలో ఉంది. కసిరెడ్డి వెంకటరెడ్డి సేకరించిన ఈ గేయంలోని కోడలి కథ కూడా వ్యథాభరితమే. వినండి ఆమె అన్న మాటలు ఎంతటి ఆక్రోశంతో నిండివున్నాయో! నక్కల్లూ నాగండ్లు దున్నిన్ననాడూ సీరామరామ సెంద్రా కుక్కల్లూ గుంటకలు కొట్టిన్ననాడూ సీరామరామ సెంద్రా మాయత్తా మామ సచ్చిన్ననాడూ సీరామరామ సెంద్రా తడిబట్ట స్నానాల కందొచ్చేనూ సీరామరామ సెంద్రా. వరంగల్ జిల్లాలో సేకరింపబడ్డ ఓ గేయం ‘మన పల్లెటూళ్ల పాటలు’(2004) ఈ కలవారి కోడలు కష్టాల్ని మరిన్ని వివరాలతో తెలియజేస్తుంది. చెల్లెల్ని పిల్చుకుని రమ్మంటే ముగ్గురన్నలు తాము వెళ్లమని అంటే కొనాకు తండ్రే బయలుదేరడం ఈ గేయంలోని విశేషం. కాగా ఈ కోడలి పేరు భాగ్యమ్మగా పేర్కొనడం మరో ప్రత్యేకత. ఆ కోడలు ఇంటిల్లిపాదీ పెద్దాచిన్నలకు పుట్టింటికి పోవడానికి అనుమతి అడిగి, చిట్టచివరికి పెనిమిటి పోయిరమ్మని చెప్పి, మళ్లీ ఎప్పుడొస్తావంటే ఆమె అంటుంది కదా: అత్త సచ్చీనంక ఉయ్యాలో ఆరు నెల్లా కొస్త ఉయ్యాలో మామ సచ్చీనంక ఉయ్యాలో మంచం కాడి కొస్త ఉయ్యాలో. ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రచురించిన ‘జాలారి సిరిమల్లెలు’ (2007)లో జి.శ్రీనివాసయ్య కర్ణాటకలోని కోలారు జిల్లాలో సేకరించిన అర్థపూర్ణమైన తెలుగు జానపద పాటలున్నాయి. దీన్లోని ‘మాయన్నగారూ’ గేయం కలవారి కోడలు కన్నీటి కథే. ఆమె అందరిని అనుమతి అడిగి, చివరగా మరిది సమ్మతించగా పుట్టింటికి బయలుదేరుతుంది. అప్పుడు ‘‘వదినా మళ్లీ ఎప్పుడు వస్తావు’’ అంటే– ఉడికిండే ఉలువాలూ మలిసిన్నాటికో కలకోడి పుంజేమో కూతేసిన్నాటికో బండమింద రాజనాలు పండిన్నాటికో– తిరిగి వస్తానంటుంది. ఆమె మళ్లీ అత్తగారింటి వైపు తలపెట్టి నిద్రపోదన్న మాట. మేక ఉమారెడ్డి సిద్ధాంత గ్రంథం ‘నల్లగొండ జిల్లా జానపద గేయాలు: సమగ్ర పరిశీలన’(2015)లో ఉటంకించిన గేయంలో కోడలు అత్తగారింటిని గుండెల మీద కుంపటిగా భావించిన లక్షణాలేవీ కనపడవు. ముద్దుల పెళ్లాంకు భర్త ఇలా వీడ్కోలు చెప్తాడు: పెట్టెలో సొమ్మూలు కోల్ – పెట్టుకోవే నాగ కోల్ దండాన బట్టలు కోల్ – సద్దుకోవే నాగ కోల్ మీ యన్నల వెంట కోల్ – వెళ్లిరావే నాగ కోల్. ఈ పాటలోని కోడలు అత్తగారింటి నుంచి క్షేమంగా వెళ్లి పుట్టింటి నుంచి లాభంగా తిరిగొస్తుందని భావించవచ్చు. ‘ఉడకేసిన ఉలవలు మొలకెత్తినబుడు’ అన్న శీర్షికతో ప్రచురించబడ్డ జానపద గేయం ‘దణి– హోసూరు పల్లెపాటల కతలు’ (2017) కలవారి కోడలు దుఃఖాన్ని వెలువరించేదే. తమిళనాడు కృష్ణగిరి జిల్లా ప్రాంతంలో లభించిన ఈ పాటలో– రాతి మీద రతనాలు పండినబుడు రాతి బసవన్న రంకేసినబుడు ఉడకేసిన ఉలవలు మొలకెత్తినబుడు– తిరిగి వస్తానంటుంది ఈ చాన. కలవారి కోడలు కలికి కామాక్షి గేయంలో కళకళలాడే ముఖంతో, సుఖమయ జీవితం గడిపే కోడలు కనిపిస్తుంది. కాని వివిధ ప్రాంతాల్లో ప్రచారంలో వున్న జానపద గేయాల్లో కన్నీరు పెట్టిన కామాక్షే కళ్లముందు నిలబడుతుంది. వీటి వల్ల ‘అత్తలేని కోడలు ఉత్తమురాలు– కోడలు లేని అత్త గుణవంతురాలు’ అన్న అలనాటి మాటలే మన చెవుల్లో గింగురుమంటాయి. కలవారి