అంశమేదైనా అదరగొట్టేస్తాడు..!
చిన్నకోడూరు: సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినా అతని తెలివితేటలు అమోఘం. అందుకే ఉపన్యాసాల్లోనూ.. వ్యాసరచల్లోనూ దంచేస్తున్నాడు. తండ్రికి వ్యవసాయంలో సాయపడుతూనే ఈ ఘనత సాధిస్తున్నాడు విద్యార్థి గణేశ్. మండల పరిధిలోని పెద్దకోడూరు గ్రామానికి చెందిన గౌరిగోణి చంద్రయ్య, సత్తవ్వ దంపతుల చిన్నకుమారుడు గణేశ్. వీరిది సామాన్య రైతు కుటుంబం. పెద్దకుమారుడు డిగ్రీ పూర్తి చేయగా, గణేశ్ పెద్దకోడూరు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ప్రాథమిక స్థాయి నుంచే గణేశ్ చదువులో ప్రథమ స్థానంలో నిలుస్తున్నాడు. పాఠ్యాం శాలను ఏకాగ్రతతో వింటూనే పత్రికలు చదువుతూ పలు అంశాలపై పట్టు సాధిస్తున్నాడు.
గెలుపొందిన బహుమతులు
2013లో జిల్లా స్థాయిలో బాల ప్రతిభా మేళా కవితలపై నిర్వహించిన పోటీల్లో మొదటి స్థానంలో నిలిచాడు. 2014లో ‘నేనే ప్రధానినైతే’ అనే అంశంపై జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లోనూ ఫస్ట్‌ప్రైజ్ గెలుచుకున్నాడు. సిద్దిపేటలో జిల్లాస్థాయి ప్రేరణ వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ‘నేనే శాస్త్రవేత్తనైతే..’ అనే అంశపై జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి పొదాడు.
ఉపాధ్యాయుల స్ఫూర్తి
ఉపాధ్యాయుల స్ఫూర్తితో ఉపన్యాస, వ్యాసరచన పోటీల్లో రాణిస్తున్నా. ప్రతి అంశంపై పట్టా సాధించాలని ఉంది. పదో తరగతిలో 10 జీపీఏ పాయింట్లు సాధించాలని కష్టపడుతున్నా. - గణేశ్, పదో తరగతి