కోడలు కలికి కామాక్షి గేయాన్ని అచ్చమైన పల్లెపాటగా పరిగణించడం కష్టం. జానపద గేయాల ఫణితిని శ్రద్ధగా గమనించిన శిష్టజనులెవ్వరో ఈ గేయాన్ని కళాత్మకంగా మలిచారని తోస్తుంది. ఇకపోతే ఈ వస్తువునే గుండె లోతుల్లోంచి ఉబికిన భావాలతో సహజ సుందరంగా, శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేసే విధంగా తీర్చిదిద్దిన పల్లెప్రజలకు, నేలతల్లి బిడ్డలకు భావుకులందరూ జోహార్లు అర్పించాలి. -ఘట్టమరాజు -
విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
అనంతపురం ఎడ్యుకేషన్ : జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 7, 8, 9 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ ఓ ప్రకనటలో తెలిపారు. ’వినియోగదారు వివాదాల సత్వర నిర్ధారణ కోసం ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం’ అనే అంశంపై 19న పాఠశాలస్థాయి, 20న మండలస్థాయి, 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో పోటీలు ఉంటాయని వివరించారు. జిల్లాస్థాయి విజేతలకు 23న విజయవాడలో రాష్ట్రస్థాయి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. -
2న జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు
స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్ :కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలుగు బాషా పండిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలో ఈ నెల 2న మధ్యాహ్నం జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సిద్దోజు శ్రీనివాసాచారి బుదవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాళోజీ కవిత్వం, తెలంగాణ ఔన్నత్యం అంశాలపై పోటీ ఉంటుందని పేర్కొన్నారు. 6,7 తరగతుల విద్యార్థులకు, 8,9,10 తరగతి విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వెర్వేరు విభాగాలుగా పోటీలు నిర్వహిస్తామన్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామని తెలిపారు. ప్రథమ బహుమతులు పొందిన వారి పేర్లను రాష్ట్ర స్థాయి ఎంపిక కోసం పంపిస్తామనిపేర్కొన్నారు. వివరాలకు 9959314072, 9505479548 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
వ్యాస రచనతో సృజనాత్మకత పెరుగుతుంది
చిలుకూరు: వ్యాసరచన పోటీల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని జెడ్పీటీసీ భట్టు శివాజీ నాయక్ అన్నారు. శనివారం చిలుకూరులో ఏఐఎస్ఎఫ్ 81 వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సీపీఐ కార్యాలయంలో పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ– విద్యార్థుల పాత్ర అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల ప్రారంభం కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చేపూరి కొండల్, ఉపాధ్యాయులు గుండు ఆదినారాయణ, నాగేశ్వరరావు, మురళి, షరీఫ్, విద్యార్థి, యువజన సంఘం నాయకులు తమ్మనబోయిన నరేష్ , ముక్క లక్ష్మీనారాయణ, రఫి తదితరులు పాల్గొన్నారు. -
అంశమేదైనా అదరగొట్టేస్తాడు..!
చిన్నకోడూరు: సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినా అతని తెలివితేటలు అమోఘం. అందుకే ఉపన్యాసాల్లోనూ.. వ్యాసరచల్లోనూ దంచేస్తున్నాడు. తండ్రికి వ్యవసాయంలో సాయపడుతూనే ఈ ఘనత సాధిస్తున్నాడు విద్యార్థి గణేశ్. మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామానికి చెందిన గౌరిగోణి చంద్రయ్య, సత్తవ్వ దంపతుల చిన్నకుమారుడు గణేశ్. వీరిది సామాన్య రైతు కుటుంబం. పెద్దకుమారుడు డిగ్రీ పూర్తి చేయగా, గణేశ్ పెద్దకోడూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రాథమిక స్థాయి నుంచే గణేశ్ చదువులో ప్రథమ స్థానంలో నిలుస్తున్నాడు. పాఠ్యాం శాలను ఏకాగ్రతతో వింటూనే పత్రికలు చదువుతూ పలు అంశాలపై పట్టు సాధిస్తున్నాడు. గెలుపొందిన బహుమతులు 2013లో జిల్లా స్థాయిలో బాల ప్రతిభా మేళా కవితలపై నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాడు. 2014లో ‘నేనే ప్రధానినైతే’ అనే అంశంపై జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లోనూ ఫస్ట్ప్రైజ్ గెలుచుకున్నాడు. సిద్దిపేటలో జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ‘నేనే శాస్త్రవేత్తనైతే..’ అనే అంశపై జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి పొదాడు. ఉపాధ్యాయుల స్ఫూర్తి ఉపాధ్యాయుల స్ఫూర్తితో ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో రాణిస్తున్నా. ప్రతి అంశంపై పట్టా సాధించాలని ఉంది. పదో తరగతిలో 10 జీపీఏ పాయింట్లు సాధించాలని కష్టపడుతున్నా. - గణేశ్, పదో తరగతి -
ఎన్ని పోటీలైనా ఈమెకు సాటిరావు!
ప్రతిభా కిరణం ఇది పోటీ ప్రపంచం. ఈ యుగంలో పోటీ పడనిదే పనిజరగదు. అని తన్మయి గ్రహించింది కాబోలు, పోటీలలో పాల్గొనడమే ధ్యేయంగా పెట్టుకుంది. పాల్గొన్న ప్రతిదానిలోనూ గెలిచి శభాష్ అనిపించుకుంటోంది. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 18, 1998న పుట్టిన తన్మయి అంబటి అత్యధిక పోటీల్లో పాల్గొని, బహుమతులు గెలుచుకుని రికార్డు సృష్టించింది. తన్మయి వివిధ రాష్ర్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పరీక్షలు, డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన, క్లే మాడలింగ్, చేతి రాత, పర్యావరణ అవగాహన, సామాజిక సేవ మొదలైన అంశాలలో 151కి పైగా అవార్డులను అందుకుంది. అంతర్జాతీయ మేథమెటిక్స్ ఒలంపియాడ్, జాతీయ సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, ఆల్ ఇండియా స్పాట్ కేమెల్ కలర్ కాంటెస్ట్, ఇంట్రా స్కూల్ లెవెల్ సైన్స్ క్విజ్ కాంటెస్ట్‌లతో పాటు ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన మేథమెటిక్స్, కంప్యూటర్ పరీక్షలలో బంగారు పతకాలు సాధించింది. ఆమె తొమ్మిది ఏళ్ల వయసులో కళారత్న, బాలమేధావి అనే బిరుదులను సంపాదించింది. 10 జూన్, 2010లో ‘మహా స్టార్’ గా ఎన్నికైనందుకు ప్రముఖ క్రికెటర్ ధోనీ చేతుల మీదుగా బహుమతి అందుకుంది. ఇంకా ఆంధ్రబాలరత్న, స్టేట్ బెస్ట్ చైల్డ్, జూనియర్ ఎక్స్‌లెన్స్ అవార్డులు పొందింది. అంతేకాదు, మన దేశ మాజీ రాష్ర్టపతి శ్రీమతి ప్రతిభాపాటిల్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయల అభినందనలు కూడా అందుకుంది తన్మయి. ఈ బాలికని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా పోటీలలో పాల్గొనండి, పతకాల పంట పండించండి!